మిచెల్ స్టార్క్: ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా బౌలర్ కోసం ఆ రెండు జట్లు ఎందుకంతలా పోటీ పడ్డాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భానుప్రకాశ్ కర్నాటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
2024లో జరిగే ఐపీఎల్ 17వ సీజన్ కోసం దుబయిలో మినీ వేలం నిర్వహించారు.
అందులో రూ. 20.5 కోట్లకు అమ్ముడైన ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ గురించి అంతా మాట్లాడుకోవడం పూర్తిగా మొదలైందో లేదో అంతలోనే ఆ చర్చంతా ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ వైపు మళ్లింది.
2024లో జరగబోయే ఐపీఎల్ 17వ సీజన్‌తో కలిపి.. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలిచాడు స్టార్క్.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75 కోట్లు ఖర్చు చేసి మరీ వేలంలో స్టార్క్‌ను దక్కించుకుంది.
గత నెలలోనే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో లో స్టార్క్ ప్రదర్శన చూసిన క్రికెట్ అభిమానులకు స్టార్క్ గురించి మళ్లీ పరిచయం చేయాల్సిన పని లేదు.
ఆ మ్యాచ్‌లో శుభమన్ గిల్, కేఎల్ రాహుల్‌లను పెవిలియన్‌కు పంపి, భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.
మొత్తం మూడు వికెట్లు (శుభ్‌మన్ గిల్,కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ) తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలకంగా మారాడు.
అయితే, మిచెల్ స్టార్క్ ఐపీఎల్ సీజన్ రీ ఎంట్రీ ఎనిమిదేళ్ల తరువాత జరుగుతోంది.
చివరిగా 2015 ఐపీఎల్ సీజన్ ఆడిన స్టార్క్, మళ్లీ 2024లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
మిచెల్ స్టార్క్‌ను జట్టులోకి తీసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా తొమ్మిదేళ్లుగా టైటిల్‌ను గెలుచుకోలేదు.
అయితే, ఒక్క బౌలర్‌పైనే జట్టు ఎందుకింత ఖర్చుచేసింది? ఆ వేలంలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్.. నువ్వానేనా
ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ కనీస ధర రూ.2 కోట్లుగా పేర్కొంటూ బిడ్ మొదలైంది.
మొదట ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు బిడ్డింగ్ మొదలుపెట్టాయి. పోటాపోటీగా బిడ్ వేస్తూ ధరను పెంచుకుంటూ వెళ్లాయి. రూ.9.6 కోట్ల వద్ద దిల్లీ క్యాపిటల్స్ పోటీ నుంచి తప్పుకుంది.
అదే సమయంలో కోల్‌కతా ప్రవేశించింది. ఆ వెంటనే ముంబయి ఇండియన్స్ కూడా పోటీ నుంచి తప్పుకోగా గుజరాత్ టైటాన్స్ రంగంలోకి దిగింది.
ఇక అక్కడి నుంచి గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోటీతో అక్కడి వాతావరణం వేడెక్కింది.
రెండు జట్ల మధ్య తీవ్రంగా జరిగిన పోటీలో చివరికి కేకేఆర్‌దే పైచేయిగా మారింది.
ఏకంగా రూ.24.75 కోట్లు బిడ్ చేసి స్టార్క్‌ను సొంతం చేసుకుంది.
బిడ్ పూర్తవడంతో గౌతమ్ గంభీర్ నవ్వుతూ కనిపించాడు.
ఈ వేలానికి ముందు జట్టులోని 12 మంది ఆటగాళ్లను వదలుకుంది కేకేఆర్. వారి దగ్గర ఉన్న మొత్తం 32.70 కోట్లు. ఈ బడ్జెట్‌లోనే 12మందిని భర్తీ చేయాల్సి ఉంది.
కానీ, మొత్తం బడ్జెట్‌లో సుమారు 75 శాతం మొత్తాన్ని ఒక్క ప్లేయర్‌కే వెచ్చించారంటే, స్టార్క్ వంటి లెఫ్ట్ ఆర్మ్ స్టార్ బౌలర్ అవసరం జట్టుకు ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.."స్టార్క్ బిడ్ మొదలవక ముందు ఐపీఎల్ వేలంలోనే రికార్డు స్థాయిలో బిడ్ జరిగిందని నాతో ఎవరో అన్నారు (కమిన్స్ వేలం గురించి). కానీ, అంతలోనే ఆ రికార్డు మారిపోయింది.
స్టార్క్ నైపుణ్యం కలిగిన స్టార్ ప్లేయర్. స్టార్క్ మా జట్టులోకి రావడం పట్ల మాకు సంతోషంగా ఉంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టార్క్‌కు ఎందుకింత డిమాండ్?
ఒక్క ప్లేయర్ కోసమే అయినా, ఇంత ఖర్చు చేయడం వెనుక ఆ జట్లకు వ్యూహం ఉంటుందని క్రీడా విశ్లేషకులు సి.వెంకటేష్ అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ..”రెండు జట్లు ఒక్క ప్లేయర్ కోసం పోటీపడటం అనేది ఆ ఆటగాళ్లకు కలిసొచ్చే విషయం” అన్నారు.
బీబీసీతో ఆయన మాట్లాడుతూ, “మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ వికెట్ టేకింగ్ బౌలర్. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నెంబర్ వన్ అని చెప్పడంలో సందేహం లేదు. 1.97 మీ. ఎత్తు, హై పేస్, సగటున గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వేసే బౌలింగ్.. ఇవన్ని అతడికి బాగా కలిసొచ్చే అంశాలు. అంతకు ముందు రెండు సీజన్లే ఆడినా మొత్తంగా 34 వికెట్లు తీశాడు. 2024 సీజన్లోనూ అతడి ప్రదర్శన మనం చూడొచ్చు” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కమిన్స్ కోసం ఎందుకంత ఖర్చుచేశారు?
మిచెల్ స్టార్క్ కన్నా ముందు అత్యధిక రికార్డు ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్ జట్టు రూ.20.5 కోట్లు ఖర్చు చేసి కమిన్స్‌ను దక్కించుకుంది.
రూ.2 కోట్లతో మొదలైన బిడ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తీవ్రంగా పోటీ పడి రూ.20.5 కోట్లకు కమిన్స్‌ను జట్టులోకి తీసుకుంది.
అంతకు ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను కూడా రూ.6.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. మొత్తం రూ.34 కోట్లు బడ్జెట్ చేతిలో ఉన్న సన్ రైజర్స్ ఆరుగురు ఆటగాళ్లను భర్తీ చేయాల్సి ఉంది. కానీ, ఈ ఇద్దరికే బడ్జెట్‌లో సుమారు 80% ఖర్చుచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
“ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో కమిన్స్ ప్రదర్శన అతడికి బాగా కలిసొచ్చింది. నిజానికి సన్ రైజర్స్‌కు కెప్టెన్ అవసరం ఉంది. పాట్ కమిన్స్ ప్రపంచ స్థాయి బౌలర్. అనుభవజ్ఞుడు.
రైట్ హ్యాండ్ బౌలర్‌గా అతడి సామర్థ్యమేంటో మనం చూశాం. కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన పాట్ కమిన్స్‌కు కెప్టెన్సీ అవకాశం ఇస్తారు. జట్టు కోచ్ డేనియల్ వెటోరీ దీనిపై స్పందించనప్పటికీ వారి ఉద్దేశం ఇదే అయి ఉండొచ్చు” అన్నారు వెంకటేష్.

ఫొటో సోర్స్, BCCI-TATA/IPL
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన 10 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడైన టాప్-10 ఆటగాళ్లు వీరే,
ప్లేయర్ - సొంతం చేసుకున్న జట్టు - సీజన్ - ధర
- మిచెల్ స్టార్క్- కోల్‌కతా నైట్ రైడర్స్ - 2024(సీజన్) - రూ.24.75 కోట్లు
- పాట్ కమిన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్-2024(సీజన్) - రూ.20.5 కోట్లు
- సామ్ కరన్ - పంజాబ్ కింగ్స్ -2023(సీజన్) - రూ.18.50 కోట్లు
- కామెరాన్ గ్రీన్ -ముంబై ఇండియన్స్-2023(సీజన్) - రూ.17.50 కోట్లు
- బెన్ స్టోక్స్ -చెన్నై సూపర్ కింగ్స్-2023(సీజన్) - రూ.16.25 కోట్లు
- క్రిస్ మోరిస్ -రాజస్థాన్ రాయల్స్- 2021(సీజన్) - రూ.16.25 కోట్లు
- నికోలస్ పూరన్ -లక్నో- సూపర్ జెయింట్స్- 2023(సీజన్) - రూ.16 కోట్లు
- యువరాజ్ సింగ్ -ఢిల్లీ డేర్ డెవిల్స్ -2015(సీజన్) - రూ.16 కోట్లు
- పాట్ కమిన్స్ -కోల్‌కతా నైట్ రైడర్స్ -2020(సీజన్) - రూ.15.50 కోట్లు
- ఇషాన్ కిషన్ -ముంబై ఇండియన్స్ -2022(సీజన్) - రూ.15.25 కోట్లు
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’
- గవదబిళ్లలు : పిల్లలను ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, లక్షణాలేంటి?
- వయసు పెరుగుతున్నకొద్దీ సెక్స్ కోరికలు ఎవరిలో పెరుగుతాయి? దీనికి ఎలాంటి పరిస్థితులు కావాలి....
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














