6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?

ఫొటో సోర్స్, @revanth_anumula
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
సమాజంలోని నాలుగు వర్గాల వారిని ప్రధానంగా లక్ష్యం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారెంటీలను ప్రకటించింది. మహిళలు, యువత, రైతులు, వృద్ధులే ఈ నాలుగు వర్గాలు.
అయితే, వీటిని ఎలా అమలు చేస్తారు? వీటికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? వీటి విధివిధానాలు ఏమిటి?

ఫొటో సోర్స్, FACEBOOK/INDIAN NATIONAL CONGRESS
ఆరు గ్యారెంటీలు ఇవీ..
మహాలక్ష్మి
- ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
- రూ.500లకే గ్యాస్ సిలిండర్
- రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం
రైతు భరోసా
- ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం
- ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం
- వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ప్రకటన
గృహ జ్యోతి
- ఇళ్లలో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితం
- ఇందిరమ్మ ఇళ్లు
- ఇళ్లులేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
- తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం
యువ వికాసం
- విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ.5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం. కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని అందిస్తారు.
- ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు
చేయూత
- పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను
- ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం

ఫొటో సోర్స్, Getty Images
స్కూటీలు కూడా..
ఈ గ్యారెంటీలకు అదనంగా యూత్ డిక్లరేషన్‌లోనూ కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. దీన్ని ‘మిని మేనిఫెస్టో’గా కాంగ్రెస్ చెప్పుకొచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని గుర్తించి వారి కుటుంబాలకు రూ.25 వేల పింఛను అందజేయడం, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత ఇందులో ప్రధానమైనవి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. నిరుద్యోగ యువకులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తారు .
విద్యార్థి, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణా తరగతుల ఏర్పాటు. పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు 75 శాతం అవకాశాలు కల్పించేలా చట్టం. రూ.10 లక్షలు వడ్డీలేని రుణాల అందజేస్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో నూతన వర్సిటీల ఏర్పాటు చేస్తారు.
మహిళా సాధికారతలో భాగంగా చదువుకునే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తారు.

ఫొటో సోర్స్, Facebook/Telangana CMO
మహాలక్ష్మి పథకం కోసం ఏం చేయాలి?
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మిలోని ‘ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రయాణం ఉచితం’ను డిసెంబరు 9 నుంచి అమలు చేస్తున్నారు.
ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధివిధానాలను సిద్ధంచేసింది. అవి ఏమిటంటే..
- సదరు మహిళ తెలంగాణవాసి అయ్యుండాలి. స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి.
- అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఈ సదుపాయం వాడుకోవచ్చు.
- తెలంగాణ సరిహద్దు లోపల ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించొచ్చు.
- పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతోపాటు హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించొచ్చు.
- బయటి రాష్ట్రాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ సరిహద్దు వరకే ఉచితంగా వెళ్లొచ్చు. ఆ తరువాత టికెట్ కొనాలి.
- ప్రయాణంలో కిలోమీటర్ల పరిధిపై ఎలాంటి పరిమితులూ లేవు.
- ప్రయాణించే ప్రతి మహిళకు ‘జీరో టికెట్’ ఇస్తారు.
- మహిళలు ప్రయాణించిన దూరాన్ని బట్టి ఆ మొత్తం చార్జీని ప్రభుత్వం టీఎస్‌ఆర్‌టీసీకి చెల్లిస్తుంది
- ఈ పథకం కోసం మహిళలకు త్వరలో ప్రభుత్వం ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్’ అందించనుంది.
మహాలక్ష్మి పథకం అమలు తర్వాత తెలంగాణలో మహిళలు బస్సుల్లో ప్రయాణించడం ఎక్కువైందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో మహిళలు గతంలో 30 నుంచి 32 శాతం మంది బస్సుల్లో ప్రయాణించేవారు. మహాలక్ష్మి పథకాన్ని అమలుచేసిన తర్వాత అది 58 నుంచి 61 శాతానికి పెరిగింది’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్య శ్రీ కూడా
చేయూత గ్యారెంటీలోని ఆరోగ్య శ్రీని కూడా డిసెంబరు 9 నుంచే అమలుచేస్తున్నారు.
గతంలో కుటుంబానికి రూ.5 లక్షల వరకూ ఉన్న ఆరోగ్య శ్రీ పరిమితిని చేయూత అమలులో భాగంగా రూ.10 లక్షలకు పెంచారు.
ఆరోగ్య శ్రీ పొందాలనుకునేవారు తప్పనిసరిగా తెలంగాణ వాసులై ఉండాలి, కుటుంబం కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి.
ఆరోగ్య శ్రీ కార్డును https://aarogyasri.telangana.gov.in/ASRI2.0/ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఫోటో, రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మొబైల్ నంబరు లాంటి వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ కార్డుతో సాయంతో ప్రభుత్వం నిర్దేశించిన ఆసుపత్రుల్లో దాదాపు వెయ్యి వరకూ ఆరోగ్య సేవలను ఉచితంగా పొందొచ్చు.

ఫొటో సోర్స్, Facebook/Ponguleti Srinivas Reddy
మిగతా హామీలు ఎప్పటినుంచి అమలు చేస్తారు?
మిగతా గ్యారెంటీలను ఎప్పటినుంచి అమలు చేస్తారనే అంశంపై డిసెంబరు 24న మీడియాతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తంగా ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన చెప్పారు.
ఈ పథకాల విధివిధానాలు త్వరలోనే వెల్లడిస్తామని, అయితే, తెల్లరేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని ఈ పథకాలను వర్తింపచేస్తామని ఆయన అన్నారు.
మరోవైపు కొత్త రేషన్ కార్డులు, రైతు బంధుకు కూడా ఈ కార్యక్రమంలోనే దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook/Telangana CMO
ఏమిటీ ప్రజాపాలన?
ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామం, వార్డు, డివిజిన్, పట్టణాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని పొంగులేటి చెప్పారు.
‘‘కొంతమంది అధికారులతో కలిసి బృందాలను ఏర్పాటుచేస్తాం. ఒక్కో బృందం ప్రతి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తుంది. అక్కడే గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుంది’’ అని ఆయన అన్నారు.
ఈ దరఖాస్తులను రెండు రోజుల ముందే కలెక్టర్ల ద్వారా ఆయా గ్రామాలకు అందిస్తారని తెలిపారు.
అయితే, మొదటి దశలో దరఖాస్తులు సమర్పించకపోతే ఆందోళన చెందొద్దని పొంగులేటి అన్నారు.
‘‘ఇదేమీ చివరి అవకాశం కాదు. మళ్లీ మళ్లీ మేం ఇలాంటి కార్యక్రమాలూ నిర్వహిస్తూనే ఉంటాం. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తు స్వీకరిస్తాం’’ అని ఆయన చెప్పారు.
విధివిధానాలు ఇలా..
- ఈ గ్యారెంటీల దరఖాస్తులను రెండు రోజుల ముందే గ్రామాల్లో పంపిణీ చేస్తారు.
- వీటిని డిసెంబరు 28 నుంచి జనవరి 6 మధ్య స్వీకరిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు పెడతారు.
- దరఖాస్తులు మరీ ఎక్కువగా ఉంటే టోకెన్లు ఇస్తారు.
- దరఖాస్తు తీసుకున్నాక రసీదును ఇస్తారు.
ఇవి కూడా చదవండి:
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
- 'ట్రాన్స్‌జెండర్ అయితే సెక్స్ వర్కర్‌గా మారాలా... లేదంటే అడుక్కోవాలా? నేను కష్టపడి పని చేసుకుని బతుకుతా' - మదనపల్లె భాను కథ
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















