‘నా కొడుకు అస్థికలను చంద్రుడిపైకి ఎందుకు పంపిస్తున్నానంటే...’

ఫొటో సోర్స్, ANAND FAMILY
- రచయిత, బీబీసీ ముండో
- హోదా, .
అమెరికాలోని కేప్ కెనావరెల్ నుంచి 2024 ప్రారంభంలో ఒక రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇంతకుముందెన్నడూ లేనట్లుగా 70 మంది అస్థికలను చంద్రుడిపైకి తీసుకెళ్లేందుకు ఈ రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఆ 70 మందిలో 16 ఏళ్ల లియామ్ ఆనంద్ ఒకరు.
‘‘నేను ఇంటి నుంచి బయటకు వచ్చి ఆకాశంలోకి చూస్తే చంద్రుడిపై నా కొడుకు కనిపిస్తాడు. అది భావోద్వేగాలతో ముడిపడిన అంశం, నాకు ఓదార్పునిస్తుంది’’ అని లియామ్ ఆనంద్ తల్లి నాదిన్ బీబీసీతో చెప్పారు.
కెనడాలోని డైపీ నగరానికి చెందిన లియామ్ 2018లో మోటార్‌సైకిల్ ప్రమాదంలో మరణించారు. ఆయన అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతులకు మించి చేయాలనుకుంది ఆయన కుటుంబం.
ఆ క్రమంలోనే ఇప్పుడాయన అస్థికలను నింగిలోకి పంపుతోంది.
లియామ్ నిత్యం ఉత్సాహంగా ఉండేవారని, పెద్దయ్యాక అంగారక గ్రహంపైకి అంతరిక్ష యాత్ర చేయాలని, ఆస్టరాయిడ్ల మైనింగ్ బిజినెస్ చేయాలని కలలు కనేవారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

ఫొటో సోర్స్, ASTROBOTIC
లియామ్ ఆనంద్ మరణించిన మూడేళ్ల తరువాత ఒక రోజు ఆయన తల్లి నాదిన్ తన కొడుక్కి అంతరిక్షంపై ఉన్న ఆసక్తిని గుర్తుచేసుకుంటూ ఇంటర్నెట్లో శోధించడం ప్రారంభించారు. ఆ శోధనలో ఆమెకు చంద్రుడి పైకి అస్థికలు పంపే కార్యక్రమం గురించి తెలిసింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో లియామ్ అస్థికలు కొన్ని పెరెగ్రైన్ లూనార్ క్రాఫ్ట్‌లో చంద్రుడిపైకి తీసుకెళ్లనున్నారు.
ఒక అసాధారణ విశ్రాంతి స్థలానికి తన కొడుకు అస్థికలను పంపుతుండడం అనేది ఆయన్ను చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తుందని నాదిన్ అన్నారు.
‘‘నా కొడుకు అంతరిక్షంలోకి వెళ్లాలనుకున్నాడు. ఇప్పుడు కుటుంబ సభ్యులు, ఆయన స్నేహితులు ఇంకా ఎవరైనా కూడా ఆయన్ను మిస్సయ్యేవారంతా చంద్రుడి వైపు చూసి హలో చెప్పొచ్చు’’ అన్నారామె.
‘‘ఇది మేం అతడికి ఇచ్చే గౌరవంలా అనిపిస్తోంది’’ అన్నారు.

ఫొటో సోర్స్, CELESTIS
ఖర్చు ఎంత?
ఇలాంటి సేవలు అందించే సెలెస్టిస్ సంస్థ సీఈవో చార్లెస్ చాఫర్ ఏరో టెక్నాలజీలాగే ఈ వ్యాపారంలో మానవీయ కోణమూ ముఖ్యమైనదే అంటారు.
‘‘నేను కంపెనీని స్థాపించినప్పుడు ఇది ఏరోస్పేస్ కంపెనీగానే ఉంటుందనుకున్నాను. కానీ వేదనకు చికిత్స చేసే కంపెనీగా మారామని తొందర్లోనే నేను గ్రహించాను’’ అన్నారు చార్లెస్.
స్కూళ్లో చదువుకుంటున్న సమయంలో అపోలో మిషన్‌లను చూసిన తర్వాత ఆయన వాణిజ్య అంతరిక్ష రంగంలోకి వచ్చారు.
1995లో ఆయన సెలెస్టిస్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఇంతకుముందు మనుషుల చితాభస్మం, డీఎన్ఏలను భూకక్ష్యలోకి పంపింది. ఆ తరువాత చంద్రునిపైకి పంపేందుకు పెరెగ్రైన్ మాడ్యూల్‌లో స్థలాన్ని కొనుగోలు చేసింది. చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడం లక్ష్యంగా అక్కడ స్థలం కొనుగోలు చేసింది ఈ సంస్థ.
సెలెస్టిస్ సంస్థ ద్వారా చంద్రుడిపైకి అస్థికలు పంపడానికి 13 వేల డాలర్లు(సుమారు రూ. 10 లక్షల 83 వేలు) ఖర్చవుతుంది. అమెరికాలో సంప్రదాయ అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా సుమారు ఇంతే ఉంటుంది.

ఫొటో సోర్స్, CLIVE FAMILY
తండ్రికి మాట ఇచ్చిన కొడుకు
మైఖేల్ క్లైవ్ తన తండ్రికి ఓ మాట ఇచ్చారు. తన తండ్రి అలాన్ క్యాన్సర్‌తో పోరాడుతూ చివరి దశలో ఉన్నప్పుడు ఆయన మరణానంతరం అస్థికలను చంద్రుడిపైకి పంపిస్తానని మైఖేల్ చెప్పారు.
‘‘ఆయన చితాభస్మాన్ని చంద్రుడిపైకి పంపించాలని అనుకుంటున్నట్లు ఆయనకు చెప్పగానే ఆయన నవ్వి, ‘అది చాలా బాగుంది’ అన్నారు’’ అని చెప్పారు మైఖేల్.
1950ల ప్రాంతంలో అలాన్ తన చిన్నతనంలో సైన్స్ ఫిక్షన్ చదువుతూ బాగా ఆసక్తి పెంచుకున్నారు.
ఆ తరువాత ఆయన కుమారుడు మైఖేల్ తండ్రితో కలిసి ‘స్టార్ ట్రెక్: ది నెక్స్ట్ జనరేషన్’ సిరీస్‌ను చూస్తూ తన తండ్రికి అందులో ఉన్నది యాక్షన్ చేసి వివరించేవారు. అప్పటికి అలాన్‌కు చూపు లేదు.
అలాన్ ప్లానెటరీ సొసైటీ, చాలెంజర్ సెంటర్ వంటి సంస్థలు అంతరిక్షం గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలలో పాల్గొనేవారు. వాటి ద్వారానే ఆయన విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త యూజిన్ షూమేకర్‌ను కలిశారు.
1997లో షూమేకర్ మరణించారు. ఇంతవరకు చంద్రునిపై చితాభస్మం ఉన్నది ఆయనదే.
ఇప్పుడు తన తండ్రి అలాన్ అస్థికలు చంద్రుడిపైకి చేరనున్నాయని, లక్ష సంవత్సరాలైనా అవి అక్కడే ఉంటాయని మైఖేల్ అనుకుంటున్నారు.
టెక్నాలజీ మరింత పెరిగి అంతరిక్షయానం ఇంకా సులభమైపోతే తన పిల్లలు చంద్రుడిపైకి వెళ్లి తమ తాతను చూడగలరని ఆయన ఆశిస్తున్నారు.
లియామ్ తల్లి నాదిన్ తన భర్త సంజీవ్, లియామ్ తోబుట్టువులు నలుగురితో కలిసి పెరెగ్రైన్ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని వీక్షించాలని ఎదురుచూస్తున్నారు.
‘‘లియామ్ కోసం మేం ఏం చేస్తున్నాయో అదంతా అతడు చూడగిలిగితే సంతోషిస్తాడు’’ అన్నారామె.
‘ఇవన్నీ సంతోషకరమైన క్షణాలు. కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. అయితే, అవి ఆనంద బాష్పాలు’’ అన్నారు మైఖేల్.
ఇవి కూడా చదవండి:
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














