ఒకే మహిళ కడుపులో రెండు గర్భాశయాలు, రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మ

కేల్సీ హాట్చర్

ఫొటో సోర్స్, ANDREA MABRY/UNIVERSITY OF ALABAMA AT BIRMINGHAM

ఫొటో క్యాప్షన్, అలబామా యూనివర్శిటీలో కెల్సీ హాట్చర్ (32) రెండు రోజుల్లో ఇద్దరికి జన్మనిచ్చారు.
    • రచయిత, జేమ్స్ ఫిట్జ్ గెరాల్డ్
    • హోదా, బీబీసీ న్యూస్

అరుదైన డబుల్ యుటెరస్ ఉన్న అమెరికా మహిళ రెండు రోజుల్లో ఇద్దరికి జన్మనిచ్చారు. ఇలా లక్షల్లో ఒకరికే జరుగుతుందంటున్నారు వైద్యులు.

బర్మింగ్‌హామ్ ఆసుపత్రిలోని అలబామా యూనివర్శిటీ (యూఏబీ)లో కెల్సీ హాట్చర్ (32) మంగళవారం ఒక కుమార్తెకు, బుధవారం రెండో కుమార్తెకు జన్మనిచ్చారు.

హాట్చర్ సోషల్ మీడియాలో తన శిశువులను "మిరకిల్ బేబీస్" అని పిలుస్తూ పోస్టు పెట్టారు. 20 గంటల ప్రసవ సమయంలో జాగ్రత్తగా చూసుకున్న వైద్య బృందాన్ని ఆమె ప్రశంసించారు.

ఈ శిశువులను కవలలు (ఫ్రెటెర్నల్ ట్విన్స్)గా పరిగణిస్తున్నారు, అయితే వారి పుట్టినరోజులు ఇలా వేర్వేరుగా ఉండటం అరుదు.

Babies Roxi and Rebel

ఫొటో సోర్స్, Andrea Mabry/University of Alabama at Birmingham

ఫ్యామిలీ అంతా ఇంటికి తిరిగి వచ్చామని, ఇక సెలవులను ఆస్వాదిస్తామని హాట్చర్ అంటున్నారు. ఎందుకంటే ఆమె ఇంతకుముందు క్రిస్మస్ తేదీని డెలివరీ డేట్‌గా భావించారు.

17 సంవత్సరాల వయస్సులో హాట్చర్‌ శరీరంలో రెండు గర్భాశయాలు (గర్భాశయం డిడెల్ఫిస్)ఉన్నాయని తెలిసింది. ఇలాంటి పరిస్థితి 0.3 శాతం మహిళలకు మాత్రమే ఎదురవుతుందని యూఏబీ తెలిపింది.

యూఏబీ ప్రకారం ఇలా రెండు గర్భాశయాలలో గర్భం (డికావిటరీ ప్రెగ్నెన్సీ) వచ్చే అవకాశాలు ప్రతీ పది లక్షల మందిలో ఒకరికే వస్తుందని తెలిపింది.

ఆసుపత్రి

ఫొటో సోర్స్, UNIVERSITY OF ALABAMA AT BIRMINGHAM

ఫొటో క్యాప్షన్, భర్త, ఇద్దరు పిల్లలతో హాట్చర్

'నమ్మలేకపోయా'

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా అరుదు. 2019లో బంగ్లాదేశ్‌లో ఒక మహిళ నెలలు నిండకుండానే బిడ్డను ప్రసవించిన నెల తర్వాత కవలలకు జన్మనిచ్చిందని ఒక వైద్యుడు బీబీసీతో చెప్పారు.

కేవలం ఒక గర్భాశయంలో మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆమె భావించారు.

అయితే, అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా రెండో బిడ్డ కూడా ఉందని తేలింది.

"నేను ఊపిరి పీల్చుకున్నాను. మేం నమ్మలేకపోయాం" అని హాట్చర్‌ గుర్తుచేసుకున్నారు.

తన ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు హాట్చర్‌. ప్రెగ్నెన్సీలో ఈ స్థాయికి ఎలా వచ్చామో తెలియట్లేదని ఆనందం వ్యక్తంచేశారు.

హాట్చర్‌ డెలివరీ బాధ్యతలను మరో వైద్యుడితో పాటు ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ చూసుకున్నారు. శిశువులు ఎదగడానికి గర్భంలో చాలినంత స్థలం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే సాధారణ గర్భం మాదిరే ఇక్కడ కూడా ప్రతి శిశువుకు ప్రత్యేక గర్భం ఉందని ఆయన చెప్పారు.

హాట్చర్ గర్భం 39 వారాల పాటు ఉంది. ఆమెను ఆసుపత్రిలో పర్యవేక్షించడానికి రెట్టింపు సిబ్బంది అవసరమయ్యారు.

డిసెంబరు 19న అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 7:45 గంటలకు మొదటి బిడ్డ ప్రసవించినపుడు గదిలోని ప్రతి ఒక్కరిలో ఆనందం కనిపించిందని వైద్యుడు గుర్తుచేసుకున్నారు.

మళ్లీ 10 గంటల తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం 06:10కి రెండో బిడ్డ బయటికి వచ్చిందని తెలిపారు.

బాలికలను కవలలు (ఫ్రెటెర్నల్ ట్విన్స్) అని పిలువవచ్చని ప్రొఫెసర్ డేవిస్ అంటున్నారు. ప్రతి శిశువు ఒక ప్రత్యేక ఎగ్ నుంచి అభివృద్ధి కావడం, ప్రతి ఒక్క ఎగ్ ప్రత్యేక స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం అయినపుడు ఈ పదం ఉపయోగించొచ్చని ఆయన అన్నారు.

ఒకే కడుపులో ఇద్దరు శిశువులు ఉన్నారని, కాకపోతే వేరు వేరు చోట్ల అని తెలిపారు డేవిడ్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)