అయోధ్య రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి తెచ్చిన భారీ శిలలు ఏమయ్యాయి... వాటితో విగ్రహాలు చేయలేదా?

ఫొటో సోర్స్, RSS
- రచయిత, విష్ణు పోఖ్రేల్
- హోదా, బీబీసీ నేపాలీ
అయెధ్య రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ ఆలయంలో కొలువుదీరనున్న రాముడు సహా ఇతర దేవతామూర్తుల విగ్రహాల కోసం నేపాల్ నుంచి తీసుకొచ్చిన శిలలు ఏమయ్యాయనే ఆసక్తి పెరుగుతోంది.
రామ మందిర నిర్మాణ పనులు దాదాపు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో నేపాల్‌లోని కాళీగండకీ నదీ తీరం నుంచి రెండు భారీ శిలలను అయోధ్యకు తరలించారు.
వాటిలో ఒక శిల బరువు 27 టన్నులు కాగా, రెండోది 14 టన్నులు. కాళీ నది తీరం నుంచి సేకరించిన ఈ శిలలను జనక్‌పూర్‌లోని జానకీ దేవి ఆలయం మీదుగా అయోధ్యకి తీసుకొచ్చారు.
అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న రాములోరి విగ్రహం ఈ శిలల నుంచే తయారు చేయనున్నట్లు అప్పట్లో వినిపించింది. కానీ, ఆ తర్వాత రాముడి విగ్రహ తయారీకి ఈ శిలలు పనికిరావని భావిస్తున్నట్లు మరో వాదన వెలుగులోకి వచ్చింది.
ఈ శిలలతో రాముడి విగ్రహం తయారు చేయకపోవడానికి ఆలయ పండితులు అభ్యంతరాలు తెలపడం కూడా ఒక కారణమని దేశీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దేవతామూర్తుల విగ్రహాలు తయారు చేసేందుకు ఈ శిలలు పనికిరావని, సాలిగ్రామాల తరహాలో విగ్రహాలు చెక్కేందుకు ఈ శిలలు పనికిరావని కొందరు పండితులు అభిప్రాయపడినట్లు తెలిసింది.
అయితే, 'ఈ శిలలను సాంకేతికంగా పరిశీలించిన తర్వాత 'ఇలాంటి శిలల నుంచి విగ్రహాన్ని చెక్కడం సాధ్యం కాదని శిల్పులు చెప్పారు' అని అయోధ్యకు వచ్చిన నేపాలీ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత వేరే శిలలతో శిల్పాలు రూపొందాయి.
నేపాల్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, 27 టన్నుల శిల నుంచి విగ్రహం చెక్కేందుకు ప్రయత్నించారు. ఎందుకంటే 14 టన్నుల రెండో శిలను సాలిగ్రామంగా పరిగణిస్తారు.
అయితే, 27 టన్నుల శిల విగ్రహం తయారీకి పనికిరాదని గుర్తించిన తర్వాత, ఆ రెండు శిలలను రామ మందిర నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోనే ఒక పక్కన ఉంచారు.
మీడియా కథనాల ప్రకారం, రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన శిలలతో మూడు విగ్రహాలను తయారు చేశారు.
వాటిలో ఉత్తమంగా తీర్చిదిద్దిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు.

ఫొటో సోర్స్, ANI
ఆలయ ప్రతిష్ఠ ఎప్పుడు?
అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం, జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
ట్రస్ట్ ఇప్పటికే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని అతిథులకు ఆహ్వానాల కార్యక్రమం ప్రారంభించింది.
గర్భగుడి పనులు రాత్రీపగలూ తేడా లేకుండా జరుగుతున్నాయని, సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆలయ ప్రతిష్ఠాపనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ, విదేశాల నుంచి అతిథులు హాజరవుతారని చెబుతున్నారు. రామ మందిర పూజారుల ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, ANI
నేపాల్‌లో ఎక్కడి నుంచి ఆ శిలలు తెచ్చారు?
నేపాల్ నుంచి తీసుకొచ్చిన శిలలను విగ్రహాల తయారీకి ఉపయోగించలేదు. అయితే, ఆ రాళ్లను ఎక్కడ ఉంచారు, వాటిని ఎలా ఉపయోగించనున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు నేపాల్, భారతీయ అధికారులతో బీబీసీ మాట్లాడింది.
ఈ కథనం ప్రచురించే సమయం వరకూ ఆ శిలల పరిస్థితి ఏంటనే కచ్చితమైన సమాచారం తెలియలేదు.
అయితే, ఆ శిలలు సురక్షితంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఈ శిలలను నేపాల్ నుంచి అయోధ్యకు పంపాలనే ప్రతిపాదన చేసిన నేపాల్ మాజీ ఉప ప్రధాని, మాజీ హోం మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నేత బిమలేంద్ర నిధి చెప్పారు.
''విగ్రహం తయారీకి ఈ శిల అనుకూలంగా లేదు. అందువల్ల వాటిని రామ మందిర నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోనే సురక్షితంగా ఉంచినట్లు మాకు సమాచారం అందింది'' అని ఆయన అన్నారు.
''విగ్రహం తయారీకి అనువుగా లేకపోయినప్పటికీ, ఈ పవిత్ర శిలలను భక్తుల పూజలు అందుకునేలా మందిరం పరిధిలో ఎక్కడో ఒక చోట ప్రతిష్ఠిస్తారు'' అని నిధి చెప్పారు.
సీతారాముల కల్యాణం రోజున అయోధ్య నుంచి భక్తులు జనక్‌పూర్‌లోని జానకీ ఆలయానికి రావడం ఆనవాయితీగా వస్తోంది.
అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతించిన తర్వాత కాళీగండకీ నది నుంచి శిలలను పంపేలా నేపాల్ ప్రతిపాదనలు చేసింది.
విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి శిలలను పంపించామని, కాంగ్రెస్ నేత బిమలేంద్ర నిధి చొరవతో వాటిని పంపించినట్లు ఆ రాళ్లను పంపించిన బేణి మునిసిపాలిటీ మేయర్ సురత్ కేసీ చెప్పారు.
అయితే, ఈ శిలల నుంచి విగ్రహాలు తయారు చేయలేదని తెలిసి కొంత నిరుత్సాహానికి గురైనట్లు ఆయన చెప్పారు.
''ఇక్కడి నుంచి పంపించిన శిలలతో విగ్రహం తయారు చేయకపోతే వాటిని తిరిగి తీసుకురావాలని చెప్పాను. ఈ శిలల నుంచి విగ్రహం తయారు చేయాలని ఎంత చెప్పినా అలా జరగలేదు'' అని ఆయన అన్నారు.
''మేము కోరేదేంటంటే, ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఆ శిలలను మేం పంపినప్పుడు వాటికి తగిన గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, KULRAJ CHALISE
శిలలను పంపాలని నిర్ణయం
నేపాల్ నుంచి ప్రతిపాదనలు పంపిన తర్వాత ఆ శిలలను పంపించాలని కోరుతూ అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ జానకీ ఆలయ వర్గాలకు లేఖ రాసింది.
ఆ తర్వాత ఈ శిలలను భారత్ పంపాలని నేపాల్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
అనంతరం నేపాల్‌లోని గండకీ ప్రావిన్స్ ప్రభుత్వం, జానకీ ఆలయ యాజమాన్యం సహకారంతో ఆ శిలలను అయోధ్యకు పంపించింది.
అందులో భాగంగా, శిలలను ఎంపిక చేసుకునేందుకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అధికారులు నేపాల్ వచ్చి, కొద్దిరోజులు ఇక్కడే ఉన్నారు.
ఈ శిలలను అయోధ్యకు పంపేటప్పుడు రాగి ఫలకాన్ని కూడా వాటితో పాటు పంపినట్లు అధికారులు తెలిపారు.
రాగితో తయారు చేసిన మూడు ఫలకాలను ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్, గవర్నమెంట్ ఆఫ్ గండకీ ప్రావిన్స్, జానకీ ఆలయానికి కూడా పంపారు.
విగ్రహ తయారీ కోసం ఈ శిలలను పంపుతున్నట్లు ఆ రాగి ఫలకాల్లో రాసి ఉంది.
''నేపాల్ ప్రభుత్వ ఒప్పందం, గండకీ ప్రావిన్స్ నిర్ణయం ప్రకారం, బేణి మునిసిపాలిటీ ఆరో వార్డు పరిధిలోని ధోల్బాగర్ సమీపంలో కాళీగండకీ నది నుంచి రెండు శిలలను రాంలీలా విగ్రహ తయారీ కోసం భారత్‌లోని అయోధ్య ధామ్‌కు పంపిస్తున్నాం. ముఖ్యమంత్రి ఖగ్రాజ్ అధికారి తరఫున జనక్‌నపూర్ ధామ్‌లోని జానకీ ఆలయం నుంచి ఈ శిలలను పంపుతున్నాం'' అని జనవరి 12వ తేదీతో ముద్రించిన ఆ రాగి ఫలకంపై రాసి ఉంది.

ఫొటో సోర్స్, KULRAJ CHALISE
శిలల గురించి అధికారులు ఏమంటున్నారు?
రాగి ఫలకంపై ముద్రించినట్లుగా ఈ శిలలతో విగ్రహం తయారు చేయకపోవడంపై ఆ శిలలను భారత్‌కు పంపిన గండకీ రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక అభివృద్ధి మంత్రిగా ఉన్న సుశీల సింఘాడాను సంప్రదించగా తమకు సమాచారం లేదని ఆమె సమాధానమిచ్చారు.
''ప్రస్తుతం దాని గురించి నాకేం సమాచారం లేదు. తెలిస్తే మీకు చెబుతాను'' ఆమె చెప్పారు.
ఈ విషయం గురించి జనక్‌పూర్‌లోని జానకీ ఆలయం అర్చకులు రామ్‌రోషన్ దాస్‌ని కూడా బీబీసీ సంప్రదించింది.
అయితే, నేపాల్ నుంచి తీసుకెళ్లిన శిలల ప్రస్తుత పరిస్థితి తెలియదని ఆయన అన్నారు. ''దాని గురించి నాకు తెలియదు'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఈ శిలను ఎలా వాడతారు?
ఈ శిలలతో విగ్రహాన్ని తయారు చేయకపోయినా వాటిని శాలిగ్రామం రూపంలో పూజిస్తారని నేపాల్‌కు చెందిన కొందరు ప్రతినిధులు చెప్పారు.
శిలలు పంపించే ప్రక్రియలో భాగస్వామి అయిన కుల్రాజ్ చాలీసె మాట్లాడుతూ ఈ శిలలను మందిరం ఆవరణలోనే ఉంచుతారని తెలిసిందని చెప్పారు.
సాలిగ్రామాల సాంస్కృతిక ప్రాముఖ్యం తెలిసిన వ్యక్తిగా చాలీసెను చెబుతారు.
చిన్న శిలను శాలిగ్రామంగా ప్రతిష్ఠించడంతో పాటు పెద్ద శిలను దానికి పునాదిగా ఉపయోగిస్తామని ట్రస్ట్ చెప్పినట్లు ఆయన చెప్పారు.
అయితే, ఆయన చెప్పిన విషయాలను ట్రస్ట్ అధికారుల నుంచి బీబీసీ ఎలాంటి ధ్రువీకరణ పొందలేదు.
ఈ విషయమై ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌ను సంప్రదించేందుకు బీబీసీ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు.
గత జూన్‌లో నేపాల్‌కి చెందిన జియాలజిస్టుతో అయోధ్య వెళ్లి శిలను పరిశీలించినట్లు చాలీసె తెలిపారు. పెద్ద శిల నుంచి విగ్రహం చెక్కేందుకు ప్రయత్నించినప్పుడు అది అంత దృఢంగా లేదని గుర్తించినట్లు ఆయన చెప్పారు.
వాటికి గౌరవప్రదమైన స్థానం దక్కుతుందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. విగ్రహాల తయారీ కోసం పంపిన శిలలను వేరే విధంగా ఉపయోగిస్తున్నట్లయితే ప్రభుత్వం ఆ విషయాన్ని తెలియజేయాలని ఆయన అన్నారు.
''ఈ శిలలను అయోధ్య రామ మందిరానికి గోధువ(వధువు తరఫున బహుమతి)గా జానకీ ఆలయ యాజమాన్యం అందించింది. నేపాలీ పౌరుల పన్ను సొమ్ముతో వాటిని పంపించాం. కూతురుకి ఇచ్చిన కట్నకానుకలను వెనక్కి తీసుకోలేం. అయితే మీయ్‌తెయి(వరుడి తరఫు) వారు ఆ గోధువను ఎలా ఉపయోగిస్తున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉంది'' అన్నారాయన.
శిల నుంచి ఒక విగ్రహం తయారు చేస్తే అది శిల గుర్తింపును చెరిపేస్తుందని, దానిని శిల రూపంలోనే ఉంచడం ద్వారా దాని ప్రాముఖ్యం మరింత పెరుగుతుందని చాలీసె అన్నారు.
''దేవ్‌శిలను కూడా అదే గౌరవంతో ఉంచుతాం'' అన్నారు.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం హిందూ, ముస్లిం వర్గాల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2019 నవంబర్‌లో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.
అనంతరం 2020 ఆగస్టు 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇవి కూడా చదవండి:
- నటరాజ స్వామి ఆలయం: వాన నీటిని చోళులు ఎగువకు ఎలా ప్రవహింపజేశారు? చిదంబర రహస్యం ఇదేనా?
- భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు.. నదిలో పసిడి ఎలా దొరుకుతోంది?
- పంజాబ్: కెనడా వెళ్లేందుకు అమ్మాయిలతో ఒప్పంద వివాహాలు, పెరుగుతున్న మోసం కేసులు
- ఖతార్: మరణ శిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపు.. వీరిలో ఒకరైన విశాఖ వాసి పాకాల సుగుణాకర్ నేపథ్యం ఏమిటి?
- ముంబయి నుంచి అమెరికా వరకు.. ‘2023’ కీలక పరిణామాలు 15 ఫోటోల్లో!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














