2024: సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? దీని ప్రభావంతో భారత్‌లో ఈ ఏడాది కరవు తప్పదా

ఎల్ నినో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రీకాంత్ బంగాలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2024లో మార్చి నుంచి మే నెలల మధ్య సూపర్ ఎల్ నినో ప్రపంచాన్ని దెబ్బతీసే సూచనలున్నాయి.

అమెరికాకు చెందిన ఎన్‌ఓఏ(నేషనల్ ఓషెనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) సూపర్ ఎల్ నినో వచ్చే అవకాశం ఉందిన కొద్దిరోజుల కిందట అంచనా వేసింది.

అసలు ఈ సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? అది భారత్‌లో వర్షపాతాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎన్‌ఓఏ ఏం చెప్పింది?

మార్చి నుంచి మే వరకూ వేసవి కాలం. ఈ కాలంలోనే ఎల్ నినో అత్యంత తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

ఎన్‌ఓఏ చేసిన వాతావరణ సూచనల ప్రకారం, 2024 మార్చి నుంచి మే నెలల మధ్య సూపర్ ఎల్ నినో ప్రభావం కనిపించే అవకాశం ఉంది. తీవ్రమైన ఎల్ నినో కనిపించే అవకాశం 70 నుంచి 75 శాతం వరకూ ఉన్నట్లు అంచనా వేసింది.

ఆ సమయంలో భూమధ్యరేఖ సమీపంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 శాతం ఉష్ణోగ్రతలు పెరిగినా అది 30 శాతం కంటే ఎక్కువగా పెరిగినట్లే.

1972–73, 1982–83, 1997–98 మరియు 2015–16లోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అనేక దేశాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కరవు, వరదల వంటి విపత్తులను ఎదుర్కొన్నాయి.

2024లోనూ అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చని అంచనా.

ఎల్ నినో

ఫొటో సోర్స్, Getty Images

ఏంటీ సూపర్ ఎల్ నినో?

సూపర్ ఎల్ నినో గురించి తెలుసుకునే ముందు అసలు ఎల్ నినో అంటే ఏంటో తెలుసుకుందాం.

పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే వాతావరణ పరిస్థితిని 'ఎల్ నినో'గా వ్యవహరిస్తారు. పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరగడాన్ని ఎల్ నినో అంటారు.

పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా 26 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే, ఆ వాతావరణ పరిస్థితిని సూపర్ ఎల్ నినో అంటారు.

ఎల్ నినో

ఫొటో సోర్స్, Getty Images

ఎల్ నినో ప్రభావంతో భారత్‌లో కరవు

ప్రపంచంలోనే అతిపెద్దదైన పసిఫిక్ మహా సముద్రంలో బలంగా వీచే గాలులు, వాటి దిశ, ఉష్ణోగ్రత వంటి అంశాలు మొత్తం ప్రపంచ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి.

వాతావరణంలో ఎల్ నినో ప్రభావం ఉన్నప్పుడే భారత్‌లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి.

అదే తరహాలో, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉండనున్న నేపథ్యంలో దేశంలో కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

భారత్‌లో వర్షపాతానికి, ఎల్ నినోకు అవినాభావ సంబంధం ఉన్నట్లు మీడియా నివేదికలతో అర్థమవుతోంది. ఎందుకంటే, 1981 నుంచి ఇప్పటి వరకూ దేశంలో తలెత్తిన కరవు పరిస్థితులు 6 ఎల్ నినోల కాలంలోనే జరిగాయి. చివరగా 2002, 2009 కరవు పరిస్థితుల సమయంలోనూ ఎల్ నినోలు చురుగ్గా ఉన్నాయి.

అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత్‌లో కరవు పరిస్థితులు తలెత్తినప్పుడు ఎల్ నినో దాదాపుగా యాక్టివ్‌గా ఉంది. కానీ, ఎల్ నినో యాక్టివ్‌గా ఉన్న ప్రతి ఏటా భారత్‌లో కరవు పరిస్థితులు ఏర్పడలేదు.

ఉదాహరణకు, 1997 - 98లో ఎల్ నినో ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ దేశంలో కరవు పరిస్థితి లేదు.

ఎల్ నినో

ఫొటో సోర్స్, Getty Images

సూపర్ ఎల్ నినో వర్షపాతంపై ప్రభావం చూపుతుందా?

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఉత్తర అమెరికా దేశాల్లో సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

ఈ సూపర్ ఎల్ నినో ప్రభావం భారత్‌పై ఎలా ఉండొచ్చనే విషయంపై వ్యవసాయ, వాతావరణ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామచంద్ర సబ్లేతో బీబీసీ మాట్లాడింది.

''తీవ్ర కరవు వచ్చే అవకాశం ఉందన్న భయం అవసరం లేదు. ఎందుకంటే కరవుకు ఎల్‌ నినో మాత్రమే కారణం కాదు. దానికి మరో ముఖ్య కారణం వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజెస్)'' అని రామచంద్ర అన్నారు.

''గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వాయువులు, నైట్రస్ ఆక్సైడ్ స్థాయిలు పెరిగిపోవడమే క్లైమేజ్ చేంజ్. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్షోగ్రత పెరిగింది. అలా ఉష్ణోగ్రతలు పెరగడంతో గాలిలో ఒత్తిడి తగ్గుతుంది. అలా ఒత్తిడి తగ్గిన చోటుకు గాలులు బలంగా వీస్తాయి. అందువల్ల ఒకచోట భారీ వర్షాలు, మరోచోట కరవు పరిస్థితులు వంటివి తలెత్తుతాయి. క్లైమేట్ చేంజ్ కారణంగా ఇలా జరుగుతుంది'' అన్నారాయన.

ఎల్ నినో

ఫొటో సోర్స్, Getty Images

''ఎల్ నినో మార్చి వరకు ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు జూన్ వరకు ఉంటుందని చెబుతున్నారు. మన దేశంలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేసవి కాలం కావడంతో వాతావరణం వేడిగా ఉంటుంది. ఎల్ నినో కొనసాగితే, ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మూడు నెలల ఉష్ణోగ్రతలు జూన్‌లో రుతుపవనాలపై ప్రభావం చూపితే దానిని ఎల్ నినో ఎఫెక్ట్‌గా భావించొచ్చు" అని సీనియర్ వాతావారణ శాస్త్రవేత్త మానిక్‌రావు ఖూలే అన్నారు.

అయితే, సూపర్ ఎల్ నినో వాతావరణంలో యాక్టివ్‌గా ఉందో లేదో ఎప్పటికి తెలుస్తుందని అడిగినప్పుడు మానిక్ రావు ఇలా చెప్పారు.

''భారత వాతావరణ శాఖ ఏప్రిల్‌లో రుతుపవనాలకు సంబంధించిన తొలి సూచన చేస్తుంది. అప్పటి నుంచి పరిశీలన కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తారు. కాబట్టి, సూపర్ ఎల్ నినో ఉందా? లేదా? అనే విషయంపై ఏప్రిల్‌లో మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది'' అన్నారు.

రానున్న రోజుల్లో ఎల్ నినో, సూపర్ ఎల్ నినో, క్లైమేట్ చేంజ్ ప్రభావం ఎలా ఉండబోతున్నదనే విషయం తెలియాలంటే మరికొద్ది నెలల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)