ఇజ్రాయెల్-గాజా: 'దగ్ధమైన కారులో, స్టీరింగ్ పట్టుకుని ఉన్న మొండెం కనిపించింది'- తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించిన బీబీసీ కెమెరామెన్

JEHAD EL-MASHRAWI

ఫొటో సోర్స్, JEHAD EL-MASHRAWI

గమనిక: ఈ కథనంలో కలిచివేసే అంశాలకు సంబంధించిన సమాచారం ఉండొచ్చు

గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడులు మొదలైన కొన్ని వారాల తరువాత ఉత్తర గాజాలో ఉండే జెహద్ అల్ మసరావి తన భార్యా పిల్లలతో కలిసి దక్షిణ గాజాకు వెళ్లాల్సి వచ్చింది.

బీబీసీ అరబిక్ కెమెరామెన్ జెహద్ అల్ మసరావి తాను, తన కుటుంబం చూసిన హృదయవిదారక ఘటనల గురించి బీబీసీకి తెలిపారు.

ఆయన మాటల్లోనే..

మేం బ్రెడ్ తయారుచేస్తుండగా, మా ఎదురిళ్లపై బాంబు దాడులు మొదలయ్యాయి. ఆ శబ్దాలు విన్న మాకు ఎక్కువ సమయం లేదని అర్థమైంది.

ఒకదాని తర్వాత మరొక ఇల్లు.. అలా మా వంతు వచ్చేస్తుందని నాకు తెలుసు. అలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించి, మా సామాన్లు సర్దిపెట్టుకున్నాం. కానీ, అంతా అనుకోకుండా దాడి జరగడంతో అన్ని వదిలేసి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. కనీసం మా ఇంటి ప్రధాన ద్వారం కూడా మూయలేదు.

మేం ఇంటిని ఖాళీ చేయాలా? వద్దా? అని ఎంతో ఆలోచించాం. ఎందుకంటే, నా తల్లిదండ్రులిద్దరికీ వయసుపైబడింది. ఉత్తరగాజాలోని అల్-జైటౌన్‌లో ఎన్నో ఏళ్లుగా కూడబెట్టుకున్న డబ్బుతో మేం ఇల్లు కట్టుకున్నాం. చివరికి ఆ ఇంటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2012 నవంబరులో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో మా ఇల్లు బాంబు దాడికి గురైంది. ఆ ఘటనలో నా కొడుకు ఒమన్‌ను పోగొట్టుకున్నాను. ఈ యుద్ధం వలన నా మిగిలిన పిల్లల్ని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను.

దక్షిణ గాజాలో విద్యుత్ లేదని, నీటి కొరతతోపాటు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ప్రజలు గంటల కొద్దీ క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని నాకు తెలుసు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చివరికి మేం కాస్త నీరు, బ్రెడ్‌తోనే ఇంటిని వదిలివచ్చాం.

అక్కడి నుంచి ఇజ్రాయెల్ చెప్తున్న సురక్షిత సలాహ్ అల్ దిన్ రోడ్‌ వెంట దక్షిణ గాజాకి వెళ్లేందుకు సిద్ధమైన వేలమందిలో మేం కూడా చేరాం.

నా భార్య అహ్లం, నా నలుగురు కొడుకులు నాతో ఉన్నారు. నా కొడుకుల్లో ఒకరికి రెండేళ్ల వయసుండగా, మరొకరికి ఎనిమిదేళ్లు ఉన్నాయి. మిగిలిన ఇద్దరిలో ఒకరికి తొమ్మిదేళ్లు, అందరికన్నా పెద్ద కుమారుడికి 14 ఏళ్ల వయసుంది. వారితోపాటు నా తల్లిదండ్రులు, నా సోదరీ సోదరులు, బంధువులు, వారి పిల్లలు.. అందరం కలిసి సలాహ్ అల్ దిన్ రోడ్‌కు ప్రయాణం మొదలుపెట్టాం.

దాడుల్లో అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు

ఫొటో సోర్స్, MAJED HAMDAN/ASSOCIATED PRESS

'అర్ధనగ్నంగా నేలపై కూర్చోబెట్టి..'

మేం నాలుగు గంటల సేపు నడిచాక ఇజ్రాయెల్ చెక్ పాయింట్‌ను సమీపించాం. యుద్ధం నేపథ్యంలో దానిని ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకోవడంతోనే మాలో ఆందోళన మొదలైంది.

నా పిల్లలు “నాన్నా, ఆర్మీ మనల్నేమైనా చేస్తుందా?” అని అడిగారు.

చెక్ పాయింట్‌కు ఒక కిలోమీటర్ దూరం నుంచి క్యూ ఉంది. ఆ రోడ్డంతా ప్రజలతో నిండిపోయింది.

అక్కడే మేం నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. మా నాన్నా మూడుసార్లు కళ్లు తిరిగిపడిపోయారు.

మా చుట్టుపక్కల ఉన్న ఓ వైపు శిథిల భవనాలు, మరోవైపు మైదాన ప్రాంతం ఉంది. అంతటా ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు. వారు మమ్మల్నే గమనిస్తూ ఉన్నారని మాకు తెలుసు.

చెక్ పాయింట్‌కు సమీపంలో ఉన్న కొండ ప్రాంతంపై చాలా మంది సైనికులు ఉన్నారు. బైనాక్యులర్ల ద్వారా వారు మమ్మల్ని గమనిస్తూ, లౌడ్ స్పీకర్ల నుంచి మాకు సూచనలు ఇస్తున్నారు.

చెక్ పాయింట్ దగ్గర ఉన్న టెంట్‌లో రెండు కంటెయినర్లు ఉన్నాయి.

వాటిలో ఒకదాని గుండా పురుషులు, మరొక దాని గుండా స్త్రీలను వెళ్లమని చెప్పారు.

అక్కడున్న చాలా కెమెరాల ద్వారా ఇజ్రాయెల్ సైనికులు మమ్మల్ని నిశితంగా గమనిస్తూనే ఉన్నారు.

అక్కడే మా ఐడీలను తనిఖీ చేసి, ఫోటోలు తీశారు. అదంతా నాకు జడ్జిమెంట్ డే చిత్రాన్ని తలపించింది.

బయటకు వచ్చాక, సుమారు 50 మందిని నిర్బంధించారు ఇజ్రాయెల్ సైనికులు. నిర్బంధంలో ఉన్న వారిలో మా పొరుగువారు ఇద్దరు ఉన్నారు. అంతా పురుషులే. ఒక యువకుడు సర్టిఫికెట్లను పోగొట్టుకోవడంతో, అతడిని ఆపేశారు. అతడికి తన ఐడి నెంబర్ లేకపోవడంతో పక్కకు పెట్టేశారు.

నా వెనకాలే క్యూలో నుంచున్న వ్యక్తిని చూసి ఇజ్రాయెల్ సైనికుడు ‘టెర్రరిస్ట్’ అని పిలిచాడు. అతడిని కూడా సైనికులు తీసుకునివెళ్లారు.

అక్కడున్న వారందరినీ దుస్తులు విప్పాల్సిందింగా ఆదేశించారు. లోదుస్తులు తప్ప ఒంటిపై ఏమీ ఉండనీయలేదు. వారిని నేలపై కూర్చోవలసిందిగా ఆదేశించారు.

కొద్దిసేపటికి వారిలో కొంతమందిని తిరిగి వెళ్లిపొమ్మని చెప్పారు. మిగిలిన వారి కళ్ళకు గంతలు కట్టి, అక్కడే కొండ వెనుక ఉన్న శిథిల భవనంవైపు తీసుకువెళ్లారు. వారిలో నా పొరుగువారు కూడా ఉన్నారు.

వారు మాకు కనుమరుగైన కొద్దిక్షణాలకే మాకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. అక్కడేం జరిగి ఉంటుందో నాకు తెలీదు. వారు కాల్పులకు గురయ్యారో లేదో నాకేమీ తెలియలేదు.

వలస వెళ్తున్న గాజా ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

'దుస్తులు లేకుండా గంటలపాటు..'

ఇలాంటి అనుభవమే నా సహోద్యోగికి కూడా ఎదురైందని చెప్పాడు. అతడి పేరు కమల్ అల్‌జోజో. కైరోలో నేను అతడిని కలుసుకున్నప్పుడు అతడు నాతో ఆ చెక్ పాయింట్‌ను తాను కూడా వారం క్రితమే దాటానని చెప్పాడు.

ఆ సమయంలో శవాలను చూశానని, కానీ వారు ఎలా చనిపోయారో అర్థం కాలేదని నాతో అన్నాడు.

నా సహోద్యోగి మొహమ్మద్ అనే వ్యక్తితో మాట్లాడాడు. మొహమ్మద్ తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పాడు. అతడు నవంబర్ 13వ తేదీ అదే చెక్ పాయింట్‌ను దాటినట్లుగా చెప్పాడు. అతడు బీబీసీతో మాట్లాడుతూ “నన్ను అందరి ముందు వివస్త్రుడిని చేశారు. ఒంటిపై నూలుపోగు లేదు. అందరి ముందు అలా నిలబడటం సిగ్గుగా అనిపించింది. అదే సమయంలో ఒక మహిళా సైనికురాలు అక్కడికి వచ్చి నాపై తుపాకీ గురిపెట్టి, నవ్వి వెళ్లిపోయింది. నేను అవమానానికి గురయ్యాను” అని తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు.

దాదాపు రెండు గంటల పాటు అలాగే దుస్తుల్లేకుండానే ఉండాల్సి వచ్చిందని, అనంతరం ఇజ్రాయెల్ సైన్యం ముహమ్మద్‌ను వెళ్లాల్సిందింగా చెప్పినట్లు వివరించాడు.

మేం ఆ చెక్ పాయింట్‌ను దాటాం. నాతోపాటు నా భార్య, పిల్లలు, నా తల్లిదండ్రులు సురక్షితంగానే దాటాం కానీ, మా సోదరులు వచ్చేందుకు చాలా సమయం పట్టింది. వారి కోసం అక్కడే ఎదురు చూశాం. అదే సమయంలో మా ముందు ఉన్న వారిని ఉద్దేశించి, ఇజ్రాయెల్ సైనికులు కేకలు వేశాడు. వారు తమ వారి కోసం చెక్ పాయింట్ దగ్గరకు తిరిగి వెళ్తుండగా, అలా వెనుదిరగొద్దని అరిచాడు.

స్పీకర్‌లో చెక్‌ పాయింట్‌కు 300 మీటర్ల దూరంలో ఉండాలని హెచ్చరించాడు. వెనువెంటనే వారిని భయపెట్టేలా గాలిలో కాల్పులు జరిపాడు. మేం ఆ శబ్దాలను విన్నాం. ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

నా తల్లి ఏడుస్తూ “నా పిల్లలకి ఏమీ కాలేదు కదా ” అంటూ గాబరా పడింది. కొద్దిసేపటికి నా సోదరులు వచ్చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నాం.

ఈ చెక్ పాయింట్ తనిఖీల గురించి ఐడీఎఫ్‌ను బీబీసీ వివరణ అడిగింది.

“చెక్ పాయింట్ తనిఖీల్లో తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానించే అదుపులో తీసుకుని ప్రశ్నించామని, వారిలో కొంతమందిని మరింత లోతుగా ప్రశ్నించేందుకు ఇజ్రాయిల్‌కు తరలిస్తే, మిగిలిన వారిని ప్రశ్నించి, విడుదల చేశాం” అని తెలిపింది.

దుస్తులు విప్పించి, తనిఖీ చేయడంపై ఐడీఎఫ్ స్పందిస్తూ, “ఎవరైనా పేలుడు పదార్థాలను తీసుకొని వస్తున్నారేమో తనిఖీ చేయడానికి అలా చేశాం. అంతర్జాతీయ చట్టాలకు లోబడే మేం పని చేస్తున్నాం. అంతేకానీ, ఎవరినీ వేధించేందుకు కాదు “ అని తెలిపింది.

అంతేకాకుండా ఐడీఎఫ్ స్పందిస్తూ, “నార్త్ సౌత్ హ్యూమనిటేరియన్ కారిడార్ వెంబడి పౌరులపై ఎలాంటి కాల్పులకు పాల్పడలేదు. అయితే మా ఆదేశాలకు విరుద్ధంగా ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపు వెళ్లకుండా తిరుగు ప్రయాణం చేయడానికి ప్రయత్నించేవారిని హెచ్చరించేందుకు గాలిలో కాల్పులు జరిపాం” అని తెలిపింది.

పైగా తుపాకీ కాల్పుల శబ్దాలు ఆ ప్రదేశాల్లో సాధారణమని ఐడీఎఫ్ చెప్పింది.

ఆ చెక్ పాయింట్ నుంచి దూరంగా వచ్చేంతవరకు మేమంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నాం. అది దాటాక మాకు ఉపశమనం అనిపించింది కానీ, తర్వాత ప్రయాణం ఎంత దుర్భరంగా ఉండనుందో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సివస్తుందో ఊహించలేకపోయాం.

గాజా స్ట్రిప్

ఫొటో సోర్స్, Getty Images

శవాల మీదుగా నడక..

దక్షిణం దిశగా సాగిన నా ప్రయాణంలో రోడ్డుపక్కన పడి ఉన్న సుమారు 10 మృతదేహాలను చూశాను. కొన్నిచోట్ల మృతదేహాలను పక్షులు పీక్కుతింటున్నాయి. కొన్ని మృతదేహాలు కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. వాటి నుంచి వచ్చే దుర్వాసన తట్టుకోలేకపోయాను. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవలేదు.

ఆ దృశ్యాలను నా పిల్లలు చూస్తే ఏమవుతారో నాకు తెలుసు. అందుకే వాళ్ళని ఆకాశం వైపు చూస్తూ నడవమని, నేలపైకి చూడొద్దని పదేపదే అరిచి మరీ హెచ్చరించాను.

దారిలో నాకు దగ్ధమైన కారు కనిపించింది. అందులో కారు స్టీరింగ్ ని పట్టుకొని ఉన్న మొండెం కనిపించింది. అది కుళ్లిన దశలో ఉంది.

గాడిదలు, గుర్రాల మృతదేహాలు కనిపించాయి. కొన్నింటి అస్తిపంజరాలు, చెత్తకుప్పలు, పాడైపోయిన ఆహారపదార్థాలు కనిపించాయి.

రోడ్డు పక్కనే ఇజ్రాయిల్ ట్యాంక్ కనిపించింది. అది ఉన్నట్టుండి వేగంగా మావైపుకు రావడం మొదలైంది. అది మా మీదకు వస్తుందన్న భయంతో, దాని నుంచి దూరంగా పరిగెత్తేందుకు ప్రయత్నించాం. ఆ సమయంలో మేం శవాల మీద నుంచి వెళ్లాల్సి వచ్చింది.

కొంతమంది పట్టుకోల్పోయి వాటిపై పడిపోయారు.

ఆ యుద్ధ ట్యాంక్ రోడ్డుపైకి చేరుకునే ముందే 20 మీటర్ల దూరంలో తన దిశను మార్చుకుని వెళ్ళింది. అప్పుడు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న భవనం పేలుడుకు గురైంది. ఆ ధాటికి శిథిలాలు అంతటా వ్యాపించి, ఆ ప్రదేశం దద్ధరిల్లింది.

ఆ సమయంలో ప్రపంచం మమ్మల్ని మింగేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు.

భయాందోళనల మధ్యనే మేము నజారెత్ క్యాంప్ వైపునకు ప్రయాణించాం.

సాయంత్రానికి అక్కడికి చేరుకుని, అక్కడే ఉన్న పేవ్‌మెంట్‌పై నిద్రించాం. చలితో నా కుటుంబమంతా వణికిపోయింది.

నా జాకెట్‌ను నా పిల్లలకు కప్పి, కాస్తయినా వారికి చలి నుంచి రక్షణ ఇవ్వాలని ప్రయత్నం చేశాను.

నా జీవితంలో ఎన్నడూ ఇంత చలిలో గడపలేదు.

అయితే, రోడ్డు వెంబడి మృతదేహాలు, ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంక్ అలజడిపై ఐడీఎఫ్‌ను సంప్రదించింది బీబీసీ,

"పగటి సమయంలో సలాహ్ అల్ దిన్ రహదారి మీదుగా కొన్ని యుద్ధ ట్యాంకులు వెళ్తుంటాయి. కానీ, ఎన్నడూ పౌరుల మీదకు వెళ్లిన సందర్భం లేదు" అని తెలిపింది ఐడీఎఫ్.

అలాగే రహదారి వెంబడి మృతదేహాలు పడి ఉండటంపై స్పందిస్తూ, అలాంటి ఘటనలేవీ వారి దృష్టికి రాలేదని, గాజా వాహనాలు మృతదేహాలను వదిలి వెళ్లుండొచ్చని తెలిపింది. అయితే, తాము ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపింది.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, JEHAD EL-MASHRAWI

ప్రాణాలు అరచేత పట్టుకుని..

మరుసటి రోజు ఉదయం మేము గాజాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌కి బయలుదేరాము.

మరుసటి రోజు ఉదయం ఖాన్ యూనిస్ నగరానికి చేరుకునేందుకు త్వరగానే ప్రయాణం మొదలుపెట్టాం.

గాజాలోని అతిపెద్ద నగరాల్లో ఖాన్ యూనిస్ రెండోది. కొంతదూరం గాడిదలు లాగే బండిపై ప్రయాణం చేసేందుకు యజమానికి కొంత చెల్లించాం.

దెయిర్ అల్ బలాహ్ చేరుకున్నాక బస్సు దొరికింది. కానీ, ఆ బస్సులో 20 మంది మాత్రమే వెళ్లేందుకు వీలుంది. 30 మంది బస్సు ఎక్కారు. కొంతమంది బస్సు పైకెక్కి కూర్చున్నారు. కొంతమంది తలుపుల దగ్గర వేలాడారు.

ఖాన్ యూనిస్‌లో సురక్షిత ప్రాంతం కోసం అన్వేషించాం. అక్కడ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే పాఠశాలను శిబిరంగా మార్చారు. మేం అక్కడికి వెళ్లే సరికే, ఆ శిబిరం పూర్తిగా జనాలతో నిండిపోయింది.

మరోదారి లేక, అక్కడే ఓ భవంతి సెల్లార్‌లో ఉన్న గోడౌన్‌లో వారం పాటు అద్దెకు దిగాం.

ఖాన్ యూనిస్‌లోనే ఉండాలని మా కుటుంబ సభ్యులంతా నిర్ణయించుకున్నారు. కానీ అక్కడి స్థానిక మార్కెట్‌పై కూడా బాంబు దాడులు జరగడంతో పిల్లలతో రాఫాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.

నా భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్లారు. నేను బస్సులో వెళ్లి, వారిని కలుసుకున్నాను. ఆ బస్సు మొత్తం నిండిపోవడంతో నేను కిటికీకి వేలాడుతూనే ప్రయాణం చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం మేం చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. అది కూడా మందపాటి ప్లాస్టిక్‌ పైకప్పుతో నిర్మించినదే. కానీ దాడులను నుంచి మా ఇంటికి ఎలాంటి రక్షణాలేదు.

అంతా ఖర్చుతో కూడుకున్నదే. కావాల్సిన వస్తువులను కొనుక్కునే పరిస్థితి లేదు. తాగునీరు కావాలన్నా మూడు గంటపాటు క్యూలో నిలబడాలి. రోజుకు మూడు పూటలా తినేందుకు ఆహారం కూడా దొరకడం లేదు. అందువల్ల రెండు పూటలే తింటున్నాం. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం. అంతే.

నా కొడుకు రోజుకు ఒక గుడ్డు తినేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అతనికి గుడ్డు కూడా కొనిచ్చే స్థితిలో లేను. నేను కోరుకునేదల్లా గాజాను వదిలి, నా పిల్లలతో సురక్షితంగా జీవించాలని అనుకుంటున్నాను. అందుకోసం చిన్న టెంట్‌లో నివసించడానికి కూడా నేను సిద్ధమే.

వీడియో క్యాప్షన్, బీబీసీ కెమెరామెన్ ఎదుర్కొన్న భయంకరమైన అనుభవం..

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)