గుండ్లకమ్మ ప్రాజెక్ట్: నీరు నిండగానే గేట్లు కొట్టుకుపోతున్నాయి... దీనిపై నిపుణులు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?

గుండ్లకమ్మ ప్రాజెక్ట్
ఫొటో క్యాప్షన్, కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్ట్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిస్థితి రానురాను దిగజారుతోందా? నీరు నిండగానే ప్రాజెక్టు గేట్లు కొట్టుకోవడంతో ఎంతమేర నష్టపోతున్నారు? అసలేం జరుగుతోంది?

నైరుతి, ఈశాన్య రుతుపవనాల మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్‌లో వాటి ప్రభావం అత్యంత తక్కువగా ఉండే ప్రాంతం ప్రకాశం జిల్లా.

జిల్లా వాసుల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు కొంత మేర ప్రయోజనకరంగా మారింది.

కానీ ఇప్పుడా ప్రాజెక్టు పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారవుతోంది. ఏటా ఒక్కో గేటు చొప్పున కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది.

ప్రకాశం జిల్లాలోని 80వేల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు, ఒంగోలు నగరం సహా పలు మండలాలకు తాగునీరు అందించాల్సిన గుండ్లకమ్మ ప్రాజెక్టులో ప్రతీ సీజన్‌లో ఒక్కో గేటు కొట్టుకుపోతున్న కారణంగా నీటిని నిల్వచేయడం ప్రశ్నార్థకమవుతోంది.

సీజన్‌లో నీటిని నిల్వచేసి వేసవి కాలంలో కూడా తాగునీటి అందించాల్సిన ఈ రిజర్వాయర్ పరిస్థితి ఎందుకిలా అవుతోందన్నది ఇప్పుడు జిల్లా వాసులను కలచివేస్తోంది.

పైగా ప్రాజెక్ట్ నిర్మించి నిండా దశాబ్దన్నర కాలం పూర్తికాకముందే ఇలాంటి పరిస్థితి రావడం మీద ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం సమీపంలోని కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందన్నది బీబీసీ పరిశీలించింది.

కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు

లక్షలమందికి ఆధారమైన ప్రాజెక్టు పరిస్థితేంటి?

గుండ్లకమ్మ నది మీద ప్రాజెక్ట్ నిర్మించి, ఈ నీటిని మళ్లించడం ద్వారా ప్రకాశం జిల్లా వాసుల కల నెరవేర్చాలని దశాబ్దాల కాలం నుంచి జిల్లా రైతాంగం నుంచి ప్రభుత్వానికి అభ్యర్థనలు చేరుతూనే ఉన్నాయి.

ఎట్టకేలకు చివరకు 2004 ఎన్నికలకు కొన్ని నెలల ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.

అనంతరం ప్రభుత్వం మారి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేశారు. 2008లో ప్రాజెక్టును ప్రారంభించారు.

మొత్తం 15 గేట్లతో నిర్మించిన ప్రాజెక్టులో 3.8 టీఎంసీల నీటిని నిల్వ చేసి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, ఒంగోలు సహా 12 మండలాల ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 2.72 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.

గుండ్లకమ్మ నుంచి ఒంగోలు నగర తాగునీటి అవసరాల కోసం నీటిని తరలించే పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆశించిన మేర లక్ష్యాన్ని చేరుకున్నట్టు కనిపించడం లేదు.

అయితే, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గుండ్లకమ్మ పూర్తికావడం అందరికీ ఉపశమనం కల్పించింది.

ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత మూడు నియోజకవర్గాల పరిధిలోని లక్షల మందికి తాగునీటి కష్టాలు తీర్చేందుకు దోహదపడింది.

కరువు కాలంలో సైతం గుండ్లకమ్మ ప్రధాన వనరుగా మారింది. సాగునీరు అందుబాటులోకి రావడంతో వేల ఎకరాల భూమి ధీమాగా సాగు చేసే అవకాశం వచ్చింది.

ఇంతటి కీలకమైన ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత దశాబ్దన్నర కాలం గడవకముందే గేట్లు కొట్టుకుపోతున్నాయి.

వరుసగా 2022, 23 సీజన్లలో రెండుసార్లు రెండు ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం విస్మయకరంగా మారింది.

ప్రాజెక్టులో నీరు చేరగానే గేట్లు కొట్టుకుపోతుండడం వల్ల నిల్వ ఉంచాల్సిన నీటిని వృథాగా సముద్రం పాలు చేయాల్సి వస్తోంది.

కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు
ఫొటో క్యాప్షన్, 8 డిసెంబర్ 2023న కొట్టుకుపోయిన ప్రాజెక్ట్ గేట్

నీరు నిండగానే కొట్టుకుపోతున్న గేట్లు..

2023 డిసెంబర్ 8న గుండ్లకమ్మ ప్రాజెక్టుకి చెందిన గేటు హఠాత్తుగా కొట్టుకుపోయింది. ఇప్పటికీ ఆ గేటు ప్రాజెక్టు దిగువ భాగంలో కనిపిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన నాటికి సుమారుగా 2.5 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది.

ప్రాజెక్టు రెండో నెంబర్ గేటు కిందకు కొట్టుకుపోవడంతో సుమారు ఒక టీఎంసీ నీటిని వృథాగా సముద్రంలోకి వదాల్సి వచ్చింది.

గతేడాది ఆగష్టు 31న ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. మూడో నెంబర్ గేటు విరిగిపోయింది. అప్పటికి ప్రాజెక్టులో నిల్వ ఉన్న 3.4 టీఎంసీల నీటిలో 2 టీఎంసీల నీరు వృథాగా దిగువకు పోయింది. ఇప్పటికే ఆ గేటుకి ప్రత్యామ్నాయంగా కొత్త గేటు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.

స్టాప్‌లాక్ సహాయంతో నీటిని ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం జరిగింది.

ఆ మూడో నెంబర్‌ గేటును పూర్తిస్థాయిలో సిద్దం చేయకముందే, ఇటీవల రెండో నెంబర్ గేటు కొట్టుకుపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

అది మాత్రమే కాక, మరికొన్ని గేట్లు కూడా ప్రమాదకరంగా మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

గత సీజన్లో వర్షాలు సకాలంలో కురవడంతో ఆగష్టులోనే ప్రాజెక్టు నిండింది.

ఈసారి వర్షాభావ పరిస్థితుల మూలంగా మొన్నటి మిగ్‌జాం తుపాను తాకిడి వరకూ ఆశించిన మేర వర్షాలు కురవలేదు.

తీరా వర్షాలు పడి, ప్రాజెక్టులో నీరు చేరాక గేట్లు విరిగిపోయి, నీరు వృథాగా పోతుండటంతో, నీటి నిల్వకు ఆస్కారం లేకుండాపోయింది.

గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద పరిస్థితి
ఫొటో క్యాప్షన్, ప్రాజెక్టు నిర్వహణతీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

'అధికారుల నిర్లక్ష్యానికి మేం పరిహారం చెల్లిస్తున్నాం'

గుండ్లకమ్మ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతంలో వరితో పాటుగా వివిధ మెట్ట పంటల సాగు విస్తృతంగా జరుగుతుంది. అందులో ఆరు తడి పంటలు కూడా ఉంటాయి. మిరప, పొగాకు విస్తృతంగా సాగులో ఉంటుంది.

కనీసంగా ఈ ఏడాది ఆరు తడి పంటల వరకైనా నీటి కొరత లేకుండా అందిస్తారని ఆశిస్తే గేట్లు కొట్టుకుపోవంతో తమ ఆశలపై నీళ్లు జల్లినట్టయ్యిందని రైతులు అంటున్నారు.

“ప్రతీ సీజన్లోనూ ఇలా గేట్లు కొట్టుకుపోతే ఇక ప్రాజెక్టు ఎందుకు?” అని ప్రశ్నించారు మల్లవరం గ్రామానికి చెందిన మహిళా రైతు పారా హైమావతి.

“ప్రాజెక్టు నిర్మించి ప్రయోజమేంటి? ఆ ఫలితం మాకు అందేదెలా? ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. వెంటనే ప్రాజెక్టు మొత్తం పరిశీలించి, పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. కనీసం పశువులకు తాగునీరు లేక, కష్టాలు పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మా ఆశలు తుంచేస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి రైతులు పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలి” అని ఆమె అన్నారు.

వరుసగా రెండు సీజన్లలో నీటిని కోల్పోయామని, ఇప్పటికైనా బాగు చేయిస్తే మంచిదని హైమవతి కోరారు.

కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు
ఫొటో క్యాప్షన్, దెబ్బతిన్న గేటు భాగం

నిర్వహణ వైఫల్యమా, నిర్మాణ లోపమా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అదే సమయంలో పులిచింతల ప్రాజెక్టు గేటు కూడా ఒకటి విరిగిపోయింది.

గడిచిన రెండేళ్లలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి రెండు గేట్లు విరిగిపోయాయి. దాంతో నిర్వహణా వైఫల్యం అంటూ పలు విమర్శలు వస్తున్నాయి.

అదే సమయంలో గుండ్లకమ్మ నిర్మాణం జరిగి పదిహేనేళ్లకే ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో నిర్మాణ లోపాల మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టులు, చివరకు ప్రకాశం, కాటన్ బరాజ్ వంటివి కూడా నిత్యం నీటిలో నానుతున్నప్పటికీ గేట్లు విరిగిపోయిన అనుభవాలు లేవు.

అలాంటిది 2008లో ప్రారంభమయిన ప్రాజెక్టులో అప్పుడే గేట్లన్నీ తప్పుబట్టి, ఒక్కో గేటు విరిగిపోతుండడం మీద రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

రిటైర్డ్ చీఫ్‌ ఇంజనీర్ ఆర్ రాఘవేంద్ర రావు దీనిపై బీబీసీతో మాట్లాడుతూ, "ప్రాజెక్టు గేటు నిర్మించిన పదేళ్లు దాటగానే విరిగిపోయే పరిస్థితి రావడం ఆశ్చర్యంగా ఉంది. దశాబ్దాల తరబడి ధీమాగా ఉండాల్సిన గేట్లకు ఇలాంటి పరిస్థితి రావడం మీద పూర్తిస్థాయి పరిశీలన జరగాలి. నిర్వహణలోపాలు కూడా కారణం కావచ్చు. కానీ, గేట్ల నాణ్యత మీదనే సందేహాలు వస్తున్నాయి. ప్రతీ గేటు తుప్పుపట్టి ఉంది. ఇప్పుడు ఒక్కో గేటు సరిచేసుకుంంటున్నా ఏటా ఒకటి రెండు గేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి" అని అన్నారు.

ప్రతీ సీజన్‌లోనూ వరద తాకిడికి తగ్గట్టుగా గేట్లను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పెద్ద వరదలు వచ్చినప్పుడు దిగువ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని అయన అన్నారు.

గుండ్లకమ్మ ప్రాజెక్ట్

నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది?

ప్రాజెక్టుల నిర్వహణలో నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. నిర్దిష్ట గడువులో గేట్లను పరిశీలించడం, అవసరమైన చోట గ్రీజ్ వంటివి ల్యూబ్రికెంట్స్ రాయడం సహా పలు నిర్వహణ పనులుంటాయి.

ప్రాజెక్ట్ నిర్వహణకు ఇంత మొత్తం ఖర్చు అంటూ ఉండదు. ఆ ప్రాజెక్ట్ నిర్మించిన ప్రాంతం, అక్కడి వరదల తాకిడి, ఎంతకాలం క్రితం నిర్మించారు? వంటి అంశాలను బట్టి నిర్వహణ ఖర్చు ఉంటుంది.

అయితే, ఇటీవల కాలంలో ప్రాజెక్టు మెయింటైన్స్ స్టాఫ్ నియామకాలు జరగడం లేదు. ముఖ్యంగా లస్కర్లు, ఎన్ఎంఆర్ వంటి పోస్టులు లేవు.

దాంతో ఖాళీ అయిపోతున్న సిబ్బంది స్థానంలో కొత్తవారు లేకపోవడంతో నిర్వహణ సమస్యగా మారుతోంది. పర్యవేక్షణ కూడా కొరవడింది.

సహజంగా వరదల సీజన్‌లోనే గేట్లు ఎక్కువగా దెబ్బతింటాయి. ఆ ప్రాజెక్టు గేట్లు ఎంత సైజులో ఉన్నాయన్న దానిని బట్టి, గేట్లు మార్చడానికి ఖర్చు కనీసంగా రూ. 50 లక్షల వరకూ అవుతుంది.

నిధుల కొరత ఉందా?

నీటిపారుదల శాఖలో నిధుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నిర్వహణ పేరుతో విడుదల చేస్తున్న నిధులు సరిపోవడం లేదు.

ఏ ప్రాజెక్టుకి ఎంత మొత్తం విడుదల చేశారు? అందులో ఖర్చు చేసిందెంత? అనే వివరాలు మాత్రం లేవని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

దాదాపుగా అన్ని ప్రాజెక్టుల్లోనూ నిర్వహణ నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఇదే ప్రాజెక్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడానికి కారణాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న అంశాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. కానీ సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.

ముఖ్యంగా, నిర్వహణా సిబ్బంది కొరత కూడా ఉన్నట్టు బీబీసీ పరిశీలనలో కనిపించింది. దానికి తోడుగా అవసరమైన నిధులు విడుదల కాకపోవడంతో నిర్వహణా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

అంబటి రాంబాబు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మంత్రి అంబటి రాంబాబు

ప్రాజెక్టుపై మంత్రి ఏమన్నారు?

వాస్తవానికి గుండ్లకమ్మ్ర ప్రాజెక్టు నిర్వహణ కోసం 2019కి ముందు ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే వాటిని నిర్వహణకు బదులుగా కేవలం సుందరీకరణ అంటూ వృథా చేయడం వల్లనే ప్రస్తుత సమస్యలు వస్తున్నాయని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో అవసరమైన నిధులు విడుదల చేయడంలో జరిగిన జాప్యం కూడా ఇలాంటి వరుస ప్రమాదాలకు కారణమని స్పష్టంగా కనిపిస్తోంది.

కానీ, ప్రభుత్వం మాత్రం గతంలో నిధుల దుర్వినియోగమే కారణమంటూ విమర్శలకు పూనుకుంటోంది.

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ "డ్యామ్ సేఫ్టీ కమిటీలు నివేదికలు ఇచ్చాయి. డ్యామ్‌ను పరిశీలించి రివ్యూ చేశారు.

2020 వరకూ వచ్చిన నివేదికల ప్రకారం గేట్లు, గడ్డర్లు తుప్పు పట్టినట్టు గుర్తించారు. రిపేర్లు అత్యవసరం అని పేర్కొన్నారు. వాటిని సరిచేయాల్సిన టీడీపీ ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుంది.

కరోనా సహా వివిధ కారణాలతో వాటిని సరిచేయాల్సిన పనులు ఆలస్యమయ్యాయి.

స్పిల్‌వే ప్రాంతం అంతంటా సరిచేయాలని రూ.9.14 కోట్లు విడుదల చేస్తూ ఈ ప్రభుత్వం జీవో ఇచ్చింది. సరిగ్గా పనులు ప్రారంభించే దశలో తుపాన్ వచ్చింది.

యుద్ధ ప్రాతిపదికన తాజాగా గేటుకి అడ్డంగా స్టాప్ లాక్ పెట్టగలిగాం. కొంత నీటిని నిల్వ చేశాం" అని ఏపీ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు వివరించారు.

ఈ ఏడాది వర్షాలు సజావుగా లేకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)