వ్యూహం: 'నన్ను చంపడానికి పబ్లిగ్గా కాంట్రాక్ట్ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి' -డీజీపీకి రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు

ఫొటో సోర్స్, TWITTER
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఆంధ్రప్రదేశ్ అనే సమాజానికి, పంటకు పట్టిన చీడ రాంగోపాల్ వర్మ. ఈ రాంగోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తా’’ అంటూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 న్యూస్ చానల్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమయ్యాయి.
డిసెంబర్ 26న జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో యాంకర్ సాంబశివరావు ఆయనను ఈ వ్యాఖ్యలను ‘‘విత్ డ్రా (వెనక్కి తీసుకోవాలి) చేసుకోవాలి’’ అని కోరారు. ‘‘చట్ట ప్రకారమే డిబేట్ చేద్దాం’’ అని కూడా చెప్పారు. కానీ, కొలికపూడి మాత్రం, ‘‘ఐ రిపీట్’’ అంటూ మళ్లీ మళ్లీ అవే మాటలు అన్నారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయి దూషణలు, బెదిరింపులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో వ్యక్తిగత దూషణలు చేశారు.
ఇప్పుడు మరోసారి వ్యూహం సినిమా వ్యవహారంలో ఆర్జీవీపై కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఫొటో సోర్స్, TV5 YOUTUBE
ఎలా మొదలైంది...
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘‘వ్యూహం’’ సినిమా తెరకెక్కింది. ఇది ఈ నెల 29న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.
సినిమాలో చూపించిన పాత్రలు ఏపీ రాజకీయాల చుట్టూ తిరుగుతుంటాయి. సినిమాలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పాత్రను బాగా చూపించి.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ పాత్రలను చులకన చేసి చూపించారనే ఆరోపణలున్నాయి.
సినిమా ట్రైలర్ విడుదలయ్యాక గత వారం కొందరు టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టారు. ఫ్లెక్సీలను తగులబెట్టారు. అందుకు సంబంధించినదని చెబుతూ ఆర్జీవీ ఒక వీడియోను ఎక్స్ (గతంలో ట్విటర్)లో పోస్టు చేశారు.
అంతకుముందు, గేదెలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ముఖాలున్న ఫొటోలను అతికించి ఒక పోస్టర్‌ను కూడా ఈ దర్శకుడు పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సినిమా విడుదలపై కోర్టులో లోకేష్ పిటిషన్
వ్యూహం సినిమా విడుదల నిలిపివేయాలని నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని హైకోర్టును కోరారు. సినిమాటోగ్రఫీ చట్టం-1952 సెక్షన్-5(బీ), 1991 రివైజ్డ్ నిబంధనలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారని లోకేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ సినిమాలో లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా పాత్రలు సన్నివేశాలున్నాయని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని లోకేష్ తరఫున న్యాయవాది మురళీధర్ వాదించారు.
సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరినా, న్యాయస్థానం నిరాకరించింది.
దీనిపై డిసెంబరు 26న విచారించి ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంపై మరోసారి డిసెంబరు 28న తెలంగాణ హైకోర్టు విచారించింది.
సినిమాలో అభ్యంతరక సన్నివేశాలు ఉన్నాయని లోకేష్ తరఫు న్యాయవాదులతో ఏకీభవించిన న్యాయస్థానం, జనవరి 11వరకు సినిమా విడుదలను నిలిపివేసింది.
అప్పటివరకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ కూడా రద్దు చేస్తున్నట్లు జస్టిస్ సూరేపల్లి నంద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఫొటో సోర్స్, NARALOKESH/FB
అంతకుముందు, నిర్మాత కిరణ్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సినిమాను చూడకుండా కేవలం ట్రైలర్ ఆధారంగా చిత్రాన్ని నిలిపివేయాలని కోరడం సరికాదన్నారు. అలాగే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేశాక న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని సెన్సార్ బోర్డు తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపించారు.
వీటిన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం, గతంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా వ్యూహం మూవీ విడుదల చేయడం సరికాదని, సినిమా ప్రదర్శన జనవరి 11వరకు ఆపాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేసును అదే రోజుకు వాయిదా వేసింది.
ఈ సినిమా విడుదలను ఆపాలని కోరుతూ నారా లోకేష్ అంతకుముందు హైదరాబాద్ సిటి సివిల్ కోర్టులోనూ పిటిషన్ వేశారు.
దీనిపై విచారించిన సిటి సివిల్ కోర్టు.. థియేటర్, ఓటీటీ, ఇంటర్నెట్ సహా ఎక్కడా సినిమాను విడుదల చేయొద్దని ఆదేశించింది.
సినిమా నిర్మించిన రామదూత క్రియేషన్స్ సంస్థ, నిర్మాత దాసరి కిరణ్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
వివాదం ఏంటి?
వ్యూహం సినిమాపై కోర్టులో వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే ‘‘ఆర్జీవీ@పరాన్నజీవి’’ అనే పేరుతో డిసెంబరు 26న టీవీ5 ఛానెల్ చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చలో పాల్గొన్న కొలికపూడి శ్రీనివాస రావు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పంటకు చీడ పడితే కూలీలను పెట్టి తీయిస్తారు. ఆంధ్రప్రదేశ్ సమాజం అనే పంటకు పట్టిన పీడ రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ తలను నరికి తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తా’’ అంటూ వ్యాఖ్యానించారు.
‘‘దళితనాయకుడి మీద అలాంటి సినిమా తీస్తే రామ్ గోపాల్ వర్మను ఇంట్లో పెట్టి తగలపెడతాం’’ అని కూడా అదే కార్యక్రమంలో అన్నారు.
ఆ తరువాత బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌లో జరిగిన డిబేట్‌లో పాల్గొన్న శ్రీనివాస రావు, ‘‘ఆయన(ఆర్జీవీ) తలకు ఎక్కువ (కోటి రూపాయలు) పెట్టారంటూ చాలా మంది స్పందించారు’’ అని మరొకసారి వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.

ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆర్జీవీ
కొలికపూడి వ్యాఖ్యలపై వ్యూహం చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు ఛానెల్ యాంకర్, యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ముందుగా డిసెంబరు 26న ఎక్స్ వేదికగా ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. దాన్నే అధికారిక ఫిర్యాదుగా స్వీకరించాలని కోరారు.
ఇందులో కొలికపూడి శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఆ తర్వాత చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో కలిసి డిసెంబరు 27న ఏపీ డీజీపీని కలిసి ఆర్జీవీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
‘‘టీడీపీకి సంబంధించిన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 ఛానల్ యాంకర్ సాంబశివ రావు, ఆ ఛానల్ యజమాని బి.ఆర్.నాయుడు మీద ఇది నా కంప్లైంట్. ఇవి వాస్తవాలు. శ్రీనివాసరావు లైవ్ టీవీ లో నన్ను చంపి నా తలను తీసుకువచ్చినవాడికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ ఇచ్చాడు. ఇదే కాకుండా, నన్ను నా ఇంటి కొచ్చి తగలబెడతానని కూడా పబ్లిగ్గా టీవీలో చెప్పాడు. నివారిస్తున్నట్టు నటిస్తూనే యాంకర్ సాంబశివరావు, మూడు సార్లు నన్ను చంపే కాంట్రాక్ట్ శ్రీనివాస రావుతో రిపీట్ చేయించాడు. ఆ తరువాత కూడా శ్రీనివాసరావుతో సాంబశివరావు చర్చ కొనసాగించాడు’’ అని ఫిర్యాదులో ఆర్జీవీ పేర్కొన్నారు.
‘‘ఇదంతా తన ఛానల్‌లో జరిగినా సాంబశివరావును ఉద్యోగం నుంచి తీసేయలేదు కాబట్టి, ఆ చానల్ యజమాని బి.ఆర్.నాయుడు కూడా ఈ కుట్ర లో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి, పై ముగ్గురి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని కూడా ఆర్జీవీ రాశారు.
ఫిర్యాదు తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన,‘‘వ్యూహం అనే సినిమా పొలిటికల్ కామెంట్, పొలిటికల్ ఒపినియన్. కంటెంట్ అనేది చెప్పడానికి నాకే కాదు, ఎవరికైనా రైట్ ఉంటుంది. అది న్యూస్ పేపర్ లో రాయొచ్చు. టీవీ ఛానెల్ డిబేట్ లో మాట్లాడవచ్చు. సినిమా తీయొచ్చు.. అదే నేను చేస్తున్నది’’ అని అన్నారు.

తెలంగాణలో జరిగితే, ఏపీలో ఫిర్యాదు చేయొచ్చా..?
హైదరాబాద్‌లోని టీవీ5 చానెల్ స్టూడియోలో మాట్లాడుతూ కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్‌లో ఫిర్యాదు చేశారు. అలా చేయవచ్చా అనే అంశం కూడా చర్చలోకి వచ్చింది.
అయితే, ఇలాంటి ఫిర్యాదుల మీద కేసు నమోదు చేయవచ్చని తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది చింతపల్లి లక్ష్మీనారాయణ బీబీసీతో అన్నారు.
‘‘టీవీ చానెల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయడానికి వీలుంటుంది. దీన్ని సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేయొచ్చు. ప్రేరేపించినందుకు నిర్వాహకులపైనా కేసు నమోదు చేసేందుకు వీలుంటుంది. తెలంగాణలో ఘటన జరిగినప్పటికీ, ఏపీలో కేసు నమోదు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. రాంగోపాల్ వర్మ ఏపీలో ఫిర్యాదు ఇచ్చినందున అక్కడ కేసు పెట్టేందుకు వీలుంటుంది" అని లక్ష్మీనారాయణ అన్నారు.
దేశంలో ఎక్కడైనా కేసు నమోదు చేసేందుకు వీలు కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పిందన్న సంగతిని ఆయన గుర్తు చేశారు.
అయితే, ఈ విషయంపై సుమోటోగా కేసు నమోదు చేయవచ్చా అనే ప్రశ్న కూడా వినిపించింది. దీనిపై రిటైర్డ్ ఏఎస్పీ బి.రెడ్డన్న బీబీసీతో మాట్లాడుతూ, "కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయడానికి వీలు కాకపోవచ్చు. దానికి సంబంధించి ఏదో ఒక ఆధారాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. ఆధారాలు చూపించలేని పక్షంలో వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయడం సాధ్యం కాదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, FACEBOOK
తన వ్యాఖ్యలపై కొలికపూడి ఏమన్నారంటే..
వివాదాస్పద వ్యాఖ్యల గురించి వివరణ అడిగించేందుకు కొలికపూడి శ్రీనివాసరావుకు బీబీసీ ఫోన్ చేసినప్పుడు, ‘‘నేను వేరొక పనిలో ఉన్నాను. మళ్లీ ఫోన్ చేస్తా’ అనిఆయన బదులిచ్చారు.
కొలికపూడి శ్రీనివాస రావు చుట్టూ గతంలోనూ వివాదాలున్నాయి. 2021 ఫిబ్రవరిలో ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డిపై చెప్పు దాడి చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ నడిచింది.
‘‘నేను ఎవరో తెలియకుండా నన్ను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని విష్ణు ఆరోపించారు. పెయిడ్ అర్టిస్టు అనేసరికి క్షణికావేశంలో కొట్టాల్సి వచ్చింది.’’ అని అప్పట్లో శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు.
ఈ వివాదంపై టీవీ5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు, ‘‘అది లైవ్ ప్రోగ్రామ్. ఆర్జీవీ తీసిన సినిమా వ్యూహంపై చర్చ కోసమని ముగ్గుర్ని పిలిచాం. కార్యక్రమంలో మాట్లాడుతున్న క్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు ఆ కామెంట్స్ చేశారు. అలా మాట్లాడతారని ఊహించలేదు. అలా మాట్లాడవద్దని, అలాంటి పదాలు వాడవద్దని మూడు నాలుగు సార్లు వారించాను" అని బీబీసీతో చెప్పారు.
ఏదిఏమైనా, ఆయన చేసిన కామెంట్స్ ను మేం ఏమాత్రం ఆమోదించడం లేదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- ఎర్ర సముద్రం: సూయజ్ కెనాల్ ఎక్కడ ఉంది? ఈ రూట్లో నౌకలపై దాడులు జరిగితే ప్రపంచం అంతా టెన్షన్ ఎందుకు?
- మెర్తిర్ టిడ్‌ఫిల్: ‘వయగ్రా’ కు జన్మనిచ్చిన ఊరు ఇదే, ఆ మగవాళ్లే లేకుంటే ఏం జరిగేది?
- అటల్ బిహారీ వాజపేయి: ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?,
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














