హూతీ రెబెల్స్ దాడులు: ఎర్ర సముద్రంలో చమురు నౌకలు బంద్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, లోరా జోన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచ చమురు రవాణాకు ఎర్ర సముద్రం చాలా కీలకం. కానీ ఈ ప్రాంతంలో చమురు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
తాజాగా శనివారం నాడు గుజరాత్ తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న కెమ్ ఫ్లూటో అనే నౌకపై దాడి జరిగిందని అమెరికా మిలిటరీ వెల్లడించింది.
ఈ దాడి కారణంగా నౌకలో అగ్ని ప్రమాదం జరిగిందని, సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారని, ఎలాంటి ప్రాణనష్టం లేదని మిలిటరీ అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఇరాన్ వ్యాఖ్యానించలేదు. అయితే, యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హూతీ రెబెల్స్ నుంచి ఎర్ర సముద్రంలో ఓడలపై డ్రోన్, రాకెట్ దాడులు ఇటీవల పెరిగాయి.
ఈ సముద్ర రవాణా మార్గంలో దిగజారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో బడా షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్రం మీదుగా జరిగే నౌకల రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎర్ర సముద్రంలో వెళ్లే చమురు రవాణా నౌకలపైన హూతీ రెబెల్స్ చేస్తున్న దాడుల కారణంగా, చమురు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని బీపీ సంస్థ ప్రకటించింది. చమురు రవాణా రంగంలో బడా కంపెనీల్లో బీపీ కూడా ఒకటి.
దిగజారుతున్న భద్రతే దీనికి కారణమని బీపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ మద్దతుగల హూతీ రెబెల్స్, ఇజ్రయెల్‌కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.
కొనసాగుతున్న హూతీల వరుస దాడులతో, సముద్ర మార్గంలో చమురు రవాణా చేసే బడా షిప్పింగ్ కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి.
బీపీ కంపెనీ ప్రకటన తర్వాత స్పందించిన అమెరికా, ఎర్ర సముద్ర మార్గంలో వెళ్లే రవాణా నౌకల భద్రత కోసం అంతర్జాతీయ నౌకాదళ సంయుక్త ఆపరేషన్ చేపట్టాల్సి వస్తుందని చెప్పింది.
అదే జరిగితే బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, బహ్రెయిన్, నార్వే, స్పెయిన్‌లు కూడా భద్రత కల్పించే నౌకాదళంలో చేరతాయి.
అమెరికా విడుదల చేసిన ప్రకటనలో ఆ దేశ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, ‘’యెమెన్‌కు చెందిన హూతీలు చేస్తున్న దాడుల కారణంగా స్వేచ్ఛాయుత వాణిజ్యం ప్రమాదంలో పడుతోంది. అమాయక నావికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే.’’ అని అన్నారు.
నౌకల రవాణా తాత్కాలిక విరామాన్ని పరిశీలిస్తామని, ఎర్ర సముద్ర ప్రాంతంలోని పరిస్థితులను పర్యవేక్షిస్తామని బీపీ కంపెనీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
చమురు ధరలు పెరుగుతాయన్న నిపుణులు
ఇతర కంపెనీలు కూడా సముద్ర మార్గంలో చమురు రవాణాను నిలిపేస్తే, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత సోమవారం చమురు ధర అత్యధికంగా నమోదైంది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.6 శాతం పెరిగి, ఒక్కో చమురు బ్యారెల్ ధర 79 డాలర్లకు చేరింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.6579 ధరకు చేరుకుంది.
దీని ప్రభావం ఏమేరకు ఉంటుందో ఇప్పడే చెప్పడం కష్టమని చమురు వ్యవహారాల చరిత్రకారుడు, యూరేషియా గ్రూప్ విశ్లేషకులు, గ్రెగొరీ బ్రూ అంటున్నారు.
షిప్పింగ్ కంపెనీలు తమ రవాణా మార్గాన్ని మళ్లించినా కూడా, ఈ పరిస్థితి కొన్ని వారాలపాటు ఇలానే కొనసాగితే, చమురు ధరలు మరింత మండిపోతాయని బ్రూ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, YAHYA ARHAB
ఎర్ర సముద్రం ఎందుకంత కీలకం?
చమురు, లిక్విడ్ నేచురల్ గ్యాస్, వినియోగ వస్తువుల రవాణాలో ఎర్ర సముద్రం చాలా కీలకం.
ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ చేసిన విశ్లేషణలో, ఆసియా, గల్ఫ్ ప్రాంతాల నుంచి యూరప్, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలకు ఎగుమతయ్యే వస్తువుల్లో దాదాపుగా 15 శాతం ఈ మార్గం నుంచే రవాణా అవుతాయని తేలింది. వాటిలో 21.5 శాతం రిఫైన్డ్ ఆయిల్, 13 శాతానికి పైగా క్రూడాయిల్ ఎగుమతులున్నాయి.
నౌకల రవాణా నిలిపివేస్తే దాని ప్రభావం, ప్రపంచవ్యాప్త చమురు ధరలపైనే కాకుండా అంతర్జాతీయ వినిమయ వస్తులపైనా తీవ్రంగా పడుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థలో పని చేస్తున్న క్రిస్ రోజర్స్ అన్నారు.
ప్రస్తుతం పీక్ సీజన్ కాకపోయినా, నౌకలకు ఎదురవుతున్న ఆటంకాల ప్రభావం వినిమయ వస్తువులపైనే తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, REUTERS
నౌకల రవాణా తాత్కాలికంగా నిలిపివేస్తున్న బడా కంపెనీలు
ఇకమీదట ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్‌కు చెందిన కార్గోలను ఆపరేట్ చేయమని ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఎవర్‌గ్రీన్ లైన్ సోమవారం నాడు ప్రకటించింది.
‘’నౌకలు, నౌకా సిబ్బంది రక్షణ మేరకు, వెంటనే ఇజ్రాయెలీ కార్గోలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ఎవర్‌గ్రీన్ లైన్ నిర్ణయించుకుంది. అలానే తదుపరి నోటీసు ఇచ్చే వరకు, రవాణా నౌకలు ఎర్ర సముద్రం మీదుగా వెళ్లొద్దని ఆదేశిస్తున్నాం’’ అని ఎవర్‌గ్రీన్ లైన్ ప్రకటనలో పేర్కొంది

నౌకల రవాణా మార్గాన్ని మళ్లిస్తే ఏమవుతుంది?
బాబ్ అల్ మందాబ్ జలసంధి మీదుగా ప్రయాణించే రవాణా నౌకలను హూతీ తిరుగుబాటు ఫైటర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ జలసంధికి గేట్ ఆఫ్ టియర్స్ అనే పేరు కూడా ఉంది. నౌకల ప్రయాణానికి ప్రమాదకరమైన ఈ జలసంధి 32 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది.
హమాస్‌కు మద్దతు ప్రకటించిన హూతీ తిరుగుబాటుదారులు, ఇజ్రాయెల్‌కు వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. విదేశీ కార్గో నౌకలపైన డ్రోన్లతోనూ, రాకెట్లతోనూ దాడులు చేస్తున్నారు.
కాబట్టి బాబ్ అల్ మందాబ్ జలసంధి మీదుగా కాకుండా, దక్షిణాఫ్రికా ప్రాంతం మీదుగా చుట్టు తిరిగి వెళ్లేలా నౌకలను మళ్లిస్తున్నారు. దీని వల్ల మరో పది రోజుల ప్రయాణం పెరుగుతుంది. లక్షల మిలియన్ డాలర్ల ఖర్చు పెరుగుతుంది.
ఒకసారి ఈ రెండు నౌక రవాణా మార్గాల వివరాలు తెలుసుకుందాం...
మొదటి మార్గం నెదర్లాండ్స్ నుంచి మొదలై ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ మీదుగా తైవాన్ వెళ్తోంది
ఈ మార్గంలో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే 18520 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణానికి 25.5 రోజులు పడుతుంది.
ఇక రెండవ మార్గం నెదర్లాండ్స్ నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా తైవాన్ వెళ్తోంది.
ఈ మార్గంలో 13,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంటే 25,002 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణానికి 34 రోజులు పడుతుంది.
ఇవి అతి భారీ కంటెయినర్ నౌకలు ప్రయాణించే 16.48 నాట్ల సగటు వేగం ఆధారంగా వెసాన్ నాటికల్ సంస్థ వేసిన అంచనాలు

ఫొటో సోర్స్, Reuters
గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగానే ఎర్ర సముద్రంలో హూతీలు దాడులకు దిగారా?
హమాస్ జరిపిన అక్టోబర్ 7 దాడుల తర్వాత గాజాలో మిలిటరీ దాడులను మొదలుపెట్టింది ఇజ్రాయెల్. హమాస్ దాడుల్లో దాదాపుగా 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ నిర్వహణలో ఉన్న గాజా ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం, యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాలో 18700 మంది మృతి చెందారు.
అయితే హూతీ తిరుగుబాటుదారులు దాడి చేస్తున్న నౌకలన్నీ కూడా ఇజ్రాయెల్ వెళ్తున్నాయని స్పష్టంగా చెప్పడానికి లేదు.
సోమవారం దాడికి గురైన ఎంటీ స్వాన్ అట్లాంటిక్ నౌక యజమాని మాట్లాడుతూ, గుర్తు తెలియని వస్తువొకటి తమ నౌకపై దాడి చేసిందని చెప్పారు. యెమెన్‌కు సమీపంగా ఉండే ఎర్ర సముద్ర ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ నౌకకు ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధం లేదు.
మరో కంపెనీ, ఇన్వెంటర్ కెమికల్ ట్యాంకర్స్ స్పందిస్తూ, ‘’నార్వేకు చెందిన యాజమాన్యానికి, సింగపూర్‌కు చెందిన సాంకేతిక విభాగానికి, కార్గో రవాణాకు అవసరమైన లాజిస్టికల్ చెయిన్‌లోని మరే ఇతర విభాగాలకూ ఇజ్రాయెల్‌తో సంబంధం లేదు.’’ అని తెలిపింది.
గడిచిన కొన్ని రోజులుగా హూతీల దాడులు తీవ్రమయ్యాయి. దాంతో అరేబియన్ ద్వీపకల్పంలోని యెమెన్‌కు, ఆఫ్రికా తీరంలోని జిబౌటీ, ఎరిత్రియా దేశాలకు మధ్య ఉండే జలసంధిలో నౌకల రవాణాను షిప్పింగ్ కంపెనీలు నిలిపివేస్తున్నాయి.
ఈ మార్గం ద్వారానే నౌకలు సూయజ్ కెనాల్ చేరుకుంటాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చమురు రవాణా నిలిపివేత ప్రకటనలు చేస్తున్న బడా షిప్పింగ్ కంపెనీలు
ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని షిప్పింగ్ కంపెనీల్లో రెండవ అతిపెద్ద కంపెనీ మేయిర్స్క్ పేర్కొంది. ఈ కంపెనీకి చెందిన నౌక మేయిర్స్క్ జిబ్రాల్టర్‌పైనా, మరో కంటెయినర్ షిప్‌పైనా దాడి తృటిలో తప్పింది.
మరో దిగ్గజ షిప్పింగ్ గ్రూప్, మెడిటెరేనియన్ షిప్పింగ్ కంపెనీ (ఎంఎస్‌సీ) కూడా తమ నౌకల రవాణా మార్గాన్ని మళ్లిస్తున్నట్టు తెలిపింది.
గత శుక్రవారం ఎర్ర సముద్రంలో వెళ్తున్న ఎంఎస్‌సీ ప్లాటినం 3 నౌకపైనా దాడి జరిగింది. నౌకా సిబ్బందిలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కానీ షిప్ సర్వీసులను ఆపేశారు.
హూతీల దాడిలో సురక్షితంగా బయటపడిన భారతీయులు
ఫ్రాన్స్ నుంచి హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ ద్వీపానికి వెళ్తున్న ఎంటీ స్వాన్ అట్లాంటిక్ నౌకపైనా దాడి జరిగిందని ఇన్వెంటర్ కెమికల్ ట్యాంకర్ సంస్థ సోమవారం ధృవీకరించింది. అయితే ఈ దాడిలో నౌకలోని భారతీయ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది.
అమెరికా నౌకాదళ రక్షణలో ఎంటీ స్వాన్ అట్లాంటిక్ సురక్షితంగా చేరుకుంటుందని తెలిపారు.

ఫొటో సోర్స్, REUTERS
రవాణా నౌకలను కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపు మళ్లిస్తున్న కంపెనీలు
జర్మనీకి చెందిన హపాగ్ లాయిడ్ సంస్థ తమ నౌకల రవాణా మార్గాన్ని మళ్లిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ ఎర్ర సముద్రం మీదుగా వెళ్లిన నౌకలు ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్తాయని స్పష్టం చేసింది. ఇదే తమ నౌకలకూ, సిబ్బందికీ సురక్షితమని తెలిపింది.
ఆసియా ప్రాంతానికీ, మధ్యధరా, యూరప్, అమెరికా తూర్పు తీర ప్రాంతాలకు మధ్య సుదీర్ఘ రవాణా మార్గాల్లో నడిచే ఎవర్‌గ్రీన్ లైన్ కంపెనీకి చెందిన నౌకలను కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా మళ్లిస్తున్నట్టు తెలిపారు.
షిప్పింగ్ రంగంపైన ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని షిప్పింగ్ ధరల డాటా కంపెనీ గ్జెనెటాలో చీఫ్ ఎనలిస్ట్‌గా పని చేస్తున్న పీటర్ శాండ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- ఒకే రోజు 78 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్.. విమర్శల వెల్లువ
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ..
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్‌లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














