భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు.. నదిలో పసిడి ఎలా దొరుకుతోంది?

ఫొటో సోర్స్, FAROOQ HAMZA AFRIDI
- రచయిత, ఇస్లాం గుల్ అఫ్రిది
- హోదా, జర్నలిస్ట్
సూర్యోదయం అవుతుండడంతో పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని నౌషెహ్రా జిల్లా నిజాంపూర్ తహసీల్‌కు చెందిన 30 ఏళ్ల సయీద్ మహ్మద్, ఆయన స్నేహితుడు వకాస్ తమ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి సన్నద్ధమవుతున్నారు.
ఎముకలు కొరికే చలిలో, చిరిగిన పాత కోటు, మురికిపట్టిన దుస్తులతో, కాళ్లకు అరిగిపోయిన ప్లాస్టిక్ చెప్పులతో రాత్రంతా సింధు నదిలో ఇసుకను జల్లెడ పట్టి అందులో బంగారం కోసం వెతకడం వీరి పని.
సయీద్ మహ్మద్‌కు రోజుకు రూ. 1,500 కూలి ఇస్తారు. వారు చేస్తున్నపని అంతా చట్టవిరుద్ధం కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినా దానికి ఎవరూ బాధ్యత వహించరు.
బంగారం కోసం నదిలో అన్వేషణ జరుపుతుండడంపై నిజాంపూర్ డిప్యూటీ కమిషనర్ ఖలీద్ ఖట్టక్ ‘బీబీసీ’తో మాట్లాడారు.
‘‘సింధు (స్థానికంగా అబసీన్ అంటారు) నదిలో ఈ బంగారం వెతికే పనులు రెండేళ్లుగా ఎక్కువయ్యాయి. భారీ యంత్రాలతోనూ కొందరు బంగారం కోసం ఇసుకను జల్లెడ పడుతున్నారు. ఈ పనులకు ఎవరికీ అనుమతులు లేవు’’ అని ఆయన చెప్పారు.
నౌ షెహ్రాలోని జహంగీరా ప్రాంతంలో సుమారు మూడు లక్షల మంది నివసిస్తుంటారు.
స్థానికంగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ, రవాణా రంగంలో పనిచేస్తూ, భద్రత సంస్థలలో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడి వారు ఉపాధి పొందుతుంటారు.
గత రెండేళ్లలో సింధు నదిలో బంగారం వెలికితీసే పనుల్లోనూ స్థానికులు పెద్దయెత్తున పాల్గొంటున్నారని అధికారులు చెప్తున్నారు.
ఈ పనిలో, దీనికి సంబంధించిన వ్యాపారాలలో ఉన్నవారితో మీరు మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారి నుంచి సమాధానం రావడం కష్టమే. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుంటారని భావించి, వారు ఆ విషయాలేమీ మీతో మాట్లాడరు.
ఈ అక్రమ వ్యవహారమంతా కొందరు పెద్దల కనుసన్నలలో జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.

ఫొటో సోర్స్, FAROOQ HAMZA AFRIDI
బంగారం వెలికితీత: ఖర్చెంత? ఆదాయం ఎంత?
అక్తర్ జాన్(పేరు మార్చాం) భారీ యంత్రాలతో గత ఆరు నెలలుగా నది నుంచి బంగారం వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజాంపూర్‌కు చెందిన ఒక స్నేహితుడు తనకు ఈ సలహా ఇచ్చాడని, ఇక్కడ కొంత డబ్బుతో పని మొదలుపెడితే రోజుకు లక్షల్లో సంపాదించవచ్చని చెప్పాడని అక్తర్ అన్నారు. ఆయన సలహా ప్రకారమే ఇక్కడ తాను పని ప్రారంభించానని, కానీ చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పారాయన.
నెలకు రూ.4 లక్షల చొప్పున చెల్లించేలా మూడు చిన్న ఎక్స్‌కవేటర్లను అద్దెకు తీసుకున్నానని, 20 మంది కూలీలను కూడా నియమించుకున్నానని అక్తర్ చెప్పారు.
నది ఒడ్డున ఉన్న ఇసుకలో బంగారం వెతుకుతున్నా అద్దె, కూలీల ఖర్చు భారీగా ఉండటంతో వారానికి రూ. 15 నుంచి 20 లక్షల నష్టం వస్తోందని ఆయన చెప్పారు.
చిన్న యంత్రాలతో పని సాగకపోవడంతో పంజాబ్(పాకిస్తాన్‌లోని) నుంచి మూడు పెద్ద ఎక్స్‌కవేటర్లను ఒక్కొక్కటి రూ. 18 లక్షల అద్దెకు తీసుకొచ్చినట్లు చెప్పారాయన. ఇవి నదిలో నీట్లో ఉన్న ఇసుకను కూడా తవ్వుతాయని చెప్పారు. వీటిని తీసుకొచ్చాక ఆదాయం పెరిగిందని చెప్పిన ఆయన, ఎంత ఆదాయం వస్తుందో మాత్రం చెప్పలేదు.
సయీద్ ఉల్లా (పేరు మార్చాం)కు గతంలో నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన రూ. 4 కోట్ల విలువైన భారీ యంత్రాలను కొని వాటిని స్థానిక కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. బంగారం వెలికితీసే పనులు చేయాలని, ఆదాయంలో సగం తనకు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు.
మొదటి రెండు నెలలలో వారికి ఏమీ సంపాదన రాలేదు. పైగా, అక్రమంగా తవ్వకాలు జరుపుతుండడంతో పోలీసులు దాడి చేసి రూ.1.5 కోట్ల విలువైన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అయిదుగురు కూలీలనూ అరెస్ట్ చేశారు.
అనంతరం వారిని బెయిలుపై విడుదల చేసినా యంత్రాలు మాత్రం పోలీసుల స్వాధీనంలోనే ఉన్నాయి.
ఈ పనిలో చాలా సమస్యలున్నాయని, పోలీసులు నిత్యం దాడులు చేస్తుంటారని, నదిలో యంత్రాలు మునిగిపోతుంటాయని సయీద్ చెప్పారు. అయినా, భారీగా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ పనిని వదులుకోలేకపోతున్నట్లు చెప్పారాయన.

ఫొటో సోర్స్, FAROOQ HAMZA AFRIDI
సింధు, కాబుల్ నదుల్లో చాలా కాలంగా పసిడి వేట
నౌషెహ్రా జిల్లాలో సింధు నది నుంచి అక్రమంగా చేపడుతున్న బంగారం తవ్వకాలను అడ్డుకునేందుకు ఆ జిల్లా అధికారులు, ఖనిజ శాఖ అధికారులు కలిసి చర్యలు చేపడుతున్నారు.
కాబుల్ నదిలో, నౌషెహ్రా వరకు సింధు నదిలో బంగారం వేట చాలా కాలంగా ఉన్నదే అయినప్పటికీ 2022 నుంచి యంత్రాల వినియోగం ఎక్కువైందని నిజాంపూర్ డిప్యూటీ కమిషనర్ ఖలీద్ ఖట్టక్ ‘బీబీసీ’తో చెప్పారు.
బంగారం అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు నిజాంపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో పోలీస్, ఖనిజ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఖలీద్ చెప్పారు.
చట్ట విరుద్ధంగా బంగారం తవ్వకాలకు పాల్పడుతున్నవారిపై ఇప్పటివరకు 858 కేసులు నమోదు చేశామని, 825 మందిని అరెస్ట్ చేశామని, వారికి 70 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించామని ఖలీద్ చెప్పారు.
12 ఎక్స్‌కవేటర్లు, 7 వాహనాలు, 20 ద్విచక్ర వాహనాలు, ఇతర యంత్ర పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఎంతగా కట్టడి చేస్తున్నా ఈ అక్రమ కార్యకలాపాలు రోజురోజుకూ పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదని స్థానికులు చెప్తున్నారు.
ప్రభుత్వమే బంగారం వెలికితేసే పనులు చేపడుతుందా అనేది తెలుసుకోవడానికి ప్రొవిన్షియల్ మినరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఇంతవరకు ఎలాంటి స్పందనా రాలేదు.
నౌషెహ్రా, స్వాబీ జిల్లాలలో సింధు నదిలో అక్రమంగా బంగారం తవ్వకాలు జరుగుతున్నట్లు ఖనిజాల విభాగానికి తెలుసునని, అక్కడ బంగారం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయన్న లెక్కలూ దీని వద్ద ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు.
ఈ అక్రమ కార్యకలాపాలను నిరోధించడానికి పెద్దయెత్తున పోలీసులను మోహరిస్తున్నారు.
అక్రమ తవ్వకాలను అడ్డుకునే సమయంలో ఒక్కోసారి కాల్పులు, రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. కొందరు అక్రమ తవ్వకందారులు పోలీసులు వచ్చినప్పుడు పడవల్లో నది దాటి పంజాబ్ ప్రావిన్స్‌కు పారిపోతున్నారు.
భారీ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నా వాటిని ఠాణాకు తరలించడం కష్టమవుతుండడంతో అక్కడే ఉంచేస్తున్నారు.
నిజాంపూర్ వద్ద సింధు నదిలో తవ్వకాలతో పాటు జహంగీరా, స్వాబీ జిల్లాలోని కుందర్ పార్క్ ప్రాంతాలు, పాకిస్తాన్ పంజాబ్‌లోని అటాక్‌లో కూడా సింధు నదిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు.
నదీ తీరంలో అటవీ భూములు
కాబూల్ నది నుంచి ఇసుక, కంకర, బంగారం అక్రమ తవ్వకాలను అరికట్టడంతో పాటు ఈ ప్రాంతంలోని ఇతర సమస్యల పరిష్కారానికి రెండు నెలల కిందట జహంగీరాలో స్థానిక పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ చీఫ్ రిఫత్ ఉల్లా బీబీసీతో మాట్లాడుతూ- నదీ తీరంలో స్థానికులకు వందల ఎకరాల అటవీ భూములున్నాయని, ఖనిజాల విభాగం నుంచి ఎవరికైనా తవ్వకాలకు అనుమతులుంటే వారు తమ భూముల్లోని ఇసుకలో తవ్వుకోవచ్చని చెప్పారు.
ఆ భూములలో తవ్వకాలకు ఎవరైనా లీజులు తీసుకుంటే అందుకు వారు చట్టప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారని, అంతేకానీ అక్రమంగా నదిలో తవ్వకాలకు వీలు లేదని అన్నారు. నదిలో తవ్వకాలు జరుపుతున్నవారితో స్థానిక పెద్దల కమిటీ రహస్య ఒప్పందాలు చేసుకుందనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
అక్రమ తవ్వకాల వ్యాపారంలో ఉన్నవారికి సంబంధించిన డేటా ఏ ప్రభుత్వ సంస్థ వద్దా లేదు.

ఫొటో సోర్స్, FAROOQ HAMZA AFRIDI
సింధు నదిలో బంగారం ఎలా వస్తోంది?
సింధు నదిలో బంగారం లభ్యతపై గతంలో పరిశోధనలు జరిగాయి.
పెషావర్ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అస్గర్ అలీ పర్యవేక్షణలో గ్రాడ్యుయేట్ విద్యార్థులు 2016లో స్వాత్, కాబుల్ నదుల్లో బంగారంపై అధ్యయనం చేశారు.
సింధు నది, కాబుల్ నది సంగమ ప్రాంతంలో జియోఫిజికల్ సర్వే నిర్వహించామని, నది ఒడ్డున మూడు మీటర్ల లోతులో బంగారం ఉన్నట్లు గుర్తించామని అస్గర్ అలీ తెలిపారు.
అప్పటికి లభ్యమవుతున్న బంగారాన్ని వివిధ స్థాయుల్లో మదించగా, లోతుకు వెళ్తున్నకొద్దీ బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నట్లు తేలిందని చెప్పారు.
ప్రొఫెసర్ డాక్టర్ అస్గర్ అలీ మాట్లాడుతూ- ‘‘మూడు రకాల శిలల్లో ఒకటి అగ్ని శిల(ఇగ్నస్ రాక్). నది ఎగువన పర్వత ప్రాంతాల్లోని ఈ రకం రాయి హిమనీనదాలు, భారీ వర్షాలు, వరదలు, భూమి కోత వంటి సహజ కారణాల వల్ల క్రమక్షయానికి గురై అందులో ధాతువులు ప్రవాహంలో కొట్టుకొస్తాయి.
బంగారం వంటి ధాతువులు భార లోహాలు. అవి ప్రవాహంలో వచ్చి నీటి అడుగుకు చేరుతాయి. నీటి దిశ మారే చోట అంటే డ్యామ్‌లు వంటి అడ్డుకట్టలు ఉన్నచోట, నదుల సంగమం వద్ద ఇవి పేరుకుపోయే అవకాశం ఉంటుందని అస్గర్ అలీ చెప్పారు.
అటాక్ ప్రాంతంలో కాబుల్, సింధు నదులు కలుస్తాయని, అలాగే నిజాంపూర్ దగ్గర సింధు నది మలుపు ఉండడం వల్ల అక్కడ బంగారం చేరొచ్చని ఆయన అంచనా వేశారు. బంగారమే కాకుండా ఇతర భార లోహాలు అక్కడ నీటిలో ఉంటాయన్నారు.
నిర్మాణ పనుల కోసం కాబుల్, సింధు నదుల నుంచి తీసుకెళ్లే ఇసుక, కంకరలో బంగారం సహా వివిధ లోహ కణాలు ఉంటున్నా వాటిని ఇసుక నుంచి వేరు చేసేందుకు సరైన పద్ధతులు అందుబాటులో లేకపోవడంతో బంగారం వృథా అవుతుందని అస్గర్ అలీ వివరించారు.

ఫొటో సోర్స్, FAROOQ HAMZA AFRIDI
సింధు నదిలో దొరికే బంగారం నాణ్యత ఎలా ఉంది?
నీటి నుంచి బంగారు రేణువులను వేరు చేయడానికి నది ఒడ్డున పెద్ద బలమైన ఇనుప జల్లెడలను ఏర్పాటు చేసి, యంత్రాల సాయంతో నదిలోని ఇసుక, మట్టిని అందులో పోసి జల్లెడ పతున్నారని అస్గర్ చెప్పారు.
అలా చేసినప్పుడు పెద్ద రాళ్లన్నీ జల్లెడలో ఉండిపోయి చిన్నచిన్న రేణువులు దిగువన పరిచే పరదాలపై చేరుతాయని, అప్పుడు ఆ పరదాలను పెద్ద ఇనుప పాత్రలలో నీటిని నింపి అందులో వేస్తారని ఆయన తెలిపారు.
నీరు నింపిన పాత్రలో వేసిన పరదాల నుంచి సూక్ష్మ ఇసుక రేణువులు వేరైన తరువాత దాన్ని సేకరించి పాదరసం కలుపుతారని, ఆ ప్రక్రియ తరువాత పాదరసానికి అతుక్కున్న బంగారు రేణువులను అగ్నిలో కరిగించడం ద్వారా బంగారం తీస్తారని చెప్పారు.
దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్, అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతాలలో ఇలా నది నీటి నుంచి బంగారం తీస్తుంటారని తెలిపారు.
ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంత నదుల్లో పెద్ద మొత్తంలో బంగారం ఉందని, దీనిపై మరిన్ని పరిశోధనలు, వెలికితీతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని ఆయన చెప్పారు.
ఇక్కడ అక్రమంగా సేకరిస్తున్న బంగారం స్థానిక మార్కెట్లలోకి వస్తోందని, బంగారం నాణ్యత బాగుందని అస్గర్ వివరించారు.
అక్రమ మైనింగ్‌ను అరికట్టి ప్రభుత్వమే వెలికితీత చేపడితే ఖజానాకు ఆదాయం రావడంతోపాటు స్థానికులకు చట్టబద్ధంగానే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















