కన్నబిడ్డలు నలుగురిని చంపింది తల్లే అన్నారు, 40 ఏళ్ళ జైలు శిక్ష వేశారు - 20 ఏళ్ల తరువాత ఈ కేసులో మిస్టరీని సైన్స్ బయటపెట్టింది

- రచయిత, హన్నా రిచియే
- హోదా, బీబీసీ న్యూస్
న్యాయవిచారణలు, సమాజం ఆమె దోషి అనే చెప్పాయి. దీంతో ఆమె 20 ఏళ్లపాటు జైల్లో ఉన్నారు.
కానీ సైన్స్ ఆమె ఏ తప్పూ చేయలేదని తేల్చి చెప్పింది. ఆమె జైలు శిక్ష రద్దయ్యేలా చేసింది.
ఇది క్యాథ్‌లీన్ ఫొల్బిగ్ అనే మహిళ కథ. కడుపున పుట్టిన నలుగురు బిడ్డలను చంపిందనే నిందను మోసి, 20 ఏళ్ళపాటు జైలుశిక్షను అనుభవించిన మహిళ ఆమె.
ఏ తప్పూ చేయకపోయినా తనను జైలు పాలుచేసినందుకు ఇప్పుడేం సమాధానం చెపుతారని క్యాథ్‌లీన్ ఫోల్బిగ్ ప్రశ్నిస్తున్నారు.
ఆమె ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరే యోచనలో ఉన్నట్టు ఆమె తరపున న్యాయవాదులు ప్రకటించారు.
క్యాథ్‌లీన్ ఫోల్బిగ్ కేసు ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. శాస్త్రీయపరమైన ఆధారాలతో దోషిని తేల్చే ప్రక్రియలలో ముందు ముందు మరింత మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్న మాట.
తన నలుగురు పిల్లలను చంపారనే ఆరోపణలపై ఒకనాడు ‘ఆస్ట్రేలియా చెడ్డ తల్లి’గా పేరుపడ్డ క్యాథ్‌లీన్ ఫోల్బిగ్ శిక్ష రద్దు అయింది.
ఆమె ఏ నేరమూ చేయలేదని శాస్త్రీయంగా నిరూపితం కావడంతో ఆమెకు జైలు శిక్ష రద్దయింది.
ఈ కేసులో క్యాథ్‌లీన్ ఫోల్బిగ్‌ను జైలుకు పంపడానికి చూపిన ఆధారాలు నమ్మదగినవిగా లేవని న్యూ సౌత్ వేల్స్ సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
జైలులో 20 ఏళ్లు గడిపిన తరువాత 56 ఏళ్ల క్యాథ్‌లీన్ ఫోల్బిగ్‌కు ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది.
2003లో ఆమెకు జైలు శిక్ష విధించినప్పటినుంచి తానే పాపం ఎరుగునని ఆమె చెపుతూనే ఉన్నారు.
అయితే ఈ కేసుపై విశ్రాంత న్యాయమూర్తితో టామ్ బథ్రస్ట్, ప్రాసిక్యూటర్లు జరిపిన విచారణలో జన్యు ఉత్పరివర్తన కారణంగా క్యాథ్‌లీన్ పిల్లలు చనిపోయినట్టు శాస్త్రీయంగా గుర్తించారు.
జన్యు ఉత్పరివర్తన పరిశోధన ఈ కేసుపై తమకు ఉన్న అవగాహనను మార్చివేసిందని టామ్ బథ్రస్ట్ చెప్పారు.
టామ్ బథ్రస్ట్ నివేదిక ఆదారంగా న్యూ సౌత్ వేల్స్ గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించి, ఆమెను తక్షణం విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.
అయితే గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు తరువాత ఈ కేసు కోర్టు ముందుకురాగా, శాస్త్రీయ ఆధారాలతో ఈ కేసును పూర్తిగా కొట్టివేస్తూ డిసెంబరు 14న ఆదేశాలు ఇచ్చింది.
తన జైలు శిక్షలను రద్దుచేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును క్యాథ్‌లీన్ ఫొల్బిగ్ స్వాగతించారు.
‘‘ కొన్నిసార్లు పిల్లలు అకస్మాత్తుగా చనిపోతారనే విషయాన్ని అంగీకరించడం కంటే నన్ను నిందితురాలిని చేయడానికే సమాజం ఎక్కువ ఆసక్తి చూపింది’’ అని క్యాథ్‌లీన్ గురువారం చెప్పారు.
క్యాథ్‌లీన్ కేసును ‘న్యాయం తప్పుదోవపట్టిన’ కేసుగా ఆస్ట్రేలియాలో పేర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, EPA
ఏం జరిగింది?
19 రోజుల నుంచి 18 నెలల వయసున్న ఆమె నలుగురు పిల్లలు 1989 నుంచి 1999 మధ్య కాలంలో హఠాత్తుగా చనిపోయారు. వారిని ఫొల్బిగ్ హత్యచేసిందని ఆరోపణలు వచ్చాయి.
ఆమె కొడుకు కాలెబ్ లరింగోమలేసియా అనే వ్యాధితో బాధపడేవాడు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో 1989లో నిద్రలోనే కాలెబ్ చనిపోయాడు.
ఆ తర్వాత కొద్దికాలానికే కార్టికల్ బ్లైండ్‌నెస్ (అంధత్వం), ఎపిలెప్సీ(మూర్చ)తో బాధపడుతున్న ప్యాట్రిక్ చనిపోయాడు. మరో ఇద్దరు పిల్లలు సారా, లారా శ్వాసకోశ వ్యాధులతో ఇంట్లోనే చనిపోయారు.
తల్లే నలుగురు పిల్లలను చంపినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వీరందరినీ ఊపిరాడకుండా చేసి చంపినట్టు అభియోగాలు మోపింది.
క్యాథ్‌లీన్ రాసుకున్న డైరీని ఆధారంగా చేసుకుని ఆమెను స్థిరత్వం లేని మహిళంటూ నేరస్తురాలిగా చిత్రీకరించారు. కానీ ఆ డైరీని ఏనాడూ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు పరిశీలించలేదు.
2003లో తన నలుగురు పిల్లలను చంపిన కేసులో ఆమెకు 40 ఏళ్ళ జైలు శిక్ష పడింది. తరువాత ఆమె అప్పీలు చేసుకోగా శిక్షను 30 ఏళ్ళకు కుదించారు. కానీ తనపై ఉన్న నేరారోపణలను సవాల్ చేసే అవకాశాలను ఆమె కోల్పోయారు.

ఫొటో సోర్స్, EPA
అరుదైన జన్యు మ్యుటేషన్లు
ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో ఇమ్యునాలజీ అండ్ జినోమిక్ మెడిసిన్ ప్రొఫెసర్ కరోలా వినుయెసా క్యాథ్‌లీన్ ఫోల్బిగ్ కేసుపై దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి వైద్య నిపుణుల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం కావడంతో 2018 నుంచి కరోలా ఈ కేసుపై దృష్టి పెట్టారు.
కరోలా, ఆమె బృందం ఫొల్బిగ్ డీఎన్‌ఏపై పరిశోధనలు జరిపి ఆమె డీఎన్‌ఏ మ్యాప్‌ను రూపొందించింది. దీంతో ఆమె జన్యువుల్లో మ్యుటేషన్లను గుర్తించడం సాధ్యమైంది.
ఫొల్బిగ్, ఆమె ఇద్దరు కూతుళ్ల జన్యువుల్లో సీఏఎల్ఎం2 జీ114ఆర్ అనే మ్యుటేషన్ కనిపించింది. అది తీవ్రమైన గుండెజబ్బులకు కారణమయ్యే అవకాశం ఉందని, దాదాపు 35 మిలియన్ల (3.5 కోట్లు) మందిలో ఒకరికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని తేలింది.
జీవకణాల్లోకి కాల్షియం అయాన్ల ప్రవాహానికి ఈ సీఏఎల్ఎం2 జీ114ఆర్ మ్యుటేషన్ ఆటంకం కలిగిస్తుంది. అది గుండె ఆగిపోవడానికి కారణమవుతుంది.
కాలెబ్, ప్యాట్రిక్ మరో రకం జన్యు మ్యుటేషన్ కలిగి ఉన్నారని, దానికి ఎలుకల్లో అనూహ్యంగా వచ్చే (సడెన్ ఆన్‌పెట్ ఎపిలెప్సి ) మూర్ఛలాంటి లక్షణాలు ఉన్నాయని ప్రొఫెసర్ వినుయెసా బృందం పరిశోధనలో వెల్లడైంది.
ఫొల్బిగ్ పిల్లల్లో గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధనలు రుజువు చేశాయి.
పునర్విచారణతో ఊపిరి
ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ పరిశోధనలకు తోడు ఈ ఏడాది ప్రారంభంలో ఈ కేసుపై మైలురాయి అనదగ్గ విచారణ జరిగింది. ఆమెపై మోపిన నేరారోపణల్లో వ్యక్తమైన సందేహాలు సహేతుకమైనవే నిర్థారణకు వచ్చారు.
ఈ కేసులో క్యాథ్‌లీన్ నేరస్తురాలని చెప్పడానికి వీల్లేని అనేక సందేహాలు ఉన్నాయని, ఆమె పిల్లల మరణం అరుదైన జన్యుకారణాల వలన సహజంగానే జరిగిందనే యూనివర్సిటీ పరిశోధనతో విచారణా బృందం ఏకీభవించింది.
ఈ సాక్ష్యాల ద్వారా ఫోల్బిగ్ పై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేసినట్టు చీఫ్ జస్టిస్ ఆండ్రూబెల్ చెప్పారు.
దీంతో క్యాథ్‌లీన్ ఫోల్బిగ్ నష్టపరిహారం కోరేయోచనలో ఉన్నట్టు ఆమె న్యాయబృందం తెలిపింది. ఎంతమొత్తానికి ఈ పరిహారం కోరుతున్నారనే విషయం తెలియజేయలేదు.
ఈ కేసు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆస్ట్రేలియా న్యాయవ్యవస్థ ఆధునిక సైన్స్ విషయాలకు నెమ్మదిగా ప్రతిస్పందిస్తుందనే విమర్శలకు గురైంది.
‘‘అభివృద్ధి చెందిన సైన్స్, జెనిటిక్స్ నా పిల్లలు ఎలా చనిపోయారనే ప్రశ్నకు సమాధానం చెప్పాయి’’ అని క్యాథ్‌లీన్ ఫోల్బిగ్ చెప్పారు. 1999లో కూడా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తగిన న్యాయపరమైన సమాధానాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ప్రాసిక్యూటర్ నా మాటలను మరోరకంగా తీసుకోవడం వలన నాకీ దుస్థితి వచ్చింది. మరెవరూ ఇలాంటి దుస్థితికి లోనుకాకూడని కోరుకుంటున్నాను’’ అన్నారు క్యాథ్‌లీన్
ఇవి కూడా చదవండి :
- యానిమల్: ‘ఆల్ఫా మేల్’ అంటే ఏమిటి? ఇలాంటి మగవాళ్లు ప్రమాదకరమా?
- బుధిని మంజియాన్: ‘నెహ్రూ గిరిజన భార్య’గా పేరున్న ఈమెను గ్రామస్థులు ఎందుకు వెలివేశారు... ఆమె చేసిన తప్పేంటి?
- 'డెవిల్ ట్రీస్': విశాఖలో ఈ 'ఏడాకుల చెట్ల'ను చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?
- చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మానవులను సృష్టించే దారుణ ప్రయోగం.... దీన్ని ఎవరు, ఎలా చేశారు?
- ఆంధ్రప్రదేశ్: జగన్ ఇప్పుడు బీసీ ఓట్ల మీద దృష్టి పెట్టారా... రెడ్డి లీడర్లు అందుకే పార్టీకి దూరమవుతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














