కూసే మునిసామి వీరప్పన్: ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల దృష్టిని ఎందుకు ఆకర్షిస్తోంది?

వీరప్పన్

ఫొటో సోర్స్, NAKKHEERAN

ఫొటో క్యాప్షన్, వీరప్పన్
    • రచయిత, సుభాష్ చంద్రబోస్
    • హోదా, బీబీసీ కోసం

వీరప్పన్ కథ ఆధారంగా 'కూసే మునిసామి వీరప్పన్' అనే డాక్యుమెంటరీ ఇటీవల విడుదలైంది. వీరప్పన్ గురించి ఇప్పటి వరకు ఎన్నో కథనాలతో సినిమాలు, సీరియల్స్‌, డాక్యుమెంటరీలు రూపుదిద్దుకున్నాయి. అయితే, ఈ డాక్యుమెంటరీ వీరప్పన్ చరిత్రలోని కొత్త విషయాలు బయటికి తీసుకొచ్చింది.

ముఖ్యంగా వీరప్పన్.. ఆయన జీవితం గురించి మాట్లాడుతున్న అనేక వీడియోలు 'కూసే మునిసామి వీరప్పన్' సిరీస్‌లో ఉపయోగించారు. పోలీసులు, అటవీ బలగాలకు సంబంధించి వివాదాస్పద సీన్లనూ చూపించారు.

దీంతో సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ డాక్యుమెంటరీలో ఏం చూపించారు?. ఒకసారి తెలుసుకుందాం..

జయచంద్ర హష్మీ

ఫొటో సోర్స్, JEYACHANDRA HASHMI / FACEBOOK

ఫొటో క్యాప్షన్, జయచంద్ర హష్మీ

నాణేనికి రెండు వైపులా

'కూసే మునిసామి వీరప్పన్' డాక్యుమెంటరీ సిరీస్‌ను జయచంద్ర హష్మీ, ప్రభావతి ఆర్వీ, వసంత్ బాలకృష్ణన్ నిర్మించారు.

ఇది జీ5 ఓటీటీలో ప్రసారం అవుతోంది. ఇతర వీరప్పన్ సిరీస్‌ల కంటే ఇది ఎందుకు భిన్నం? అని మేం చిత్ర బృందాన్ని మొదటి ప్రశ్నగా అడిగాం.

‘‘వీరప్పన్‌పై ఇప్పటివరకు వచ్చిన సినిమాలు, సీరియల్‌లు పోలీసులు లేదా మూడో వ్యక్తులు చెప్పే వాటితోనే వచ్చాయి. కానీ వీరప్పన్ తెరపై కనిపించి ఆయన జీవితంలో ఏం జరిగిందో ఆయనే చెప్పే డాక్యుమెంటరీ ఇది’’ అని జయచంద్ర హష్మీ చెప్పారు.

“నాణేనికి రెండు వైపులా అన్నట్లు ఆ కథకూ రెండు పార్శ్వాలున్నాయి. ఈ డాక్యుమెంటరీలో వీరప్పన్ పోరాటయోధుడని, ప్రజల కోసం పోరాడారని నఖీరన్ (ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు) చెప్పలేదు. చట్ట ప్రకారం నేరస్థుడనే విషయాన్నీ ఖండించలేదు. వీరప్పన్ మంచివాడని కూడా కథలో చెప్పలేదు'' అని అన్నారు.

“కానీ ఇంతకుముందు వచ్చిన కథలన్నీ వీరప్పన్ అది చేశాడు, ఇది చేశాడని పోలీసులు చెప్పినవే ఉన్నాయి. అందుకే వీరప్పన్ వచ్చి ఏం జరిగిందో చెప్పడం ముఖ్యం. తన గురించి చాలా కథలు చక్కర్లు కొడుతున్నాయని, ఎవరో చేసిన నేరాలన్నీ తనపై నెడుతున్నారని ఆయన భావించారు. ఈ విషయం చెప్పడానికే మాట్లాడాలనుకున్నారు. అలా నఖీరన్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చారు" అని చెప్పారు.

"ఉదాహరణకు ఆయన ఏనుగులను చంపిన మాట నిజమే. కానీ ఎన్ని ఏనుగులనేది ఆయనకే తెలుసు. 2,000 ఏనుగులను చంపారని నేరం మోపడంతో బయటకు వచ్చి నిజం మాట్లాడాలనుకున్నారు. అధికారులు చెప్పినది వినడమే కాదు, మరోవైపు కథ కూడా తెలుసుకోవాలి" అని జయచంద్ర హష్మీ చెప్పారు.

వసంత బాలకృష్ణన్

ఫొటో సోర్స్, VASANTH BALAKRISHNAN / FACEBOOK

ఫొటో క్యాప్షన్, వసంత బాలకృష్ణన్

వీరప్పన్ వైపు కథ చెప్పారా?

ఈ కొత్త సిరీస్ వీరప్పన్ కోణం నుంచి చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది సిరీస్‌కు కొత్త ప్రాముఖ్యత తీసుకొచ్చినప్పటికీ, దాని ప్రధాన ఉద్దేశం అది కాదని జయచంద్ర హష్మీ అంటున్నారు.

“ఈ కథ వీరప్పన్ కోణంలో చెప్పలేదు. వీరప్పన్ వీడియోనే మన దగ్గరున్న ముఖ్యమైన డాక్యుమెంట్. ఈ కథ ద్వారా.. వీరప్పన్ ఎలా ఎదిగారు? ఆయన కారణంగా ప్రజలు ఎలా ప్రభావితమయ్యారు, వీరప్పన్ కోసం వెతికే ప్రక్రియలో అధికారులు ప్రజలను ఎలా ప్రభావితం చేశారు. చివరగా సాధించిందేంటి? దాని గురించే డాక్యుమెంటరీ చెప్పింది" అని ఆయన చెప్పారు.

సిరీస్ నిర్మాణంలో చిత్ర బృందం ఎదుర్కొన్న సవాళ్ల గురించి వసంత్ బాలకృష్ణన్‌ని మేం కొన్ని ప్రశ్నలు అడిగాం.

“వీరప్పన్‌ వీడియోలు చూస్తే, ఆయనకు ఫ్యాన్ అయిపోతారు. అయితే వాటిని నిర్థరించేందుకు మేం చేసిన ప్రయత్నాల్లో మాకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. వీడియోలో వీరప్పన్ ఆయన కోణం నుంచే కథను వివరించారు" అని చెప్పారు వసంత్.

"కానీ ఆయన స్వగ్రామం గోపీనాథంలోకి వెళ్లి చూస్తే, ఆ గ్రామంలో వీరప్పన్ ఆనవాళ్లే లేవు. ఇలా, ఈ కథలో అనేక గందరగోళాలు ఉన్నాయి" అని అన్నారు.

"కథను రెండు వైపుల నుంచి చెప్పాలనుకున్నాం. అదే ప్రధాన సవాలు కూడా. అంతేకాదు గ్రామస్తులను తీసుకొచ్చి వారితో నిర్భయంగా మాట్లాడించడం కూడా పెద్ద చాలెంజ్. అందుకు సీనియర్ జర్నలిస్టులు సుబ్బు, జీవా సహకరించారు’’అని వసంత్ చెప్పారు.

“మహిళలు, అదేవిధంగా పురుషులపై కూడా అత్యాచారాలు జరిగాయి. నేను అక్కడి ప్రజలను కలిసినప్పుడు, చాలామంది పురుషులు పోలీసుల దెబ్బలతో అంగవైకల్యం పాలై, అనారోగ్యంతో ఒక్క లైన్ కూడా సరిగ్గా మాట్లాడలేకపోయారు" అని వసంత్ చెప్పారు.

వీరప్పన్

ఫొటో సోర్స్, Getty Images

'ఆయన సినిమాను రజనీకాంత్ తీయాలనుకున్నారు'

ప్రేక్షకులు లీనమయ్యే సినిమాటిక్ అనుభూతిని అందించాలని ముందుగానే నిర్ణయించుకుంది చిత్ర బృందం. ఇందులో షూటింగ్ లొకేషన్లది కీలక పాత్ర. ఇప్పటి వరకు షూటింగ్ చేయని అంధియూర్ ప్రాంతంలోని కొండల్లో షూటింగ్ చేశానని వసంత్ అన్నారు. వీరప్పన్ ఈ ప్రాంతాలలో తిరిగినట్లు కూడా చెబుతారు.

“మంచి చిత్రాన్ని అందించే బాధ్యత షూటింగ్ బృందానిదే. అలాగే, వీరప్పన్ ముఖానికి తగినట్లుగా ఎవ్వరూ ఉండరు కాబట్టి, మేం సిరీస్ అంతటా వీరప్పన్ ముఖాన్ని పూర్తిగా చూపించలేం. ఈ సిరీస్‌లో నిజమైన వీరప్పన్ ఎక్కువగా కనిపిస్తారు. అదే సమయంలో ఆయన ముఖ కవళికలు, కథ చెప్పే నైపుణ్యాలు అసమానం. ఈ సిరీస్‌‌కు పనిచేసిన టెక్నీషియన్లందరూ చాలా కష్టపడ్డారు, సక్సెస్‌కి కారణమయ్యారు’’ అని వసంత్ చెప్పారు.

లొంగిపోయి ప్రజాప్రతినిధిగా బయటకు రావాలని, రజనీకాంత్ తనపై సినిమా తీయాలని వీరప్పన్ కోరుకున్నారని వసంత్ అంటున్నారు.

"వచ్చే సిరీస్‌లో చాలా వివరంగా ఉంటుంది. తనను పట్టుకునే కారణంతో పోలీసులు ఎంతమందిని హింసించారని, వారికి పరిహారం ఇవ్వాలనేది ఆయన కోరిక" అని వసంత్ చెప్పారు.

వీరప్పన్

ఫొటో సోర్స్, ZEE 5

నెట్‌ఫ్లిక్స్ వీరప్పన్ vs జీ5 వీరప్పన్

ఇంతకుముందు నెట్‌ఫ్లిక్స్‌లో వీరప్పన్ సిరీస్ విడుదలైంది. ఇందులో ప్రభుత్వం వైపు నుంచి సిరీస్ తీస్తే, జీ5 సిరీస్‌లో వచ్చిన డాక్యుమెంటరీలో వీరప్పన్‌ వైపు నుంచి చూపించారు.

“ఐదేళ్ల క్రితం ఈ డాక్యుమెంటరీ బయటికి తీసుకురావాలనుకున్నపుడు ట్రైలర్‌ను కట్ చేసి చాలా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు పంపాం. జీ5 ప్లాట్‌ఫారమ్ ఈ సిరీస్ లోతైన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, అంగీకరించింది. ఆ తర్వాతే దర్శకుడు శరత్‌జ్యోతి, ఎడిటర్‌ రామ్‌ పాండియన్‌తో సహా సాంకేతిక నిపుణులను రంగంలోకి దించాం’’ అని జయచంద్ర హష్మి చెప్పారు.

“ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఈ సిరీస్‌ని ఎంచుకోకపోవడానికి కారణం, ఇది తమిళ భాషలో రావడం. కాబట్టి వారికి నచ్చుతుందా లేదా అనే సందేహం వచ్చి ఉండవచ్చు. వీరప్పన్ మీద వచ్చిన రెండు సిరీస్‌లు వేర్వేరు దిశలను తీసుకున్నాయి. అలా అని ఈ ఓటీటీలపై పక్షపాత ముద్ర వేయాల్సిన అవసరం లేదు”అని ఆయన అంటున్నారు.

ప్రధాన లక్ష్యమిదే: జయచంద్ర

వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్ చేస్తే ఎవరు కొన్నారు? దానికి సంబంధించిన ఆధారాలున్నాయా? అని వీరప్పన్ ఈ సిరీస్‌లో ప్రశ్నించారు.

“ఇన్నాళ్లూ ప్రభుత్వ సహకారం లేకుండా అడవుల నుంచి మైదాన ప్రాంతాలకు దుంగలను తీసుకురాలేరు. ఇంత పెద్ద నెట్‌వర్క్‌ని ఆయనెలా నిర్మించగలిగారు? ఇన్ని కోట్లు ఖర్చు చేసినా వీరప్పన్ సిబ్బందిలో ఒక్కరిని కూడా పట్టుకోలేకపోవడమేంటి?'' అన్నది ఈ సిరీస్‌ చూసిన వారికి ఎదురవుతున్న ప్రశ్న.

''వందల కొద్దీ హత్యలు చేశానని వీరప్పన్ స్వయంగా వీడియోలో చెప్పారు. అదే సమయంలో వీరప్పన్ పేరుతో వేలాదిమందిని పెడుతున్న ఇబ్బందులను బయటకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యం'' అని జయచంద్ర హష్మి అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)