భారత రెజ్లింగ్ ఫెడరేషన్: కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఎవరు? ఇకపైనా హవా బ్రిజ్ భూషణ్ సింగ్‌దేనా?

 బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(ఎడమ వైపు), సంజయ్ సింగ్ (కుడి వైపు)

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(ఎడమ వైపు), సంజయ్ సింగ్ (కుడి వైపు)
    • రచయిత, అనంత్ జనానే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు, విధేయుడిగా భావించే సంజయ్ సింగ్ ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి గురువారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.

సంజయ్ సింగ్ గురించి తెలుసుకునే ముందు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల గురించి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేసిన ఒక ప్రకటన గురించి తెలుసుకోవాల్సి ఉంది.

‘‘'సంజయ్ సింగ్ వారణాసికి చెందినవారు, నరేంద్ర మోదీజీ ప్రాంతానికి చెందినవారు. మేం ఆయన్ను అధ్యక్ష పదవికి అభ్యర్ధిగా నిర్ణయించాం’’ అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఎన్నికకు ముందు తమ ప్యానెల్ విజయావకాశాల గురించి బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ, "రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికలకు దేశంలో 25 రాష్ట్రాలకు 25 యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్‌కు రెండు ఓట్లు ఉన్నాయి. 20 రాష్ట్రాలు మా ప్యానెల్‌కు అనుకూలంగా ఉన్నాయి. మా ప్రత్యర్ధి ప్యానెల్‌కు కేవలం మూడు రాష్ట్రాలే ఉన్నాయి. కాబట్టి ఎవరు గెలుస్తారో మీరు ఊహించుకోవచ్చు’’ అని బ్రిజ్ భూషణ్ అన్నారు.

బ్రిజ్ భూషణ్‌తో సంజయ్ సింగ్

ఫొటో సోర్స్, RAJEEV SINGH RANU

మోదీ జీ ఏరియాలో ఓటర్లం: సంజయ్ సింగ్

ఇక సంజయ్ సింగ్ కూడా విజయం తమదేనని ముందు నుంచీ ధీమా వ్యక్తం చేశారు.

‘‘మేము మోదీ జీ ప్రాంతానికి చెందిన ఓటర్లం. కానీ మాకు బీజేపీతో సంబంధం లేదు" అని అన్నారు.

సంజయ్ సింగ్ వారణాసికి సమీపంలోని చందౌలీ ప్రాంతానికి చెందినవారు.

అయితే ఆయన ఉండే ప్రాంతం రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్న లఖ్‌నవూ లోక్‌సభ నియోజకవర్గంలో ఉంటుంది.

తనను తాను పెద్ద రైతుగా చెప్పుకుంటారు సంజయ్ సింగ్.

2010 నుంచి రెజ్లింగ్ అసోసియేషన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నానని ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్, నేషనల్ రెజ్లింగ్ అసోసియేషన్ రెండింటిలోనూ ఆఫీస్ బేరర్‌గా ఉన్నానని ఆయన వెల్లడించారు.

‘‘బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు, మాకు ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. గత మూడు దశాబ్దాలుగా మేం కలిసి పని చేస్తున్నాం’’ అని సంజయ్ సింగ్ చెప్పారు.

మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సంజయ్ సింగ్ స్పందించారు.

"ఈ ఆరోపణలు నిరాధారమైనవి. ఆయన్ను రెజ్లింగ్ అసోసియేషన్ నుంచి తప్పించడానికి కుట్ర జరిగింది’’ అని ఆయన చెప్పారు.

బ్రిజ్ భూషణ్‌ మీద వచ్చిన ఆరోపణలపై దిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.

"ఆయన రెజ్లింగ్ కోసం చాలా కృషి చేశారు. ఇంతకు ముందు రెజ్లింగ్ ఎక్కడ ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉంది. కొంత మంది ఆయన్ను విచారణ లేకుండానే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ను తొలగించాలని కుట్ర చేస్తున్నవారే ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నేరస్థుడా, కాదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది’’ అని ఆయన అన్నారు.

మాజీ రెజ్లర్ అనితా షియోరన్ అభ్యర్థిత్వం గురించి సంజయ్ సింగ్ మాట్లాడారు.

‘‘ఆమె బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నడుస్తున్న కేసులో ఒక సాక్షి. మాకు తెలిసిన నియమాల ప్రకారం, ఆమె సాక్షి కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయకూడదు’’ అన్నారు.

సంజయ్ సింగ్

ఫొటో సోర్స్, RAJEEV SINGH RANU

బనారస్ రెజ్లింగ్ అసోసియేషన్ నుంచి జాతీయస్థాయి ఫెడరేషన్ వరకు..

వారణాసి రెజ్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సింగ్ రాణు, సంజయ్ సింగ్ రెజ్లింగ్‌ కెరీర్ గురించి వివరించారు. ఆయన సంజయ్ సింగ్‌కు సన్నిహితుడు.

“సంజయ్ సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో కుస్తీ పోటీలలో పాల్గొనేవారు. ఆయన తండ్రి, తాత పెద్ద రైతులు. అందుకే ఊళ్లో పెద్ద వేదిక ఏర్పాటు చేసి మల్లయోధుల పోటీలు నిర్వహించేవారు. గ్రామాలలో రెండే ఆటలు ఎక్కువగా ఉండేవి. ఒకటి రెజ్లింగ్, రెండోది కబడ్డీ’’ అన్నారు రాజీవ్ సింగ్.

2008లో సంజయ్ సింగ్ వారణాసి రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. 2009లో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, సంజయ్ సింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, గత నాలుగేళ్లుగా ఆయన ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు.

వారణాసి నుంచి వెయ్యి మంది రెజ్లర్లు వివిధ విభాగాల్లో ఆడుతున్నారని, కుస్తీ క్రీడాకారులకు సహాయం చేయడంలో సంజయ్ సింగ్‌కు మంచి పేరుందని రాజీవ్ సింగ్ చెప్పారు.

సంజయ్ సింగ్ హయాంలోనే బనారస్‌లో రెజ్లింగ్‌కు సంబంధించిన అనేక పోటీలు జరిగాయని చెప్పారు.

రాజీవ్ సింగ్ 2008 నుంచి రెజ్లింగ్ అసోసియేషన్‌లో ఉన్నారని, అందుకే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనను రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా పరిగణించారని చెబుతారు.

బనారస్‌లో అమర్ ఉజాలా పత్రికకు చాలా కాలంగా స్పోర్ట్స్ రిపోర్టింగ్ చేస్తున్న రోహిత్ చతుర్వేది ప్రకారం, సంజయ్ సింగ్ అలియాస్ బబ్లూ, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు అత్యంత నమ్మకస్తుడు.

‘‘ప్రస్తుతం సంజయ్ సింగ్‌పై ఎలాంటి ఆరోపణలు లేవు. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు సంబంధించిన వివాదంలో సంజయ్ సింగ్ ప్రమేయం లేదు’’ అని ఆయన చెప్పారు.

‘‘సంజయ్ సింగ్, బ్రిజ్ భూషణ్‌కు నీడలా వెంట ఉంటారు. కాబట్టి సంజయ్ సింగ్‌కు తనపై ఉన్న విశ్వాసానికి కృతజ్ఞత తెలియజేయడం బ్రిజ్ భూషణ్ విధి’’ అని చతుర్వేది అన్నారు.

మరి సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, బ్రిజ్ భూషణ్ పరోక్షంగా రెజ్లింగ్ అసోసియేషన్‌పై ఆధిపత్యం చెలాయిస్తారా? దీనిపై రోహిత్ స్పందిస్తూ- ‘‘సంజయ్ సింగ్ అధ్యక్షుడైనా, కుస్తీకి ప్రధాన ముఖం బ్రిజ్ భూషణ్ శరణ్ సింగే. చాలా రాష్ట్రాల అసోసియేషన్లు బ్రిజ్ భూషణ్‌కే అండగా నిలుస్తున్నాయి’’ అన్నారు.

సంజయ్ సింగ్

ఫొటో సోర్స్, RAJEEV SINGH RANU

సంజయ్ సింగ్ సోషల్ మీడియాలో కనిపించరు

ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వం, ఆయన మంచిచెడుల గురించి వినొచ్చు. అయితే, సంజయ్ సింగ్ సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించరు.

బ్రిజ్ భూషణ్ తన సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. కానీ, వాటి ద్వారా సంజయ్ సింగ్ గురించి ఏమీ తెలియదు.

తనపై తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికీ, బ్రిజ్ భూషణ్ యూపీలోని తన నియోజకవర్గంలో, ఇటు దిల్లీలో పర్యటనలు చేస్తూ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)