దళితుల జీవితాలను కళ్లకు కట్టే 8 బ్లాక్ & వైట్ ఫోటోలు

ఝార్ఖండ్ బొగ్గుగనులలో నడుస్తున్న మహిళ

ఫొటో సోర్స్, ASHA THADANI

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక దళిత మహిళ. ఝార్ఖండ్‌లోని ఉపరితల బొగ్గు గనిని తన చేతికర్రల సాయంతో నడుస్తూ దాటుతున్నారామె.

బొగ్గు గనుల ప్రాంతం కావడంతో ఇక్కడ భూగర్భం నుంచి మంటలు రావడం సాధారణమైపోయింది.

‘బ్రోకెన్’ పేరుతో ఆశా థడాని తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోల సిరీస్‌లో ఈ ఫొటో భాగం. భారత్‌లోని దళితుల జీవితాలను ఆశా గత ఏడేళ్లుగా చిత్ర రూపంలో చరిత్రకెక్కిస్తున్నారు.

భారత్‌లో సుమారు 20 కోట్ల మంది దళితులున్నారు. వారిలో చాలామంది సమాజంలో అట్టడుగు వర్గాలుగా జీవిస్తున్నారు.

అయితే, రిజర్వేషన్ల కారణంగా విద్య, ఆదాయ అవకాశాలు పెరిగి ఆరోగ్యం విషయంలో అంతరాలు తగ్గాయి.

దళితులలో అనేక మంది మిలియనీర్లు బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు. అనేక సంస్థలు దళిత హక్కుల కోసం పనిచేస్తున్నాయి.

భారతదేశ రాష్ట్రపతి పదవినీ చేపట్టారు దళితులు.

కానీ, ఇప్పటికీ దళితులు ఇతరులు చేయని పనుల్లో, వృత్తుల్లో కొనసాగుతున్నారు.

చనిపోయిన జంతువులను పాతిపెట్టడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం వంటి వృత్తులలో ఉంటున్నారు.

Theyyam

ఫొటో సోర్స్, ASHA THADANI

థెయ్యమ్ అనేది కేరళ ఉత్తర ప్రాంతంలో కనిపించే ఒక మతపరమైన ఆచారం. ఈ ఫోటోలో కనిపిస్తున్నది థెయ్యమ్ వేషం వేసుకున్న దళితుడు.

డాన్స్ చేస్తూ ట్రాన్స్‌లోకి వెళ్లే వీరిని దైవం ఆవహిస్తుందని నమ్ముతారు.

‘‘థెయ్యం కళాకారులను దైవదూతలుగా భావిస్తారు. వీరు కథలు చెప్తారు. కుల వ్యవస్థలో ఈ థెయ్యం పాతుకుపోయింది. థెయ్యం కళాకారులు అట్టడుగు కులాలకు చెందినవారు అయినప్పటికీ వారు ఆ వేషంలో ఉన్నప్పుడు అగ్రకులాలుగా చెప్పే కులాలకు చెందినవారు కూడా వారిని గౌరవించాలి, వారి మాటను పాటించాలి’’ అని ఆశా థడానీ చెప్పారు.

Musahars

ఫొటో సోర్స్, ASHA THADANI

ముషాహర్స్.. అంటే ఎలుకలవారు అని అర్థం. వీరి ప్రధాన ఆహారంలో తరచూ ఎలుకలు ఉంటాయి. బిహార్ రాష్ట్రానికి చెందిన ఈ దళిత కులం ముషాహర్లు భూస్వాముల పొలాలలో పనిచేస్తుంటారు. ఏడాదికి సుమారు 8 నెలలు వీరికి పని కూడా దొరకదు.

దీంతో మనుగడ కోసం వీరు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ఎంచుకుంటారు.

భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతూ వారిచ్చే దానాల కోసం ‘నాచానియా’గా వ్యవహరిస్తారు. అంటే మగవాళ్లే ఆడవాళ్లలా వేషం వేసుకుని అలరిస్తారు.

10 నుంచి 23 ఏళ్ల వయసు అబ్బాయిలు, యువకులు మహిళల వేషం వేసుకుని ఊళ్లలో పెళ్లిళ్లు వంటి వేడుకలలో నృత్యం చేస్తారు.

Ramnami

ఫొటో సోర్స్, ASHA THADANI

ఈ చిత్రంలో కనిపిస్తున్నది రామనామి మహిళ. గుమ్మంలో నిల్చుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ మహిళ ముఖం, గుండు, ఒంటిపై రామ నామం హిందీలో పచ్చబొట్టు వేయించుకున్నారు.

కిరోసిన్ దీపం మసితో చేసిన నల్ల సిరా, చెక్క సూది ఉపయోగించి రామనామాన్ని చర్మంపై రాశారు. ఆమె శాలువాపైనా సంప్రదాయం విస్తరించింది. ఆమె అందంగా కప్పుకొన్న శాలువాపైనా రామనామమే ఉంది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రామనామీలు 19వ శతాబ్దపు చివరి కాలంలో ధిక్కారం నుంచి ఉద్భవించినవారు. ఒంటిపై రామనామాన్ని పొడిపించుకుని శరీరం, ఆత్మ రెండింటా భక్తిని కంటికి కనిపించేలా నింపుకొన్న విలక్షణ నిరసన రూపం వీరిది.

విశ్వాసం, అస్తిత్వంల కాలాతీత మేళవింపే ఈ రామనామీలు.

గంగానదిలో నాణేల వేట

ఫొటో సోర్స్, ASHA THADANI

‘ప్రతి మునకా పవిత్రమే’

వారణాసిలో గంగా నదీ పవిత్ర లోతుల్లోంచి పైకి తేలిన ఈ దళిత ఈతగాడు నోటిలో కనిపిస్తున్నవి నాణేలు. ‘గొటాకోర్’ అని పిలిచే వీరు.. పాప విముక్తి కోసం భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నాణేలను నది నుంచి సేకరిస్తారు.

ఒక్కోసారి నదిలో మునిగి చనిపోయినవారి మృతదేహాలను బటయకు తీస్తుంటారు. దానికి ప్రతిఫలంగా వారికి అందేది చవక రకం మద్యం మాత్రమే అని ఆశా చెప్పారు.

Dalit women in Bihar

ఫొటో సోర్స్, ASHA THADANI

బిహార్‌లో ఈ దళిత మహిళలు ఆభరణాలు ధరించకుండా అగ్రకులాల నుంచి ఉన్న ఆంక్షలను ప్రతిఘటిస్తూ పచ్చబొట్లనే ఆభరణాల రూపంలో కనిపించేలా వేసుకుంటున్నారు.

అంతేకాదు, తాటాకులు, గడ్డి, కొమ్మలతో నిర్మించుకునే వారి గుడిసెలలో గోడలను ఆవుపేడతో అలికి ఆ గోడలనే కాన్వాస్‌గా మలచుకుంటారు.

‘‘హిందూ దేవతల చిత్రాలను వేయకుండా వీరిపై అప్రకటిత నిషేధం ఉండడంతో వారు ప్రకృతినే స్ఫూర్తిగా తీసుకుని తమదైన శైలిలో గోడలపై చిత్రాలు వేస్తారు. ఆ చిత్రాలు ఈ దళిత మహిళల సృజన, ధైర్యానికి నిదర్శనమే కాకుండా జీవనోపాధి మార్గం కూడా’’ అని ఆశా చెప్పారు.

Oppari

ఫొటో సోర్స్, ASHA THADANI

ఇతరుల ఇళ్లలో విషాదాన్ని తమదిగా స్వీకరించి పాటల రూపంలో వేదన వ్యక్తం చేసే ఒప్పారి కులానికి చెందిన మహిళలు వీరు.

తమిళనాడులోని దళిత కులాలలో పాతుకుపోయిన పురాతన ఒప్పారి విషాద ఆచారాన్ని పాటిస్తున్నారు.

ఎవరి ఇంట్లోనైనా కుటుంబసభ్యులు చనిపోతే వీరిని పిలుస్తారు. వీరు అక్కడ ఏడుస్తూ పాటలు పాడుతారు.

మేక తలలు

ఫొటో సోర్స్, ASHA THADANI

బెంగళూరు నగరంలోని మాంసం మార్కెట్లో మేకలు, పొట్టేళ్ల తలలు కాల్చి మాంసంగా మార్చే పని చేస్తుంటాడు శివ. కర్ణాకటలోని ఓ దళిత కులానికి చెందిన శివలాంటివారు ఈ పని చేస్తుంటారు.

బొగ్గు ధూళి, ప్రమాదకరమైన పొగ, మంటల వేడి మధ్య ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వీరి సగటు జీవిత కాలం 35 నుంచి 45 ఏళ్లే.

ఇనుప గజాలకు మేక తలలు పెట్టి రోజంతా కాల్చుతుండడం వల్ల వేడికి వీరి చేతులు సున్నితత్వాన్ని కూడా కోల్పోతాయి.

సాధారణ దళిత కులాల పురుషులు ఈ పని చేస్తుంటారు. ఈ పనిలో 10 నుంచి 12 ఏళ్ల పిల్లలు కూడా కనిపిస్తారు.

ఒక తల కాల్చితే వీరికి దక్కేది 15 రూపాయలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)