విచ్చలవిడి వ్యభిచారం, జూదం, ఆన్‌లైన్ మోసాలు చేసే ‘గాడ్‌ఫాదర్’ తరహా మాఫియా కుటుంబాలు ఎలా పతనమయ్యాయి?

మియన్మార్ మాఫియా

ఫొటో సోర్స్, CHINESE MINISTRY OF PUBLIC SECURITY

    • రచయిత, జోనథన్ హెడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా పోలీసులు విడుదల చేసిన కొన్ని ఫోటోల్లో ఒక మహిళ, మరో పురుషుడి చేతులకు సంకెళ్లు వేసి చైనా మియన్మార్ సరిహద్దు గేటు ముందు నిలబెట్టిన దృశ్యాన్ని పై ఫోటోలో చూడవచ్చు.

ఈశాన్య చైనా సరిహద్దుని పంచుకునే మియన్మార్ పట్టణాలే కేంద్రంగా అనేక స్కాం కేంద్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని నిర్వహిస్తోన్న మాఫియా సభ్యులపై వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా పైన చూపిస్తున్న ఇద్దరినీ చైనా అధికారులకు అప్పగిస్తున్నారు మియన్మార్ అధికారులు.

వారిలో ఒకరి పేరు మింగ్ గ్యుపింగ్, ఇంకొకరి పేర్ మింగ్ ఝెన్ ఝెన్. మియన్మార్‌ లోని లౌక్కెయింగ్‌ పట్టణాన్ని పధ్నాలుగేళ్లపాటు తన గుప్పిట్లో పెట్టుకున్న అత్యంత శక్తిమంతమైన వార్‌లార్డ్‌కి కొడుకు, మనమరాలు వీళ్లు.

అయితే మియన్మార్‌లో అంతర్యుద్ధం చైనాలోని మాఫియా పతనానికి దారి తీసింది. అరాచకం రాజ్యమేలుతున్న సరిహద్దు పట్టణంలో ద గాడ్ ఫాదర్ సినిమాను పోలిన నాలుగు మాఫియా కుటుంబాల పతనం మొదలైంది.

గత గురువారం ఇద్దరి చేతులకూ బేడీలు వేసిన ఫోటోలను చైనా పోలీసులు విడుదల చేసిన సమయానికే, మియన్మార్‌లో ఒక వ్యానులో 69 ఏళ్ల వృద్ధుడి శరీరానికి అటాప్సీ పరీక్షలు చేస్తున్న ఫోటోలను మియన్మార్ మిలిటరీ విడుదల చేసింది.

ఆ వ్యక్తి లౌక్కెయింగ్ పట్టణ వార్‌లార్డ్ మింగ్ ష్యుఛాంగ్. అతన్ని పట్టుకున్నాక ఆత్మహత్య చేసుకున్నాడని మియన్మార్ మిలిటరీ చెబుతోంది. అయితే నిజానిజాలపై అనుమానాలూ లేకపోలేదు.

ఇదొకరకంగా ఒక అసాధారణ కథకు అవమానకర ముగింపు లాంటిది. ఈ కథ యుద్ధం, విప్లవాల కాలంలో మొదలైంది. కానీ క్రమంగా మలుపు తిరిగింది.

మాదకద్రవ్యాలు, జూదాలు, దురాశ, అనైతిక చర్యలతో పుట్టుకొచ్చిన అపనమ్మకాలు, వాటి కారణంగా జరిగిన ఆధిపత్య పోరు, అంతిమంగా భీకర శత్రుత్వానికి దారి తీసిన వైనం ఈ కథలో మనకు కనిపిస్తాయి.

మియన్మార్ మాఫియా కథ

ఫొటో సోర్స్, THE KOKANG MEDIA

ఫొటో క్యాప్షన్, సరిహద్దు వెంబడి వార్‌లార్డ్స్ పతనం తరువాత వందలాదిమంది అనుమానితులను మియన్మార్ నుంచి చైనాకు అప్పగించారు.

నాలుగు మాఫియా కుటుంబాలు

నాలుగు కుటుంబాల్లోని ఒక కుటుంబ పెద్ద బాయ్ సువోఛెంగ్. ఈయన అనుచరుడే మింగ్ ష్యుఛాంగ్.

వీళ్ల నియంత్రణలోని లౌక్కెయింగ్ ఉప్పుటేరు ప్రాంతాలు క్యాసీనోలకు ప్రధాన కేంద్రంగా మారిపోయాయి. కొత్తగా పుట్టుకొచ్చిన బహుళ అంతస్తు భవనాలు గంభీరంగా తయారయ్యాయి. వ్యభిచార కూపాలు వేళ్లూనుకున్నాయి.

అయితే బలమైన శక్తిగా ఉన్న మింగ్స్, ఈ నాలుగు కుటుంబాల జాబితాలో లేరు. ఇక మిగిలిన మూడు కుటంబాలను నడిపిస్తున్న ముగ్గురు పెద్దలు - వెయ్ ఛావొరెన్, లియు గువోక్షి, లియు ఝేంగ్షియాంగ్.

మొదట్లో చైనాలోనూ, సరిహద్దు దేశాల్లోనూ చట్టవ్యతిరేకమైన జూదానికి డిమాండ్‌ బాగా ఉండేది. దీన్ని అవకాశంగా మలుచుకుని ఈ కుటుంబాలు బాగా వృద్ధి చెందాయి. లౌక్కెయింగ్ ప్రాంతంలో ఏర్పడిన క్యాసీనోలు, హవాలాకూ, అక్రమ రవాణాలకు, ఇతర అనేక మోసాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి.

దాదాపుగా లక్ష మంది విదేశీ పౌరులను, వారిలో ఎక్కువగా చైనీయులను ఈ స్థానిక స్కాం కేంద్రాలు బాగా ఆకర్షించాయి. వాళ్లంతా ఇక్కడ పనికోసం వచ్చి దాదాపుగా జైలువంటి కఠిన పరిస్థితుల్లో చిక్కుకుపోయారు.

ఎక్కువ గంటలు పని చేసేలా వాళ్లపై ఒత్తిడి చేసేవారు. వీళ్లంతా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతూ ఉంటారు. వీళ్ల మోసాలకు బలైన బాధితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.

ఇక్కడి స్కాం కేంద్రాల్లో అత్యంత క్రూరమైన క్రౌచింగ్ టైగర్ విల్లాను మింగ్ ష్యుఛాంగ్ నిర్వహించేవారు.

మియన్మార్ జాతీయ పోలీస్ యూనిఫాంలను పోలిన యూనిఫాంలు ధరిస్తూ తిరిగే ప్రైవేటు పోలీస్ ఫోర్స్‌ని మింగ్ నడిపేవారని కొందరు చెబుతారు.

వాళ్లొక ప్రైవేట్ మిలీషియాలాగా పని చేసేవారని కొన్ని రిపోర్టులున్నాయి. లౌక్కెయింగ్‌లో నాలుగు మాఫియా కుటుంబాల అధిపత్యాన్ని, పాలనను అమలు చేసేది ఈ మిలీషియానే.

సెప్టెంబరు నెలలో ఈ స్కాం కేంద్రాల మూసివేత కోసం, వాటిని నడిపిస్తున్న అన్ని గ్రూపులపైనా చర్యల కోసం మియన్మార్ ప్రభుత్వంపైన చైనా ఒత్తిడిని పెంచింది.

అక్కడ పనిచేస్తున్న వారిని తమకు అప్పగించాలని చైనా డిమాండ్ చేసింది. కానీ మింగ్ కుటుంబం దాన్ని వ్యతిరేకించింది.

మాఫియా కుటుంబాలకు చెందిన ప్రతీ క్యాసీనో కూడా, సంవత్సరానికి కొన్ని బిలియన్ డాలర్ల డబ్బుని ప్రాసెస్ చేస్తున్నాయని కొన్ని అంచనాలున్నాయి. కాబట్టి ఈ వ్యాపారాలను విడిచిపెట్టడం మాఫియా కుటుంబాలకు అంత తేలికైన విషయం కాదు.

ఈ మాఫియా కుటుంబాలకు, మియన్మార్ మిలిటరీకి మధ్య బలమైన సంబంధాలు కొనసాగాయి. దాంతో తమకు రక్షణ దొరుకుతుందని మింగ్స్ భావించేవారు.

సరిహద్దు ప్రాంతంలో గట్టిపట్టుని కొనసాగించే చైనా ప్రభుత్వం వీళ్లను అప్పగించాలని డిమాండ్ చేస్తూన్నా కూడా తాము తప్పించుకోగలమని దీమాగా ఉన్నారు మింగ్స్.

మియన్మార్ మాఫియా కథ

ఫొటో సోర్స్, MYAWADDY NEWS

మాఫియా కాల్పుల్లో చైనా అండర్ కవర్ పోలీసులు మరణించారా?

చైనా పోలీసులు స్కాం కేంద్రాలపై దాడులుచేస్తారనే ఊహాగానాల మధ్యన అక్టోబరు 20 తెల్లవారుజామున, క్రౌచింగ్ టైగర్ విల్లా నుంచి కొందరు స్కాం వర్కర్ల బృందాన్ని తరలించడం మొదలుపెట్టారు.

వర్కర్ల బృందంలో ఉన్న 50 నుంచి 100 మంది తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడున్న గార్డులు కాల్పులు జరిపారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో చైనాకు చెందిన అండర్ కవర్ పోలీస్ అధికారులున్నారని కొందరు చెబుతున్నారు.

ఈ ఘటన తర్వాత, మియన్మార్‌తో సరిహద్దుని పంచుకునే చైనా ప్రావిన్స్‌లోని స్థానిక ప్రభుత్వం, ఘాటైన ఉత్తరం ద్వారా స్పందించింది. వెంటనే మింగ్ కుటుంబంలోని నలుగురినీ అరెస్టు చేయాలంటూ చైనా పోలీసుల నుంచి అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.

లౌక్కెయింగ్‌ మాఫియా కుటుంబాలను అదుపు చేయడంలో అయిష్టత, అసమర్థతను ప్రదర్శించిన మియన్మార్ జుంటా పాలనపైన, చైనా బహిరంగంగా వ్యక్తం చేసిన ఆగ్రహ చర్యగా ఇది కనిపించింది.

లౌక్కెయింగ్ మాఫియాను కట్టిడి చేయని కారణంగా, మియన్మార్ సైనిక పాలనపై పోరాడుతున్న మూడు తిరుగుబాటు గ్రూపులు బలపడేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

బ్రదర్‌హుడ్ అలయన్స్‌గా చెప్పుకుంటోన్న ఈ తిరుగుబాటు గ్రూపులు, ఆక్టోబరు నెలాఖరున మియన్మార్ మిలిటరీపైన దాడులు చేసేందుకు సిద్ధపడ్డాయి.

అయితే సరిహద్దు ప్రాంతంలోని శాంతి భద్రతల కోసం దూకుడుగా వ్యవహరించొద్దని చైనా కోరుతూ వచ్చింది. కానీ మాఫియా కుటుంబాలకు అందుతోన్న భారీ ఆర్థికసాయం, వాళ్ల చుట్టూ రక్షణ కవచాల్లాంటి పూర్తిస్థాయి ప్రైవేటు సైన్యాలతో ఉన్న లౌక్కెయింగ్ ప్రాంతం, చైనా ప్రభుత్వ ప్రాధాన్యతలను మార్చేసింది.

మరోవైపు స్కాం కేంద్రాలను తుడిచిపెట్టేయడమే తమ లక్ష్యమని చెబుతోన్న తిరుగుబాటు గ్రూపులు, 2021లో మియన్మార్ పాలనను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యానికి వ్యతిరేకంగా పని చేస్తూ, జుంటా అధికారాన్ని కూలదోయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

అయితే లౌక్కెయింగ్ ప్రాంతంలోని మాఫియా ఘర్షణలకు, కుటుంబాల మధ్య ప్రతీకారాలకు సుదీర్ఘ చరిత్రే ఉంది. ఇది అర్థం కావాలంటే ప్రచ్ఛన్నయుద్ధ కాలం వరకూ వెళ్లాలి.

మియన్మార్ మాఫియా కథ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లౌక్కెయింగ్ : జూదం, మత్తుమందులు, స్కామ్‌లకు కేంద్రంగా మారింది

లౌక్కెయింగ్‌ గాడ్ ఫాదర్స్

లౌక్కెయింగ్ ప్రాంతంపైన గట్టి పట్టుని పదర్శిస్తున్న నాలుగు మాఫియా కుటుంబాలూ, మియన్మార్ మిలిటరీ కమాండర్, మిన్ ఆంగ్ హ్లెయింగ్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నాయి.

2021లో మియన్మార్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసే సైనిక కుట్రను నడిపించిన వ్యక్తి మిన్ ఆంగ్ హ్లెయింగ్.

కొంచెం వెనక్కు వెళ్లి 2009లో పరిస్థితిని గమనిస్తే, లౌక్కెయింగ్‌లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న మాజీ ఫైటర్, అప్పటి ఆ ప్రాంత వార్‌లార్డ్‌, పెంగ్ జియాషెంగ్‌ను గద్దె దింపేందుకు చేపట్టిన ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌ను, మిన్ ఆంగ్ హ్లెయింగ్ నడిపించారు.

ఈ ఆపరేషన్ ద్వారా అప్పటి మిలిటరీ ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పనిచేసే గ్రూపులను గద్దెనెక్కించాలని ప్రయత్నించారు.

సరిగ్గా ఇదే సమయంలో మియన్మార్ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆదివాసీ జాతుల తిరుగుబాటు గ్రూపులపైనా ప్రభుత్వానికి అనుకూలంగా మారాలంటూ ఒత్తిడి తెచ్చారు.

దీన్ని వ్యతిరేకించిన వారిలో పెంగ్ జియాషెంగ్ కూడా ఒకరు. తమకు అనుకూలంగా మారితే మాదకద్రవ్యాల వ్యాపారాలను కొనసాగనిస్తామని, డబ్బు సంపాదించుకునేందుకు అనుమతిస్తామని తిరుగుబాటు గ్రూపులకు సైనిక ప్రభుత్వం హామీలిచ్చింది. అయినా కూడా ఈ గ్రూపులు ఒప్పుకోలేదు.

మియన్మార్ స్వాతంత్రానంతర కాలంలోని కల్లోల పరిస్థితుల మధ్య, షాన్ రాష్ట్రంలో పుట్టుకొచ్చిన వార్‌లార్డ్స్‌ తరానికి చెందిన వ్యక్తి పెంగ్ జియాషెంగ్.

అప్పటి మియన్మార్ కేంద్ర ప్రభుత్వ పాలన, సరిహద్దు ప్రాంతాల వరకూ విస్తరించలేదు.

మారుమూలనుండే అత్యంత బీద, బీడు ప్రాంతమైన షాన్ రాష్ట్రానికున్న ఏకైక ఆర్థిక వనరు, నల్లమందు సాగు. దీని ద్వారా వచ్చే డబ్బుని తిరుగుబాటు గ్రూపులకు ఆర్థిక సాయంగా అందించేవారు.

మియన్మార్ మాఫియా

ఫొటో సోర్స్, THE KOKANG

ఫొటో క్యాప్షన్, పెంగ్ జియాషెంగ్ : షాన్ రాష్ట్రంలో శక్తిమంతమైన వార్‌లార్డ్‌గా ఎదిగారు. 91 ఏళ్ళ వయసులో మరణించారు

పెంగ్ జియాషెంగ్

చైనా మద్దతుగల బర్మా కమ్యూనిస్ట్ పార్టీలో కమాండర్‌గా ఎదిగారు పెంగ్ జియాషెంగ్. కానీ 1989లో చైనా మద్దతు ఆగిపోవడంతో, పెంగ్ సైనిక తిరుగుబాటు చేశారు. దాంతో బర్మా కమ్యూనిస్టు పార్టీ వేర్వేరు తిరుగుబాటు గ్రూపులుగా విడిపోయింది.

సరిగ్గా ఈ సమయంలోనే మియన్మార్ సైనిక ప్రభుత్వం బలహీనపడింది.

అప్పటికి ఏడాది ముందు 1988లో క్రమంగా బలపడుతున్న ఉద్యమాన్ని క్రూరంగా అణచివేసింది. ఈ ప్రజా ఉద్యమంలోనే ప్రతిపక్ష నాయకురాలిగా మారారు ఆంగ్ సాన్ సూచీ.

అయితే అప్పటికే బలం పుంజుకున్న ఆదివాసీ తిరుగుబాటు గ్రూపులు, ప్రతిపక్ష ఉద్యమకారులతో చేతులు కలుపుతారనే భయంతో, ప్రభుత్వంలోని సైనిక జనరల్స్ వేగంగా పావులు కదిపి తిరుగుబాటు గ్రూపులతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. దాంతో తిరుగుబాటు గ్రూపులకు విచ్చలవిడి స్వేచ్ఛ లభించింది.

ఈ గ్రూపులకు పట్టున్న ప్రాంతాలు ఒకరకంగా భూస్వాముల కింద ఉండే ప్రాంతాల్లాగా మారిపోయాయి.

క్రమంగా పెంగ్ నడిపిస్తోన్న మాదకద్రవ్యాల వ్యాపారంపైన ఒత్తిడి పెరగడంతో లౌక్కెయింగ్ పట్టణ కేంద్రంగా గ్యాంబ్లింగ్ హబ్‌ను అభివృద్ధి చేశారు.

తర్వాత 2009లో తమ బలగాలను బార్డర్ గార్డ్ ఫోర్స్‌గా మార్చాలని మియన్మార్ మిలిటరీ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు పెంగ్ జియాషెంగ్.

పెంగ్‌పై తిరుగుబాటు చేయాలంటూ ఆ గ్రూపులో డిప్యూటీ కమాండర్‌గా ఉన్న బాయ్ సువోఛెంగ్‌ను ఆశ్రయించారు మిన్ ఆంగ్ హ్లెయింగ్.

తర్వాత పెంగ్‌ను బయటకు తరిమేయడంతో ఆయన చైనాకు వెళ్లారు. తర్వాత గ్రూపు తగాదాల మధ్య అక్కడి క్యాసీనోల గోడలన్నీ తుపాకీ తూటాలు దూసుకెళ్లిన కన్నాలతో గుల్లయ్యాయి.

అయినప్పటికీ నిబద్దత కలిగిన జూదగాళ్లు మాత్రం బెట్టింగ్‌లను కొనసాగించారు. క్రమంగా బాయి సువోఛెంగ్‌తో పాటు మిగిలిన మూడు కుటుంబాలూ క్యాసీనోల ఆర్థిక వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్నాయి.

అయితే మిలిటరీతో బలమైన సంబంధాలు కొనసాగించిన మాఫియా కుటుంబాలు, మియన్మార్ వ్యాప్తంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరించుకున్నాయి.

అందులో భాగంగా మైనింగ్, ఎనర్జీ, మౌలికవసతులు, కాంబోడియా లాంటి దేశాల్లో క్యాసీనోల్లో వ్యాపార వాటాలు కలిగి ఉన్నాయి.

క్రమంగా మకావు, ఆగ్నేయ చైనా ప్రాంతాల్లో వ్యవస్థీకృతమైన నేర సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాయి.

దాంతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్న లౌక్కెయింగ్ ప్రాంతంలో, దేన్నైనా అమ్ముకోవచ్చు, దేన్నైనా కొనుక్కోవచ్చనే పరిస్థితి ఏర్పడింది.

ప్రతర్థి స్కాం కేంద్రాల మధ్య అరుదుగా తుపాకీ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. పెత్తనం చెలాయించే వ్యక్తులు సింహాలను, పులులనూ పెంచుకుంటూ ఉంటారు.

కానీ పెంగ్ తిరుబాటు సైన్యం ఎంఎన్‌డిఏఏ (మియన్మార్ నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ ఆర్మీ) లోని చాలా మంది, ఆయనకు విశ్వాసంగా ఉండిపోయారు. 2015లో నాలుగు మాఫియా కుటుంబాల నుంచి లౌక్కెయింగ్‌ను తిరిగి తన పట్టులోకి తెచ్చుకునే విఫలయత్నం చేశారు పెంగ్.

తర్వాత ఎంఎన్‌డిఏఏ, షాన్ రాష్ట్రంలోని సాయుధ గ్రూపులతో చేతులు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తన 91 ఏళ్ల వయసులో గతేడాది కన్నుమూశారు పెంగ్.

ఆయనకు లభించిన అత్యంత ఘనమైన అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో, ప్రాంతీయ తిరుగుబాటు గ్రూపుల నాయకులు, వార్‌లార్డ్స్ దాదాపుగా అందరూ పాల్గొన్నారు.

చివరికి ఒకనాటి తన ప్రత్యర్థికి గౌరవ వందనం అర్పించేందుకు మిన్ ఆంగ్ హ్లెయింగ్ కూడా ఒక సీనియర్ మిలిటరీ కమాండర్‌ను పంపించారు.

తర్వాత పెంగ్ వారసులు ఎంఎన్‌డిఏఏ కమాండ్ బాధ్యతలు తీసుకున్నారు. పెంగ్ నుంచి పదవి గుంజుకున్న బాయ్‌ సువోఛెంగ్‌ను గద్దె దింపేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

మియన్మార్ మాఫియా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆచూకీ తెలియని బాయ్ సువోఛెంగ్

స్కాంల మహమ్మారి

లౌక్కెయింగ్‌కు వెళ్లే అన్ని రోడ్లనూ, ప్రధాన సరిహద్దు క్రాసింగ్‌నూ కంట్రోల్ చేస్తున్న ఎంఎన్‌డిఏఏ, క్యాసినో క్యాపిటల్‌ను తమ సొంతం చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాయి. లౌక్కెయింగ్‌ను స్కాంల మహమ్మారి అని పేర్కొంది ఐక్యరాజ్య సమితి.

అయితే వాళ్ల చేతుల్లోకి ఈ ప్రాంతం వస్తే వాళ్లేంచేస్తారో మనం ఊహించుకోవచ్చు. స్కాంలను అంతం చేస్తామని చైనాకు హామీ ఇచ్చిన కారణంగా, ఈ గ్రూపు, తమ తిరుగుబాటు కార్యకలాపాల కోసం ప్రత్యామ్నయ ఆర్థిక వనరులను వెతుక్కోక తప్పదు.

అయితే సైనిక పాలనను గద్దె దింపాలనే తమ లక్ష్యాన్ని, మియన్మార్‌లోని విస్తృత సైనిక వ్యతిరేక ఉద్యమం స్వాగతిస్తోంది.

ఆదివాసీ తిరుగుబాటు బలగాలకు చిక్కిన మిలిటరీ సైనికులను, ప్రభుత్వ పరికరాలనూ ఊరేగిస్తోన్న ఘటనలు చూస్తూ మురిసిపోతున్న లక్షలాది మంది మియన్మార్ ప్రజానీకం, ఇప్పుడు లౌక్కెయింగ్‌లో నాటకీయ మాఫియా పతనాన్నీ కూడా చూస్తున్నారు.

మూడేళ్లపాటు సాగిన హింసాత్మక నియంతృత్వ పాలనతో బలహీనంగా కనిపిస్తోంది జుంటా ప్రభుత్వం. దాంతో సైనిక ప్రభుత్వం కూలుతుందని ప్రజలు ఊహిస్తున్నారు.

ప్రస్తుతం బాయ్ సువోఛెంగ్ ఎక్కడున్నారో ఎలాంటి వివరాలూ అందుబాటులో లేవు. ఆలానే మిగిలిన ఇద్దరు వార్‌లార్డ్స్ – వెయ్ ఛావొరెన్, లియు ఝేంగ్షియంగ్ ల గురించీ కచ్చితమైన సమాచారం లేదు. ఇక నాల్గవ వ్యక్తి లియు గువోక్షీ 2020లో చనిపోయారు.

ఈ మాఫియా కుటుంబాలకు చెందిన చాలా మంది కుటుంబ సభ్యులు ఇప్పుడు చైనా కస్టడీలో ఉన్నారు. వారిలో కొందరు పశ్చాత్తాపంతో వాంగ్మూలాలు ఇచ్చారు. స్కాం కేంద్రాల్లో పని చేసిన వేలాది మందిని చైనా పోలీసులకు అప్పగించారు.

లౌక్కెయింగ్‌లోనే చిక్కుకుపోయిన ఇంకొన్ని వందల మందిని తీసుకొచ్చేందుకు ప్రాంతీయ ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతానికి ఈశాన్య మియన్మార్ ప్రాంతంలోని ఈ స్కాండమిక్ పతనమవ్వొచ్చు. కానీ ఈ అరాచక పునాదులు ప్రపంచంలో మారో మారుమూల ప్రాంతంలో వేళ్లూనుకోవని చెప్పలేం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)