ఎర్ర సముద్రం: సూయజ్ కెనాల్ ఎక్కడ ఉంది? ఈ రూట్‌లో నౌకలపై దాడులు జరిగితే ప్రపంచం అంతా టెన్షన్ ఎందుకు?

ఎర్ర సముద్రంలో ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న హూతీ మిలిటరీ హెలికాప్టర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎర్ర సముద్రంలో ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న హూతీ మిలిటరీ హెలికాప్టర్
    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసియా నుంచి ‘మేడిన్ చైనా’ వస్తువులు యూరప్ దేశాలకు వెళ్లాలన్నా, యూరప్ నుంచి ‘మేడిన్ నెదర్లాండ్స్’ ఉత్పత్తులు భారత్‌కు చేరాలన్నా, సౌదీ అరేబియా, మరికొన్ని అరబ్ దేశాల నుంచి చమురు, సహజవాయువు దిగుమతులు చేసుకోవాలన్నా అనువైన సముద్ర మార్గం ఎర్ర సముద్రం.

ఈ మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హూతీ తిరుగుబాటుదారుల దాడులతో ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది. వీరు హమాస్‌కు మద్దతుగా, ప్రధానంగా ఇజ్రాయెల్‌కు వెళుతున్న సరకు రవాణా నౌకలపై దాడులు చేస్తున్నారు.

వీరి దాడులు ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేశాయి.

యూరప్- ఆసియా దేశాల సరకు రవాణాలో కీలక మార్గం
ఫొటో క్యాప్షన్, యూరప్- ఆసియా దేశాల సరకు రవాణాలో కీలక మార్గం

సూయజ్ కెనాల్ తవ్విన తర్వాత పెరిగిన ప్రాధాన్యం

ఈజిప్టులోని సూయజ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను ఆనుకుని ఉండే బాబ్ అల్ మండెబ్ జలసంధి వరకూ 1,930 కిలోమీటర్ల పొడవున ఎర్ర సముద్రం ఉంది.

అటు ఇటు ఎడారులే ఉండటంతో ఎర్ర సముద్రంలో నదులేమీ కలిసే అవకాశం లేదు. అందుకే ఈ సముద్రపు నీటిలో లవణాల గాఢత ఎక్కువ. మిగతా సముద్రాలతో పోలిస్తే ఎర్ర సముద్రం నీటిలో వేడి కూడా ఎక్కువే.

ఈ సముద్రం వెడల్పు 190 మైళ్లు. లోతు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. ఒక ప్రాంతంలో మూడు వేల మీటర్లు, మరో చోట 500 మీటర్లు ఉంది.

సూయజ్ కెనాల్ తవ్విన తర్వాత ఈ మార్గం ప్రాధాన్యం పెరిగింది.

ఎర్ర సముద్రానికి ఒక వైపు ఈజిప్టు, సుడాన్, ఎరిట్రియా, మరోవైపు సౌదీ అరేబియా, యెమెన్ ఉన్నాయి.

ఎర్ర సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాల్లో ఐదు రకాల కీలక ఖనిజ వనరులు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రధానమైనవి చమురు, సహజవాయువు. అందుకే ఇక్కడ ఏ చిన్న అలజడి తలెత్తినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై పడుతుంది.

ఈ మార్గానికున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా జిబౌటీలో తన నేవల్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది.

15 ఏళ్ల క్రితం గల్ఫ్ ఆఫ్ ఏడెన్, పశ్చిమ హిందూ మహా సముద్రం వద్ద సరకు రవాణా నౌకలపై కొంత మంది సముద్రపు దొంగలు (పైరేట్లు) దాడి చెయ్యడంతో అంతర్జాతీయ మారిటైమ్ పోలీస్ ఆపరేషన్‌ చేపట్టారు.

సూయజ్ కెనాల్ ద్వారా ప్రపంచ సరకు రవాణాలో 12శాతం
ఫొటో క్యాప్షన్, సూయజ్ కెనాల్ ద్వారా ప్రపంచ సరకు రవాణాలో 12శాతం

సూయజ్ కెనాల్ ఎందుకంత కీలకం?

సూయజ్ కెనాల్ తవ్వక ముందు యూరప్ దేశాల నుంచి బయల్దేరిన నౌక ఆసియా దేశాలకు చేరుకోవాలంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి రావాల్సి వచ్చేది.

ఈ కాలువ తవ్విన తర్వాత యూరప్‌ దేశాల్లో బయల్దేరిన నౌక ఆసియా దేశాలకు చేరుకోవడంలో వేగం పెరిగింది. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని కొత్త మలుపు తిప్పిన అంశం.

యూరప్ – ఆసియా దేశాల మధ్య వాణిజ్యంలో కీలకమైన సముద్ర మార్గం ఇది. మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి చేరడానికి ఉన్న దగ్గరి దారి.

ప్రపంచ సరకు రవాణాలో రద్దీగా ఉండే మార్గం, భారీగా ఆదాయం తీసుకొచ్చే సముద్ర మార్గం కూడా ఇదే. చమురు, సహజ వాయవుతో పాటు ఎలక్ట్రిక్ పరికరాలు, కార్లు, ఇతర సరకులు, ఆహార ధాన్యాల నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి.

యూరప్- ఆసియా దేశాల మధ్య తగ్గుతున్న దూరం
ఫొటో క్యాప్షన్, సూయజ్ కెనాల్ తవ్విన తర్వాత యూరప్- ఆసియా దేశాల మధ్య తగ్గిన దూరం
సముద్ర వాణిజ్యం

తొమ్మిది శాతం చమురు ఈ మార్గం గుండానే..

ఈ మార్గంలో 192 కిలోమీటర్లు ఉండే సూయజ్‌ కెనాల్ ప్రధానమైనది. 2023 ప్రథమార్ధంలో సూయజ్ కెనాల్ గుండా రోజుకు 9.2 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందంటే ఈ రూటుకున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ చమురు డిమాండ్‌లో ఇది 9 శాతమని వోర్‌టెక్సా డేటాను ప్రస్తావిస్తూ అమెరికా చమురు సమాచార విభాగం తెలిపింది.

ప్రపంచ ఎల్ఎన్‌జీ( లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగుమతుల్లో నాలుగు శాతం అంటే 391 మిలియన్ మెట్రిక్ టన్నులు ఈ మార్గం గుండా వెళ్లినట్లు ఎనర్జీ యాస్పెక్ట్స్ చెప్పింది.

సూయజ్ కెనాల్ గుండా ప్రయాణిస్తున్న సరకు రవాణా నౌకలు చెల్లిస్తున్న టోల్ చార్జీలు ఈజిప్టు ఆర్థిక రంగానికి ఆయువు పట్టు. ఈ టోల్ చార్జీల ద్వారా వస్తున్న ఆదాయం ఈ ఏడాది జూన్ 30 నాటికి రికార్డు స్థాయిలో 9.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్యాంకర్లలో పూర్తిగా నింపిన వాటిలో 60 శాతం ట్యాంకర్లను సూయజ్ కెనాల్‌లో నిలపవచ్చు. అంతే కాదు, ప్రపంచంలోని మొత్తం కంటైనర్ క్యారియర్స్, కార్ క్యారియర్స్, కార్గో షిప్పులను కూడా ఇందులో నిలపవచ్చు.

సౌదీ అరేబియా నుంచి క్రూడాయిల్ తీసుకుని బయల్దేరిన నౌక ఈ మార్గం గుండా ప్రయాణిస్తే నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌కు చేరాలంటే 6,436 నాటికల్ మైళ్లు ప్రయాణిస్తే చాలు. అదే ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాలంటే దీనికి దాదాపు రెట్టింపు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

ఏటా సూయజ్ కెనాల్ గుండా 17 వేల సరకు రవాణా నౌకలు ప్రయాణిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్ర సముద్రం గుండా జరుగుతోంది. దీని విలువ ట్రిలియన్ డాలర్లు ఉంటుంది.

ఇదెలా ప్రారంభమైంది?

మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతూ ఈజిప్టు రాజు సెనౌస్రెట్ 3 (1887-1849) పాలనా కాలంలో నైలు నది మీదుగా తొలిసారి సూయజ్ కెనాల్ తవ్వారు.

మధ్యధరా సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ సూయజ్, ఎర్ర సముద్రంతో కలిపేందుకు కొత్తగా కాలువ తవ్వాలని ఫ్రెంచ్ ఇంజినీరు ఫెర్డినాండో డి లెసప్స్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇది పూర్తవడానికి పదేళ్లు పట్టింది. దీన్ని 1869 నవంబర్ 10న ప్రారంభించారు.

ఈ కాలువ ఆసియా నుంచి ఆఫ్రికా ఖండాన్ని వేరు చేస్తోంది. మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహా సముద్రం, పశ్చిమ ఫసిఫిక్ ప్రాంతాలను చేరుకునేందుకు దగ్గరి దారి. సరకు రవాణాలో ప్రపంచవ్యాప్తంగా రద్దీగా ఉండే మార్గాల్లో ఇది కూడా ఒకటి.

1956లో ఈజిప్టు సూయజ్ కెనాల్‌ను జాతీయం చేసింది. ఈ నిర్ణయం కాలువ నిర్మాణంలో భాగస్వాములైన బ్రిటన్, ఫ్రాన్స్ , ఇజ్రాయెల్‌ను రెచ్చగొట్టింది. దీంతో ఈ దేశాలు ఈజిప్టు మీద దాడి చేశాయి. ఈజిప్టు 40 నౌకలను ముంచి వెయ్యడంతో అమెరికా, రష్యా, ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌కు నచ్చచెప్పడంతో యుద్ధం సద్దుమణిగింది.

1967 జూన్‌లో ఈజిప్టు, కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగాయి. ఆరు రోజుల యుద్ధంగా గుర్తింపు పొందిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ బలగాలు సూయజ్ కెనాల్ తూర్పు వైపున పాగా వేశాయి. పోరాటంలో ఈ కాలువ తీవ్రంగా దెబ్బ తింది. ఈజిప్టు, అరబ్ దేశాల సైన్యాలు కాలువ పశ్చిమం వైపున మాటు వేశాయి. దీంతో 1973లో యోమ్‌ కిప్పూర్ యుద్ధం వరకు కాలువను మూసివేశారు.

యోమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత 1975లో సూయజ్ కెనాల్ మీద ఈజిప్టు పూర్తి ఆధిపత్యాన్ని దక్కించుకుంది. దీంతో అప్పటి నుంచి కాలువను తిరిగి తెరిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)