డంకీ: షారుక్ ఖాన్ హ్యాట్రిక్ కొట్టారా లేదా?

ఫొటో సోర్స్, Facebook/Sharukhkhan
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
2023 షారుక్ ఖాన్‌కు మరపురానిది. ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి రెండు భారీ విజయాలతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన షారుక్, ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం 'డంకీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కెరీర్‌లో అపజయం ఎరుగని రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రానికి దర్శకుడు. మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి సూపర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు తొలిసారి షారుక్- హిరాణీ జట్టు కట్టారు.
పఠాన్, జవాన్ చిత్రాలు మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగితే డంకీ మాత్రం పూర్తిగా హిరాణీ మార్క్ చిత్రమని ప్రచార చిత్రాలు చెప్పాయి.
ఈ చిత్రాన్ని కేవలం హిందీ భాషలోనే విడుదల చేశారు. అయినప్పటికీ రెండు భారీ విజయాల తర్వాత షారుక్, ఐదేళ్ళ తర్వాత హిరాణీ నుంచి వస్తున్న సినిమా కావడంతో రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
మరి డంకీ షారుక్‌కు హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చిందా? వెండితెరపై హిరాణీ మరో మరపురాని చిత్రాన్ని ఆవిష్కరించారా?
డంకీ అంటే అర్థమేంటి?
సమాజం ఎదుర్కొంటున్న ఒక బలమైన అంశానికి సున్నితమైన హాస్యం జోడించి మనసుకు హత్తుకునే చిత్రం అందించడంలో హిరాణీ మాస్టర్. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డంకీ కూడా ఒక సామాజిక అంశమే.
‘డంకీ’ అనేది పంజాబీ ప్రజల వాడుక పదం. అక్రమ వలస అని దీని అర్ధం. ‘డంకీ ఫ్లైట్స్’ అంటే చాలామందికి తెలిసే వుంటుంది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి ‘డంకీ ఫ్లైట్స్’ పద్దతిలో అక్రమంగా వలస వెళ్తుంటారని వార్తల్లో చూస్తుంటాం. ‘డంకీ’ చిత్రానికి ఇదే పాయింట్‌ని కథగా తీసుకున్నారు హిరాణీ.
ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించే ఓ నలుగురు కథని తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించారు దర్శకుడు.

ఫొటో సోర్స్, facebook/Shah Rukh Khan
లండన్ కలలు - ఇంగ్లిష్ కష్టాలు
మను (తాప్సీ), సుఖి (విక్కీ కౌశల్), బుగ్గు, బాలి.. ఈ నలుగురి కల లండన్ వెళ్లి, తమ జీవితాన్ని మెరుగుపరచుకోవాలి. అక్కడికి వెళ్ళడానికి ఒకొక్కరికి ఒక్కో కారణం వుంటుంది.
లండన్ వెళ్ళడానికి చేసే వీసా ప్రయత్నాలు, ఏజెంట్‌తో ఆడిన బేరాలు.. అతను చెప్పిన సలహాలు.. ఇవన్నీ సరదాగా సాగిపోతాయి. ఆ నలుగురి కథలోకి హార్డి (షారుక్) పాత్రను తీసుకొచ్చిన విధానం కాస్త సినిమాటిక్‌గా అనిపించినప్పటికీ తర్వాత ఆ పాత్రల ఎమోషన్‌తో కలిపిన విధానం మెప్పిస్తుంది.
స్టూడెంట్ వీసా ప్రయత్నంలో భాగంగా వచ్చే స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు నవ్విస్తాయి. ముఖ్యంగా రెండు నిమిషాల ఇంగ్లిష్ టెస్ట్.. త్రీ ఇడియట్స్ స్టేజ్ స్పీచ్ సీన్‌ని గుర్తు తెచ్చినప్పటికీ.. చాలా మంచి హాస్యం పండింది.
ఇలా సరదాగా సాగిపోతున్న కథనంలో విరామ సన్నివేశంలో జరిగే ఘటన ద్వితియార్ధంపై మరింత ఆసక్తిని పెంచింది.

ఫొటో సోర్స్, Facebook/Sharukhkhan
ద్వితీయార్ధం భావోద్వేగాల సమాహారం
డంకీలో అసలు ప్రయాణం ద్వితీయార్ధంలో మొదలౌతుంది. దేశ సరిహద్దులను దాటుకుంటూ చేసిన ప్రయాణం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. కొన్ని సన్నివేశాలైతే అక్రమ వలసల్లో ఇన్ని కష్టాలు, ప్రమాదాలు ఉంటాయా అని మనసు బరువెక్కించేలా చేస్తాయి. ఇక్కడ నుంచి సన్నివేశాలన్నీ చకచక ముందుకు కదులుతాయి.
లండన్ చేరుకున్న తర్వాత అక్కడ ఎదురైన పరిస్థితులు వలస జీవితాల్లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ క్రమంలో వచ్చే కోర్ట్ సీన్ ఆలోచింపజేస్తుంది.
ఈ సన్నివేశంలో దేశభక్తిని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మను, హార్డీల మధ్య ఒక సున్నితమైన ప్రేమకథని రాసుకున్నాడు.

ఫొటో సోర్స్, Red Chillies Entertainment
షారుక్ పాత్ర గుర్తుండిపోతుంది
హార్డీ పాత్రని ఉద్దేశించి ‘‘ఏం మనిషివి నువ్వు. టేప్ రికార్డర్ ఇవ్వడానికి వచ్చి పాతికేళ్ళపాటు నీది కాని జీవితంలో ఉండిపోతావా’’ అని మను పాత్ర ఓ డైలాగ్ చెబుతుంది. నిజమే, ఈ కథ హార్డీది కాదు. లండన్ వెళ్లాలని కలలు కన్న మను, సుఖి, బుగ్గు, బాలి పాత్రలది.
కానీ ఈ కథలో ఒక సైనికుడి పాత్ర పోషించాడు హార్డీ. సైనికుడు తనకు కావాల్సిన వారి కోసం జీవితాన్ని పణంగా పెట్టి నిలబడతాడు. లోతుగా ఆలోచిస్తే.. హార్డీ కూడా ఈ కథలో ఒక సైనికుడే. ఆద్యంతం ఈ కథను తన భుజాలపై మోశాడు షారుక్. కేవలం షారుక్‌లోని నటనని చూద్దామనుకునే ప్రేక్షకులకు ఇందులో హార్డీ పాత్ర గుర్తుండిపోతుంది.
‘‘పఠాన్, జవాన్ అభిమానుల కోసం చేశాను. ‘డంకీ’ మాత్రం నా కోసం చేసుకున్న సినిమా’’ అని షారుక్ ఎందుకు చెప్పారో సినిమా చూస్తే అర్ధమౌతుంది.
ఆయనకు ఒక నటుడిగా తృప్తినిచ్చే సినిమా ఇది. నవ్వించే సన్నివేశాలతోపాటు భావోద్వేగాలు పంచే సన్నివేశాల్లో షారుక్ తన ప్రతిభను చూపించారు. కోర్ట్ సీన్‌లో షారుక్ నటన మరో స్థాయిలో వుంటుంది.
కళ్లలో నీళ్లు తెప్పించే సంభాషణ
హార్డీ తర్వాత ప్రేక్షకులకు బలంగా గుర్తుండిపోయే మను పాత్రలో తాప్సీ నటన ఆకట్టుకుంటుంది, తన పాత్రలో హాస్యం, ఉద్వేగం రెండూ వున్నాయి. తన ఇంటిని దక్కించుకోవడం కోసం లండన్ వెళ్లి డబ్బులు సంపాదించాలని కలలుగంటుంది మను.
లండన్ వెళ్లిన తర్వాత ఒక దశలో అక్కడ పరిస్థితులు చూసి ఇంటికి తిరిగివెళ్లిపోదామని అంటాడు హార్డీ. ఇల్లు లేదనే కదా ఇక్కడికి వచ్చామని మను పాత్ర చెప్పిన సమాధానం విన్న తర్వాత అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగేస్తాయి. అంత భావోద్వేగమైన పాత్రది. ఇప్పటివరకూ తాప్సీ చేసిన పాత్రలు ఒకెత్తు.. మను పాత్ర మరో ఎత్తు.
నిడివి తక్కువ ఉన్నప్పటికీ సుఖి పాత్రలో చేసిన విక్కీ కౌశల్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. షారుక్‌కి సరిసమానంగా కొన్ని సీన్స్ లో నటించాడు. తన పాత్రని సెకండ్ హాఫ్‌లో వాడుకున్న విధానం కూడా చాలా బావుంది.
తాప్సీ, విక్కీ.. ఈ ఇద్దరిదీ పంజాబీ కావడంతో యాసని చాలా సహజంగా పలకగలిగారు. బుగ్గు పాత్రలో విక్రమ్, బాలి పాత్రలో అనిల్ గ్రోవర్ ఆకట్టుకున్నారు.
ఇంగ్లిష్ టీచర్ గా బోమన్ ఇరానీ తన అనుభవం చూపించారు. మిగతా పాత్రలు పరిధిమేర ఉన్నాయి.
ఫ్రేమ్స్‌లో హిరాణీ మార్క్
టెక్నికల్‌గా సినిమా చాలా బావుంది. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. పంజాబ్‌తో పాటు దేశాల సరిహద్దుల్లో జరిపిన చిత్రీకరణ సరికొత్త అనుభూతిని పంచుతుంది. కెమెరా పనితనం నీట్‌గా వుంది. ఫ్రేమ్స్ లో హిరాణీ మార్క్ కనిపించింది.
నేపథ్య సంగీతం, పాటలు చక్కగా కుదిరాయి. ఈ చిత్రాన్ని స్వయంగా ఎడిట్ చేశారు దర్శకుడు.
డైలాగ్‌తో తర్వాత సీన్‌కి లీడ్ ఇవ్వడం, విజువల్‌ని ముందే చూపించి క్యారెక్టర్‌ని సీన్‌లోకి తీసురావడం ఇవన్నీ హిరాణీ మార్క్స్. ఇందులోనూ దానిని కంటిన్యూ చేశారు.
ఇక స్క్రీన్-ప్లేలో ఆయన రెగ్యులర్ టెక్నిక్‌నే ఫాలో అయ్యారు. డైలాగ్స్ ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా కోర్ట్ లో వచ్చే వలస పక్షుల రెఫరెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
‘‘పక్షులు వలస వస్తాయి. పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ అవి పుట్టిన ప్రాంతానికి వెళ్ళిపోతాయి. మరి మనిషికి ఎందుకు ఈ వెసులుబాటు లేదు? ఈ నేలకు సరిహద్దుల పేరుతో ఎందుకు కంచెలు వేశారు? ఈ సరిహద్దులు డబ్బు, పేదరికం, చదువు లేనివారి జీవితాలకే ఎందుకు’’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు డంకీతో లేవనెత్తారు హిరాణీ.
ఒక్క మాటలో చెప్పాలంటే...
నిజాయతీ ఉన్న కథ ఇది. జరిగిన, జరుగుతున్న వలసల కథ. ఈ కథకు తన మార్క్ ట్రీట్మెంట్‌తో డంకీని తీసే ప్రయత్నం చేశారు హిరాణీ.
మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే లాంటి కంటెంట్ ఇందులో ఉంటుందని ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదు. జవాన్, పఠాన్ లాంటి మాస యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్ళినా నిరాశ ఎదురవుతుంది.
పెద్దగా అంచనాలు లేకుండా ఒక మంచి సినిమా చూద్దామని వెళితే మాత్రం డంకీ చాలా చోట్ల నవ్విస్తుంది.. భావోద్వేగాలతో కళ్ళు చెమర్చేలా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్ కోసం హరియాణా ‘స్కిల్’ కార్పొరేషన్ 10 వేల మందిని ఎందుకు నియమించుకుంటోంది? అర్హతలు ఏమిటి?
- పోలీసును చంపారనే కేసులో జైలు పాలైన యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి ‘లా’ చదివి, తన కేసు తానే వాదించుకుని గెలిచాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















