బంగ్లాదేశ్ ఎన్నికలు: అమెరికా వైఖరికి భిన్నంగా చైనా వాదనకు భారత్ ఎందుకు మద్దతిస్తోంది
- రచయిత, అమృత శర్మ
- హోదా, బీబీసీ మానిటరింగ్

ఫొటో సోర్స్, ANI
బంగ్లాదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నీ తమ ప్రాభవం చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.
రాజకీయాలకు మించి అనిశ్చితి, అనేక ఒడిదొడుకుల నడుమ ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాత్-ఇ-ఇస్లామి ఈ ఎన్నికలను బహిష్కరించడంతో ఈ అనిశ్చితి మరింత పెరిగింది.
సార్వత్రిక ఎన్నికలను ఆపద్ధర్మ ప్రభుత్వ పర్యవేక్షణలో మాత్రమే జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చేస్తున్నాయి.
దేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన పార్టీలు 44 ఉన్నాయి. వాటిలో 26 పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటుండగా, మరో 14 పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి.

ఫొటో సోర్స్, ANI
రాజకీయ సమీకరణలు
బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన రాజకీయ హింస కారణంగా గత 11 నెలల కాలంలో 82 మంది చనిపోగా, 8,150 మంది గాయాలపాలైనట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ప్రతిపక్ష పార్టీలే అందుకు కారణమని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఆవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసింది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ 21,385 మంది బీఎన్‌పీ కార్యకర్తలను వివిధ కేసుల్లో అరెస్టు చేసినట్లు ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో అసాధారణ సమీకరణలకు దారితీశాయి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్న బీఎన్‌పీ డిమాండ్‌కు అమెరికా మద్దతిచ్చింది. ఎన్నికలకు అంతరాయం కలిగించే వారికి వీసాల మంజూరులో ఆంక్షలు కొనసాగుతాయని హెచ్చరించింది.
అయితే, బంగ్లాదేశ్‌కి మిత్రదేశమైన భారత్.. రష్యా, చైనా వాదనలకు బలం చేకూరుస్తూ బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇతరుల జోక్యం ఉండకూడదని స్పష్టం చేస్తోంది.
అమెరికా జోక్యంతో అస్థిరమైన వాతావరణం ఏర్పడి, రాడికల్ శక్తులకు ఊతమిచ్చే అవకాశం ఉందని, అలాగే దక్షిణాసియాలో చైనా ప్రభావం మరింత పెరిగేందుకు అవకాశం ఇచ్చినట్టవుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఫొటో సోర్స్, ANI
బంగ్లాదేశ్‌పై అమెరికా ఒత్తిడి
అమెరికా, చైనా, రష్యా వంటి ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు, ప్రాంతీయ శక్తిగా ఎదిగిన భారత్ తమ వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకోవాలని చూస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎన్నికలు ప్రపంచ రాజకీయాలకు హాట్‌స్పాట్‌గా మారాయి.
ఈ ఎన్నికల్లో చరిత్ర పునరావృతం అవుతోంది. ఎందుకంటే, అమెరికా మళ్లీ ఒంటరైంది.
2014 ఎన్నికలకు ముందు కూడా షేక్ హసీనా దేశ అత్యున్నత పదవి చేపట్టేందుకు చైనా, రష్యా, భారత్ అంగీకరించినట్లు చెబుతారు.
2023 మే నెలలో, యూఎస్ ప్రత్యేక వీసా విధానాన్ని ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను అవాంతరం కలిగించే బంగ్లాదేశీయులకు వీసాలు నిలిపివేయడమే దాని ఉద్దేశమని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడమే ఈ విధానం ముఖ్యోద్దేశమని తెలిపింది.
'బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత, మాజీ ఉద్యోగులు, ప్రభుత్వ అనుకూల, ప్రతిపక్ష పార్టీల సభ్యులు, న్యాయ వ్యవస్థ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సభ్యులు, భద్రతా సిబ్బంది కూడా ఈ పాలసీలో భాగమే' అని అమెరికా పేర్కొంది.
అయితే, వీసా ఆంక్షలపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా అమెరికా ఆంక్షలు అసంబద్ధంగా ఉన్నాయన్నారు.
దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని బంగ్లాదేశ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఫొటో సోర్స్, ANI
అమెరికాను టార్గెట్ చేసిన చైనా, రష్యా
అయితే, ఈ విషయంలో అమెరికా చర్యలను చైనా, రష్యా వెంటనే ఖండించాయి.
బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, స్వతంత్రను, సమగ్రతను కాపాడడంలో చైనా మద్దతు ఉంటుందని ఆగస్టులో జరిగిన సమావేశంలో హసీనా చెప్పిన విషయాన్ని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గుర్తు చేశారు.
ఇటీవల ఒక దేశం మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, బంగ్లాదేశ్‌లో నిష్పక్షపాత ఎన్నికల గురించి ఒక దేశం మాట్లాడుతోందని, కానీ ఏకపక్షంగా వీసాలపై ఆంక్షలు విధించిందంటూ అమెరికా పేరెత్తకుండానే చైనా రాయబారి యో వెన్ విమర్శలు చేశారు.
అదే దేశం బంగ్లాదేశ్ ప్రజలపై ఆర్థిక ఆంక్షలు కూడా విధించిందని యో అన్నారు.
బంగ్లాదేశ్ ఎన్నికలపై అమెరికా, చైనా చేస్తున్న వేర్వేరు ప్రకటనలు కూడా ఇరుదేశాల మధ్య ఆధిపత్య పోరుని సూచిస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న దేశం అమెరికా. అలాగే, దక్షిణాసియా దేశాల్లో రెడీమేడ్ దుస్తుల అతిపెద్ద మార్కెట్‌గా బంగ్లాదేశ్ ఉంది.
బంగ్లాదేశ్‌కి రక్షణ పరికరాల సరఫరాతో పాటు ప్రధాన వాణిజ్య భాగస్వామి చైనా. దీంతో ఈ రెండు ప్రపంచ శక్తుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది.
హసీనా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ద్వారా బంగ్లాదేశ్‌పై చైనా ప్రభావాన్ని తగ్గించడమే అమెరికా ఉద్దేశమని ఇండియన్ మీడియా చెబుతోంది.
మరోవైపు రష్యా కూడా బంగ్లాదేశ్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. గత ఐదు దశాబ్దాలుగా ఎన్నడూ లేనిది, ఇటీవల బంగ్లాదేశ్‌కి యుద్ధ నౌకను కూడా పంపింది. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని చూస్తోందని కూడా రష్యా ఆరోపిస్తోంది.
అనుకున్నట్లుగా ఎన్నికలు జరగకపోతే, అరబ్ స్ప్రింగ్ తరహాలో బంగ్లాదేశ్‌లోనూ అస్థిర వాతావరణం సృష్టించేలా ఉందని అమెరికా జోక్యం ఉందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా డిసెంబర్ 15న ఒక ప్రకటన చేశారు.
గత సెప్టెంబర్‌లో తొలిసారి ఢాకాలో పర్యటించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయి లావ్రోవ్ అమెరికా చర్యలను ఖండించారు. చైనాను, ఇండో పసిఫిక్ రీజియన్‌లో రష్యాను ఒంటరిని చేయాలనే లక్ష్యంతోనే ఇలా చేస్తోందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
చైనా, భారత్ అంగీకారం
ఈసారి బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికలు భారత్‌ను కూడా చైనా, రష్యా శిబిరంలో చేర్చాయి.
బీఎన్‌పీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో ఇస్లామిక్ మతఛాందసవాదం పెరిగే అవకాశం ఉందని భారత్‌లోని ప్రతిపక్ష పార్టీ కూడా సందేహిస్తోంది.
అధికార ఆవామీ లీగ్ ప్రభుత్వం ఇస్లామిక్ అతివాదులకు అవకాశం ఇవ్వడం భారత్‌తో సంబంధాల బలోపేతానికి దారితీసింది.
దేశంలో షరియా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రెబెల్ గ్రూపులపై హసీనా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
అలాంటి సంస్థలకు సంఘీభావంగా నిలుస్తున్నాయని భావిస్తున్న బీఎన్‌పీ, జామాత్ - ఇ - ఇస్తామీ పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంది.
అయితే, ఎన్నికల ముందు బీఎన్‌పీ యాక్టివిస్టులపై హసీనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ప్రపంచ మీడియాలో హెడ్‌లైన్స్‌గా వచ్చాయి. దీంతో అమెరికా చర్యలకు ఉపక్రమించింది.
అదే సమయంలో బంగ్లాదేశ్ ఎన్నికలు ఆ దేశ అంతర్గత వ్యవహారమని భారత్ చెబుతోంది. అలాగే, బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విషయంలో మరింత్ర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, అది ప్రాంతీయ సుస్థిరతకు ముప్పుగా మారడంతో పాటు, తీవ్రవాద శక్తులకు బలం చేకూర్చే అవకాశం ఉందని అమెరికాను కోరినట్లు తెలుస్తోంది.
''బంగ్లాదేశ్‌లో ఛాందసవాదాన్ని, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ ప్రతిపక్ష శక్తి అధికారంలోకి రావడాన్ని భారత్ ఎప్పుడూ కోరుకోదు'' అని బంగ్లాదేశ్‌కు చెందిన ఇంగ్లిష్ దినపత్రిక ఢాకా ట్రిబ్యూన్ ఆగస్టులో రాసిన కథనంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ముంబయి నుంచి అమెరికా వరకు.. ‘2023’ కీలక పరిణామాలు 15 ఫోటోల్లో!
- అరేబియా సముద్రంలో భారత్ మూడు క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలను ఎందుకు మోహరించింది?
- ఖతార్: మరణ శిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపు.. వీరిలో ఒకరైన విశాఖ వాసి పాకాల సుగుణాకర్ నేపథ్యం ఏమిటి?
- అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది
- భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు.. నదిలో పసిడి ఎలా దొరుకుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














