ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడానికి సంబంధించిన పిటిషన్లపై డిసెంబరు 11న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. అయితే, ఈ తీర్పును చాలా మంది న్యాయ కోవిదులు తప్పుపడుతున్నారు.

ఈ తీర్పును సుప్రీంకోర్టు సమీక్షించుకోవాలని కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకుర్ సహా పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ప్రముఖ న్యాయ నిపుణులు ఎలాంటి సందేహాలను లేవనెత్తారో ఈ కథనంలో చూద్దాం.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, SCREENGRAB/SUPREME COURT OF INDIA

సమాఖ్య స్ఫూర్తిపై ప్రతికూల ప్రభావం: విశ్రాంత జస్టిస్ రోహింటన్ నారీమన్

ఈ అంశంపై శ్రీమతి బంసారీ శేఠ్ ఎండోమెంట్ లెక్చర్‌లో విశ్రాంత జస్టిస్ రోహింటన్ నారీమన్ స్పందించారు.

‘‘సుప్రీం కోర్టు తాజా నిర్ణయం సమాఖ్య స్ఫూర్తిపై చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆర్టిల్ 365 (5) కింద పరిణామాలను ఎదుర్కోకుండా ఉండేందుకే జమ్మూకశ్మీర్‌ను విభజించారు’’ అని ఆయన అన్నారు.

‘‘రాజ్యాంగంలోని ఈ నిబంధన ప్రకారం, ఏ రాష్ట్రంలోనైనా ఏడాదికి మించి రాష్ట్రపతి పాలన విధించకూడదు. అందుకే రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. దీంతో నేరుగా ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు కేంద్రానికి అవకాశం దక్కింది’’ అని ఆయన చెప్పారు.

‘‘ఈ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంటే ఒక రాజ్యాంగ విరుద్ధ చర్య నిరవధికంగా కొనసాగేందుకు అనుమతించారు. ఈ పరిణామాలన్నీ చాలా ఆందోళకరమైనవి’’ అని ఆయన అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టు వెనకడుగు: విశ్రాంత జస్టిస్ మదన్ లోకుర్

ఈ అంశంపై తాజాగా ‘ద వైర్’ వార్తా సంస్థతో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి మదన్ లోకుర్ మాట్లాడారు.

‘‘సుప్రీం కోర్టు ఇలా ఎందుకు తీర్పు ఇచ్చిందో అర్థంకావడం లేదు. ఆర్టిల్ 370 రద్దును ఆమోదించాల్సి ఉండాల్సింది కాదు. ఈ విషయంలో సుప్రీం కోర్టు వెనకడుగు వేసినట్లుగా అనిపిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో రాజ్యాంగం మొత్తాన్ని అమలు చేయొచ్చు, ఆర్టికల్ 370ని కూడా రద్దు చేయొచ్చు.. ఇలాంటి నిర్ణయాలను ఎలా తీసుకున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. సుప్రీం కోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాలు నాకు సంతృప్తికరంగా అనిపించలేదు’’ అని ఆయన అన్నారు.

‘‘జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోకపోవడం తప్పు. ఈ అంశంపై కూడా తీర్పు వెల్లడించాల్సింది. ఈ విషయంలో సరైన కేసు దాఖలయ్యేంత వరకూ ఎదురుచూద్దామని చెప్పడం సరికాదు. ఇదే ఆ సరైన కేసు. దీనిలోనే ఆ విషయంపైనా నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని ఆయన అన్నారు.

‘‘రాష్ట్రాల స్థితిగతులను మార్చడంపై ఉదాహరణగా నిలిచే కేసు ఇదీ. ఉదాహరణకు ఒక రాష్ట్రాన్ని పార్లమెంటు రెండుగా విభజించింది అనుకోండి. ఈ అంశాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు అనుకోండి. ఇక్కడ ఆ రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎలాంటి సిఫారసులేదు, ఒక వేళ ఉన్నా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరంలేదని సుప్రీం కోర్టు చెబితే ఎలా?’’ అని ఆయన ప్రశ్నించారు.

‘‘ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమీక్షించుకోవాలి. భారత పౌరుడిగా ఈ తీర్పును నాకు గర్వంగా అనిపించడం లేదు’’ అని ఆయన అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు

ఫొటో సోర్స్, EPA

రాజ్యాంగ బద్ధమైతే కాదు: ఫాలీ ఎస్ నారీమన్

ఈ అంశంపై సీనియన్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలీ ఎస్ నారీమన్.. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఒక కథనం రాశారు.

‘‘జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమైనవి. అంతేకాదు, సమాఖ్య స్ఫూర్తికి కూడా ఇవి వ్యతిరేకమైనవి. మన రాజ్యాంగ ప్రాథమిక భావనల్లో సమాఖ్యవాదం కూడా ఒకటని గుర్తుపెట్టుకోవాలి’’ అని ఆయన రాశారు.

‘‘రాష్ట్రం నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌ హోదాను ఏకపక్షంగా మార్చేశారు. ఈ నిర్ణయం ఎవరూ ఊహించనిది, పైగా దీన్ని సమర్థించేలా రాజ్యాంగంలోని ఏ నిబంధననూ చూపించలేం’’ అని ఆయన అన్నారు.

‘‘సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆమోదయోగ్యం అయ్యుండొచ్చు. కానీ, రాజ్యాంగ బద్ధంగా కాదు.’’ అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

కపిల్ సిబల్

ఫొటో సోర్స్, Getty Images

పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఏమన్నారు?

ఈ కేసులో పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్లలో కపిల్ సిబల్ కూడా ఒకరు.

ఈ తీర్పుపై ఆయన స్పందిస్తూ.. ‘‘చాలా మందికి ఈ తీర్పుతో కొత్త మార్గం తెరిచినట్లు అయింది. కానీ, కొంత మందికి మాత్రం ఇది హృదయాన్ని బద్దలుచేసే వార్త’’ అని అన్నారు.

‘‘ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకున్న తీరును సుప్రీం కోర్టు పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటిలానే ఈ తీర్పు కూడా వచ్చింది. నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు’’ అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ విషయంలో ప్రభుత్వ న్యాయవాదులు, మంత్రులు దీనికి పూర్తి భిన్నంగా స్పందిస్తున్నారు.

వీరంతా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఈ తీర్పు స్పష్టంచేసిందని వారు అంటున్నారు.

జమ్మూకశ్మీర్ ప్రజల హక్కులను సుప్రీం కోర్టు తీర్పుతో పరిరక్షించినట్లు అయిందని ప్రభుత్వానికి మద్దతు పలికేవారు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, గిల్గిట్ - బాల్టిస్తాన్ ప్రాంతానికి పూర్తిస్థాయి ప్రావిన్స్ హోదా

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్పారు?

ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన వారిలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒకరు.

ఆయన స్పందిస్తూ.. ‘‘సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది. చట్టపరమైన అంశాల్లో అద్భుతమైన నైపుణ్యం, చట్టాలను పరిరక్షించడం, జమ్మూకశ్మీర్ ప్రజల మౌలిక హక్కుల విషయంలో సున్నితత్వంతో వ్యవహరించడం.. లాంటి విషయాల్లో ఈ తీర్పు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని ఆయన చెప్పారు.

‘‘భారత దేశంలోని సుప్రీం కోర్టు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కోర్టు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడటం, రాజ్యాంగ విలువలను పరిక్షించడంతోపాటు న్యాయమైన హక్కులకు దూరమైన అక్కడి ప్రజలకు అన్ని హక్కులూ అందేలా చూడటంలో తాజా తీర్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ప్రధాని మోదీ: ‘#TheKashmir Filesపై కుట్ర జరుగుతోంది.. వాస్తవాలను అంగీకరించట్లేదు’

ప్రధాని, హోం మంత్రి ఏమన్నారు?

సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ట్విటర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

‘‘డిసెంబరు 11 నాటి ఈ తీర్పుతో ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి సుప్రీం కోర్టు బలం చేకూర్చినట్లైంది. నేడు జమ్మూకశ్మీర్‌లో పుట్టే ప్రతి చిన్నారిని తన భవిష్యత్తు గురించి అందమైన కలలు కనొచ్చు’’ అని ఆయన అన్నారు.

ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ- ‘‘ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఇక్కడి పేదలు, బలహీన వర్గాల హక్కులను పునరుద్ధరించినట్లు అయింది. అంతేకాదు, వేర్పాటువాదం, రాళ్లు రువ్వడం లాంటి ఘటనలు గతంలో కలిసిపోయాయి’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)