రాజస్థాన్ అసెంబ్లీలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం సంస్కృతంలో ఎందుకు చేశారు?

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, మోహర్ సింగ్ మీనా
- హోదా, బీబీసీ హిందీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినవారిలో ఇద్దరు ముస్లింలు సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి వీరిద్దరిపై చర్చ నడుస్తోంది.
వీరిలో బీజేపీ రెబల్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన యూనస్ ఖాన్ ఒకరైతే, కాంగ్రెస్‌కు చెందిన జుబేర్ ఖాన్ మరొకరు.
రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాల్లో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీరిలో 191 మంది ఎమ్మెల్యేలు డిసెంబర్ 20న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
రామ్‌గఢ్ స్థానం నుంచి జుబేర్ ఖాన్ గెలుపొందితే, దివానా నియోజకవర్గం నుంచి యూనస్ ఖాన్ గెలిచారు.
ఇంతకుముందు జుబేర్ ఖాన్ భార్య సఫియా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, కాంగ్రెస్ ఈసారి జుబేర్ ఖాన్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో జుబేర్ ఖాన్ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేవాత్ కేసుపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంలో తాను రాముడు, కృష్ణుడి వారసురాలిగా సఫియా జుబేర్ ఖాన్ చెప్పుకున్నారు.
ఇక సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన రెండో ఎమ్మెల్యే యూనస్ ఖాన్, గతంలో వసుంధర రాజే ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
యూనస్ ఖాన్‌ను వసుంధర మద్దతుదారుగా చెబుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టోంక్ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌పై పోటీ చేశారు.

ఫొటో సోర్స్, YUNUS KHAN/FB
మమ్నల్ని ముస్లింలు కూడా ప్రశంసించారు: యూనస్ ఖాన్
సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం గురించి జరిగిన చర్చలపై యూనస్ ఖాన్ స్పందిస్తూ- "ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం మంచి పనిచేశామంటూ ముస్లింలు కూడా చాలా ప్రశంసించారు" అని చెప్పారు.
"భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న అధికారిక భాషల్లో సంస్కృతం ఒకటి. ఇది మన పురాతన భాషల్లో ఒకటి" అని ఆయన బీబీసీతో చెప్పారు.
‘‘వేదాలు, పురాణాలు, రామాయణం సంస్కృతంలో రాశారు. భారతదేశంలోని అన్ని భాషలకు సంస్కృతం తల్లివంటిది. నేను కూడా భారతీయుడిని. మన దేశంలో సంస్కృతం అత్యంత గొప్ప పురాతన భాష. సంస్కృతంలో ప్రమాణం చేసినందుకు చాలా గర్వపడుతున్నాను" అని యూనస్ ఖాన్ తెలిపారు.
"ప్రమాణం చేయడానికి మా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి ఇంగ్లిష్. ఇంగ్లిష్ అంటే బ్రిటిష్ వారి భాషలో ప్రమాణం చేస్తున్నట్టు. మిగతా రెండు- హిందీ, సంస్కృతం" అన్నారు.
సంస్కృతంలోనే ఎందుకు అనే ప్రశ్నకు యూనస్ ఖాన్ ఇలా సమాధానమిచ్చారు.
"మన పురాతన పద్ధతులు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. సంస్కృతంలో ప్రమాణం చేయడం సరైన పని అనిపించింది. మనమే వాటిని అలవరచుకోకపోతే ఇంకెవరు చేస్తారు? సంస్కృతం మన భారతీయ భాష" అన్నారు.

ఫొటో సోర్స్, RAJASTHAN LEGISLATIVE ASSEMBLY
మేం ప్రతి మతాన్ని గౌరవిస్తాం: జుబేర్ ఖాన్
జుబేర్ ఖాన్ ఇప్పుడు నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు.
"1993లో నేను రెండోసారి ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు కూడా సంస్కృతంలోనే ప్రమాణం చేశాను"అని ఆయన అన్నారు.
"సంస్కృతం మన ప్రాచీన భాష. మేం భారతదేశంలో ఉంటున్న భారతీయ ముస్లింలం, ఇక్కడి సంస్కృతిని, రాజ్యాంగాన్ని విశ్వసిస్తాం. ఇక్కడి సోదరభావంపై మాకు విశ్వాసం ఉంది. మేం ప్రతి మతాన్ని గౌరవిస్తాం" అని జుబేర్ ఖాన్ చెప్పారు.
"సంస్కృతం నా సబ్జెక్ట్, నేను సీనియర్ సెకండరీ వరకు సంస్కృతం చదివాను. రెండోసారి సంస్కృతంలో ప్రమాణం చేశాను. ముస్లిం అయి ఉండి కూడా సంస్కృతంలో ప్రమాణం చేయడం ప్రజలకు నచ్చింది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, RAJASTHAN LEGISLATIVE ASSEMBLY
20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సంస్కృతంలో..
అసెంబ్లీలో 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంస్కృతంలో ప్రమాణం చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలానికి మద్దతిచ్చే సంస్థ అయిన సంస్కృత భారతికి చెందిన రాష్ట్ర మంత్రి డాక్టర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కలిసి సంస్కృతిలో ప్రమాణం చేయమని తమ సంస్థ కోరిందని చెప్పారు.
"సంస్కృతం ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన భాష కాదు, భారతీయతకు సంబంధించింది. సంస్కృతానికి ప్రత్యేక సమాజం, వర్గం, మతమంటూ లేవు. ప్రతి ఒక్కరూ సంస్కృతాన్ని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ దానిని తమదని భావిస్తారు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నన్ను, నా చెల్లిని కాపాడబోయి మా నాన్న వరదలో కొట్టుకుపోయారు. కానీ...’
- దావూద్ ఇబ్రహీం: పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు?
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














