అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది

అరపైమా గిగాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పైచే చేప నాలుగు మీటర్ల పొడవు, 200 కిలోల బరువు వరకు పెరుగుతుంది
    • రచయిత, బాబ్ హోవర్డ్
    • హోదా, బీబీసీ పాడ్‌కాస్ట్: క్రాసింగ్ కాంటినెంట్స్

గులెర్మో ఒట్టా పరుమ్ అనే వ్యక్తి 50 ఏళ్లుగా బొలివియన్ ఆమెజాన్‌లో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు.

మొదట్లో ఆయన నదిలో ఉండే రకరకాల క్యాట్‌ఫిష్‌లను పట్టుకునేవారు.

కానీ, ఆ తర్వాత ఆ నీటిలోకి ఒక భారీ చేప వచ్చింది. స్థానికంగా ఆ చేపను పైచ్ ( శాస్త్రీయంగా అరపైమా గిగాస్) అని పిలుస్తారు.

‘‘ఈ జీవిని మొదటగా నేను నీళ్ల పాము అనుకున్నా. అన్నింటిపై ఇది దాడి చేస్తుందని భావించా. దాన్ని తింటే హాని కలుగుతుందేమో అని, అది విషపూరితం కావొచ్చని అనుకున్నా’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

నిజానికి ఇది ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి చేపల్లో ఒకటి. 4 మీ పొడవు(సుమారు 13 అడుగులు) వరకు పెరుగుతుంది. 200 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటుంది.

పైచ్ చేప
ఫొటో క్యాప్షన్, గిలెర్మో 50 ఏళ్లుగా చేపల్ని వేటాడుతున్నారు

ఈ చేప పరిమాణం, దానికి ఉండే ఆకలి స్థానిక చేపలకు తీవ్ర ముప్పుగా మారుతుందని బెనీ అటానమస్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ అక్వాటిక్ రీసోర్సెస్ రీసెర్చ్ డైరెక్టర్ ఫెడరికో మొరెనో చెప్పారు.

‘‘ఈ చేప స్థానిక చేప జాతుల్ని భయపెడుతుంది. దీంతో వచ్చే పెద్ద సమస్యల్లో ఇదొకటి’’ అని ఆయన అన్నారు.

బొలీవియాలో పైచ్ మొదట ఎప్పుడు కనిపించిందో కచ్చితంగా ఎవరికీ తెలియదు.

పెరూ నుంచి బొలీవియా నదుల్లోకి ఈ చేపలు వచ్చినట్లు నమ్ముతారు.

పైచే చేప
ఫొటో క్యాప్షన్, బయాలజిస్ట్ ఫెర్నాండో కార్వజల్ ఏళ్ల పాటు పైచే చేపల మీద అధ్యయనం చేశారు

పైచే చేపలకు విపరీతమైన ఆకలి వేస్తుందని బయాలజిస్టు, నిపుణుడు ఫెర్నాండో కార్వజల్ చెప్పారు.

‘‘పుట్టిన తొలి ఏళ్లలో పైచే చేపలు ఏడాదికి 10 కిలోల చొప్పున బరువు పెరుగుతాయి. అంటే అవి బాగా ఇతర చేపల్ని తింటున్నాయని అర్థం’’ అని ఆయన అన్నారు.

పీక్కుతినే పిరానా చేపల్లా కాకుండా పైచ్ చేపలకు చిన్న దంతాలు ఉంటాయి. ఎక్కువ పదునుగా కూడా ఉండవు.

పళ్లు పదునుగా లేకపోవడం తిండి విషయంలో వాటికి అడ్డంకి కాదు. పిరానా చేపలతో పాటు స్థానికంగా ఉండే ఇతర చేపలు, మొక్కలు, మొలస్క్‌, పక్షులను ఒక పెద్ద వాక్యుమ్ క్లీనర్‌లాగా ఈ చేపలు మింగేస్తాయి.

తమ పిల్లల్ని తినేందుకు ప్రయత్నించే ఇతర చేపల్ని కూడా పైచే చేపలు భయపెడతాయి.

ఇతర చేప జాతులపై పైచే చూపిస్తోన్న ప్రభావం గురించి కచ్చితమైన డేటా అందుబాటులో లేదని ఫెర్నాండో చెప్పారు.

కానీ, స్థానిక చేప జాతులు తగ్గిపోతున్నట్లు అక్కడ చేపలు పట్టేవారు చెబుతున్నారని ఆయన అన్నారు.

పైచే చేప
ఫొటో క్యాప్షన్, పైచే చేపల వేటకు వెళ్తోన్న పడవ

‘‘వచ్చే ఒకటి లేదా రెండు దశాబ్దాల్లో ఈ పైచే చేపలు అవి జీవించడానికి అనుకూలంగా ఉన్న అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి’’ అని ఆయన హెచ్చరించారు.

ఇతర ప్రాంతాల్లో దండెత్తే జాతులను జీవ వైవిధ్యం దెబ్బతినడానికి రెండో కారణంగా చెబుతుంటారు.

అయితే, స్థానిక మత్స్యకారులకు మాత్రం పైచే చేపల రాక ఒక వరంలా మారింది.

పైచే చేపల్ని చూసి మొదట భయపడినప్పటికీ, తర్వాత వాటి సామర్థ్యాన్ని గ్రహించడానికి మత్స్యకారులకు పెద్ద సమయం పట్టలేదని గులెర్మో అన్నారు.

‘‘నాకు పైచే చేప తొలిసారి దొరికినప్పుడు, దాన్ని చిన్న చిన్నముక్కలు చేసి కస్టమర్లకు బహుమతిగా ఇచ్చాను. వారు దాని రుచి చూస్తారనే ఉద్దేశంతో ఇలా చేశాను’’ అని ఆయన చెప్పారు.

ఇప్పుడు బొలీవియా అంతటా పైచే చేపను తింటారు.

బ్రెజిలియన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈశాన్య బొలీవియాలోని రిబెరాల్టాలో ఎడ్సన్ సుజానో ఒక పైచే ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నడుపుతున్నారు.

పైచే చేప
ఫొటో క్యాప్షన్, తక్కువ ధరకే పైచే లభిస్తుందని ఎడ్సన్ సుజానో (ఎడమ) అన్నారు

‘‘మార్కెట్లు, సూపర్‌మార్కెట్లు ఇలా అంతటా దీన్ని అమ్ముతాం. నెలకు 30 వేల కిలోల చొప్పున ఈ చేపల ప్రాసెసింగ్ జరుగుతుంది’’ అని ఎడ్సన్ తెలిపారు.

భారీ విస్తీర్ణంలో ఉన్న ఆమెజాన్‌ నదిలో పైచే చేపను పట్టుకోవడం మత్స్యకారులకు పెద్ద సవాలు.

పైచే చేపకు ఊపిరితిత్తుల వంటి నిర్మాణం ఉంటుంది. తాజా గాలి కోసం ఇది తరచుగా నీటి ఉపరితలానికి వస్తుంది. ప్రశాంతమైన నీటిని ఇది ఇష్టపడుతుంది.

సరస్సులు, మడుగుల్లో నివసించడం అంటే దీనికి ఇష్టం. కానీ, ప్రమాదం ఉన్నట్లు భావించినప్పుడు వెంటనే అక్కడి నుంచి వలసపోతుంది.

పైచే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు పైచే చేపలు వలసపోతాయి

పడవల ద్వారా రవాణా అయిన చేపల్ని ఎడ్సన్ ప్రాసెసింగ్ చేసేవారు.

ఇప్పుడు పైచే చేపను పట్టడం కోసం మత్స్యకారులు మరింత మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. వాటిని పడవల నుంచి కనోయిలకు తరలించాల్సి వస్తోంది. మత్స్యకారులు ఇలా చేయడం వల్ల స్థానిక కమ్యూనిటీలతో వారికి విభేదాలు తలెత్తుతున్నాయి.

పైచే చేపలు దొరికే చాలా మారుమూల సరస్సులు, మడుగుల హక్కుల్ని ఈ కమ్యూనిటీలకు అందించారు. వారు కూడా చేపల్ని పట్టడం, అమ్మడం మొదలుపెట్టారు.

పైచే చేప
ఫొటో క్యాప్షన్, రిబెరల్టా చేపల మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధమవుతున్న పైచే చేప

ఇప్పుడు వాణిజ్య మత్స్యకారులు ఈ ప్రాంతాల్లో చేపలు పట్టడానికి ప్రత్యేక లైసెన్సులను పొందాలి.

కానీ, సరైన పత్రాలు ఉన్నప్పటికీ తమను చేపలు పట్టేందుకు అనుమతించట్లేదని గిలెర్మో వంటి మత్స్యకారులు చెప్పారు.

బొలీవియా ప్రభుత్వం కల్పించిన హక్కు ప్రకారమే, తాము వనరులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నామంటూ స్థానిక కమ్యూనిటీలు వాదిస్తున్నాయి.

పైచే
ఫొటో క్యాప్షన్, జువాన్ కార్లోస్ ఆర్టిజ్ చావెజ్

జువాన్ కార్లోస్ ఆర్టిజ్ చావెజ్ అనే వ్యక్తి ఆల్టో ఇవోన్ కో చాకోబా అనే ఆదివాసీ కమ్యూనిటీకి చెందినవారు.

గతంలో వాణిజ్య మత్స్యకారులంటే ఆదివాసీలు భయపడేవారని ఆయన చెప్పారు.

‘‘కానీ, కొత్త తరం యువకులు మారారు. మా వనరుల్ని తీసుకెళ్లకుండా మేం నిబంధనల్ని రూపొందించాం’’ అని ఆయన తెలిపారు.

‘‘పైచే చేపల్ని నిరంతరం వేటాడండి. అలా చేయడం వల్ల ఇతర జాతుల మధ్య సమతుల్యం ఉంటుంది’’ అని శాస్త్రవేత్త ఫెడెరికో మోరెనో అన్నారు.

వీడియో క్యాప్షన్, అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)