‘డెవిల్’ రివ్యూ: నేతాజీతో మర్డర్ మిస్టరీని ముడిపెట్టిన ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Abhishek Pictures/YOUTUBE
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
అమిగోస్ చిత్రం నిరాశ మిగిల్చిన తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’తో మరోసారి ప్రేక్షకులకు ముందుకొచ్చారు.
‘డెవిల్’ సినిమా ఒక ఇన్వెస్ట్ గేషన్ థ్రిల్లర్. దీనికి 1945 నేపథ్యంలో సాగే పీరియాడికల్ కథను జోడించారు. గూఢచర్యం, నేర పరిశోధనలను మిళితం చేసి దీన్ని ఒక థ్రిల్లర్‌గా రూపొందించారు.
ఈ సినిమా షూటింగ్ కొంత జరిగిన తర్వాత చిత్ర దర్శకుడు మారిపోయాడు. దర్శకుడి స్థానంలో నిర్మాత అభిషేక్ నామా పేరు చేరింది. ఈ విషయంలో కొత్త వివాదం కూడా రాజుకుంది.
మరోవైపు, అమిగోస్ ఫెయిల్యూర్ తరువాత ‘డెవిల్’ కళ్యాణ్ రామ్ కెరీర్ కు కూడా కీలకమైన చిత్రంగా మారింది. ‘బింబిసార’తో విజయం అందుకున్న కళ్యాణ్ రామ్‌కు ‘అమిగోస్’ మళ్ళీ నిరాశ మిగిల్చింది.
మొత్తానికి, ఈ ఏడాదిని విజయంతో ముగించే అవకాశం కళ్యాణ్ రామ్‌కు ‘డెవిల్’ రూపంలో వచ్చిందా?

ఫొటో సోర్స్, Abhishek Pictures/YOUTUBE
నేతాజీ కోసం బ్రిటీషర్ల వేట
అది 1945. నేతాజీని పట్టుకోవడానికి బ్రిటిష్ సైన్యం వ్యూహాలు పన్నుతుంటుంది. నేతాజీ భారతదేశం తిరిగివస్తున్నారనే సందేశం వేగుల ద్వారా తెలుస్తుంది.
సరిగ్గా ఇదే సమయంలో రాసపాడు జమీందారు కూతురు విజయని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హత్య చేస్తాడు.
ఈ కేసులో హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్)ని రంగంలో దింపుతాడు బ్రిటిష్ జనరల్.
అసలు నేతాజీని పట్టుకోవడానికి, ఈ హత్యకు లింక్ ఏమిటి?
మర్డర్ మిస్టరీ థ్రిల్ ఇచ్చిందా?
నేతాజీ గురించి వాయిస్ ఓవర్ తో కథని మొదలుపెట్టిన దర్శకుడు.. తర్వాత జయమ్మ మర్డర్ మిస్టరీ చుట్టూ సన్నివేశాలు అల్లుకున్నాడు.
హత్య జరిగిన తీరు, కొన్ని పాత్రలపై అనుమానాలు కలిగించడం, కేసులోకి డెవిల్ రావడం, ఆయన చేసిన నేర పరిశోధన ఆసక్తిగానే సాగుతాయి.
అసలు కథకి ఈ హత్య కేసు ఒక ఉపకథ మాత్రమే అన్న సంగతి ప్రేక్షకులకు క్రమంగా అర్ధమౌతుంటుంది. మొదట కొంచెం హుషారుగా సాగిన నేరపరిశోదన తర్వాత రొటీన్ గా మారిపోతుంది. సన్నివేశాలన్నీ ముందే ఊహకు అందిపోతుంటాయి.
నైషధ( సంయుక్త మేనన్) డెవిల్ పాత్రల మధ్య అల్లుకున్న సన్నివేశాలు కూడా అంత రక్తికట్టేలా వుండవు. ఒక దశలో ఈ మర్డర్ మిస్టరీ కనుమరుగైపోతుంది.
చివర్లో ఓ సన్నివేశంతో ఆ మిస్టరీ చిక్కుముడిని విప్పారు. కానీ, అప్పటికే దానిపై ప్రేక్షకుడికి ఆసక్తి పోతుంది. పైగా విప్పిన ముడిలో బలం, కొత్తదనం రెండూ కనిపించవు.

ఫొటో సోర్స్, Abhishek Pictures/ YOUTUBE
గూఢచారి ‘కోడ్’ గందరగోళం
విరామం వరకూ మర్డర్ మిస్టరీతో నడిచిన డెవిల్.. తర్వాత బ్రిటిష్ గూఢచర్యం, ఇండియన్ నేషనల్ ఆర్మీ ‘కోడ్’ కోసం చేసే ప్రయత్నాలు చుట్టూ సాగుతుంది.
నేతాజీ నుంచి వచ్చిన కోడ్ ను చోరీ చేయడం, ఆ కోడ్ బ్రిటిషర్లకు చేరకుండా చూడటం.. ఆ క్రమంలో వచ్చే పాత్రలు, వాటి ప్రయాణాలు కొంత గందరగోళానికి గురిచేస్తాయి.
పైగా ‘కోడ్’ చుట్టూ నడిపే డ్రామాలో ఆసక్తికరమైన మలుపులు ఏవీ వుండవు. సన్నివేశాలన్నీ నీరసంగా సాగుతుంటాయి. కోడ్ కోసం డెవిల్ ఆడే లవ్ డ్రామా కూడా తేలిపోతుంది.
ప్రీక్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ వస్తుంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు కూడా ఈ ట్విస్ట్ ముందే అర్ధమైపోతుంది. చివర్లో ఒక వార్ ఎపిసోడ్ ఉంది. అంత పెద్ద ఎపిసోడ్ కి కావాల్సిన ఎమోషన్‌ను తెరపై చూపించలేకపోయాడు దర్శకుడు.

ఫొటో సోర్స్, Abhishek Pictures/ Youtube
నేతాజీ కుడిభుజం.. ఎవరీ త్రివర్ణ?
నేతాజీ మరణం చరిత్రలో ఒక మిస్టరీ. ఆ మిస్టరీ చుట్టూ ఎన్నో కథలు, కథనాలు, ఊహాగానాలు వున్నాయి. డెవిల్ కథ కూడా అలాంటి ఒక ఊహాగానమే.
అయితే, ఇది నేతాజీ గురించి కాదు. ఈ చిత్ర కథా రచయిత నేతాజీకి కుడిభుజం లాంటి ఒక పాత్రను సృష్టించాడు. ఆ పాత్ర పేరు త్రివర్ణ (ఇందులో నేతాజీ తప్ప మిగతా పాత్రలన్నీ కల్పితమే అనే డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి.. త్రివర్ణ పాత్ర కల్పితమే అనుకోవాలి).
త్రివర్ణ, నేతాజీకీ ఒక కమాండర్. ఆ పాత్ర బ్రిటిష్ ప్రభుత్వంతో చేసిన పోరాటాన్ని చూపించాలానే ఆలోచనతో ఈ కథ పుట్టింది. ఆలోచన వరకూ బావుంది కానీ.. ఆచరణలోనే తేడా కొట్టింది.
డెవిల్ పాత్రకు కళ్యాణ్ రామ్ న్యాయం చేశారా?
డెవిల్ పాత్రకు కళ్యాణ్ రామ్ ఆహార్యం సరిపోయింది. బ్రిటిష్ ఏజెంట్‌గా ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో కష్టపడ్డాడు.
అయితే, డెవిల్ పాత్రకు సరైన క్యారెక్టర్ ఆర్క్ లేదు. పైగా దర్శకుడు ఆ పాత్ర లోతెంతో, ఎటువైపు టర్న్ తీసుకొంటుందో ట్రైలర్‌లో రివీల్ చేశాడు. సినిమాలో మాత్రం అదేదో ట్విస్ట్ అన్నట్టుగా చివరి వరకూ దాచాడు.
దాంతో ప్రేక్షకులకు డెవిల్ పాత్రపై ఆసక్తి తగ్గిపోతుంటుంది.

ఫొటో సోర్స్, Abhishek Pictures/ Youtube
స్వతంత్ర పోరాటంలో రెండు బలమైన మహిళా పాత్రలు
డెవిల్ లో రెండు బలమైన మహిళా పాత్రలు కనిపిస్తాయి. నైషధ, మణి మేఖల (మాళవిక నాయర్). స్వతంత్ర పోరాటంలో, నేతాజీ సైన్యంలో మహిళలు కూడా కీలక పాత్రలు పోషించారని ఈ రెండు పాత్రలు నిరూపించే ప్రయత్నం చేశాయి.
ఈ కథలో మర్డర్ మిస్టరీ లింక్ నైషధ పాత్ర ద్వారా తెరపైకి వస్తుంది. అలాగే, రాజకీయ నేపథ్యంలో మణి మేఖల పాత్ర కూడా బాగానే కుదిరింది.
నైషధ పాత్రలో సంయుక్త మీనన్ ఆకట్టుకుంది. ఈ పాత్రకు ప్రేమకథని జోడించే ప్రయత్నం కుదరలేదు.
మణి మేఖల వీరోచిత మహిళగా కనిపించింది.
శ్రీకాంత్ అయ్యంగర్, సత్య ,అజయ్, ఎస్తర్ నోరోన్హా పాత్రలు పరిధిమేరకు వున్నాయి.
డెవిల్ లాంటి కథలకు పాటలు అనవసరం అనిపిస్తుంది. ఇలాంటి కథలో పాటలు కథనానికి అడ్డం పడినట్లుగా ఉంటాయి.
హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పిస్తుంది. సౌందర్ రాజన్.ఎస్ ఛాయాగ్రహణం డీసెంట్ గా వుంది.
ఆర్ట్ వర్క్ లో నాటి పరిస్థితులని క్రియేట్ చేసే ప్రయత్నం కనిపించింది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.
నిజానికి, డెవిల్ కథ ఆలోచన కాస్త కొత్తదే. ఒక సీక్రెట్ ఏజెంట్‌ను మర్డర్ మిస్టరీలోకి తెచ్చి స్వతంత్ర పోరాటంతో ముడిపెట్టి దేశభక్తిని రగిలించే ఒక ఉద్వేగాన్ని ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. అయితే, ఈ ప్రయత్నంలో ఆ ఉద్వేగమే కొరవడింది.
ఇవి కూడా చదవండి :
- అటల్ బిహారీ వాజపేయి: ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?,
- మెర్తిర్ టిడ్‌ఫిల్: ‘వయగ్రా’ కు జన్మనిచ్చిన ఊరు ఇదే, ఆ మగవాళ్లే లేకుంటే ఏం జరిగేది?
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- ఎర్ర సముద్రం: సూయజ్ కెనాల్ ఎక్కడ ఉంది? ఈ రూట్లో నౌకలపై దాడులు జరిగితే ప్రపంచం అంతా టెన్షన్ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















