అలెగ్జీ నవాల్నీ: అదృశ్యమైన ఈ పుతిన్ బద్ధశత్రువు మళ్లీ ఎక్కడ కనిపించారు ? ఇన్నాళ్లు ఏమయ్యారు....

ఫొటో సోర్స్, REUTERS
రష్యా ప్రభుత్వ విమర్శకుడు, అవినీతి వ్యతిరేక ప్రచారకర్త అలెగ్జీ నవాల్నీ బతికే ఉన్నారని, సైబీరియాలోని ఒక కాలనీలో ఆయన్ను నిర్బంధించారని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు.
‘‘అలెగ్జీ నవాల్నీ ఆచూకీని గుర్తించాం. ఆయన ఉత్తర రష్యాలో ఉన్నారు’’ అని డిసెంబర్ 25న అలెగ్జీ అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు.
అలెగ్జీ నవాల్నీని మునుపటి జైలు నుంచి తరలించిన తర్వాత అంటే డిసెంబర్ 6 నుంచి తన బృందంతో నవాల్నీ కాంటాక్టులో లేరు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరిగా నవాల్నీని పరిగణిస్తారు. 2021 నుంచి ఆయన జైల్లో ఉన్నారు.
‘‘అలెగ్జీ బాగానే ఉన్నారు. లాయర్ ఈరోజు ఆయన్ను చూశారు’’ అని టెలిగ్రామ్ యాప్‌లో కిరా యార్మిష్ రాశారు.

ఫొటో సోర్స్, EPA
పాత జైలు నుంచి అలెగ్జీని ఉత్తర రష్యాలోని యామెలో నెనెట్స్ జిల్లాలో ఉన్న ఖార్ప్ ఐకే-3 పీనల్ కాలనీకి తరలించినట్లు కిరా చెప్పారు.
అలెగ్జీని ఇంతకుముందు తూర్పు మాస్కోకు 235 కి.మీ దూరంలోని మెలెఖోవోలో ఉంచారు.
నవాల్నీ ఆచూకీ తెలిసిందంటూ వచ్చిన నివేదికల్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా చెప్పింది. అయినప్పటికీ ఆయన క్షేమం, నిర్బంధ పరిస్థితుల గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది.
‘‘పొలార్ వోల్ఫ్ కాలనీ’’గా పేరున్న కొత్త జైలుకు ఆయనను తరలించారు. రష్యాలోని ఈ జైలును అత్యంత కఠినమైన కాలనీల్లో ఒకటిగా పరిగణిస్తారు.
ఈ జైల్లో నిర్బంధంలో ఉన్న ఖైదీల్లో చాలామంది తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు.
నవాల్నీని ఒంటరిని చేసి ఆయన జీవితాన్ని వీలైనంత దుర్భరంగా మార్చేందుకు రష్యా అధికారులు ప్రయత్నిస్తున్నారని యార్మిష్ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
‘‘ఈ కాలనీ చాలా దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లడం చాలా కష్టం. అక్కడికి వెళ్లి అలెగ్జీ బాగోగులు తెలుసుకోవడం లాయర్లకు కూడా కష్టమే’’ అని ఆమె చెప్పారు.
నవాల్నీని తరలించిన విధానాన్ని బట్టి రాజకీయ ఖైదీల పట్ల వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుందో, వారిని ఒంటరిని చేసి అణిచివేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో అర్థం చేసుకోవచ్చని ఆయన సహాయకుడు ఇవాన్ జాదోవ్ అన్నారు.
అనేక కోర్టు విచారణలకు నవాల్నీ హాజరు కాకపోవడంతో ఆయన బృందం తీవ్రంగా ఆందోళన చెందింది.
అవినీతి వ్యతిరేక ప్రచారకర్తగా నవాల్నీ పేరు సంపాదించారు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనేందుకు రష్యా అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించగల ఏకైక రష్యా ప్రతిపక్ష నాయకుడిగా నవాల్నీ కనిపించారు.
2020లో సైబీరియాలో ఆయనపై విషప్రయోగం జరిగింది. అది నరాలపై ప్రభావం చూపే రసాయనం (నర్వ్ ఏజెంట్) అని పాశ్చాత్య ప్రయోగశాలలు నిర్ధరించాయి.
విదేశాల్లో ఆయనకు చికిత్స జరిగింది. 2021లో రష్యాకు తిరిగొచ్చిన వెంటనే ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














