మీ జీవితానికి మిమ్మల్ని ‘సూపర్ హీరో’ను చేసే ఏడు లక్షణాలు

విజయానికి ఏడు అడుగులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, విజయానికి ఏడు అడుగులు
    • రచయిత, బీబీసీ ముండో
    • హోదా, .

మీ జీవితానికి పరమార్థం ఏంటి? నిపుణులు చెబుతున్న చిన్న చిన్న సలహాలు దీనిని తెలుసుకోవడంలో ఉపయోగపడవచ్చు.

ఎలాంటి పరిస్థితులనైనా క్షణాల్లో మార్చేయగల అసాధారణ, అతీంద్రియ శక్తులున్న కథానాయకుడు మనకు హ్యారీ పాటర్, స్టార్‌వార్స్, బ్యాట్‌మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి సినిమాల్లో కనిపిస్తాడు. వీరంతా సినిమాలు, కామిక్ కథలు, నవలల్లోనే ఉంటారు.

అయితే తమ జీవితాల్లో ఇలాంటి సాహసాలు చేయాలని భావించేవారు, తమలో కొంత నిరాశ ఉందని, తాము ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా ఉండాలని కోరుకుంటున్నట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రచురించిన అధ్యయనం చెబుతోంది.

మీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నారో, దాన్ని అలా మలచుకునే మార్గం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని మీరొక సూపర్ ‌హీరోగా భావించండి. మీ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతోనే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించే హీరోగా ఎదిగి వాటిని అధిగమించవచ్చు.

“ఒక ప్రత్యేక మార్గంలో మీ జీవితం గురించి ఆలోచించడం అనేది చాలా శక్తిమంతమైనదని మేం చెబుతాం. అప్పుడే వాళ్లు సమస్యల్ని ఉన్నతంగా ఎదుర్కొనే మార్గాలతో ముందుకొస్తారు. వాటి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి” అని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో సోషల్ సైకాలజీ ప్రొఫెసర్ కుర్త్ గ్రే, బీబీసీతో చెప్పారు.

ఆ ఏడు అడుగులు ఏమిటి?

మొదట ఓ చిన్న సందర్బం

అతీంద్రియ శక్తులున్న సూపర్ హీరో వర్ణన కొత్తదేమీ కాదు.

దీన్ని మొదట 1940లో జోసెఫ్ క్యాంప్‌బెల్ గుర్తించారు. మతాలకు సంబంధించిన పురాణాల అధ్యయనంలో భాగంగా తాను కనుక్కున్న దాన్ని ఆయన తనకు తానే సమర్పించుకున్నారు.

“ద హీరో విత్ థౌజండ్ ఫేసెస్” నాటకాన్ని రాసిన జోసెఫ్ క్యాంప్‌బెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘ద హీరో విత్ థౌజండ్ ఫేసెస్’ నాటకాన్ని రాసిన జోసెఫ్ క్యాంప్‌బెల్

క్యాంప్‌బెల్ మీద సైకాలజిస్ట్ కార్ల్ యంగ్ ప్రభావం ఉంది.

కార్ల్ యంగ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు.

“మనుషులు తమను సంతృప్తి పరిచే అంశాల కోసం తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్నదాన్ని గమనిస్తుంటారు” అని ‘ద హీరో విత్ థౌజండ్ ఫేసెస్’లో క్యాంప్ బెల్‌ రాశారు.

ఆయన పుస్తకాలు, పరిశోధనలను అనేక మంది వాస్తవికవాదులు పరిస్థితులకు అన్వయించి చూశారు. వాటిని వివిధ రకాల నిపుణులు రోజూ ఏదో ఒక విధంగా ఉపయోగిస్తున్నారు.

నిజ జీవితంలో ‘అతీంద్రియ శక్తులున్న ఒక సూపర్ హీరోలా’ సమస్యలను ఎదుర్కొనేందుకు క్యాంప్‌బెల్ 17 అంశాలను ప్రస్తావించారు. అయితే ఆయన రచనలను అధ్యయనం చేసిన గ్రే, కార్రోల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎట్ బాస్టన్ కాలేజ్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్ బెంజమిన్ రోజర్స్, ఇతర పరిశోధకులు ఈ 17 అంశాలను ఏడుగా సంక్షిప్తీకరించారు.

ఈ పరిశోధనకు “సీయింగ్ యువర్ స్టోరీ యాజ్ ఎ ‘హీరోస్ జర్నీ’ ఇంక్రీజెస్‌ ద మీనింగ్ ఆఫ్ లైఫ్” అని పేరు పెట్టారు.

1. ఓ కథానాయకుడు (అది మీరే)

2. పరిస్థితుల్లో మార్పు (మీ జీవితంలో ఏదైనా జరిగినప్పుడు, ఉదాహరణకు మీరు తలపెట్టిన సాహస కార్యక్రమం ఏదైనా మీరు అనుకున్నట్టు జరగనప్పుడు)

3. పరిష్కారం కోసం అన్వేషణ (సమాధానాల కోసం ప్రయత్నించడం, మీరు ఆ సమస్య నుంచి ఎలా బయటపడగలరు)

4. మద్దతుదారులు (మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు అండగా నిలిచేవారు ఎవరైనా కావచ్చు)

5. సవాళ్లు (మీకు ఎదురయ్యేవి కావచ్చు)

6. వ్యక్తిగతంగా మార్పు (లక్ష్య సాధన కోసం మీరు నేర్చుకునేవి)

7. అంతిమ ఫలితం (మీరు తీసుకునే నిర్ణయాలే మీ చుట్టూ ఉండే పరిస్థితులకు కారణం)

వారికే ఎక్కువ ఆనందం, తక్కువ ఆందోళన

అమెరికాలోని 1,200 మంది జీవితాల మీద నాలుగు విడివిడి అధ్యయనాలు చేసిన తర్వాత పరిశోధకులు వారి జీవితాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

తర్వాత వారి జీవితంలో ‘కథానాయకుడి’కి సంబంధించిన ఏడు అంశాలను పరిశీలించారు.

“తమ దైనందిన జీవితంలో ఎక్కువ అంశాలు ఉన్నవారు మరింత అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు మేం గుర్తించాం. వారు ఎక్కువ ఆనందంతో తక్కువ ఆందోళనతో ఉన్నారు” అని పరిశోధకులు అమెరికన్ సైంటిఫిక్ జర్నల్‌లో పొందు పరిచారు.

బలమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న “హీరోయిక్” వ్యక్తులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బలమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న “హీరోయిక్” వ్యక్తుల్లో మీరూ ఒకరు కావొచ్చు.

హీరోయిక్ పీపుల్‌ ఎలా ఉంటారు?

ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో మిగతా వారితో పోలిస్తే హీరోయిక్ పీపుల్‌లో కొత్త సాహసాలు చెయ్యడం, బలమైన లక్ష్యాలు, మంచి స్నేహితుల బృందం లాంటి అంశాల్లో తమ గురించి తమకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది.

తర్వాత పరిశోధకులు ‘పునరుద్దరణ’ ప్రక్రియను అభివృద్ధి చేశారు. వారి గురించి మళ్లీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి వారిని కథానాయకుడిగా నిలబెట్టిన అంశాల మీద దృష్టి పెట్టారు.

ఈ ప్రక్రియ పని చేసిందని మేము నిర్ధరించుకున్నాం. ఇది ప్రజలు తమ జీవితాల్లో కథానాయకుడిని చూసేందుకు సాయపడింది. ఇదే వారి జీవితాలను మరింత అర్థవంతంగా మార్చింది.

ఈ ఏడు అంశాల గురించి తెలుసుకుని ఆచరించిన వారు తాము మెరుగైన స్థితికి చేరుకోవడంతోపాటు, వ్యక్తిగతంగా ఎదురయ్యే సవాళ్లతో పోరాడటంలో మరింతగా రాటుదేలినట్లు అధ్యయనం తెలిపింది.

జీవితాన్ని సానుకూల దృక్ఫథంతో చూడండి

ఈ టెక్నిక్‌తో “మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, మిమ్మల్ని మీరు హ్యారీపాటర్‌గా ఊహించుకోకండి” అని వాళ్లు ప్రజలకు చెప్పడం లేదని విద్యావేత్త కుర్త్ గ్రే, బీబీసీతో చెప్పారు.

“మీరు ఊహాలోకంలో ఉన్నట్లు ఊహించుకోండి అని మేము మీతో చెప్పడం లేదు. మీరు మీ జీవితాన్ని మరో కోణం నుంచి చూడండి అని మాత్రమే మేము చెబుతున్నాం” అని ఆయన అన్నారు.

ఇందుకు ఈ పరిశోధకుడు తేలికైన ఉదాహరణ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటంటే- రాత్రి మీ పిల్లలు ఏడవడం వల్ల మీకు నిద్రాభంగం అయ్యిందనుకోండి. అప్పుడు దీని గురించి బాధ పడకుండా, ఒక తండ్రిగా లేదా తల్లిగా నా పిల్లలను ప్రయోజకులను చేయాలి అని మీకు మీరు చెప్పుకోండి. ఇలాంటి సందర్భాల్లో ఇలా సానుకూల దృక్పథంతో ఆలోచించడం ఫలితాన్ని ఇస్తుంది.

దీనిని మీ జీవితాన్ని కొత్తగా మార్చుకోవడం లేదా, పునరుద్దించుకోవడం అనుకోవచ్చని కుర్త్ గ్రే చెప్పారు.

మెదడులో ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడం, స్ఫూర్తి పొందడం చాలా తేలిక అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

దీని వల్ల మీరు నిజంగా హీరో కాకపోయినప్పటికీ, మీరు మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు మీ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తిగా నిలుస్తారు.

మీలో ఆ ధైర్యం ఉందా? అయితే కొత్త సంవత్సరం 2024లో “మీలోని హీరో” ప్రస్థానాన్ని ఆరంభించగలరా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)