సాక్షి మలిక్ vs బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్: ఈ వివాదం మహిళా ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించింది?

సాక్షి మలిక్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

లైంగిక వేధింపులకు గురయ్యామంటూ 2023 ప్రారంభంలో వీధుల్లోకి వచ్చారు కొందరు భారత మహిళా రెజ్లర్లు. ఇపుడు సంవత్సరం చివరిలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత , న్యాయం కోసం నిస్సహాయతను వ్యక్తం చేస్తూ బోరున విలపించారు.

ఒలింపిక్ పతక విజేత సాక్షి మలిక్ రెజ్లింగ్‌ను వదిలేస్తున్నట్లు ప్రకటించారు.

భారత రెజ్లింగ్ సంఘం మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చాలారోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

తాజాగా ఆయన సన్నిహితుడైన సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇపుడు దాని ప్రభావం రెజ్లింగ్, క్రీడా ప్రపంచంలోని మహిళలపై కనిపిస్తోంది.

క్రీడా ప్రపంచంలో లైంగిక వేధింపుల కేసులు గతంలో ఎక్కువగా బహిరంగంగా చర్చకు రాలేదు, భవిష్యత్తులో మరింత కష్టతరం కావొచ్చు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లకు సంబంధించిన ఫిర్యాదుపై దిల్లీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. జూన్‌లో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత, ఈ కేసులో విచారణ నడుస్తూ ఉంది.

అయితే ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తికి పదోన్నతి రావడంతో ఇది మరొక న్యాయమూర్తి వద్దకు బదిలీ అయింది. మళ్లీ జనవరిలో విచారణ ప్రారంభం కానుంది.

ఇప్పటివరకు జరిగిన పరిణామాలు కేవలం రెజ్లింగ్‌నే కాదు, అసలు క్రీడలే మహిళలకు సురక్షితం కాదన్న భయాన్ని బలపరిచేలా చేస్తున్నాయి.

చాలామంది కోచ్‌లు, తల్లిదండ్రులు అమ్మాయిలను క్రీడాకారిణులుగా మార్చాలనే వారి ఆశయాలు బలహీనపడటం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

అలాగే, ఆటను నడిపే సంఘాల్లోని నియంతృత్వాన్ని సవాలు చేయడం చాలా కష్టమని కూడా తెలుస్తోంది.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్

ఒకే వ్యక్తి నియంత్రణ

మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు, ఫెడరేషన్లో​ 'ఒక్కరి ఆధిపత్యం' సమస్యను కూడా లేవనెత్తారు .

ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన తర్వాతే నిరసన విరమించారు.

రెజ్లర్ల వాదన ప్రకారం బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ బంధువు లేదా సన్నిహితులను భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా చేయకూడదనే ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది.

బీజేపీ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్ 'రెజ్లింగ్ సమాఖ్య' పదవి నుంచి వైదొలిగి ఉండవచ్చు. అయితే ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా గెలిచిన ఆయన సన్నిహితుడు (ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు) సంజయ్ సింగ్ ద్వారా ఫెడరేషన్‌లో బ్రిజ్ భూషణ్ ఆధిపత్యం కొనసాగవచ్చు. గురువారం విలేఖరుల సమావేశంలో వినేశ్ కూడా ఇదే వాదనను వినిపించారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత బ్రిజ్‌భూషణ్‌ ఇంటి వద్ద ‘సంజయ్‌ భయ్యా క్యా లే కే చలే, బ్రిజ్‌భూషణ్‌ కీ ఖదౌ లే కే చలే’ అంటూ నినాదాలు చేశారు.

దీంతో రెజ్లింగ్‌లో కొత్త ముఖాలు వచ్చినా ఫెడరేషన్‌లో బ్రిజ్‌ భూషణ్‌ పట్టు ఉంటుందని, దానిలో మునపటిలాగే ఉంటుందని అర్థమవుతోంది.

ఈ నెలాఖరులో గోండాలో అండర్-15, అండర్-20 జాతీయ చాంపియన్‌షిప్‌లు నిర్వహించనున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గోండా నివాసి. అక్కడి నుంచి ఆయన రెండు సార్లు ఎంపీగా గెలిచారు.

రెజ్లర్లు

ఫొటో సోర్స్, ANI

ఫెడరేషన్‌లో ఒక్క మహిళా లేదు

రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షురాలు, ప్యానెల్ సభ్యులుగా మహిళలే ఉండాలని, అయితే ఎన్నికల్లో గెలిచిన 15 మంది సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేరన్నది రెజ్లర్ల మరో వాదన.

ఇప్పుడు ఫెడరేషన్ ముందున్న పెద్ద సవాలు ఏమిటంటే వారు మహిళా రెజ్లర్ల నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటారు?

ఈ ఆట మహిళలకు సురక్షితమైనదని, ఎటువంటి సంకోచం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చనే భరోసా ఎలా ఇస్తారు?

తనను విమర్శించే రెజ్లర్లు ప్రతీకారాన్ని ఎదుర్కోబోరని ఎన్నికల తర్వాత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ హామీ ఇచ్చారు.

బజరంగ్, వినేశ్ ఫోగాట్ అంతర్జాతీయ పోటీల్లో ఎక్కువగా పాల్గొనలేదని, కానీ వారు కచ్చితంగా పారిస్ ఒలింపిక్స్‌లో ఆడి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరి ఇప్పుడు ఇరువురు కెరీర్‌ను కొనసాగిస్తారా లేక సాక్షి మలిక్‌ మాదిరి రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతారా అనేది చూడాలి.

అనితా షియోరాన్

ఫొటో సోర్స్, INSTAGRAM/ANITASHEORAN_WRESTLER

ఫొటో క్యాప్షన్, అనితా షియోరాన్

డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 50 ఓట్లలో అనితా షియోరాన్ (2010 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత)కు 7 ఓట్లు మాత్రమే వచ్చాయి, సంజయ్ సింగ్‌కు 40 ఓట్లు వచ్చాయి.

అయితే, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పదవులకు జరిగిన ఎన్నికల్లో సంజయ్​ ప్యానెల్‌లోని అభ్యర్థులు ఓడిపోయారు.

అనిత ప్యానెల్‌లోని ప్రేమ్‌చంద్ లోచబ్, దేవేంద్ర కడియన్‌లు విజయం సాధించారు. దీంతో ఈ ఎన్నికపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వినేశ్ ఫొగట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వినేశ్ ఫొగట్

వినేశ్, బజరంగ్ ఒలింపిక్స్ ఆడతారా?

వినేశ్ ఫోగాట్ రెజ్లింగ్‌లో 53 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు. అయితే, ఇదే విభాగంలో 20 ఏళ్ల అంతిమ్ పంఘల్ పారిస్ ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించారు.

లైంగిక ఆరోపణల వివాదం దృష్ట్యా మే నెలలో రెజ్లింగ్ సమాఖ్యను నడపడానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 'తాత్కాలిక ప్యానెల్' ఏర్పాటు చేసింది.

కోటాలో గెలిచిన రెజ్లర్లను నేరుగా ఒలింపిక్స్‌ పంపబోమని, వారికి మరొక ట్రయల్ నిర్వహిస్తామని దానిలో గెలిచాకే పారిస్ పంపిస్తామని ప్యానెల్ తెలిపింది.

అయితే, కొత్త ప్యానెల్​ ఏర్పాటవడంతో, అంతిమ్ పంఘల్‌ను మాత్రమే పారిస్‌కు పంపే అవకాశం ఎక్కువగా ఉంద. ఇదే జరిగితే, వినేశ్ ఒలింపిక్ పతకం సాధించాలనే కల అలాగే మిగిలిపోతుంది.

వినే‌శ్‌కు రెండు చాన్సులు మాత్రమే ఉన్నాయి, ఆమె 50 కేజీల విభాగానికి తిరిగి రావాలి లేదా తన బరువును పెంచుకోని, 57 కిలోల విభాగంలో కోటా సంపాదించాలి.

బజరంగ్ పునియా రెజ్లింగ్‌ను కొనసాగిస్తే, ఆయనకు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవచ్చు. ఎందుకంటే 2024 పారిస్ ఒలింపిక్స్‌కు 65 కిలోల విభాగంలో ఇప్పటి వరకు ఏ భారతీయ రెజ్లర్ అర్హత సాధించలేదు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(ఎడమ వైపు), సంజయ్ సింగ్ (కుడి వైపు)

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(ఎడమ వైపు), సంజయ్ సింగ్ (కుడి వైపు)

కొత్త ప్యానెల్ ముందున్న సవాళ్లేంటి?

గత 11 నెలల్లో రెజ్లింగ్ ఆటగాళ్లలో నమ్మకం సన్నగిల్లింది. కొందరు ఆటగాళ్లను ట్రయల్ లేకుండానే ఆసియా క్రీడలకు పంపడంపై పలువురు రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రీడాకారుల విశ్వాసాన్ని సంపాదించడంతో పాటు ఇప్పుడు ఎవరిపైనా వివక్ష చూపబోమని నిరూపించుకోవడమే రెజ్లింగ్ ఫెడరేషన్​ ముందున్న మొదటి సవాలు.

ఫెడరేషన్ కాంట్రాక్టులను ప్రొఫెషనల్‌గా పద్దతిలో అమలుచేయాల్సి ఉంటుంది. పోటీ సమయంలో ప్రాక్టీస్ మ్యాట్, ఇతర ప్రాథమిక అవసరాలతో సహా ఆటగాళ్ల అన్ని సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

ఫెడరేషన్ మహిళా ప్రతినిధులను ఎన్నుకోవాలి. వారికి బాధ్యతాయుతమైన పదవులను ఇవ్వాలి. తద్వారా వారు క్రీడాకారులకు, ఫెడరేషన్‌కు మధ్య సంధానకర్తలుగా మారతారు. రెజ్లింగ్‌లో ఎదురయ్యే సెక్యూరిటీ సమస్యలను మెరుగ్గా పరిష్కరించగలరు.

(సీనియర్ జర్నలిస్ట్ అమన్‌ప్రీత్ సింగ్‌తో సంభాషణ ఆధారంగా రూపొందిన కథనం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)