మేడిగడ్డ బరాజ్: బాగుచేసే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు మారితే ఒప్పందాలు మారిపోతాయా

ఫొటో సోర్స్, facebook/Rahul Gandhi
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అక్టోబరు 22
‘‘మా సాంకేతిక నిపుణుల బృందం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి మేడిగడ్డ బరాజ్ ప్రాంతాన్ని సందర్శించింది. బరాజ్ కు జరిగిన నష్టాన్ని అంచనా వేసి దెబ్బతిన్న ప్రాంతాన్ని ఎల్ అండ్ టీ తరఫున వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తాం. ’’
- ఎల్ అండ్ టీ హైడల్ అండ్ టన్నెల్ జనరల్ మేనేజర్ ఎస్.సురేశ్ కుమార్ విడుదల చేసిన ప్రకటన.
అక్టోబరు 28
ఒక్కపైసా భారం కూడా ప్రజలపై పడదు. మేడిగడ్డ బరాజ్ ను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ విజిట్ చేసింది. వాళ్లు రిపోర్టు ఇస్తారు. అందులో ఎలాంటి లోపాలున్నా.. ఏజెన్సీనే సరిదిద్దుతుంది.
- మీట్ ది ప్రెస్ లో భాగంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి.
డిసెంబరు 2..
ముందుగా జరిగిన అగ్రిమెంట్ ప్రకారం సివిల్ పనులకు సంబంధించి డిఫెక్ట్ లయబిలిటీ పిరియడ్ 24 నెలలుగా ఉంది. 2020 జూన్ 29న ప్రాజెక్టు పూర్తి చేసినందున ఈ లయబిలిటీ పిరియడ్ 2022 జూన్ 29తోనే ముగిసింది. అందుకే కొత్తగా పనులు చేయాలంటే మళ్లీ ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్లాలి.
- ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్ రాసిన మరో లేఖ.
సరిగ్గా, తెలంగాణలో ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు రోజు ఎల్ అండ్ టీ మేడిగడ్డ బరాజ్‌పై నీటి పారుదల శాఖకు లేఖ రాసింది. ఆ లేఖ అటు రాజకీయంగానూ.. ఇటు నీటి పారుదల శాఖ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది.

ఫొటో సోర్స్, FACEBOOK/COLLECTOR BHUPALPALLI
అప్పుడు చెప్పి.. ఇప్పుడు లెక్క తప్పి
మేడిగడ్డ బరాజ్‌లోని పియర్లు కుంగినప్పుడు దాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని అప్పట్లో చెప్పింది ఎల్ అండ్ టీ.
కానీ, ఇప్పుడు ఆ పనులు చేయాలంటే ప్రభుత్వం తరఫున ఒప్పందం చేసుకుని చెల్లింపులు జరగాలన్నట్లుగా లేఖ రాసింది.
అప్పట్లో మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనను గమనిస్తే, ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కూడా మేడిగడ్డ పునరుద్ధరణ పనులకు వినియోగించేది లేదని చెప్పుకొంటూ వచ్చారు. ఇప్పుడు ఎల్ అండ్ టీ రాసిన లేఖ ప్రకారం రూ.కోట్లలో భారం పడనుంది.
తెలంగాణలో డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అనూహ్యంగా ప్రాజెక్టు పరంగా ఉన్న ఒప్పందాలు.. ప్రకటనలు అన్నీ మారిపోయాయి.
ఇప్పుడు మేడిగడ్డ బరాజ్ ను పునరుద్ధరించే బాధ్యత ఎవరిదన్నదే అతిపెద్ద ప్రశ్న.
ఈ విషయంపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘అప్పట్లో ఎల్ అండ్ టీ చేసిన ప్రకటన, ఇప్పుడు రాసిన లేఖను పరిశీలిస్తున్నాం. ప్రాజెక్టు పునరుద్ధరణ మాకు సంబంధం లేదంటే కుదరదు.
దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు బరాజ్ పునరుద్దరణపై ఒక నిర్ణయానికి వస్తాం’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/rahul gandhi
ఏముంది ఆ లేఖలో…
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ అంశంపై తాజా లేఖను ఎల్ అండ్ టీ తరఫున జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్ లేఖ రాశారు. దీన్ని నీటి పారుదల శాఖ ఈఎఎన్‌సీ వెంకటేశ్వర్లును ఉద్దేశించి రాశారు.
ఈ లేఖ డిసెంబరు 2నే రాసినట్లుగా చెబున్నప్పటికీ, రెండు వారాల తర్వాత బయటకు వచ్చింది.
ఇంతకీ లేఖలో ఏముందంటే.. ‘‘మేడిగడ్డ బరాజ్ డిజైన్ నీటి పారుదల శాఖ ఇచ్చింది. నాన్ ఈపీసీ పద్ధతిలో నిర్మాణ పనులు చేశాం.
2018 ఆగస్టు 25కు పనులు పూర్తి చేయాల్సి ఉంది.
2020 జూన్ 29కు పూర్తయ్యాయి. మొదట రూ.3062.79 కోట్లకు ఒప్పందం జరిగినప్పటికీ, పెరిగిన ధరల కారణంగా రూ.3348 కోట్లను సంస్థకు ప్రభుత్వం చెల్లించింది.
సివిల్ పనులకు సంబంధించి పనరుద్దరణ విషయంలో ఒప్పందం 24 నెలలుగా ఉంది. అందువల్ల ఆ సమయం 2022 జూన్ 29తోనే ముగిసింది.
ఇదే విషయాన్ని నీటిపారుదల శాఖ మాకు 2021 మార్చి 15న పని పూర్తి చేసుకుని స్వాధీనం చేసుకున్నామని లేఖ సైతం ఇచ్చింది.
ఈ లేఖ ప్రకారం చూసుకున్నా, 2023 మార్చితోనే లయబిలిటీ పీరియడ్ ముగిసింది.’’ అని లేఖలో ప్రస్తావించారు.
కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉంటుందని, అందుకు రూ.55.75 కోట్లు ఖర్చు అవుతుందని అందులో పేర్కొన్నారు.
అక్టోబరు బరాజ్ పియర్లు కుంగినప్పుడు పునరుద్ధరిస్తామని చెప్పి.. తర్వాత నెల రోజులకు మాకు సంబంధం లేని చెప్పడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి కూడా ఉండొచ్చని చెప్పారు నీటి పారుదల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఎన్.రంగారెడ్డి.
‘‘గతంలో ఐదేళ్ల పాటు మెయింటెన్స్ పీరియడ్ ఉండేది. ఈ మధ్యకాలంలో లయబులిటీ పీరియడ్ పెడుతున్నారు. రెండేళ్ల తర్వాత డిపాజిట్లు రిలీజ్ చేస్తున్నారు. ఐదేళ్ల పాటు మెయింటెన్స్ పీరియడ్ ఉంటుంది.
డిజైన్స్‌కు నీటి పారుదల శాఖదే బాధ్యత. ఇది డిజైన్ డిఫెక్ట్ కిందకు వస్తుందని అనుకోవచ్చు.
అందుకే ముందుగా కాంట్రాక్టు సంస్థ చెప్పినా.. తర్వాత మళ్లీ వేరొక లేఖ రాసి ఉండొచ్చు.’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Anumula Revanth Reddy
కొత్త ప్రభుత్వం ఏం చెబుతోంది…
మేడిగడ్డ బరాజ్ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమీక్షలు చేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు జరిపారు.
‘‘మేడిగడ్డ బరాజ్ కు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించండి.’’ అని రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
మరోవైపు ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతోపాటు నీటిపారుదల శాఖ అధికారులతో డిసెంబరు 18న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
‘‘అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేశారు.. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశారు.
ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే కుదరదు.’ అని ఉత్తమ్ అన్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది.
మరోవైపు ఈ వ్యవహారంపై నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘మేడిగడ్డ పునరుద్ధరణను నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చేపతుంది. ఒప్పంద నిబంధనల ప్రకారం మార్చి చేసిన పనులకు మాత్రమే 2021 మార్చి 15న ధ్రువీకరణపత్రం జారీ చేశాం. అది కంప్లీషన్ సర్టిఫికెట్ కాదు.
మిగిలిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ బరాజ్‌ను నీటి పారుదల శాఖకు అప్పగించలేదు.
ఏడో బ్లాకులో 20వ నంబరు పియర్ తోపాటు ఇరువైపులా ఉన్న 18,19,21,22 పియర్స్ కూడా కుంగాయి.’’ అని అందులో పేర్కొన్నారు.
ఈ విషయంపై నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాదర్ రెడ్డి బీబీసీ తో మాట్లాడారు.
‘‘ఇది శాఖాధికారుల వైఫల్యంగానే చూడాలి. బరాజ్ కుంగిన ఘటనకు అధికారులదే బాధ్యత అవుతుంది.
బరాజ్ నిర్మాణంలోనే లోపాలున్నాయని గతంలోనే రిటైర్డు ఇంజినీర్లు ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ లెక్కలోకి తీసుకోలేదు.’’ అని అన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి.

ఫొటో సోర్స్, Gangula Kamalakar
అసలు మేడిగడ్డ బరాజ్ వివాదం ఏమిటి..?
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ గ్రామం వద్ద ఉంటుంది మేడిగడ్డ బరాజ్. దీనికి లక్ష్మీ బరాజ్ అని పేరు పెట్టారు కేసీఆర్.
16 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉండే ఏర్పాటు ఉంది. 85 గేట్లు ఉంటాయి.
1.6 కిలోమీటర్ల పొడవు, 110 మీటర్ల వెడల్పుతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.
2023 అక్టోబరు 21న బరాజ్‌లోని 20వ పునాది (పియర్) కుంగిపోయింది. ఫలితంగా బరాజ్ వంతెన కుంగడంతోపాటు పియర్లకు పగుళ్లు వచ్చాయి.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం తేల్చింది..
‘జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ కమిటీ అక్టోబర్ 23 నుంచి 25వ తేదీ వరకు మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించింది.
ముందుగా అక్టోబర్ 23న తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)తో సమావేశమైంది. మరుసటి రోజు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించింది. తర్వాత రోజు మరోసారి నీటి పారుదల శాఖ, ఎల్ అండ్ టీ, ఎస్‌డీఎస్‌ఓ తదితర సంస్థలు, ఆయా విభాగాలతో సమావేశమైంది.
దీనిపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) కమిటీ 11 అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ 43 పేజీల పరిశీలన నివేదికను ఇచ్చింది. దీన్ని రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ షైనీకి ఎన్‌డీఎస్ఏ ఛైర్మన్ సంజయ్ కుమార్ సిబల్ పంపించారు.
బరాజ్ వైఫల్యాలపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని ఆ నివేదికలో కమిటీ స్పష్టం చేసింది.
‘‘సాధారణంగా బరాజ్ అనేది ఒకటి లేదా రెండు టీఎంసీల సామర్థ్యంతో ఉంటుంది.
ప్రాజెక్టులకు బరాజ్‌లకు చాలా తేడా ఉంటుంది.
కానీ, మేడిగడ్డ బరాజ్ అనేది ఏకంగా 16టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేశారు.
ప్రాజెక్టు నుంచి నీటిని విడిచిపెట్టినప్పుడు వాటర్ ఫ్లో(నీటి ప్రవాహం) యూ ఆకారంలో ప్రవహిస్తుంది. బరాజ్ విషయంలో అలా ఉండదు. అందుకే బరాజ్ అనేది తక్కువ సామర్థ్యంతో ఉండాలి.
మేడిగడ్డ విషయంలో సామర్థ్యం ఎక్కువగా డిజైన్ చేయడంతో ఇసుక కొట్టుకుపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. డిజైన్ లోపం స్పష్టంగా ఉంది.’’ అని బీబీసీతో చెప్పారు రిటైర్డ్ సీఈ రంగారెడ్డి.

ఫొటో సోర్స్, congress party
ఇసుక కొట్టుకుపోవడంతోనే సమస్య
బరాజ్ పిల్లర్లు కుంగడానికి కారణాలను జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.
బరాజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడంతో పియర్ల(పిల్లర్ల)కు ఆధారం బలహీనంగా మారింది.
ఫౌండేషన్ (పునాది)లో వాడిన మెటీరియల్ సామర్థ్యం లేదా పటిష్టత తక్కువగా ఉండటం.
బ్యారేజి లోడ్ కారణంగా సెకాంట్ వాల్స్ పై ఒత్తిడి పడి వైఫల్యం చెందడం.
వీటిన్నింటి కారణంగా ప్లానింగ్‌కు తగ్గ డిజైన్, నిర్మాణం జరగలేదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చిచెప్పింది. బరాజ్‌ను నీటిపై తేలియాడే నిర్మాణం (ఫ్లోటింగ్ స్ర్టక్చర్)గా డిజైన్ చేసి గట్టిదైన కట్టడంగా నిర్మించారని చెప్పింది.
బరాజ్ పైన, కింద వైపులా ఉన్న రాతిని చేరుకోవడానికి వరుసగా కాంక్రీట్ గోడలనే ఉపయోగించారని కమిటీ నివేదికలో రాసింది.
ప్రత్యేక కమిటీ వేయాలి
అయితే.. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎల్ అండ్ టీ పునరుద్ధరణ చేస్తుందా.. లేక ప్రభుత్వమే భరిస్తుందా అనేది చూడాల్సి ఉందని శ్యాంప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
‘‘ప్రాజైక్టు పూర్తి కాలేదని అధికారులు ఇప్పుడు ప్రకటనలు చేస్తున్నారు సరే, మరి అప్పట్లో పూర్తయ్యిందని సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారు.
ఈ వ్యవహారంపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి లోపం ఎక్కడ జరిగిందనేది పరిశీలించాలి.
కమిటీ ఇచ్చే స్పష్టత ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉండాలి.’’ అని చెప్పారు శ్యాంప్రసాద్ రెడ్డి.
ఈ పూర్తి వ్యవహారంపై నీటి పారుదల శాఖ, ఎల్ అండ్ టీని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా సంస్థ తరఫున ఎవరూ అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు’
- గవదబిళ్లలు : పిల్లలను ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, లక్షణాలేంటి?
- వయసు పెరుగుతున్నకొద్దీ సెక్స్ కోరికలు ఎవరిలో పెరుగుతాయి? దీనికి ఎలాంటి పరిస్థితులు కావాలి....
- రేప్ కేస్-సజ్జన్ జిందాల్: ఈ బిజినెస్ మేన్ ప్రవర్తన గురించి ఆ నటి ఏం చెప్పారు?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














