విజయకాంత్: ఫైట్ సీన్‌లో తన బదులు నటించిన డూప్ చనిపోవడంతో అప్పటి నుంచి డూప్ లేకుండానే స్టంట్స్ చేసిన నటుడు

విజయకాంత్

ఫొటో సోర్స్, DMDK

నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ (70) కన్నుమూశారు.

కరోనాకు చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆయన భౌతిక కాయాన్ని డీఎండీకే కార్యాలయంలో ఉంచారు.

‘‘న్యుమోనియాతో ఆయన ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స జరిగింది. ఆయన ప్రాణాలు కాపాడటానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు’’ అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

సాధారణ వైద్య పరీక్షల కోసం మంగళవారం ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

‘‘వైద్య పరీక్షల్లో కెప్టెన్‌కు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు’’ అని అంతకుముందు డీఎండీకే ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో విజయకాంత్ నివాసం వద్ద డీఎండీకే కార్యకర్తలు, వాలంటీర్లు చేరుతున్నారు.

విజయకాంత్‌ను చేర్చిన మియాట్ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.

గత కొన్నేళ్లుగా విజయకాంత్ తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

గత నెలలో కూడా ఆయన మియాట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొని ఇంటికి తిరిగొచ్చారు. పార్టీ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు.

విజయకాంత్

విజయ్‌రాజ్ నుంచి విజయకాంత్‌గా..

విజయకాంత్ అలియాస్ విజయ్‌రాజ్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో జన్మించారు. ఆయన తండ్రి అలగర్‌స్వామి ఒక రైస్ మిల్లు యజమాని.

ఈయనకు తెలుగు మూలాలు ఉన్నాయనేది తమిళనాట ఒక వాదన.

చిన్నతనంలో చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో విజయకాంత్ తరచుగా స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్తుండేవారు. ఎంజీఆర్ సినిమాలు ఎక్కువగా చూసేవారు.

‘‘ఎంజీఆర్ సినిమాల్లోని ప్రతీ సీన్‌ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఆయన సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత చెన్నైకి వెళ్లి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు’’ అని ఆయన సన్నిహితులు చెబుతారు.

చెన్నైకి మారేంతవరకు తమిళ సినిమాల్లో ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాల్లో నటించేందుకు ఎక్కడికెళ్లినా శరీరం రంగు కారణంగా అనేకసార్లు తిరస్కారాలు ఎదురయ్యాయని ఆయన వివిధ సందర్భాలలో చెప్పారు.

నిరంతర ప్రయత్నాల తర్వాత 1979లో ఎంఏ కాజా దర్శకత్వంలో ‘ఇనిక్కమ్ ఇళమై’ సినిమాతో ఆయన చిత్రసీమలో అరంగేట్రం చేశారు.

కాజాకు విజయ్‌రాజ్ పేరు నచ్చలేదు. ఆ సమయంలో రజనీకాంత్ హవా బాగా నడుస్తుండటంతో ఆయన పేరులో నుంచి కాంత్ అనే పదాన్ని తీసుకొని విజయ్‌రాజ్ పేరును కాజా, విజయకాంత్‌గా మార్చారు.

విజయకాంత్

ఫొటో సోర్స్, VIJAYANTH

ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించి రికార్డు

తమిళ సినిమాలోని పెద్ద నటుల్లో ఒకరిగా విజయకాంత్ పేరు సంపాదించారు. వరుసగా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు.

తెలుగులో కూడా ఆయన సినిమాలు వచ్చాయి.

విజయకాంత్ కెరీర్‌లో 150కి పైగా సినిమాల్లో నటించారు. ఒకే ఏడాది (1984)లో ఏకంగా 18 సినిమాల్లో నటించి రికార్డు నెలకొల్పారు.

ఎస్‌ఏ చంద్రశేఖర్, రామ నారాయణన్ దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు.

'54 మంది దర్శకులను పరిచయం చేసిన ఏకైక నటుడు'

నటుడు విజయకాంత్ తన సినీ కెరీర్‌లో 54 మంది కొత్త దర్శకులను పరిచయం చేశారని నిర్మాత శివ ఒక సందర్భంలో చెప్పారు.

‘‘ప్రపంచ సినిమాలో మరెవరూ ఇలా చేసి ఉండరు. ఎంతో మంది కొత్త నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు విజయకాంత్ అవకాశం ఇచ్చారు’’ అని ఆయన అన్నారు.

“నన్ను నిర్మాతగా పరిచయం చేసింది కూడా ఆయనే. సీన్, డైలాగ్స్, కథ విషయంలో ఆయన కల్పించుకోరు. ఒకసారి కథ విని దానికి అంగీకరించిన తర్వాత మళ్లీ ఎలాంటి మార్పులు కోరుకోకుండా నటిస్తారు. విజయకాంత్ గొప్ప వ్యక్తి మాత్రమే కాదు. మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్" అని నిర్మాత శివ తెలిపారు.

విజయకాంత్

ఫొటో సోర్స్, VIJAYAKANTH/FACEBOOK

ఫైట్ సీన్స్‌లో డూప్‌ పెట్టేందుకు ఇష్టపడరు

విజయ్‌కాంత్ సినిమాల్లో ఫైట్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సినిమాల్లో స్టంట్ సీన్లు చేసేప్పుడు డూప్‌ని పెట్టేందుకు విజయకాంత్ ఇష్టపడేవారు కాదు. చాలా సినిమాల్లో ఆయన సొంతంగానే స్టంట్ సీన్లు చేశారు. యాక్షన్ సీన్స్‌లో విజయకాంత్ తనకంటూ ఓ స్టైల్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

డూప్ లేకుండా చేయడం వెనక ఒక బలమైన కారణం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. 'నలై ఉనాదు నాన్' సినిమా షూటింగ్ సమయంలో తనకు డూప్‌గా పెట్టిన ఆర్టిస్ట్ ప్రమాదవశాత్తూ చనిపోయారు. అప్పటి నుంచి డూప్‌ లేకుండా తనే స్టంట్ చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతారు.

అందుకోసం ఆయన ఫైటింగ్‌ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అలా చాలా సినిమాల్లో డూప్ లేకుండానే నటించడంతో, అనేకసార్లు భుజం గాయంతో బాధపడ్డారు కూడా.

కమల్, రజనీకి దీటుగా ఫ్యాన్ బేస్

కమల్ హాసన్, రజనీ కాంత్ హవా నడుస్తున్న కాలంలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు విజయకాంత్. ఎంత పెద్ద ఎమోషనల్ డైలాగ్‌లు అయినా తన స్టైల్‌లో సింగిల్ టేక్‌లో చెప్పేసేవారు.

''విజయకాంత్ సినిమా రిలీజ్ రోజు పండుగ వాతావరణం ఉండేది. గ్రామాల నుంచి బండ్లు కట్టుకుని పండుగకు వెళ్తున్నట్లు కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లేవాళ్లం'' అని తిరునల్వేలికి చెందిన ఒక అభిమాని చెప్పారు.

కమల్ హాసన్, విజయకాంత్

ఫొటో సోర్స్, VIJAYAKANTH/FACEBOOK

మానవత్వమున్న మనిషి

''సెట్స్‌లో ఆయన చాలా క్రమశిక్షణతో ఉండేవారు. షాట్ అయిపోగానే వెళ్లి కారవాన్‌లో కూర్చోడం వంటివి చేసేవారు కాదు'' అని కొరియోగ్రాఫర్ బృంద ఒకసారి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

''విజయకాంత్ లాంటి మనిషిని ఎప్పుడూ చూడలేదు. ఆయన నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లను కూడా ప్రేమపూర్వకంగా చూసుకునేవారు. సంఘం అప్పులు తీర్చడం కోసం విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా అందరినీ బాగా చూసుకునేవారు.''

''కొరియోగ్రాఫర్లకు సింగపూర్ నుంచి మలేషియాకు టికెట్లు కూడా ఆయనే బుక్ చేయించారు. డ్యాన్సర్లే కదా బస్సులో వస్తారులే అని వదిలేయలేదు'' అని ఆమె అన్నారు.

యువ నటులకు మెంటార్

1993లో ఎస్‌ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సెంతురబ్ పాండి సినిమాలో హీరో విజయ్ నటించారు. అందులో విజయ్ పెద్దన్నయ్య పాత్రలో విజయకాంత్ నటించారు.

అలాగే, 1999లో సూర్య నటించిన పెరియాన్న అనే సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించారు.

''సూర్య నటించిన మయావి సినిమాలో గెస్ట్ రోల్ చేయాలని ఆయన్ను అడగ్గానే, వెంటనే ఒప్పుకున్నారు. సాధారణంగా అలాంటి పెద్ద నటులు అంత త్వరగా ఒప్పుకోరు. కానీ, ఆ మరుసటి రోజు షూటింగ్‌ భోజన విరామం సమయంలో ఏవీఏం స్టూడియోకు వచ్చి తన పార్ట్ పూర్తి చేశారు'' అని మయావి సినిమా దర్శకుడు సింగం పులి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

విజయకాంత్

ఫొటో సోర్స్, VIJAYAKANTH/FACEBOOK

'పేదలకు సాయం చేయడంలో ఆయనకెవరూ సాటిరారు'

నటుడు రమేష్ ఖన్నా ఒకసారి బీబీసీతో మాట్లాడుతూ- ''విజయకాంత్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పుడు అందులో చేరాలని అనుకున్నా. అప్పుడు ఆయన నన్ను పిలిపించి నువ్వు పార్టీలో చేరితే ఒక పార్టీ మద్దతుదారుగానే మిగిలిపోతావు. కానీ, నువ్వు అందరి అభిమానం పొందాలి'' అన్నారని చెప్పారు.

''ఆ రోజుల్లో చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు భోజనం కూడా ఉండేది కాదు. డబ్బులు కూడా ఉండేవి కాదు. అప్పుడు కళ్లు మూసుకుని విజయకాంత్ ఇంటికి వెళ్లేవాళ్లం. ఆయన ఏం తింటారో అదే అందరికీ వడ్డించాలని చెప్పేవారు.''

''సినిమా సెట్‌లోనూ అంతే. లైటింగ్ బాయ్స్ నుంచి, సౌండ్ యూనిట్, అందరికీ అదే భోజనం పెట్టించేవారు. ఎలాంటి భేషజం లేకుండా అందరితో కలిసి కూర్చుని భోజనం చేసేవారు'' అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఏడాదిలో 18 సినిమాల్లో హీరోగా నటించి రికార్డ్ ఎలా సృష్టించారు?

రాజకీయాల్లోకి..

విజయకాంత్ 2005లో దేశీయ ముర్కోపు ద్రవిడ కలగం (డీఎండీకే) అనే పార్టీని స్థాపించారు.

తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ద్రావిడ పార్టీల పాలనకు డీఎండీకే ప్రత్యామ్నాయమని ఆయన ప్రకటించారు.

విజయకాంత్ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేశారు.

పార్టీ ఆవిర్భవించిన ఏడాదిలోపే జరిగిన 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు 8.4% ఓట్లు వచ్చాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 10.3% ఓట్లు సంపాదించారు.

కానీ, ఆ తర్వాత ఆయన సంకీర్ణ రాజకీయాల్లో భాగమయ్యారు. అప్పుడు డీఎండీకేకు ప్రజల్లో మద్దతు తగ్గిపోయింది.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకేకు 7.9%, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 5.1% ఓట్లు వచ్చాయి.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో 2.4% ఓట్లు, 2021 లోక్‌సభ ఎన్నికల్లో 0.43 శాతానికి ఓట్లు పడిపోయాయి.

1979లో ఇనిక్కమ్ ఇళమై సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన పలు హిట్ సినిమాలతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.

తర్వాత ఆయన బ్లాక్‌ ఎంజీఆర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ మద్దతు రాజకీయ కెరీర్ తొలినాళ్లలో విజయాలకు కారణమైంది.

1991లో వచ్చిన "కెప్టెన్ ప్రభాకరన్" సినిమా విజయంతో ఆయనకు కెప్టెన్ అనే బిరుదు వచ్చింది.

2001లో తమిళనాడు ప్రభుత్వం ఆయనకు కళైమామణి అవార్డును ప్రదానం చేసింది. 2002లో విడుదలైన "రమణ" చిత్రానికి తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు.

విజయకాంత్

ఫొటో సోర్స్, VIJAYAKANTH/FACEBOOK

‘పేదరిక నిర్మూలన దినోత్సవం’గా పుట్టినరోజు

సినిమా రంగంలో వెలిగిపోతున్న రోజుల్లో, 2005 సెప్టెంబర్ 14న మదురైలో భారీ సభ ఏర్పాటు చేసి తన రాజకీయ పార్టీ దేశీయ ముర్కోపు ద్రవిడ కళగం(డీఎండీకే)ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు.

ఆయన పార్టీ పెట్టిన తర్వాతి ఏడాది 2006 నుంచి, ఆయన పుట్టిన రోజును ‘పేదరిక నిర్మూలన దినోత్సవం’గా నిర్వహించేవారు.

విజయకాంత్

నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రవిడ కళగంకి నేతృత్వం వహించిన సమయంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 'పేదల కోసం వీలైనంత సాయం చేద్దాం(లెట్స్ డూ అవర్ బెస్ట్ ఫర్ ది పూర్)' అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

స్టాలిన్

ఫొటో సోర్స్, Twitter/MK stalin

ప్రధాని మోదీ సంతాపం

విజయకాంత్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

విజయకాంత్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ ట్వీట్ చేశారు.

‘‘తమిళ సినిమా లెజెండ్ విజయకాంత్. ఆయన నటన లక్షలాది హృదయాలను కదిలించింది. రాజకీయ నాయకుడిగా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపారు’’ అని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా విజయకాంత్ మృతికి నివాళులు అర్పించారు.

‘‘అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన డీఎండీకే అధ్యక్షుడు, సోదరుడు కెప్టెన్ విజయకాంత్ మరణవార్త చాలా బాధ కలిగించింది. ఆయన మంచి రాజకీయ నాయకుడు, మంచి మనిషి, మంచి సోదరుడు. మొత్తమ్మీద మనం ఒక మంచి మనిషిని కోల్పోయాం’’ అని ఆమె ట్వీట్ చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా విజయకాంత్ మృతికి సంతాపం తెలియజేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)