కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ అయిందా? అందుకే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టిందా

ఫొటో సోర్స్, ANI
- రచయిత, వినీత్ ఖరే, పాయల్ భుయాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘డొనేట్ ఫర్ ద కంట్రీ (దేశం కోసం విరాళం) ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ ద్వారా, 18 ఏళ్లు నిండిన భారతీయులు, కాంగ్రెస్ పార్టీ కోసం రూ. 138, రూ. 1,380 లేదా రూ. 13,800 విరాళంగా ఇవ్వొచ్చు. కావాలంటే ఇంకా ఎక్కువ కూడా విరాళంగా ఇవ్వొచ్చు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల సహాయం తీసుకొని దేశ నిర్మాణం కోసం అడుగువేయడం ఇదే మొదటిసారి అని ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ అవుతున్న డ్యాష్‌బోర్డు ప్రకారం, ఈ కార్యక్రమం కింద 6 కోట్లకు పైగా విరాళాలు పోగయ్యాయి.
ఇప్పటివరకు రెండు లక్షల మంది ఈ కార్యక్రమంలో భాగమైనట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్, బీబీసీతో మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని మొదలుపెట్టామంటే దానర్థం పార్టీ వద్ద నిధుల కొరత ఏర్పడినట్లు కాదని అన్నారు.
‘‘ఈ కార్యక్రమంతో మా ఎన్నికల ఖర్చును కవర్ చేయాలని మేం అనుకోవట్లేదు. అది మా ఉద్దేశం కూడా కాదు. ఇది ఒక రాజకీయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అవ్వడానికి మేం ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ ప్రకారం, 2021-22 ఏడాదిలో దేశంలోని 8 ప్రధాన రాజకీయ పార్టీల్లో సుమారు రూ. 6,046 కోట్ల సంపత్తితో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ వద్ద రూ. 806 కోట్లు ఉన్నాయి.
అంటే కాంగ్రెస్ కంటే బీజేపీ వద్ద ఉన్న నిధులు ఏడు రెట్లు ఎక్కువ. మరో ముఖ్య విషయం ఏంటంటే భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతో ఖరీదైన వ్యవహారం.

దేశం కోసం విరాళాలివ్వండి
దేశం కోసం విరాళాలివ్వాలనే ప్రచారాన్ని ప్రకటించిన సమయం గురించి బీబీసీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్‌ను ప్రశ్నించింది. “ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఇంకా ముందుగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉంటే మేము ప్రజలతో ఇంకా బాగా కనెక్ట్ అయి ఉండేవాళ్లం“ అని అన్నారాయన.
“ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వాళ్లకు ఇప్పుడు డబ్బులు అవసరం. మేము ఇచ్చే డబ్బుతోనే వాళ్లు ఎన్నికల ప్రచారం చేసుకుంటారని ప్రజలు భావించవచ్చు”.
డొనేట్ ఫర్ కంట్రీ కార్యక్రమంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆరాధ్య సేఠియా చెప్పారు.
“అసలు లేకపోవడం కంటే ఎప్పుడోఅపుడు రావడం మంచిదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిధులు వస్తాయి. కాకుంటే కాస్త ఆలస్యంగా వస్తాయంతే. దీని వల్ల పెద్దగా మారిదేమీ ఉండదు.” అని హిందూస్తాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ వినోద్ శర్మ అన్నారు.
ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీని మరోసారి ఆర్థికంగా పరిపుష్ఠం చేసేందుకు చేపట్టిన ప్రయత్నమని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది.
“60 ఏళ్ల పాటు దేశాన్ని దోచుకున్నవాళ్లు ఇప్పుడు దేశం కోసం విరాళాలు ఇవ్వండి అనే ప్రచారం చేపట్టారు. ఈ 60 ఏళ్లలో జీపుల స్కాము నుంచి అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్, నేషనల్ హెరాల్డ్ స్కామ్ వరకు అనేక కుంబకోణాలు చేశారు. దేశాన్ని అడ్డంగా దోచుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. దేశాన్ని దోచుకుని ఇప్పుడు దేశం కోసం విరాళాలు ఇవ్వమని ప్రచారం చేస్తున్నారు” అంటూ మండి పడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.
కాంగ్రెస్ ఈ ప్రచారం ప్రారంభించడానికి ముందు, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో ఓడిపోయింది. రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని పట్టించుకోలేదని ఆ పార్టీ భాగస్వాముల నుంచి ఆరోపణలు వచ్చాయి.
దేశవ్యాప్తంగా అనేక సంస్థలు చేపడుతున్న సర్వేలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ విస్తృతమైన ప్రజామోదం ఉన్న నాయకుడని చెబుతున్నాయి.
నరేంద్రమోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా ఆపడం ఎలా అనేది ప్రతిపక్షాల ముందున్న అతి పెద్ద సవాలు.
పార్లమెంట్‌లోకి కొంతమంది వ్యక్తులు చొరబడిన ఘటనపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం150 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ- ప్రతిపక్షాల మధ్య సంఘర్షణ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిపక్షాలకు చావు బతుకుల సమస్య అని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి సంజయ్ జా.
దేని కోసం ఈ కార్యక్రమం?
నిధులు సమకూర్చుకోవడంతో పాటు ఇందులో ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల, విరాళాలు ఇచ్చే వారు తాము పార్టీ అభివృద్ధి కోసం పాటు పడుతున్నామనే భావన కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దేశం కోసం విరాళం అనే ప్రచారానికి ఎంత మంది ప్రజలు స్పందిస్తారనే దానిపై కాంగ్రెస్ పార్టీ ముందు సవాళ్లు ఉన్నాయి.
“భారతీయ జనతా పార్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేస్తోంది. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఇదొక సవాలే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అర్థిక పరిస్థితి మరీ అంత దయనీయంగా ఏమీ లేదు” అని అజయ్ మాకెన్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి ఉపయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంత సొమ్ము విరాళాలుగా వసూలు చేయాలని భావిస్తోందని అడిగినప్పుడు అజయ్ మాకెన్ ఇలా స్పందించారు.
“క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎంత వసూలు చేయాలనే దానిపై లక్ష్యాలేమీ నిర్ధరించుకోలేదు. ప్రస్తుతం వస్తున్న నిధుల్లో 80 శాతం యూపీఐ ద్వారా వస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులలో 50 శాతాన్ని మేము ఫిక్స్డ్ డిపాజిట్‌గా భద్రపరుస్తాం. దానిపై వచ్చే వడ్డీని పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తాం. మిగతా సొమ్మును రాష్ట్రాలకు ఇస్తాం. అది కూడా నగదుగా కాదు.”
నాగపూర్‌లో జరిగే కాంగ్రెస్ సభకు హజరయ్యే ప్రజలు, కార్యకర్తలు పార్టీకి విరాళాలు అందించేందుకు వీలుగా ప్రతీ చోటా క్యూ ఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది. భవిష్యత్‌లో పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా కొన్ని వస్తువుల్ని అమ్మాలనే ఆలోచన కూడా చేస్తున్నారు.
“ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎవరూ అనుకోరు. అది సాధ్యం కాదు కూడా. ప్రజల విరాళాలతో పాటు ఇతర వనరులు కూడా ఉండాలి” అని అజయ్ మాకెన్ అన్నారు.
పార్టీ వెబ్‌సైట్ మీద వేల సంఖ్యలో మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని, వెబ్‌సైట్‌లో సమాచారం దొంగిలించడమే వీటి లక్ష్యమని ఆయన చెప్పారు.
“సైబర్ అటాకర్ల ప్రయత్నాల్లో ఒక్క దాన్ని కూడా మేము సఫలీకృతం కానివ్వలేదు. మా వెబ్ సైట్ ఒక్క నిముషం పాటు కూడా ఆగిపోలేదు. నిముషానికి 5వేల లావాదేవీలు జరపగల సత్తా మా వెబ్‌సైట్ సొంతం” అని అజయ్ మాకెన్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
నిధుల కోసం పోరాటం
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకుని ఎన్నికల్లో పోటీ చేయడంపైనా చర్చ జరుగుతోంది.
పార్టీలకు విరాళాలు ఇవ్వడానకి ఎలక్టోరల్ బాండ్లు ఒక మార్గం. పౌరుడు లేదా సంస్థ ఎవరైనా సరే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లకు వెళ్లి తమకు కావల్సిన పార్టీకి విరాళం ఇవ్వవచ్చు. ఇలా విరాళాలు ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతారు.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు ఇది దేశంలో పార్టీలకు నిధులిచ్చే విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తుందని ప్రకటించింది.
అయితే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు నిధులు ఇస్తున్న వారి వివరాలను గోప్యంగా ఉంచుతుండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విధానం నల్లధనాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
“ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశాన్నైనా చూడండి. ప్రతీ చోటా ప్రతీ పైసాకు లెక్క ఉంటుంది. ఎవరు ఎంత మొత్తం ఇచ్చారనేది ప్రజలకు తెలుస్తుంది. ఈ సొమ్ముపై పర్యవేక్షణ ఉండాలి. దాన్ని తొలగించారు” అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ ప్రతినిధి త్రిలోచన్ శాస్త్రి అన్నారు.
2016-17 నుంచి 2021-22 మద్య ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారతీయ జనతా పార్టీకి భారీగా నిధులు వచ్చాయి అని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది.
ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
తాము ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామనే సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దీనికి ప్రజల నుంచి ఎంత స్పందన వస్తుంది. ఎంతమంది ప్రజలు ఇందులో చేరతారో చూడాలని అనుకుంటోంది” అని హిందుస్తాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ వినోద్ శర్మ చెప్పారు.
“ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా నిధులు ఇవ్వాలని ఏ పారిశ్రామికవేత్త అనుకోరు. వాళ్లు ఎందుకు భయపడుతున్నారో వాళ్లకు తెలుసు”
“వాళ్లు ప్రతిపక్షాలకు బహిరంగంగా డబ్బులిస్తే అధికార పార్టీకి ఆగ్రహం వస్తుందనే విషయం మనకు తెలుసు” అని ఆయన అన్నారు.
ఎన్నికల్లో పార్టీలు ఖర్చు చేసే సొమ్మంతా నగదు రూపంలోనే వస్తుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో పీహెచ్‌డీ స్కాలర్ ఆరాధ్య సేఠియా చెప్పారు.
“20 వేల రూపాయల కంటే ఎక్కువగా విరాళం ఇస్తే దాన్ని బహిరంగంగా ప్రకటించాలని చట్టం చెబుతోంది. అయితే ఒక వ్యక్తి 20వేల రూపాయలు, అంత కంటే తక్కువ మొత్తం విరాళంగా ఎన్నిసార్లు ఇవ్వ వచ్చు అనే దాన్ని చట్టంలో చేర్చలేదు” అని ఆయన చెప్పారు.
“దేశంలో ఎక్కువ పార్టీలు, ముఖ్యంగా జాతీయ పార్టీలు విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చెయ్యడం లేదు. వాళ్లు 20 వేల రూపాయలు కంటే తక్కువ అనే వాదనన తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి.”
కాంగ్రెస్ ప్రచారం
దేశం కోసం విరాళం కార్యక్రమం మహాత్మా గాంధీ స్ఫూర్తితో చేపట్టినట్లు కాంగ్రెస్ చెబుతోంది. 1921లో చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంలో బాగంగా మహాత్మగాంధీ తిలక్ స్వరాజ్ ఫండ్ ఏర్పాటు చేశారు.
ఆమ్ఆద్మీ పార్టీని స్థాపించిన తొలినాళ్లలో పార్టీ ఖర్చుల కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించింది.
పశ్చిమ దేశాల్లోనూ పార్టీలు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నాయి. అక్కడ పార్టీలో చేరే వారి నుంచి నిర్ణీత రుసుం వసూలు చేసే విధానం కూడా అమల్లో ఉంది.
ప్రజల నుంచి విరాళాలు సేకరించడాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదని, దాని వల్ల ఆ పార్టీకి పెద్దగా మేలు జరగకపోవచ్చని పీహెచ్‌డీ విద్యార్థి ఆరాధ్య సేఠియా చెప్పారు.
“తాము బలంగా ఉన్నామని కాంగ్రెస్ భావిస్తే, బీజేపీకి తామే ప్రత్యామ్నాయమని, రాజకీయాల్లో పాల్గొనాలని భావిస్తే మాకు విరాళాలు ఇవ్వండి” అని ప్రకటిస్తే విరాళాలు సాధించాలనే ప్రయత్నం సఫలీకృతం అయ్యేది అని ఆయన చెప్పారు.
రాజకీయాల్లో డబ్బు అవసరమే, కానీ డబ్బుతోనే ఎన్నికల్లో గెలవలేరనేది ఆరాధ్య అభిప్రాయం. నాయకుడు, నాయకత్వం, సంస్థ, సిద్దాంతాలు లాంటి అనేక అంశాల మీద ఆధారపడి పార్టీ పని తీరు ఉంటుంది.
కాంగ్రెస్‌కు బదులుగా ఇండియా కూటమి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అలా చేస్తే ప్రజల నుంచి స్పందన కూడా వేరేగా ఉండేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే తమ లక్ష్యాన్ని విపక్షాల కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉండేది.
ఇవి కూడా చదవండి:
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














