‘సన్‌బర్న్’ ఫెస్టివల్‌లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?

- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా నిర్వహించే మ్యూజిక్, డ్యాన్స్ ఫెస్టివల్ ‘సన్‌బర్న్’ ఈ ఏడాది కూడా వివాదంలో చిక్కుకుంది.
తాజాగా హైదరాబాద్‌లో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
దీనికి అనుమతులు తీసుకోకుండానే టికెట్లు విక్రయించడంపై విచారణ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
అనంతరం సన్‌బర్న్ పార్టీకి టికెట్లు విక్రయిస్తున్న ‘బుక్ మై షో’ ప్లాట్‌ఫామ్ ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి మీడియాతో చెప్పారు.
ఏటా చర్చల్లో నిలిచే ‘సన్‌బర్న్ ఫెస్టివల్’ అంటే ఏమిటి? ఎందుకు దీన్ని తరచూ వివాదాలు చుట్టుముడుతున్నాయి? దీనిపై కొన్ని సంస్థలు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి?

ఫొటో సోర్స్, SunBurn
సన్ బర్న్ ఎవరు నిర్వహిస్తారు? ఎక్కడ మొదలైంది?
సన్‌బర్న్ ఒక ఎలక్ట్రానిక్ డ్యాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్. ఏటా దేశంలోని భిన్న ప్రాంతాల్లో దీన్ని ‘పెర్సెప్ట్ లిమిటెడ్’ నిర్వహిస్తోంది.
2007లో గోవాలో మొదలైన ఈ ఫెస్టివల్‌లో స్వల్ప కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో ఒకటిగా ఎదిగిందని తమ వెబ్‌సైట్‌లో సన్‌బర్న్ పేర్కొంది.
ఈ వేడుకకు వచ్చే సంగీత అభిమానులను అలరించేందుకు భారత్‌తోపాటు విదేశీ కళాకారులను కూడా తీసుకొస్తారు.
ఇక్కడ ఆల్కహాల్ కూడా అందుబాటులో ఉంచుతారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘లీగల్ డ్రింకింగ్ ఏజ్ (ఎల్‌డీఏ)’ కంటే ఎక్కువ వయసుండే వారికి మాత్రమే తాము ఆల్కహాల్ ఇస్తామని, ఎంట్రీ గేటు దగ్గరే ఐడీ కార్డును పరిశీలించి వయసును నిర్ధరిస్తామని సన్‌బర్న్ చెబుతోంది.

ఫొటో సోర్స్, SunBurn
ఈ ఫెస్టివల్‌పై ఆరోపణలు ఏమిటి?
సన్‌బర్న్ ఫెస్టివల్ ‘డ్రగ్ కల్చర్’ను ప్రోత్సహిస్తోందని కొన్ని ‘రైట్ వింగ్’ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
గోవాలో ఈ ఏడాది నిర్వహించ తలపెట్టిన ఫెస్టివల్‌ను అడ్డుకోవాలని హిందూ జనజాగృతి సమితి ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది.
‘‘ఏటా నిర్వహించే ఇలాంటి ఫెస్టివల్స్‌తో గోవా సంస్కృతి దెబ్బతింటోంది. ముఖ్యంగా ఇలాంటి పార్టీలు యువతను డ్రగ్ కల్చర్ వైపు నడిపిస్తున్నాయి’’ అని ఆ పత్రంలో ఆరోపించారు.

ఫొటో సోర్స్, SunBurn
2019లో గోవాలో నిర్వహించిన ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ముగ్గురు యువకులు మరణించారు. వీరి మృతికి కారణాలు తెలియలేదు.
డ్రగ్స్ కల్చరే దీనికి కారణమని అప్పట్లో గోవా కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘ఆ ఈవెంట్‌లో బహిరంగంగానే డ్రగ్స్ అమ్ముతారు. అన్నీ తెలిసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు’’ అని నాడు కాంగ్రెస్ నాయకుడు వరద్ మర్దోల్కర్ ఎన్‌డీటీవీతో చెప్పారు.
సన్‌బర్న్ డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తోందని గోవా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ్ భీకే కూడా తాజాగా ఆరోపించారు.
సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను చుట్టుకుంటున్న వివాదాలపై ఫెస్టివల్ ఆర్గనైజర్, పెర్సెప్ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ ‘ద టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడారు.
‘‘భారత్ ఒక సంక్లిష్టమైన ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ దాదాపు అన్నింట్లోనూ వివాదాలు ఉంటాయి. కాబట్టి వీటిని అంత సీరియస్‌గా తీసుకోకూడదు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BookMyShow
హైదరాబాద్‌లో తాజా వివాదం ఏమిటి?
హైదరాబాద్ మాదాపూర్‌లో డిసెంబరు 31 రాత్రి ఎనిమిది గంటలకు ఈ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్వాహకులు భావించారు.
టికెట్ల ధరలు రూ.2,299, ఆ పైన ఉన్నాయి. ‘బుక్ మై షో’లో విక్రయాలు కూడా మొదలయ్యాయి. డీజేలు ‘సౌండ్ అవతార్’, డీజే ఏబీఎస్‌లు దీనికి వస్తున్నారని కూడా వెబ్‌సైట్లో రాశారు.
18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, 21 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే మద్యం ఇస్తామని కూడా వెబ్‌సైట్లో చెప్పారు.

ఫొటో సోర్స్, SunBurn
డ్రగ్స్ సమస్యపై అప్రమత్తం కావాలన్న రేవంత్
డిసెంబరు 24న కలెక్టర్లు, ఉన్నత పోలీసు అధికారులతో సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘‘ఈ టికెట్లు స్కూలు పిల్లలకు కూడా అందుబాటులో ఉంటున్నాయి. బుక్ మై షో ప్రతినిధులను ప్రశ్నించండి.. అధికారుల అనుమతి లేకుండా వారు టికెట్లు ఎలా విక్రయిస్తారు’’ అని ఈ భేటీలో రేవంత్ అన్నారు.
‘‘డ్రగ్స్ సమస్యతో పంజాబ్ ఎలా ఇబ్బంది పడుతోందో మనం చూశాం. తెలంగాణ కూడా ఆ దిశగానే త్వరత్వరగా ముందుకు వెళ్తోంది. అందుకే పోలీసులు అప్రమత్తం కావాలి’’ అని రేవంత్ చెప్పారు.
హైదరాబాద్‌లో సన్‌బర్న్ నిర్వహించడం, దీనికి వివాదాలు చుట్టుముట్టడం ఇదేమీ తొలిసారి కాదు. 2017లో గచ్చిబౌలి స్టేడియంలో దీన్ని నిర్వహించినప్పుడు ఆర్గనైజర్లపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనమంతరావు(వీహెచ్) పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇలాంటి ఈవెంట్లతో డ్రగ్స్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని నాటి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా విమర్శలు చేశారు.
తాజా పరిణామాల నడుమ కొంత సేపటి వరకూ ‘బుక్ మై షో’లో సన్‌బర్న్ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు.
అనుమతులు తీసుకోకుండా టికెట్లు అమ్మడంపై ‘బుక్ మై షో’ నోడల్ ఆఫీసర్, ఎండీలకు నోటీసులు ఇచ్చామని మాదాపూర్ అదనపు డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి చెప్పారు.
ఈవెంట్ ఆర్గనైజర్లలో ఒకరైన సుమంత్ అనే వ్యక్తిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ వివాదంపై స్పందన కోసం ‘బుక్ మై షో’, సన్‌బర్న్ ఫెస్టివల్ నిర్వాహకులను బీబీసీ సంప్రదించింది. అయితే, ఈ కథనం పబ్లిష్ చేసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.
ఇవి కూడా చదవండి..
- ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- Herpes: ఈ సుఖ వ్యాధి ఎందుకొస్తుంది, యువతలో ఎక్కువగా వస్తోంది ఎందుకు
- అయోధ్య-ప్రాణప్రతిష్ఠ: ఈ నగరం ఇప్పుడెలా మారిపోయింది, స్థానికులు ఏమంటున్నారు?
- పగడాల వరాలు: చదివింది ఎం.కామ్, బతుకు దెరువు కోసం శవాలకు పోస్టుమార్టం...తన జాబ్ గురించి ఆమె ఏం చెప్పారు?
- వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్, 81 మంది విద్యార్థినుల సస్పెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















