ఎక్స్‌పోశాట్‌: ఇస్రో తొలిసారిగా ఇలాంటి శాటిలైట్ ఎందుకు ప్రయోగించింది? ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటి?

విజయవంతంగా అంతరిక్షంలోకి

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహక నౌక ఎక్స్‌పోశాట్‌ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది.
    • రచయిత, జాహ్నవి మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త సంవత్సరం తొలి రోజున శుభారంభం చేసింది. ‘ఎక్స్ రే పొలారిమీటర్’ ఉపగ్రహాన్ని (ఎక్స్‌పోశాట్) విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహక నౌక సోమవారం ఈ ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఎక్స్‌పోశాట్ విజయవంతంగా అంతరిక్షంలోకిి దూసుకెళ్లింది.

పీఎస్ఎల్‌వీ-సీ58 రాకెట్ శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టిందని 'ఇస్రో' ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

భారత్ నుంచి ఇలాంటి శాటిలైట్ ప్రయోగించడం ఇదే తొలిసారి. అసలు ఎక్స్‌పోశాట్ మిషన్ దేని కోసం? దీని ప్రాధాన్యం ఏమిటి?

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఖగోళంలో రహస్యాల్ని కనుక్కునే ప్రయత్నం

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఖగోళంలో రహస్యాల్ని కనుక్కునే ప్రయత్నం

అబ్జర్వేటరీగా పనిచేసే రెండో శాటిలైట్ ఇదే

ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 ప్రయోగాల తర్వాత అంతరిక్షంలో బాగా దూరంగా ఉన్న బ్లాక్ హోల్స్, సూపర్ నోవా లాంటి నక్షత్రాలను పరిశోధించేందుకు భారత్ ఎక్స్‌పోశాట్ మిషన్ చేపట్టింది.

మొదట దీన్ని డిసెంబర్ చివర్లో ప్రయోగించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రయోగాన్ని కొత్త సంవత్సరం తొలి రోజుకి వాయిదా వేశారు.

ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్‌ను సంక్షిప్తంగా ఎక్స్‌పోశాట్ అని పిలుస్తున్నారు.

జనవరి 1న సోమవారం ఎక్స్‌పోశాట్‌ను ప్రయోగించింది ఇస్రో. ఇది అబ్జర్వేటరీ మాదిరిగా పని చేయనుంది.

ఇది అంతరిక్షంలో ఐదేళ్ల పాటు పని చేస్తుంది.

ఇది కీలకమైన ఎక్స్‌ రే డేటాను సేకరిస్తుంది. ఈ డేటా సాయంతో విశ్వంలో అంతు చిక్కని అంశాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచంలో అబ్జర్వేటరీగా పని చేసే రెండో శాటిలైట్ ఇది.

2021లో నాసా, ఇటలీ కలిసి ఐఎక్స్‌పీఈ అనే శాటిలైట్‌ను ప్రయోగించాయి. ఇది అబ్జర్వేటరీ మాదిరిగా పని చేస్తోంది.

ఎక్స్ రే కిరణాలపై అధ్యయనం చెయ్యనున్న ఎక్స్‌పో శాట్

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఎక్స్ రే కిరణాలపై అధ్యయనం చెయ్యనున్న ఎక్స్‌పో శాట్

ఎక్స్‌ రేలను ఎందుకు అధ్యయనం చేయాలి?.

ఖగోళంలో వస్తువులు ఎలా ఉన్నాయో మనం సాధారణ టెలిస్కోపు ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అవి ఎలా పుట్టాయి, ఎలా ప్రవర్తిస్తాయి లాంటి అంశాలు సాధారణ టెలిస్కోపు ద్వారా తెలుసుకోవడానికి వీలుకాదు.

అందుకే శాస్త్రవేత్తలు వీటి గురించి తెలుసుకునేందుకు వాటి నుంచి విడదలయ్యే ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు, కాస్మిక్ లేదా రేడియో తరంగాల నుంచి వచ్చే డేటాను సేకరించి అధ్యయనం చేస్తున్నారు.

అసాధారణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల నుంచి ఎక్స్ కిరణాలు వెలువడతాయి. విస్ఫోటనాలు జరిగినప్పపుడు, ఆస్ట్రాయిడ్లు ఢీ కొన్నప్పుడు, అయస్కాంత క్షేత్రాలు వేగంగా తిరిగేటప్పుడు ఇవి ఏర్పడతాయి.

ఇందులో బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయి. బరువు ఎక్కువై నక్షత్రాలు వీటిలోకి రాలిపోతుంటాయి.

బ్లాక్‌హోల్‌లో గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే, అందులో నుంచి కాంతి కూడా బయటకు రాలేదు.

అందుకే మనం వాటిని చూడలేక పోతున్నాం. అవి కనిపించవు కాబట్టి, వాటిని అధ్యయనం చెయ్యడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం.

ఎక్స్ కిరణాలను వెదజల్లే క్వాసార్స్, సూపర్ నోవా, న్యూట్రాన్ స్టార్ల గురించి తెలుసుకోవడానికి ఎక్స్‌రే టెలిస్కోపులు అవసరం.

విశ్వంలో రహస్యాలను, అంతు చిక్కని అంశాలను అర్థం చేసుకోవడానికి ఇలాంటి వాటిని అధ్యయనం చెయ్యడం తప్పనిసరి.

భారత్ నుంచి ఇలాంటి శాటిలైట్ ప్రయోగం ఇదే తొలిసారి
ఫొటో క్యాప్షన్, భారత్ నుంచి ఇలాంటి శాటిలైట్ ప్రయోగం ఇదే తొలిసారి

స్పేస్ అబ్జర్వేటరీ ఎందుకు అవసరం?

విశ్వంలోని రకరకాల పదార్ధాల నుంచి వచ్చే రేడియో ధార్మికతను భూమి వాతావరణం నిరోధిస్తోంది. దీని వల్లే భూమి మీద అనంత జీవరాశి మనుగడ సాగిస్తోంది.

దీనర్థం మనం ఈ రేడియో ధార్మిక కిరణాలను ఆటంకాలు లేకుండా చూడలేమని కాదు. వీటిని పరిశీలించేందుకే ఎక్స్‌పోశాట్ లాంటి మిషన్లను అంతరిక్షంలోకి పంపిస్తున్నాం.

అలాంటి ఒక మిషన్ నాసా ప్రయోగించిన చంద్ర ఎక్స్ రే మిషన్. ఈ మిషన్‌కు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రమణియన్ చంద్రశేఖర్ పేరు పెట్టారు.

అంతరిక్షాన్ని అల్ట్రావయోలెట్, అధిక, తక్కువ శక్తి ఉన్న ఎక్స్ రే కిరణాలతో పరిశీలించేందుకు భారతదేశం 2015లో ఆస్ట్రోశాట్ మిషన్‌ను ప్రయోగించింది.

అయితే ఎక్స్‌పోశాట్ అంతరిక్షంలో ఎక్స్‌ రే కిరణాలనే కాక వాటిని వెదజల్లే వస్తువులను దాటి మరింతగా పరిశీలిస్తుంది.

ఎక్స్ రే కిరణాల దీర్ఘకాలిక ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు వాటి పోలరైజేషన్‌ను అవగాహన చేసుకోవడంపైనా ఈ మిషన్ దృష్టి పెడుతుంది.

అంతరిక్షంలో రేడియో ధార్మిక కిరణాల పుట్టుక ఎక్కడ?
ఫొటో క్యాప్షన్, అంతరిక్షంలో రేడియో ధార్మిక కిరణాల పుట్టుక ఎక్కడ?

పోలరైజేషన్, పొలారిమీటర్ అంటే ఏమిటి?

పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ నుంచి కాంతి ప్రయాణించినప్పుడు అది సూర్యకాంతితో పోలిస్తే భిన్నంగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?.

ఎందుకంటే కాంతి తరంగాలు ఓ తాడు మాదిరిగా పని చేస్తాయి. అవి వాటి మార్గంలో పయనిస్తూనే నాలుగు వైపులా ప్రసరిస్తాయి.

అయితే అవి వాతావరణంలో ప్రత్యేక ఫిల్టర్ల నుంచి లేదా వాయువుల నుంచి ప్రయాణించినప్పుడు అవన్నీ పోలరైజ్ అవుతాయి. వాటి కాంతి ఒకే మార్గంలోకి వస్తుంది.

ఎక్స్ రే కిరణాలు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఒకే డైరెక్షన్‌లో తిరుగుతూ ఏకీకృతం అవుతాయి.

ఎక్స్ రే కిరణాలను వెదజల్లే వస్తువుల స్థితి, అవి ఉన్న దిశ గురించి కీలకమైన సమాచారం అందించడంలో పొలారి మీటర్ ఉపయోగ పడుతుంది.

అలాంటి ఒక పొలారి మీటర్‌ను ఎక్స్‌పోశాట్‌కు అమర్చారు.

ఎక్స్‌పోశాట్‌లో పేలోడ్లు

ఎక్స్‌పో శాట్‌ అంతరిక్ష వ్యోమనౌకలో రెండు సాంకేతిక పరికరాలను అమర్చారు.

పొలిక్స్: ఇది ప్రాథమిక వస్తువు. దీనిని రామన్ పరిశోధనా సంస్థ తయారు చేసింది. యూఆర్ రావు సెంటర్ కూడా దీని తయారీలో భాగస్వామిగా ఉంది.

ఖగోళ పదార్ధాల నుంచి పుట్టే కిరణాల దిశ, కోణాన్ని ఇది లెక్కిస్తుంది.

ఎక్స్ఎస్ పెక్ట్ : ఈ పరికరం స్పెక్ట్రోస్కోపిక్ సమాచారం పంపిస్తుందని ఇస్రో చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)