ముంబయి పేలుళ్ళ సూత్రధారి, లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని కోరిన భారత్... ఇదీ పాకిస్తాన్ రియాక్షన్

ఫొటో సోర్స్, ARIF ALI/AFP VIA GETTY IMAGES
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్‌ను కోరింది.
ఈ మేరకు కొద్ది రోజుల కిందట పాకిస్తాన్‌కు ఒక లేఖ పంపినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం వెల్లడించారు.
అయితే, ఈ అభ్యర్థనను స్వీకరించిన పాకిస్తాన్ 'రెండు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం లేదు' అని తెలిపింది.

ఫొటో సోర్స్, All India Radio News
భారత విదేశాంగ శాఖ ఏం చెప్పింది?
హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ అధికారికంగా కోరినట్లు గురువారం నుంచి వార్తలు వినిపించాయి.
అయితే, శుక్రవారంనాడు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విషయాన్నిధ్రువీకరించారు. విలేఖరులతో మాట్లాడుతూ, సయీద్ అప్పగింతను కోరుతూ కొన్ని పేపర్లతో పాటు ఒక లేఖను పాకిస్తాన్‌కు పంపామని ఆయన వెల్లడించారు.
సయీద్ హఫీజ్ గత కొన్నేళ్లుగా భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడని, పలు కేసుల్లో విచారణకు ఆయనను భారత్‌కు అప్పగించాలని ఆధారాలను చూపిస్తూ పాకిస్తాన్‌ను కోరినట్లు బాగ్చి తెలిపారు.
ఆయన మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ముందు ప్రస్తావిస్తున్నామని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఎలా స్పందించింది?
ఈ వ్యవహారంపై పాకిస్తానీ పత్రిక డాన్ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించింది.
మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ తమకు లేఖ అందినట్లు శుక్రవారం ధ్రువీకరించారు
మనీలాండరింగ్ కేసులో హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారతదేశం నుంచి తమకు అభ్యర్థన వచ్చిందని ఆమె చెప్పారు.
అయితే, వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కూడా ఆమె వెల్లడించారు.
‘‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య అలాంటి ద్వైపాక్షిక ఒప్పందం ఏదీ లేదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం’’ అని ఆమె అన్నారు.
హఫీజ్ కొడుకు గురించి భారత్ ఏం చెప్పింది?
హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ పాకిస్తాన్‌లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్న వార్తలను కూడా తాము పాకిస్తాన్‌కు గుర్తు చేశామని అరిందమ్ బాగ్చీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘‘ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై మనం వ్యాఖ్యలు చేయం. కానీ, పొరుగు దేశం పాకిస్తాన్‌లో రాడికల్ టెర్రరిస్ట్ సంస్థలు భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. ఇది కొత్త విషయం కాదు. వారిని ప్రోత్సహించడం ఆ దేశపు విధానాలలో భాగం. ఇలాంటి కార్యకలాపాలు ఈ ప్రాంతపు భద్రపై ప్రభావం చూపుతాయి’’ అని బాగ్చి అన్నారు.
‘‘భారతదేశపు భద్రతకు సమస్యగా మారే ఏ అంశాన్నైనా మేం పరిశీలిస్తూనే ఉంటాం’’ అని ఆయన అన్నారు.
2022లో విడుదల చేసిన భారత ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, భారత్‌లో దాడులకు ఉగ్రవాదులను రిక్రూట్ చేయడం, వారికి డబ్బు ఏర్పాటు చేయడం, దాడులకు ప్లాన్ చేయడంలో తల్హా సయీద్ ముఖ్య పాత్ర పోషించారు.
పాకిస్తానీ పత్రిక డాన్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, 2024లో జరగబోయే ఎన్నికలలో పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఈ పార్టీకి హఫీజ్ సయీద్ మద్దతు ఉందని భావిస్తున్నారు.
ఈ పార్టీ తరఫున తల్హా సయీద్ లాహోర్‌లోని NA-127 ప్రాంతం నుండి జాతీయ అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థిగా నిలబడ్డారు.

ఫొటో సోర్స్, ARIF ALI/AFP VIA GETTY IMAGES
హఫీజ్ సయీద్ ఎవరు?
2008 ముంబై బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ అని భారత్ అనుమానిస్తోంది. మిలిటెన్సీకి సంబంధించిన పలు కేసుల్లో భారత్‌లోని భద్రతా సంస్థలు హఫీజ్ కోసం వెతుకుతున్నాయి.
ఐక్యరాజ్యసమితి 2008లో హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించగా, ఇంటర్‌పోల్ కూడా హఫీజ్ సయీద్‌కు నోటీసు జారీ చేసింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాదుల జాబితా ప్రకారం....1950లో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జన్మించిన హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా చీఫ్‌గా లాహోర్‌లో నివసిస్తున్నారు.
హఫీజ్ సయీద్ మొదట్లో పాకిస్తాన్ నిషేధిత సంస్థ జమాత్-ఉద్-దవా (లష్కరే తోయిబా కు చెందిన స్వచ్ఛంద విభాగం) నాయకుడు. దీనిని భారతదేశం తీవ్రవాద సంస్థగా పరిగణించింది.
హఫీజ్ సయీద్ 1990లో లష్కరే తోయిబాను స్థాపించాడు. ఈ సంస్థను కూడా భారత్ నిషేధించినప్పుడు, అతను జమాత్-ఉద్-దవా వాల్-ఇర్షాద్ అనే పాత సంస్థను తిరిగి స్థాపించాడు. 2002లో దాని పేరు జమాత్ ఉద్ దవాగా మార్చబడింది.
జమాత్-ఉద్-దవా తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా చెబుతున్నప్పటికీ, ఇది స్వచ్ఛంద సేవా సంస్థ అని, సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని ఆ సంస్థ చెప్పుకుంటోంది.

ఫొటో సోర్స్, AFP
హఫీజ్ ఎక్కడ?
డాన్ పత్రిక కథనం ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో మీడియాలో హఫీజ్ సయీద్ ఉనికి చాలా తక్కువగా ఉంది.
పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా, 2017 ప్రారంభంలో, పాకిస్తాన్ ప్రభుత్వం అతని సంస్థకు నిధులను ఆపడానికి అనేక చర్యలు తీసుకుంది . అలాగే హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచింది.
అయితే, ఆయనను గృహనిర్బంధంలోనే కొనసాగించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ఈ ఏడాది చివర్లో లాహోర్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన విడుదల చేశారు.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చినందుకు గాను హఫీజ్ సయీద్‌కు గత ఏడాది పాకిస్తాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అయితే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (FATF) మానిటరింగ్ జాబితా నుంచి తన పేరు లేకుండా చేసుకోవడంలో భాగంగానే పాకిస్తాన్ హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచింది.
హఫీజ్ సయీద్ 2019 నుండి లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
- భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు.. నదిలో పసిడి ఎలా దొరుకుతోంది?
- పంజాబ్: కెనడా వెళ్లేందుకు అమ్మాయిలతో ఒప్పంద వివాహాలు, పెరుగుతున్న మోసం కేసులు
- ఖతార్: మరణ శిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపు.. వీరిలో ఒకరైన విశాఖ వాసి పాకాల సుగుణాకర్ నేపథ్యం ఏమిటి?
- ముంబయి నుంచి అమెరికా వరకు.. ‘2023’ కీలక పరిణామాలు 15 ఫోటోల్లో!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














