మీకన్నా మీ అవయవాల వయసు ఎక్కువగా పెరగడం దేనికి సంకేతం, ఇదెలాంటి ముప్పు కలిగిస్తుంది?

వయోభారం

ఫొటో సోర్స్, GETTY IMAGES

మీ వయసు 50 ఏళ్ళు అయితే మీ గుండె వయసు కూడా 50 ఏళ్ళే అవ్వాలి. అలా కాకుండా 55 ఏళ్ళు అయితే ఏమవుతుంది? అసలు ఇది సాధ్యమేనా? ఇలా మన అసలు వయసును మించి అవయవాల వయసు పెరిగితే ఏమవుతుంది? ఈ అవయవ వయోభారం ఏ ముప్పును సూచిస్తుంది?

మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వివిధ పరీక్షలు చేయించుకుంటూ ఉంటాం. అయితే మన శరీరంలో ఏ అవయవం ముందుగా వృద్ధాప్యం బారినపడుతుందో తెలుసుకోవడానికి ఏదైనా పరీక్ష ఉందా?

రక్తపరీక్ష ద్వారా మాత్రమే మానవ శరీరంలోని అవయవాలు ఎంత వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నాయో గుర్తించగలమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఏ అవయవం త్వరగా క్షీణత పొందుతుందో కూడా కనిపెట్టొచ్చని తెలిపారు.

ఇందుకోసం మానవ శరీరంలోని గుండె, ఊపిరితిత్తుల, మెదడు వంటి 11 కీలకమైన అవయవాలను పరీక్షించామని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ బృందం తెలిపింది. ఈ పరీక్షలు ఎక్కువగా మధ్యవయస్కులు, వృద్ధులపైనా చేశారు.

ఈ పరిశోధనలో 50 ఏళ్ళు దాటినవారిలో ఐదుగురిలో ఒకరికి ఏదో ఒక అవయవం వయసు సంబంధిత వ్యక్తి వయసును మించి పెరుగుతోందని కనిపెట్టారు.

అదే సమయంలో వందమందిలో ఒకరిద్దరిలో ఎక్కువశరీర భాగాలు వారి వయసుకన్నా పెద్దవిగా ఉంటున్నాయని తెలిపారు.

నిజానికి ఈ పరిశోధన భయం గొలుపుతున్నా, లైఫ్‌స్టైల్‌ను మార్చుకునేందుకు ఇదొక అపురూపమైన అవకాశమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అవయవ వయోభారం

అవయవాల వయసు పెరిగితే ఏమవుతుంది?

‘‘ ఏ శరీర భాగం త్వరగా క్షీణతకు గురవుతుందో తెలుసుకోవడం భవిష్యత్తు అనారోగ్యాన్ని గుర్తించడానికి సహాయకారి కాగలదు’’ అని నేచర్ పత్రికలో పరిశోధకులు చెప్పారు.

ఉదాహరణకు వయోభారాన్ని పొందిన గుండె, గుండెసంబంధిత వ్యాధుల ముప్పును పెంచుతుంది. అలాగే మెదడు వయసు వేగంగా పెరిగితే మతిభ్రమణకు దారితీస్తుంది.

శరీరంలో ఏదైనా అవయవం వయసు వేగంగా పెరుగుతోందంటే దాని సంబంధిత వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుందని, తరువాత 15 ఏళ్ళలో మరణం సంభవించే అవకాశం ఉంటుందని పరిశోధకులు కనిపెట్టారు.

ఈ పరిశోధన ఎలా చేశారు?

మన శరీరం వివిధ రకాల కణ సముదాయాలతో నిండి ఉంటుంది. శరీరం చక్కగా పని చేయడానికి, ఎదగడానికి కణాలు తప్పనిసరి. ఈ కణాలు ప్రోటిన్లతో తయారవుతాయి. ప్రొటీన్లు అమినో యాసిడ్లతో ఏర్పడతాయి.

ఏదైనా శరీర అవయవం వయసు తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేసినప్పుడు శరీరంలోని వేలాది ప్రొటీన్ల స్థాయిని కొలుస్తారు. దీనివలన శరీరంలోని అవయవాల వయసు ఎంతవేగంగా పెరుగుతుందో తెలుసుకోవచ్చు.

వివిధ రక్తపరీక్షల ఫలితాలను, ఇతర రోగుల సమాచారాన్ని కృత్రిమ మేధతో మదింపు చేసి పరిశోధకులు ఈ ఫలితాలను సాధించారు.

ఈ పరిశోధనలు చేసినవారిలో టోనీ వైస్ కోర్ కూడా ఒకరు. ఆయన బీబీసీ డిజిటల్ హెల్త్ ఎడిటర్ మిచెల్ రాబర్ట్స్‌తో మాట్లాడారు. ‘‘ తీవ్రమైన వ్యాధులు, వారి వయసుతో సంబంధం లేకుండా పెద్దసంఖ్యలో వారి శరీర అవయవాలను పోల్చి చూసినప్పుడు 50 ఏళ్ళ వయసు దాటిన వారిలో 18.4 శాతం మందిలో వారి అవయవాలు వారి వయసుకన్నా పెద్దవిగా వేగంగా మారడాన్ని గమనించాం’’ అని చెప్పారు.

‘‘ఇలాంటివారిలో రాబోయే 15 ఏళ్ళలో ఆ అవయవానికి సంబంధించిన వ్యాధి ముప్పు ఎక్కువయ్యే అవకాశంఉంది’’ అని తెలిపారు.

ప్రస్తుతం ఈ యూనివర్సిటీ తన పరిశోధనా ఫలితాలపై పేటెంట్ పొందే పనిలో ఉంది. దీనికి సంబంధించిన పేపర్ వర్క్‌ను పూర్తి చేస్తోంది. దీంతో ఈ ఫలితాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి లేదా అమ్ముకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది.

అవయవ వయోభారం

ఫొటో సోర్స్, GETTY IMAGES

బయోమార్కర్లు అంటే ఏమిటి

శరీర అవయవాల వయసును నిర్థరించే ఈ పరీక్షలు ఎంతమేరకు సమర్థవంతమైనవనే విషయం తేలడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.

దీనిపై గతంలో పరిశోధనలు చేసిన డాక్టర్ విస్ కోరీ మాట్లాడుతూ వృద్ధాప్య ప్రక్రియ అనేది ఓ పద్ధతిగా సాగదని, ఇది హఠాత్తుగా జీవితంలోని మూడో దశాబ్దపు మధ్యభాగంలో (అంటే 35 ఏళ్ల వయసులో) వేగం పుంజుకుంటుందని, తరువాత ఆరో దశాబ్దపు మొదట్లో (60 ల మొదట్లో ) ఏడో దశాబ్దపు (70ల చివర్లో) వేగంగా సాగుతుందని తెలిపారు.

‘‘ డాక్టర్ విస్ పరిశోధన ఆకట్టుకునేలానే ఉంది. కానీ దానిని ఇంకా అనేకమందిపైన ప్రయోగించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువకులపైన జరపాల్సి ఉంది, అలాగే వివిధ జాతీయులపైనా చేయాలి’’ అని ప్రొఫెసర్ జేమ్స్ టిమ్మన్స్ బీబీసీకి చెప్పారు. ఈయన క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌లో వయోభార సంబంధిత వ్యాధులలో నిపుణుడు.

వృద్ధాప్యానికి సంబంధించిన బయోమార్కర్లను అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్ టిమ్మన్స్ ‘‘ఈ పరిశోధన వృద్ధాప్యం గురించా? లేక శరీరంలో వచ్చే వ్యాధులను ముందుగా గుర్తించడానికా?’’ అని ప్రశ్నించారు.

అయితే డాక్టర్ విస్ పరిశోధ వయసుకు సంబంధించినదే అయినా అది వయోభార వ్యాధులను గుర్తించడాన్ని విస్మరించలేనిదన్నారు.

‘‘జీవ కణాలలో ఏం జరుగుతోందనే విషయాన్ని బయోమార్కర్లు గుర్తిస్తాయి. ఇది అనారోగ్యం ముప్పును ముందుగానే పసిగడుతుంది’’ అని గువాహటి వైద్యకళాశాలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పల్లవీఘోష్ చెప్పారు.

‘‘రోగులను ప్రతిదశలో జాగ్రత్తగా చూసుకోవడానికి బయోమార్కర్ల పాత్ర చాలా కీలకం. ఇప్పుడు క్లినికల్ ప్రాక్టీసులో వీటి పాత్ర పెరుగుతోంది. వ్యాధులకు చికిత్స అందించడంలోనూ, నియంత్రించడంలోనూ బయోమార్కర్ల పాత్ర ఎన్నదగినది.

‘‘ ఇదెంతో ఉపయుక్తమైనది. ఒకే వ్యాధి ఇద్దరు మనుషులలో స్వల్పతేడాతో ఉంటుంది. బయోమార్కర్ అనేది వ్యాధిని నిర్థరించి, చికిత్స అందించడానికి సరైన దారి చూపుతుంది’’ అని ఆమె చెప్పారు.

"ఖచ్చితంగా ఈ పరిశోధన ఇప్పటికీ కొత్తదే. అయితే కొంత దిశానిర్దేశం చేసింది. గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ఎముకలు వంటి అవయవాల వృద్ధాప్య అస్థిరతను బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ప్రొఫెసర్ పల్లవి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)