అరేబియా సముద్రంలో భారత్ మూడు క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలను ఎందుకు మోహరించింది?

 ఐఎన్ఎస్ మార్ముగో

ఫొటో సోర్స్, X / RAJNATH SINGH

ఫొటో క్యాప్షన్, ఐఎన్ఎస్ మార్ముగో: ఈ యుద్ద నౌకలో బ్రహ్మోస్ క్షిపణులు ఉంటాయి.
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైనట్టు అనుమానిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ చెమ్ ఫ్లుటో ముంబయి తీరానికి చేరుకుంది. భారత నౌకాదళంలోని పేలుళ్ళ నిరోధక బృందం దీనిపై ప్రాథమిక పరిశోధన మొదలుపెట్టింది.

ఈ నౌక లైబీరియన్ జెండాతో ప్రయాణించింది. దీని సిబ్బందిలో 21 మంది భారతీయులు, ఒక వియాత్నమీ ఉన్నారు.

దాడికి గురైన నౌకాభాగాన్ని, అక్కడ పడి ఉన్న శిథిలాలను పరిశీలించాక, ఇది డ్రోన్ ద్వారా జరిపిన దాడి అయ్యుండొచ్చని అనిపిస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది.

సౌదీ అరేబియా నుంచి భారత్‌లోని మంగుళూరుకు ఈ నౌక వస్తుండగా డిసెంబరు 23న అరేబియా సముద్రంలో దాడి జరిగింది.

వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఐఎన్ఎస్ మార్ముగో, ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ కోల్‌కతా అనే మూడు క్షిపణి విధ్వంసక నౌకలను భారత నౌకాదళం అరేబియా సముద్రంలో వేరు వేరు ప్రాంతాలలో మోహరించింది.

ఇంతకుముందు ఆఫ్రికా దేశమైన గాబన్ జెండాతో, చమురునిల్వలతో ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది.

ఈ నౌక 25 మంది భారతీయ సిబ్బందితో భారత్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ నౌకపై ఆదివారం డ్రోన్ దాడి జరగ్గా, అంతకుముందు నార్వే జెండాతో ప్రయాణిస్తున్న నౌకపైనా దాడి చేశారు.

గాబన్ నౌకపై దాడి జరిగినప్పుడు భారతీయ జెండాతో ఉన్న నౌకపై దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. భారతీయ నౌకపై దాడి జరిగినట్టు అమెరికా కూడా ప్రకటించింది.

కానీ తరువాత అది గాబన్‌కు చెందినదని భారత నౌకాదళం స్పష్టం చేసింది.

హుతీ తిరుగుబాటుదారులు గాబన్ నౌకపై దాడిచేసినట్టు అమెరికా సైన్యంలోని కేంద్రీయ కమాండ్ ప్రకటించింది.

ఇక డిసెంబరు 23 ఎంబీ చెమ్ ప్లూటో నౌక ఇరాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్ దాడికి గురైంది. కానీ ఇండియాకు వెళుతున్న నౌకపై తమ భూభాగం నుంచి ఎటువంటి దాడి జరగలేదని ఇరాన్ ప్రకటించింది.

యుద్ధ నౌకల మోహరింపు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత నౌకలపై దాడులకు పాల్పడినవారు సముద్రం అడుగున దాక్కున్నా కనిపెట్టి శిక్షిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

హుతీ తిరుగుబాటుదారుల హెచ్చరిక ఏమిటి?

ఎర్రసముద్రంలో యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులు చేస్తున్న సమయంలోనే ఇండియాకు వస్తున్న నౌకపై అరేబియా సముద్రంలో దాడి చోటుచేసుకుంది.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక ఇజ్రాయెల్‌కు వెళుతున్న నౌకలపై ఈ దాడులు మొదలయ్యాయి.

ఈ దాడుల తీవ్రతపై అమెరికా సెంట్రల్ కమాండ్ దృష్టి సారించింది. ఇటువంటి దాడులు అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతకు ముప్పు కలిగిస్తాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ట్వీట్ చేసింది.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేశాక, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ స్పందించినప్పటి నుంచి సముద్రమార్గంలో దాడులు మొదలయ్యాయి.

మొట్టమొదట నవంబర్ 21న ఇజ్రాయెలీ సరుకు రవాణా నౌక గెలాక్సీ లీడర్ దాడికి గురైంది. ఈ నౌక కూడా టర్కీ నుంచి భారత్‌కు వస్తోంది.

ఇరాన్‌కు మిత్రపక్షమైన హుతీ తిరుగుబాటుదారులు ఈ నౌకలోని 25 మందిని కిడ్నాప్ చేశారు.

ఆ సమయంలో హుతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ సలామ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలన్నింటికీ ఇదే గతి పడుతుందని చెప్పారు.

అంతకుముందు నౌకల నుంచి తమ పౌరులను వెనక్కి వచ్చేయాలని చెప్పాల్సిందిగా ఇజ్రాయెల్ మిత్రదేశాలను హుతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి హెచ్చరించారు.

డ్రోన్స్, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ఎలా ఉపయోగించాలో నేర్పడంతో పాటు వాటిని హుతీ తిరుగుబాటుదారులకు, హమాస్‌కు మద్దతుగా నిలుస్తున్న ఇరానే అందిస్తోందని చెబుతున్నారు.

కార్గో షిప్ ‘గెలాక్సీ లీడర్’పై నవంబర్ 25న దాడి జరిగాక, డిసెంబరు 3న రెండు ఇజ్రాయెలీ నౌకలు, మరో వాణిజ్య నౌక దాడికి గురయ్యాయి.

గడిచిన రెండు మూడు రోజులలోనే భారత్‌కు వస్తున్న నౌకలపై దాడులు చోటు చేసుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.

‘‘భారత్‌కు పెరుగుతున్న ఆర్థిక, వ్యూహాత్మక ప్రాబల్యాన్ని చూసి కొందరు అసూయపడుతున్నారు. అరేబియా సముద్రంలో ఎంవీ చెమ్ ప్లూటో, ఎర్రసముద్రంలో ఎంవీ సాయిబాబా అనే నౌకపై దాడులు జరగడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ దాడులకు పాల్పడినవారు సముద్రం అడుగున దాక్కున్నా కనిపెట్టి శిక్షిస్తాం’’ అని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే మూడు క్షిపణి విధ్వంసక నౌకలను అరేబియా సముద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారత్ మోహరించింది.

సముద్ర వాణిజ్యం

ఫొటో సోర్స్, GETTY IMAGES

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం అరేబియాకు పాకిందా?

‘‘హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడు అరేబియా సముద్రానికి పాకినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి యుద్ధ క్షేత్రాల తలుపులు తెరుచుకోవడం ఇండియాపై తీవ్రప్రభావం చూపుతుంది’’ అని భారత నౌకాదళానికి చెందిన ఓ సీనియర్ అధికారి బీబీసీకి తెలిపారు.

‘‘భారత్ ప్రభావితమవుతోందని చెప్పడానికి మూడు క్షిపణి విధ్వంస నౌకలను మోహరించడమే ఉదాహరణ. భారతదేశానికి సంబంధించిన అనేక ఎగుమతులు, దిగుమతులు ముంబయి, కోచి, మంగళూరు, గోవా, చెన్నై నుంచి సాగుతాయి. అందుకే ఇది భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశమే’’ అని చెప్పారు.

భారత వాణిజ్యం 80 శాతం మేర సముద్ర మార్గం నుంచే సాగుతుంది. దీనికి తోడు 90 శాతం చమురు సముద్రమార్గం గుండానే వస్తుంది.

ఈ పరిస్థితుల్లో సముద్రమార్గంపై దాడులు నేరుగా భారత వాణిజ్యానికి ముప్పు కలిగించేవే అవుతాయి.

ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఎర్రసముద్రం, సూయజ్ కాలువ ద్వారానే సాగుతోంది.

ఈ మార్గంలో ఎక్కడ సమస్య తలెత్తినా మొత్తం ప్రపంచ వాణిజ్యానికే ముప్పు వాటిల్లుతుంది.

యుద్ధ నౌకల మోహరింపు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇండియాపై ప్రభావమెంత?

భారత దేశ ఎగుమతులు, దిగుమతుల వాణిజ్యంలో అత్యధిక భాగం అరేబియా సముద్రం గుండానే సాగుతుంది. ముంబయి, కోచి, మంగళూరు, గోవా, చెన్నైతోపాటు ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్, మలేసియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాంతోపాటు చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియాకు అరేబియా సముద్రం మార్గం గుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయి.

ముందు హిందూ మహాసముద్రం, తరువాత అరేబియా సముద్రం, అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌కు, ఎర్రసముద్రం, అక్కడి నుంచి సూయజ్ కాలువ, ఆ తరువాత మధ్యధరా సముద్రం, అక్కడి నుంచి యూరప్, అక్కడి నుంచి నేరుగా జిబ్రాల్టర్ మీదుగా అట్లాంటిక్ మహాసముద్రంలోకి, అక్కడి నుంచి అమెరికా.. ఇలా ఉంటుందీ మార్గం.

ఈ మార్గంలో ఎక్కడైనా సమస్య ఎదురైతే మొత్తం మార్గమే మారిపోతుంది. దీని తరువాత మొత్తం సరుకునంతటినీ కేప్ ఆఫ్ గుడ్ హోప్‌కు తీసుకురావాల్సి వస్తుంది. ఇది వాణిజ్యమార్గం పొడవును 40 శాతం మేర పెంచుతుంది.

దీంతో ఇంధన వ్యయం పెరుగుతుంది. ఫలితంగా వాణిజ్య ఖర్చూ పెరుగుతుంది. ఇది భారత్‌పై పెద్ద ఆర్థిక భారాన్ని మోపుతుంది.

యుద్ధ నౌకల మోహరింపు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇండియాపై ఒత్తిడి పెంచేందుకేనా?

ఇంతకుముందు ఇజ్రాయెల్, దాని మిత్రదేశాల నౌకలపై దాడులు జరిగేవి. ఇప్పుడు ఇండియా నౌకలపైనా దాడులు మొదలయ్యాయి.

ఇండియాకు వస్తున్న నౌకలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపేలా ఒత్తిడి పెంచడానికే ఇలా చేస్తున్నారా?

హమాస్‌పై దాడులు ఆగేవరకూ, తామీ దాడులు కొనసాగస్తామని హుతీ తిరుగుబాటుదారులు చెప్పారు.

నిజానికి హమాస్, దాని అనుబంధ శక్తులు దాడులు ఆపాల్సిందిగా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.

ఇజ్రాయెల్ దాడులు ఆపేలా రష్యా, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఒత్తిడి ఇండియాపై కూడా పడింది.

భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగితే, ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఆగిపోవాలని భారత్ కోరుకుంటుందని వారు భావిస్తున్నారు.

భారత్‌కు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాడులు ఆపే కోణంలో తగిన చొరవ తీసుకోగలదు. ఈ వ్యూహంతోనే భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.

సముద్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

క్షిపణి విధ్వంస వాహక నౌకల సామర్థ్యం ఎంత?

ఐఎన్ఎస్ మార్ముగో యుద్ధనౌక నిర్మాణం 2016 సెప్టెంబర్‌లో మొదలైంది. 2021 డిసెంబర్ 19న ప్రయోగాత్మక పరిశీలన జరిపారు.

ఈ యుద్ధనౌకలో అత్యంత శక్తిమంతమైన సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఇవి శత్రువుల దాడులను పసిగట్టగలుగుతాయి.

ఈ యుద్ద నౌకలో ఉపరితలం నుంచి గగనంలోకి ప్రయోగించగలిగే మధ్యశ్రేణి క్షిపణులు, ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులు ఉంటాయి.

సముద్రంలో శత్రువుల జలంతర్గాములపై దాడులు చేసేందుకు ఇందులో దేశీయంగా తయారుచేసిన టార్పెడో ట్యూబ్ లాంచర్స్, రాకెట్ లాంచర్స్ ఉన్నాయి.

ఐఎన్ఎస్ కోచి బరువు 7,500 టన్నులు. 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 16 సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులతో నిండి ఉంటుంది.

న్యూక్లియర్, జీవ రసాయన యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా దీనిని అన్ని విధాలా సిద్ధం చేసినట్టు నేవీ తెలిపింది.

శత్రువుల దాడులను పసిగట్టగల అధునాత నిఘా రాడర్ వ్యవస్థ దీని సొంతం. దీంతోపాటుగా 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్, ఏకే 630లను ఇందులో చేర్చారు. ఇందులో సీ కింగ్, చేతక్ అనే రెండు హెలికాప్టర్లు కూడా ఉంటాయి.

ఐఎన్ఎస్ కోల్‌కతా 164 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది ఐదంతస్తుల భవనమంత ఎత్తుగా ఉంటుంది. మొదటిసారి త్రీ డీ రాడార్‌ను యుద్ధనౌకలో నౌకాదళం ఉపయోగించింది.

ఇందులో బ్రహ్మోస్ క్షిపణులు, 76ఎంఎం గన్, రెండు రాకెట్ లాంచర్లు, యాంటీ సర్ఫేస్ గన్, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్, సబ్‌మెరైన్ డిటెక్టర్, నాలుగు టోర్పెడోస్ కూడా ఉన్నాయి.

హుతీలు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ‘‘అమెరికా నశించాలి, ఇజ్రాయెల్ నశించాలి, యూదులు అంతమవ్వాలి, ఇస్లాం గెలవాలి’’ అన్నది హుతీల నినాదం.

హుతీల లక్ష్యం ఏమిటి?

యెమెన్‌లో మైనార్టీలైన షియా జైదీ కమ్యూనిటీకి చెందిన సాయుధ బృందాలే హుతీలు. 1990లో అప్పటి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సాలెహ అవినీతికి వ్యతిరేకంగా ఈ గ్రూపు ఏర్పడింది.

ఇదీ దీని వ్యవస్థాపకుడు హుస్సేనీ అల్ హుతీ పేరుతో ఏర్పడింది.

‘‘అమెరికా నశించాలి, ఇజ్రాయెల్ నశించాలి, యూదులు అంతమవ్వాలి, ఇస్లాం గెలవాలి’’ అన్నది హుతీల నినాదం.

ఇజ్రాయెల్‌,అమెరికా, పశ్చిమదేశాలకు వ్యతిరేకంగా హమాస్, హిజ్బుల్లాతోపాటు ఇరాన్ నేతృత్వంలోని ప్రతిఘటన కూటమిలో తాము భాగమని చెబుతారు హుతీలు.

హుతీలు గల్ఫ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్ళే నౌకలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో వారి ప్రకటనే చెబుతోందని యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పీస్‌కు చెందిన నిపుణుడు హిషమ్ – అల్-ఒమైసీ చెప్పారు.

‘‘నిజానికి వారు వలసవాదులకు, ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకులతో వారు పోరాడుతున్నారు. అని చెప్పారు.

నౌకలపై దాడులు

ఫొటో సోర్స్, REUTERS

హుతీ తిరుగుబాటుదారులకు సాయం చేస్తున్నదెవరు?

లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బొల్లా నుంచి హుతీ తిరుగుబాటుదారులు స్ఫూర్తి పొందారు.

2014 నుంచి హిజ్బొల్లా హుతీ తిరుగుబాటుదారులకు యుద్ధ నైపుణ్యాలతోపాటు పెద్ద ఎత్తున శిక్షణ అందిస్తోందని అమెరికా పరిశోధనా సంస్థ కంబాటింగ్ టెర్రరిజం సెంటర్ తెలిపింది.

హుతీలు ఇరాన్‌ను తమ మిత్రుడిగా చెపుతాయి. ఎందుకంటే వీరి ఉమ్మడి శత్రువు సౌదీ అరేబియానే.

హుతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ ఆయుధాలు సమకూర్చుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఎర్రసముద్రానికి చెందిన అతిపెద్ద తీరప్రాంతంపై హుతీలకు నియంత్రణ ఉంది. ఇక్కడి నుంచి వారు నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

సౌదీ అరేబియాతో జరుగుతున్న శాంతి చర్చలలో హుతీలు పై చేయి సాధించేందుకు ఈ దాడులు ఉపయోగపడ్డాయని హిషమ్ అల్ ఒమైసీ చెప్పారు.

‘‘ఎర్రసముద్రం దారిని మూసివేయగలమని చూపడం ద్వారా ఈ గ్రూపు సౌదీ అరేబియా నుంచి రాయితీలు పొందేందుకు వారు ఒత్తిడి చేయగలుగుతున్నారు’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)