విశాఖపట్నం: ప్రియుడే తన ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేశాడని బీచ్‌లో కూర్చుని ఏడుస్తున్న మైనర్ బాలికపై మరో ఎనిమిది మంది అత్యాచారం

minor

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ లో10 మంది 6 రోజులు పాటు ఒక బాలికను గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు తెలిపారు.

‘‘ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడు తన స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అది తట్టుకోలేకపోయిన ఆ బాలిక విశాఖ బీచ్‌లో ఏడుస్తుంటే ఓదార్పు పేరుతో దగ్గరైన మరో వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా తన స్నేహితులు ఏడుగురిని పిలవగా వారంతా రేప్ చేశారు. నగరంలోని రోజుకో లాడ్జ్‌కు మైనర్‌ను తిప్పుతూ ఈ దారుణానికి ఒడిగట్టారు’’ అని పోలీసులు వెల్లడించారు.

ఈ గ్యాంప్ రేప్ ఘటన కేసును ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఈ ఘటన 2023, డిసెంబర్ 17-22 తేదీల మధ్య జరగ్గా విషయం ఆలస్యంగా బయటపడింది.

17 ఏళ్ల తన కుమార్తె కనిపించడం లేదంటూ ఒడిశాకు చెందిన ఆ బాలిక తండ్రి విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

విశాఖలోని దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ సీహెచ్ వివేకానంద ఈ కేసును విచారిస్తున్నారు.

కేసుకు సంబంధించిన వివరాల కోసం ఆయనను బీబీసీ సంప్రదించింది.

వైజాగ్ బీచ్

అసలేం జరిగిందంటే...

ఏసీపీ వివేకానంద చెప్పిన వివరాల ప్రకారం, విశాఖలోని ఒక అపార్ట్ మెంట్‌లో ఆ బాలిక తండ్రి వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. వారు ఒడిశా నుంచి వచ్చారు.

17 ఏళ్ల కుమార్తె ఉన్న అతడు తన కుటుంబంతో సహా కంచరపాలెంలోనే నివసిస్తున్నారు. అక్కయ్యపాలెం సమీపంలోని పోర్ట్ క్వార్టర్స్ ఏరియా సమీపంలోని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విభాగంలో పని చేస్తున్న ఒక కుటుంబం నివాసం ఉంటుంది.

వారి ఇంటిలోకుక్కలకు ఆహారం పెట్టే పని కోసం ఒక మనిషి కావాలని తెలిసిన వారు కోరడంతో ఆయన తన కుమార్తెను ఆ పనిలో కుదిర్చారు.

కంచరపాలెం నుంచి వచ్చే ఆ అమ్మాయి సంఘటన జరగడానికి కేవలం 15 రోజుల ముందు ఆ ఇంటిలో పనికి కుదిరింది.

ఆ ఇంటి ఎదురుగా ఉన్న మరో ఇంటిలో బిల్డింగ్ టైల్స్ వర్క్ చేసే ఇమ్రాన్ అనే యువకుడు ఉండేవాడు. అతడికి ఈ బాలికకు పరిచయం ఏర్పడింది.

ఇమ్రాన్ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మింది. ఆ బాలిక కూడా ఇమ్రాన్‌ను ప్రేమించింది.

దీంతో డిసెంబర్ 17న అతడు బయటకు రమ్మని పిలిస్తే వెళ్లింది.

రోజూ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకునే తన కుమార్తె డిసెంబర్ 17న రాత్రంతా ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైజాగ్ పోలీస్ స్టేషన్

ముందు మిస్సింగ్ కేసుగా నమోదు

దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఆ బాలిక తమ సొంత గ్రామంలోని ఉన్నట్లు తెలిసి అక్కడికి వెళ్లి బాలికను విశాఖ తీసుకుని వచ్చామని నాలుగో పట్టణ పీఎస్ సీఐ విజయ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

ఆ బాలికను వెతికే క్రమంలో ఏపీతో పాటు ఝార్ఖండ్ కూడా వెతికారు.

పోలీసులు, బాలిక తల్లిదండ్రులు, ఆమె పని చేసిన చోట స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏపీలోని కొన్ని జిల్లాలు, ఝార్ఖండ్‌లో వెతికారు.

అయితే, ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ క్రమంలో బాలిక ఒడిశాలోనే ఉన్నట్లు గుర్తించారు.

అది కూడా తమ సొంత గ్రామంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో విశాఖ నుంచి పోలీసులు ఒడిశా వెళ్లారు.

మైనర్ బాలికపై అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

మిస్సైన బాలిక గ్రామానికి ఎలా చేరింది?

విశాఖలో కనిపించకుండా పోయిన బాలిక, సొంత గ్రామమైన ఒడిశాలోని పనిముండ్రకు ఎలా వెళ్లిందనే విషయాలను దిశ ఏసీసీ వివేకానంద వివరించారు.

‘‘ఒడిశా నుంచి విశాఖ తీసుకుని వచ్చిన ఆ బాలిక రెండు, మూడు రోజుల పాటు మాట్లాడలేకపోయింది. చివరకు డిసెంబర్ 31న అసలేం జరిగిందో వివరించింది. డిసెంబర్ 17న ఇమ్రాన్ తో కలిసి బయటకు వెళ్లిన బాలికను ఒక హోటల్ లో రేప్ చేశాడు. ఆ తర్వాత అతడి స్నేహితుడిని ఆ హోటల్ కు రమ్మని ఫోన్ చేశాడు. అతడు కూడా ఆ బాలికను బెదిరించి రేప్ చేశాడు. అక్కడ నుంచి ఆ బాలిక తప్పించుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి తనని ఇలా మోసం చేయడంతో ఆ బాలిక కుంగిపోయింది. ఏం చేయాలో తెలియక బీచ్‌కు చేరుకుని అక్కడ ఏడుస్తూ కూర్చుంది.

బాలిక ఏడవడాన్ని అక్కడున్న సందర్శకులు చాలా మంది గమనించారు. కానీ ఎవరు ఆమెను ప్రశ్నించలేదు.

అయితే బీచ్‌లో సందర్శకులకు ఫోటోలు తీసే ఒక వ్యక్తి ఆ బాలికను చేరుకుని విషయం అడిగి తెలుసుకున్నాడు.

ఆమెను ఓదార్చుస్తూ ఆమెకు మంచి మాటలు చెప్పాడు. ఆమెను తనతో ఫ్రెండ్ రూంకి తీసుకుని వెళ్లాడు.

అక్కడ అతడితో పాటు మరో ఏడుగురు కలిసి ఆ బాలికను రేప్ చేశారు.

ఆ తర్వాత సిటీలోని పలు లాడ్జిలు, హోటల్స్ తిప్పుతూ ఆ బాలికపై డిసెంబర్ 22వ తేదీ వరకు ఈ ఎనిమిది మంది పలుమార్లు అత్యాచారం చేశారు.

ఆ తర్వాత వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆ బాలిక తన గ్రామానికి చేరుకుంది. ఆ విషయం తెలిసిన పోలీసులు ఆ గ్రామానికి బాలిక తల్లిదండ్రుల సహాయంతో చేరుకుని విశాఖ తీసుకుని వచ్చారు.’’

వైజాగ్ బీచ్

పోక్సో చట్టం కింద కేసు నమోదు

‘‘మొదట బాలిక ఏం మాట్లాడలేకపోయింది. చాలా భయాందోళనలో ఉంది. చివరకు డిసెంబర్ 30న తల్లిదండ్రులు, పోలీసులు మెల్లగా ఆమెతో మాట్లాడి అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 31న బాలిక ధైర్యం తెచ్చుకుని అసలేం జరిగిందో వివరించింది. డిసెంబర్ 17 తేదీ నుంచి డిసెంబర్ 22 వ తేదీ వరకు తనను 10 మంది పలు మార్లు అత్యాచారం చేశారని చెప్పింది. బాలిక చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నాం.

ఆ వివరాలు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. బాలిక చెప్పిన సమాచారంతో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. వీరందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. ప్రస్తుతం బాధితురాలు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఎక్కువ సమాచారాన్ని అందించలేమని, బాలిక ఆరోగ్య స్థితి మెరుపడిన తర్వాత ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాలపై మరింత లోతుగా విచారణ చేస్తాం’’ అని దిశ ఏసీపీ వివేకానంద తెలిపారు.

ఎక్కడైనా ఒంటరిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బాలికలు, యువత, మహిళలు కనిపిస్తే వారి పరిస్థితిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ వివేకానంద కోరారు. అటువంటివి సమచారం నేరాలు జరగకుండా ఆపడమే కాకుండా కొన్ని సార్లు ప్రాణాలను కూడా కాపాడేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు.

గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు.

నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు

బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)