ఛత్రపతి శివాజీ: ‘‘నన్ను చంపాలనుకుంటే చంపండి, బంధించాలనుకుంటే బంధించండి’’ అని ఔరంగజేబు దర్బారులో ఎందుకు అన్నారు?

- రచయిత, ప్రాచీ కులకర్ణి
- హోదా, బీబీసీ మరాఠీ కోసం, బికనీర్ నుంచి
‘‘అయిదున్నర అడుగులు, దృఢమైన శరీరం, సూర్యుడిలా ప్రకాశించే ముఖంతో ఉన్న ఒక వ్యక్తి గుర్రం మీద ఆగ్రాలో అడుగు పెడుతున్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో ఏనుగులు, గుర్రాలతో పాటు కాలినడకన వస్తున్న సైనికులు ఉన్నారు.’’
ఔరంగజేబును కలిసేందుకు వెళ్తోన్న ఛత్రపతి శివాజీ గురించి ఒక పాతకాలపు దస్తావేజులో ఇలా వర్ణించి ఉంది.
మీర్జా రాజా జై సింగ్ దర్బారులో పనిచేసే న్యాయవాది ప్రకాల్‌దాస్ ఈ దస్తావేజును రాసినట్లు చెబుతున్నారు.
చాలామంది ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకునే ఉత్కంఠభరిత ఘటన గురించి విన్నారు. కానీ, దానికంటే ముందు అసలు ఏం జరిగింది? అనే వివరణ మొత్తం ఈ వకీలు రాసిన నివేదికలో ఉంది. ఇది చాలా ముఖ్యమైన పత్రం.
రాజస్థాన్ రాష్ట్రం బికనేర్‌లోని డాక్యుమెంట్స్ మ్యూజియంలో ఉన్న ఈ పత్రం ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. అప్పటి పరిస్థితుల గురించి వర్ణిస్తుంది.
ముఖ్యమైన రికార్డులను భద్రపరిచే దేశంలోని తొలి డాక్యుమెంట్స్ మ్యూజియం ఇదే.

రాజస్థాన్ రాజకుటుంబాల చరిత్రకు సంబంధించిన అనేక ముఖ్యమైన రికార్డులు ఈ మ్యూజియంలోనే ఉన్నాయి. అయితే, ఇక్కడున్న ఒక హాలు అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఈ హాలు మొత్తం ఛత్రపతి శివాజీ, ఔరంగజేబుల గురించి, అలాగే ఛత్రపతి శంభాజీ చరిత్ర గురించి చెబుతుంది.
రాజస్థాన్‌లో రాజకుటుంబాల పాలన ముగియడంతో వారికి సంబంధించిన అన్ని దస్తావేజులు ప్రభుత్వానికి చేరాయి. వీటిలో చాలా ముఖ్యమైన రికార్డులు ఉన్నాయి.
ఈ రికార్డుల్లోని చాలా పత్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇందులో ఒకదానిలో శివాజీ గురించి ఉంది. దిల్లీ దర్బార్‌కు వెళ్లిన శివాజీకి అవమానం జరిగిందని ఇందులో పేర్కొన్నారు.
ప్రకాల్‌దాస్ రాసిన ఈ దస్తావేజు ప్రకారం ...దర్బారులో ఆయన నిలబడాల్సిన చోట కాకుండా 5 వేల మున్సబుదార్ల వరుసలో జోధ్‌పూర్ రాజుల వెనక శివాజీని నిలబడేలా చేశారని అందులో ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, RANJIT DESAI
నజరానా అందించి ఈ లైన్‌లో నిల్చోవాల్సిందిగా పంపినప్పుడు ఛత్రపతి శివాజీ ఆశ్చర్యపోయారు. ఆయన కళ్లు కోపంతో ఎరుపెక్కాయి. ఔరంగజేబు ఇదంతా చూశారు. ఏం జరిగిందంటూ మీర్జారాజా జైసింగ్ కుమారుడు రామ్ సింగ్‌ను అడిగారు.
శివాజీ మహరాజ్ చేయి పట్టుకుని కదిలించారు రామ్ సింగ్. అప్పుడు శివాజీ ‘‘నేను నిన్ను చూశాను. మీ నాన్నను చూశాను. మీ బాద్షాను కూడా చూశా. నేను ఆయన చర్యను ఆమోదించను. మీరు నన్ను చంపాలనుకుంటే, చంపండి. నన్ను బంధించాలనుకుంటే బంధించండి’’ అంటూ ఔరంగజేబుకు వెన్ను చూపిస్తూ దిల్లీ దర్బారును వీడారు శివాజీ,
ఈ ఉదంతాన్ని వకీలు ప్రకాల్‌దాస్ తన నివేదికలో వివరంగా రాశారు. దీని గురించి రాజస్థాన్ పురావస్తు శాఖ డైరెక్టర్ మహేంద్ర సింగ్ ఖడ్గావత్ వివరించారు.
ఖడ్గావత్‌ల చొరవతోనే ఈ మ్యూజియం ఏర్పాటైంది.
శాసనాలు, ఇతర రాత ప్రతులు, చారిత్రక పత్రాలను అలాగే భద్రపరిచారు. ఇందులోని ఒక హాల్ మొత్తం రాజపుత్ రాజుల దృష్టి కోణం నుంచి ఛత్రపతి శివాజీ మహరాజ్ చరిత్రను ఆవిష్కరిస్తుంది.

పురంధర సంధి
ఈ హాలులోకి ప్రవేశించినప్పుడు ఒక పెద్ద షోకేస్ కనిపిస్తుంది.
ఈ షోకేస్‌లో భద్రపరిచిన పత్రాలు శివాజీ మహరాజ్ దిల్లీ దర్బారు యాత్ర గురించి తెలుపుతాయి. దాన్ని పురంధర సంధిగా పిలుస్తారు.
22 అడుగుల ఎత్తున్న పురంధర సంధి పత్రాన్ని అక్కడ ఏర్పాటు చేశారు.
ఛత్రపతి శివాజీ వదులుకోవడానికి అంగీకరించిన కోటలు, ఆయుధాల గురించి పురంధర ఒప్పందంలో మీర్జా రాజా జైసింగ్ పేర్కొన్నారు.
మీర్జారాజా జై సింగ్ ఈ ఒప్పంద పత్రాన్ని ఔరంగజేబుకు పంపారు. ఔరంగజేబు ఈ ఒప్పంద పత్రాన్ని తిరిగి పంపేటప్పుడు శివాజీ కోసం ఒక లేఖను కూడా పంపారు.
వాటితో పాటు ఒక వస్త్రాన్ని కూడా పంపించారు. శివాజీకి పంపిన లేఖపై ఒక చేతిముద్రను కూడా వేశారు. ఈ చేతి ముద్రను ఎంపికచేసిన కొన్ని లేఖలపై మాత్రమే వేస్తారు.

ఈ లేఖలో ఔరంగజేబు ఇలా రాశారు. ‘‘ఈ ఉత్తర్వుతో పాటు ఛత్రపతి శివాజీ పేరు మీద ఒక విలువైన వస్త్రాన్ని పంపించాం. ఈ ఉత్తర్వుపై మా పంజా గుర్తు ఉంది. ఆయన నేరాలను క్షమించి, అతని తప్పులను విస్మరిస్తూ ఈ ఉత్తర్వులు పంపిస్తున్నాం’.
ఆయన గౌరవం, కీర్తి కోసం ఈ వస్త్రాన్ని (చక్రవర్తి ఇచ్చిన వస్త్రం) పంపించాం. ఆయన కీర్తి, ప్రతిష్టలను కీర్తించడానికి ఈ వస్త్రాన్ని ఆయనకు సమర్పిస్తున్నాం. ఎల్లప్పుడూ నిజాయతీగా, విధేయతతో ఉంటానని ఆయన మాట ఇవ్వాలి. సామ్రాట్‌కు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పాలి.
శివాజీకి తల్కోకన్ భాగాలు దక్కుతాయి. బీజాపూర్‌లోని ఆ భాగం విలువ నాలుగు లక్షల మాణాలు (బంగారు నాణేలు) ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
మీర్జా రాజా జైసింగ్ వల్ల ఈ లేఖ రాజస్థాన్‌కు చేరకుందని ఖడ్గవత్ చెప్పారు.
‘‘మాకు ఈ కాగితం దొరికినప్పుడు ఇది చాలా చిరిగిపోయి ఉంది. దాన్ని మేం సరిగ్గా జత చేసి అతికించాం. తర్వాత తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ భద్రపరిచాం. దానికి ఎలాంటి నష్టం జరుగకుండా లేఖ వద్ద ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేశాం. ఈ ఒప్పంద పత్రాన్ని వివిధ భాషల్లోకి అనువదించాం’’ అని ఆయన చెప్పారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్ వీరోచిత గాథ
శివాజీ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన పత్రాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. అలాగే దిల్లీ చక్రవర్తిని వ్యతిరేకించడాన్ని మానేసి అతనితో కలిసి పనిచేయాలంటూ ఛత్రపతి శంభాజీకి జైపుర్ మహారాజు రామ్ సింగ్ రాసిన లేఖల్ని కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చు.
రామ్ సింగ్‌కు ఛత్రపతి శంభాజీరాజ్ ఇచ్చిన సమాధానం కూడా ఇక్కడ ఉంది.
అందులో "మనం తీసుకున్న నిర్ణయాల గురించి ఆలోచించండి. మనం కోల్పోయిన వాటి గురించి ఆలోచించండి. మనం ఈ రాచరిక జీవితాన్ని గడపగలిగాం. ఇప్పుడు మన మనుషుల్ని చంపుతున్నారు. వాళ్ల ఇళ్లను కూల్చివేస్తున్నారు. దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. మీరు దిల్లీకి రాజు అవ్వండి. అప్పుడు మేం మీతో కలిసి వస్తాం. అలా చేయలేకపోతే, అదంతా వదలేసి మీరు మాతో కలవండి’’’ అని శంభాజీ అందులో పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని తొలి డాక్యుమెంటరీ మ్యూజియం
రాజస్థాన్‌లోని 27 రాజ కుటుంబాలకు చెందిన ఈ పత్రాలను పరిశీలించే పని నేటికీ కొనసాగుతోంది.
ప్రతీ పత్రాన్ని సంరక్షించడానికి రసాయన పూత పూయడం వంటి పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా వాటిని చదివే పని ఇంకా కొనసాగుతూనే ఉంది.
ప్రతీ కాగితాన్ని భద్రపరచడమే కాకుండా అందులోని అంశాల్ని డిజిటలైజ్ చేస్తున్నారు.
తమ వద్ద 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దానికి చెందిన పత్రాలు ఉన్నాయని ఖడ్గవత్ చెప్పారు.
‘‘రాజపుత్ రాజులకు మొగలులు రాసిన 327 పత్రాలు లభించాయి. ఈ పత్రాలన్నీ చాలా అధ్వాన్న స్థితిలో మాకు దొరికాయి. వాటిని ఈ మ్యూజియంలో భద్రపరిచాం. చరిత్రలో ఏమి జరిగిందో భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు’’ అని ఆయన చెప్పారు.
ఇప్పటికీ చాలా పత్రాలు పరిశోధకుల చేతుల్లోకి వస్తున్నాయి. రాజపుత్రుల దృష్టి కోణం నుంచి వెల్లడవుతున్న ఈ మరాఠా చరిత్ర భవిష్యత్‌లో చరిత్రలోని మరిన్ని ముఖ్యమైన పేజీలను బహిర్గతం చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్: ధోనీతో యువ ఆటగాడైన రాబిన్ మింజ్‌ను ఎందుకు పోల్చుతున్నారు? ఐపీఎల్లో తొలి గిరిజన ఆటగాడు ఈయనేనా
- ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- Herpes: ఈ సుఖ వ్యాధి ఎందుకొస్తుంది, యువతలో ఎక్కువగా వస్తోంది ఎందుకు
- అయోధ్య-ప్రాణప్రతిష్ఠ: ఈ నగరం ఇప్పుడెలా మారిపోయింది, స్థానికులు ఏమంటున్నారు?
- పగడాల వరాలు: చదివింది ఎం.కామ్, బతుకు దెరువు కోసం శవాలకు పోస్టుమార్టం...తన జాబ్ గురించి ఆమె ఏం చెప్పారు?
- వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్, 81 మంది విద్యార్థినుల సస్పెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














