చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, HANDOUT
గమనిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
చెన్నై శివారులో శనివారం సాయంత్రం ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సగం కాలిన స్థితిలో కనిపించారు. ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం మృతి చెందారు. ఆమె బాయ్‌ఫ్రెండే ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏం జరిగింది?
శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో చెన్నైలోని పొన్‌మార్ అనే ఓ నిర్మానుష్య ప్రాంతం నుంచి ఒక్కసారిగా యువతి కేకలు వినిపించాయి. ఆమె కాళ్లు కట్టేసి ఉన్నాయి.
సగం కాలిన స్థితిలో ఆమె కొట్టుమిట్టాడుతూ స్థానికులకు కనిపించారు. ఆమెను వాళ్లు ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ ఆధారంగా మృతురాలు మదురై జిల్లాకు చెందిన 24 ఏళ్ల నందినిగా గుర్తించారు.
గత ఎనిమిది నెలలుగా దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె ప్రోగ్రామర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, HANDOUT
ఎవరు చంపారు?
నందిని గతంలో ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆమె మాజీ ప్రియుడు వెట్రిమారన్‌ను పిలిపించి విచారణ జరిపారు. నందినిని హత్య చేసింది తానేనని వెట్రిమారన్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వెట్రిమారన్ అసలు పేరు పాండి మహేశ్వరి అని, అతను లింగ మార్పిడి ద్వారా పురుషుడిగా మారారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో వెట్రిమారన్ చెప్పినదాని ప్రకారం నందిని, తాను ఒకే స్కూల్లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహితులు.
ఈ కేసును విచారిస్తున్న అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, "వెట్రిమారన్ స్కూల్లో చదువుకునే రోజుల్లో పాండి మహేశ్వరి అనే అమ్మాయి. అప్పటి నుంచి నందిని, మహేశ్వరి స్నేహితులు. స్కూల్ తర్వాత పాండి మహేశ్వరి లింగ మార్పిడి చేయించుకుని వెట్రిమారన్‌గా మారింది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, HANDOUT
ఎందుకు ఇలా చేశాడు?
అరెస్టయిన వెట్రిమారన్ వాంగ్మూలం ప్రకారం....అతను నందినితో చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వెట్రిమారన్‌తో నందిని మాట్లాడటం మానేసిందని, ఇతర మగ స్నేహితులతో సన్నిహితంగా మాట్లాడుతుండటం చూసి అనుమానించిన వెట్రిమారన్ ఆమెపై కోపం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు.
నందిని బర్త్ డే కావడంతో పుట్టిన రోజు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికంటూ ఆమెను బయటకు తీసుకెళ్లారు వెట్రిమారన్. ఉదయం గుడికి తీసుకెళ్లి, మధ్యాహ్నం హోటల్‌లో భోజనం చేసి సాయంత్రం ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
“సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి ముందుగా కళ్లకు గంతలు కట్టి, ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆ తర్వాత బ్లేడుతో చేతులు, కాళ్లు, మణికట్టు, మెడపై కోశాడు. ఆమె నొప్పి భరించలేక అరుస్తుండగానే,పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొని నందినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు’’ అని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుడు వెట్రిమారన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మహిళలపై గౌరవం లేకనే ఈ ఘోరాలు’: నివేదితా లూయిస్
నువ్వు నన్ను కాదంటే నిన్ను హింసిస్తా అనే ధోరణి బాగా పెరిగిపోయిందని చెన్నైకి చెందిన ప్రముఖ రచయిత్రి, స్త్రీవాది నివేదితా లూయిస్ అన్నారు.
గతంలో ఇలాంటి ధోరణికి భయపడినట్లు కనిపించిన మహిళలు ప్రస్తుత రోజుల్లో వాటిని ఎదిరిస్తున్నారని అందువల్లే హింసకు గురవుతున్నారని ఆమె చెప్పారు.
‘‘నేటి సమాజంలో ఆర్థిక స్వేచ్ఛ మహిళలకు తమ కోరికలను, హక్కులను వ్యక్తీకరించడానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇది పితృస్వామ్య ప్రపంచానికి షాక్‌లాంటిది’’ అని నివేదిత అన్నారు.
ఇంట్లో ఉండే స్త్రీలు పితృస్వామ్యానికి కట్టుబడి తమ జీవితాలను దాని పరిమితుల్లోనే ఉండేలా చూసుకుంటారు. తమ ఆధిపత్యం పోతుందన్న ఆందోళన కలిగినప్పుడు పురుషుడు హింసకు దిగుతాడు’’అని నివేదిత అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒకే రోజు 78 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్.. విమర్శల వెల్లువ
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ..
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్‌లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










