మెర్తిర్ టిడ్‌ఫిల్: ‘వయగ్రా’ కు జన్మనిచ్చిన ఊరు ఇదే, ఆ మగవాళ్లే లేకుంటే ఏం జరిగేది?

వయాగ్రా

ఫొటో సోర్స్, BBC/QUAY STREET PRODUCTIONS/TOM JACKSON

ఫొటో క్యాప్షన్, వయాగ్రా పై నిర్మించిన డ్రామాలో ఓ దృశ్యం
    • రచయిత, పీటర్ షటిల్‌వర్త్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఈ మెడిసిన్‌ యాడ్స్‌లో కనిపించాడు. పోప్ స్వయంగా ఈ మందుకు తన మద్ధతు తెలిపాడు. కానీ, వీరందరికన్నా ముందుకు చెప్పుకోవాల్సిన కొందరు వ్యక్తులున్నారు.

వారే లేకుండే అసలు మెడిసిన్ బయటకు వచ్చేది కాదు. అయితే, తాము తీసుకోబోయే ఆ మందు ప్రపంచ చరిత్రలో ఒక అధ్యాయాన్ని సృష్టిస్తుందన్న విషయం వారికి కూడా తెలియదు. ఆ మందు మరేదో కాదు. వయాగ్రా.

బ్రిటన్‌లోని సౌత్ వేల్స్‌లో మెర్తిల్ ట్విడ్‌ఫిల్ అనే చిన్న పారిశ్రామిక పట్టణం ఉంది. అక్కడున్న ఒక ఉక్కు పరిశ్రమ మూతపడడంతో స్థానికంగా ఉండే కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

బాగా డబ్బు అవసరం ఉండటంతో ఏ పనికైనా సిద్ధమే అన్నట్లు ఉన్నారు అక్కడి కార్మికులు. సరిగ్గా ఆ బలహీనతే వారిని క్లినికల్ గినీ పిగ్స్‌గా మార్చేసింది.

వయాగ్రా క్లినికల్ టెస్టులకు వారు అంగీకరించినప్పుడు మొత్తం ప్రపంచాన్ని మార్చేసే ఒక మందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌లో తాము భాగమవుతున్నామన్న విషయం కూడా వారిలో ఎవరికీ తెలీదు.

తమపై జరిపిన పరిశోధనలు ఒక అద్భుత ఔషధానికి పునాదులు వేశాయని, అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్న లక్షల మందికి అది సాయం చేసిందని వారిలో కొందరికి 30 ఏళ్ల తర్వాతే తెలిసింది.

అలా ఒక రీసెర్చ్ సెంటర్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు స్వచ్ఛందంగా సిద్ధమైన కొందరు కార్మికులు లేకుంటే వయాగ్రా గురించి మనకు అసలు ఎప్పటికీ తెలిసేదే కాదు.

వయాగ్రా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మెర్తిర్ టిడ్‌ఫిల్

అలా మొదలైంది...

1990ల ప్రారంభంలో అధిక రక్తపోటు, ఆంజినా (గుండె కండరాలకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల చాతీ నొప్పి) లాంటి ఆరోగ్య సమస్యలు చికిత్స అందించే ప్రయత్నంలో ఔషధాలు తయారు చేసే ఫైజర్ సంస్థ సిల్డెనాఫిల్ యుకె-92,480 అనే ఒక కాంపౌండ్‌ను పరీక్షిస్తోంది.

ఆ ఔషధంపై అధ్యయనాలు జరిపేందుకు అది మెర్తిర్ టిడ్‌ఫిల్‌లోని ఒక రీసెర్చ్ సెంటర్‌తో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఔషధాన్ని పరీక్షించడానికి స్థానిక యువకులను రిక్రూట్ చేసుకున్నారు.

1992లో ఆ కొత్త ఔషధాన్ని పరీక్షించే ప్రక్రియలో పాల్గొనడానికి, అంగీకరించిన పట్టణంలోని కార్మికుల్లో ఇద్రిస్ ప్రైస్ ఒకరు. ఆ సమయంలో పట్టణంలోని ఉక్కు పరిశ్రమ మూతబడి ఉద్యోగం పోవడంతో ఆయన వేరే ఉద్యోగాలు వెతుక్కుంటూ తిరుగుతున్నారు. డబ్బుల కొరత తీవ్రంగా ఉండడంతో తాను సింబెక్ అనే ప్రాంతానికి వెళ్లానని ఆయన చెప్పారు.

‘‘డబ్బుల కోసం ఎలాంటి పరీక్షల్లో పాల్గొనాలి అని నేను వారిని అడిగాను. యాంజినా కోసం వేసుకునే టాబ్లెట్ కోసం క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చని ఒక డాక్టర్ మాకు చెప్పాడు. దానివల్ల తమకు ఏం జరుగుతుందోనని అక్కడున్న చాలా మంది యువకులు భయపడ్డారు’’ అని ఇద్రిస్ చెప్పారు.

అక్కడ వచ్చిన వలంటీర్లంతా యువకులే. వారికి యుకె-92,480 పిల్‌ను రోజుకు మూడు సార్లు, వరుసగా పది రోజులపాటు వేసుకోవాలని కంపెనీ వాళ్లు చెప్పారు. అందుకు వారికి కొంత డబ్బు చెల్లించారు.

‘‘1980ల చివర్లో, 90ల ప్రారంభంలో మాకు రోజు గడవాలంటేనే చాలా కష్టంగా ఉండేది. చేతికి ఎంత డబ్బు వచ్చినా తీసుకుందాం అనే ధోరణిలో ఉన్నాం. ఆ రోజుల్లో మా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో క్లినికల్ ట్రయల్స్‌ వాళ్లు ఇచ్చే డబ్బు చాలా ఉపయోగపడుతుందని అనుకున్నాం’’ అని బీబీసీ డాక్యుమెంటరీ కీపింగ్ ఇట్ అప్‌ కు ఇద్రిస్ చెప్పారు.

‘‘దానివల్ల మా ఇంట్లోవారికి అదనంగా ఆహారం దొరికింది. చలి కాచుకోడానికి రెండు బొగ్గు సంచులకు బదులు ఐదు బొగ్గు సంచులు తెచ్చుకోగలిగాం. డబ్బు అలా ఊరికే, సులభంగా చేతిలో వచ్చి పడుతోంది.’’ అని ఆయన అన్నారు.

‘‘కానీ ఆ ట్రయల్స్ ముగిసిన తర్వాత ఆ డ్రగ్ వల్ల వలంటీర్లుగా ఉన్న యువకుల్లో కనిపించిన అనూహ్యమైన సైడ్ ఎఫెక్ట్స్....ఫైజర్‌ సంస్థ పాలిట వరంగా మారింది’’ అని ఇద్రిస్ వెల్లడించారు.

వయాగ్రా
ఫొటో క్యాప్షన్, బీబీసీ వన్ ప్రోగ్రామ్ కీపింగ్ ఇట్ అప్ ప్రోమో చిత్రం

వయాగ్రాను ఎలా గుర్తించారు?

ఆ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లు ఒక్కొక్కరుగా ఆ మందు వేసుకున్నాక తమలో వచ్చిన మార్పులను, సమస్యలను అక్కడున్న నిపుణులకు చెప్పడం మొదలెట్టారు.

‘‘అంగస్తంభన మామూలు కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోందని వాళ్లు చెప్పారు. ఇంతకు ముందుకంటే ఎక్కువగా అంగం గట్టిపడినట్లు తమకు అనిపించిందని అన్నారు’’ అని ఫైజర్ మాజీ డిస్కవరీ అండ్ డెవలప్‌మెంట్ లీడ్ డాక్టర్ పీట్ ఎలిస్ గుర్తు చేసుకున్నారు.

మెర్తిర్ టిడ్‌ఫిల్‌లో అనుకోకుండా కనిపించిన ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ను గమనించిన ఫైజర్, అప్పటికి జరుగున్న గుండె సంబంధ అధ్యయనంతోపాటూ నపుంసకత్వంపై కూడా రీసెర్చ్ చేయడానికి నిధులు సమకూర్చింది.

1994లో స్వాంజీలో తమ తదుపరి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ముందు అంగస్తంభన సమస్యలు ఉన్న రోగులకు బ్రిస్టల్‌లోని సౌత్‌మీడ్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించింది ఫైజర్.

స్వాంజీలోని మోరిస్టన్ ఆస్పత్రిలోని క్లినిక్‌లో రకరకాల రోగులు ఉన్నారు. వారిలో డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ఉన్నారు. వారికి ఉన్న దుష్ప్రభావాలలో అంగస్తంభన సమస్య కూడా ఒకటి కావచ్చు.

‘‘తాము పరీక్షలు నిర్వహించే పురుషులు తమ మహిళా భాగస్వాములతో స్థిరమైన లైంగిక సంబంధాలు నెరిపేవారే అయ్యుండాలని ఫైజర్ చెప్పింది. యువకులు, వివాహితులను ఎంపిక చేసుకుంది. ఆ ట్రయల్స్‌లో భాగంగా మేం వారికి సెక్స్ వీడియోలు కూడా చూపించాం’’ అని అప్పటి ట్రయల్స్‌కు లీడ్‌గా వ్యవహరించిన ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డేవిడ్ ప్రైస్ గుర్తు చేసుకున్నారు.

తమ డ్రగ్ ప్రభావం గురించి పరిశీలించడానికి ట్రయల్స్‌లో పాల్గొన్న వారి పురుషాంగానికి ఒక పరికరం అమర్చారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని డాక్టర్లు వారికి భరోసా ఇచ్చారు. స్వాంజీలో జరిగిన అధ్యయనంలో పాజిటివ్ ఫలితాలు కనిపించాయి. దీంతో తమ చేతిలో ఉన్న ఔషధం చరిత్ర సృష్టించబోతోందని ఫైజర్‌కు త్వరగానే అర్థమైంది.

ఈ పరీక్షల ఫలితాలు ఎంత పాజిటివ్‌గా ఉన్నాయంటే, ట్రయల్స్‌లో పాల్గొన్న మగవాళ్లు కొందరు వారికి ఇచ్చిన టాబ్లెట్లలో వాడగా మిగిలిపోయిన టాబ్లెట్లను కంపెనీకి తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.

వయాగ్రా

ఫొటో సోర్స్, BBC / TWO RIVERS MEDIA

ఫొటో క్యాప్షన్, ఇద్రిస్ ప్రైస్

మార్కెటింగ్ ఎలా ....

అయితే, ఈ మాత్రలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో ఫైజర్ మార్కెటింగ్ టీమ్ రంగంలోకి దిగింది. అయితే, కొందరు నిపుణులు మాత్రం ఇది అవసరమైన డ్రగ్ అవుతుందా, లేక వినాశకారిగా మారుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేశారు.

సంప్రదాయాలు, విలువల గురించి ఆలోచించే ప్రపంచంలో ఒక సెక్స్ డ్రగ్‌గా వర్ణిస్తున్న మాత్రను లాంచ్ చేయడం ఎలా అన్నదానిపై ఫైజర్ మల్లగుల్లాలు పడింది. తమ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న మగవాళ్లు తమకు ఏమేం చెబుతూ వచ్చారో వాటినే మార్కెటింగ్ సందేశాలుగా ఉపయోగించింది ఫైజర్.

‘‘నపుంసకత్వం అనేది ఒక వ్యక్తిపై ఎంతటి ప్రభావం చూపిస్తుంది, వివాహ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేవి ఈ పరిశోధనలో మేం గమనించాం. ఈ మాత్ర తమకు ఎంత అవసరమో కొందరు మగవాళ్లు చెబుతుంటే విని నేను కదిలిపోయాను’’ అని ఫైజర్ మాజీ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ జెన్నిఫర్ డోబ్లెర్ అన్నారు.

నపుంసకత్వానికి విరుగుడుగా భావిస్తున్న ఈ డ్రగ్ లైంగిక సంబంధాలను చక్కదిద్దగలదు అనే సందేశంతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. ‘కుటుంబాలను, కుటుంబ విలువలను కాపాడుతుంది’ అంటూ ఈ డ్రగ్‌కు వాటికన్ నుంచి మతపరమైన ఆశీస్సులు కూడా లభించాయి.

అంగస్తంభన సమస్యకు ఆమోదం పొందిన మొట్టమొదటి నోటి మాత్ర అంటూ 1998లో అమెరికా, బ్రిటన్‌లో మార్కెట్లలోకి వయాగ్రా వచ్చింది. 2008 కల్లా అది దాదాపు 200 కోట్ల డాలర్ల వార్షిక విక్రయాలతో ఫార్మా చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్ముడవుతున్న డ్రగ్‌గా రికార్డులకెక్కింది.

వయాగ్రా

ఫొటో సోర్స్, BBC / TWO RIVERS MEDIA

ఫొటో క్యాప్షన్, వయాగ్రా సృష్టికర్తల్లో ఒకరైన డాక్టర్ డేవిడ్ బ్రౌన్

పరిశోధనలో భాగమైన వారికి ఏమీ తెలియదు

కానీ ఇద్రిస్, తన తోటి వలంటీర్లు సైడ్ ఎఫెక్టులు అనుకుని చెప్పిన విషయాలే వయాగ్రా సృష్టికి కారణమనే వాస్తవం మాత్రం మరుగున పడిపోయింది.

2023 ప్రారంభంలో కీపింగ్ ఇట్ అప్ అనే కార్యక్రమంలో పరిశోధకులు వయాగ్రా కథను చెప్పే వరకూ వయాగ్రా పుట్టుక వెనక మెర్తిర్ టిడ్‌ఫిల్ పట్టణం పాత్ర ఉందని ఎవరికీ తెలియలేదు.

వయాగ్రా మూలాలు సౌత్ వేల్స్‌లో ఉన్నాయనే కథను ‘మెన్ అప్’ అనే ఒక డ్రామాగా రూపొందించారు. ‘‘ నాకు ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. వయాగ్రా ఇప్పుడొక పెద్ద విషయం. దాన్ని మెర్తిర్ టిడ్‌ఫిల్‌లో జరిగిన పరిశోధనలో గుర్తించారని తెలిసి చాలా సంతోషంగాఉంది’’ అని ఇద్రిస్ అన్నారు.

‘‘సౌత్ వేల్స్‌కు చెందిన ఆ కొందరు మగవాళ్లు లేకపోయుంటే, వయాగ్రా బహుశా ఉనికిలోనే ఉండేది కాదేమో. వాళ్లు చరిత్రకు కారకులయ్యారు. అప్పట్లో డబ్బు సంపాదించాలనే ఆశతో ఉండి ఉండవచ్చు. కానీ వాళ్లు చాలామంది జీవితాల్లో పెను మార్పు తీసుకొచ్చారు. దానికి వాళ్లు చాలా గర్వపడాలి.’’అని వయాగ్రా కో ఫౌండర్ డాక్టర్ డేవిడ్ బ్రౌన్ అన్నారు.

వయాగ్రా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఫుట్ బాల్ దిగ్గజం పీలే వయాగ్రా ప్రమోషన్ లో పాల్గొన్నారు.

అంగస్తంభన సమస్య తీవ్రత ఎంత?

నపుంసకత్వం లేదా అంగస్తంభన సమస్య అనేది పురుషుల్లో, ముఖ్యంగా 40 దాటిన వారిలో సర్వ సాధారణం అని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది. 40 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్న దాదాపు సగంమంది పురుషుల్లో ఆ ప్రభావం ఉంటుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. 1995 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది అంగస్తంభన సమస్యలు ఎదుర్కుంటే, 2025 నాటికి వారి సంఖ్య 32 కోట్ల మందికి, అంటే రెట్టింపు పైగా ఉండొచ్చని మరికొన్ని అధ్యయనాలు తేల్చాయి.

వీడియో క్యాప్షన్, 400 మిలియన్ల సంవత్సరాలుగా చెక్కుచెదరని అరుదైన జీవి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)