పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ పార్టీ గుర్తు 'క్రికెట్ బ్యాట్'పై నిషేధం ఎందుకు... ఆయన ఇకపై ఎన్నికల్లో పోటీ చేయలేరా?

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
- రచయిత, షుమైలా జెఫ్రీ
- హోదా, బీబీసీ న్యూస్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి8న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయగలరా లేదా అనే చర్చ జరుగుతోంది. తోషాఖానా కేసులో మూడేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ తన జైలుశిక్షను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
హైకోర్టు తిరస్కరణతో పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఎన్నికల్లో పోటీచేసే విషయం సందిగ్థంలో పడింది.
జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని పీటీఐ కార్యకర్తలు ఆశతో ఉన్నారు. కానీ హైకోర్టు నిర్ణయం ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మరోపక్క సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు షా మహమూద్ ఖురేషీకి సుప్రీం కోర్టు శుక్రవారం (డిసెంబర్22)న బెయిల్ మంజూరుచేసింది.
ఇంకా మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదల కాలేకపోయారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఎన్నికల సంఘం రానున్న ఎన్నికల్లో పీటీఐ అధికారిక గుర్తును ఉపయోగించుకోకూడదని ఆదేశాలు జారీచేసింది.
దీంతో ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన పార్టీకి సమస్యలు మరింతగా పెరిగాయి.
ఎన్నికల నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని పీటీఐ కోరింది. ఈమేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుపైనా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ వచ్చే ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ పోటీచేయలేరనే విషయం స్పష్టమైపోతోందని పాకిస్తానీ విశ్లేషకులు నమ్ముతున్నారు.
పాకిస్తాన్ చట్టాల ప్రకారం నేరారోపణలు రుజువైన రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.
కానీ, తోషాఖాన్ కేసులో దిగువ కోర్టు ఈ ఏడాది ఆగస్టు5న ఇమ్రాన్ ఖాన్‌ను దోషిగా నిర్థరిస్తూ మూడేళ్ళ జైలుశిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పు ఫలితంగా ఇమ్రాన్ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోవడంతోపాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హతను కోల్పోయారు.
అయితే, కొన్నివారాల తరువాత ఇమ్రాన్‌ఖాన్ తనకు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. కానీ అక్కడా ఆయనకు ఊరట దక్కలేదు.

ఫొటో సోర్స్, REUTERS
నిరాశే... కానీ, సుప్రీం కోర్టు ఉందిగా
పాకిస్తాన్‌లో ఎన్నికలు ఇంకా కొన్నివారాలే ఉన్నవేళ ఇమ్రాన్ ఖాన్ జైలుశిక్షను రద్దుచేయించేందుకు, ఆయనను ఎన్నికల్లో నిలిపేందుకు పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ- ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) కోర్టు ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ పార్టీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
‘‘తోషాఖానా కేసులో కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని వేసిన ఇమ్రాన్‌ఖాన్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఇమ్రాన్ పై ఉన్న అనర్హత కొనసాగుతుంది’’ అని ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది, అధికార ప్రతినిధి నయీమ్ హైదర్ పంజుతా సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. అలాగే హైకోర్టు ఉత్తర్వులపైనా సుప్రీంను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు.
ఈ వారం ప్రారంభంలో ఇమ్రాన్‌ఖాన్ లాహోర్, ఇస్లామాబాద్, మైనావాలీ జాతీయ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేస్తారని పీటీఐ చెప్పింది.
సహజంగా పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఎన్నికల్లో తాము గెలిచే అవకాశాలు మెరుగుపరచుకోవడానికి వీలుగా ఒకటి కంటే ఎక్కువస్థానాలలో పోటీచేస్తుంటారు.
కానీ, ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుతో పీటీఐ ఆశలన్నీ గల్లంతయ్యాయి.
దీనిపై పీటీఐ న్యాయవాది సర్దార్ లతీఫ్ మాట్లాడుతూ పీటీఐ తగిన ప్రణాళికతో ఉందని, ప్రత్యామ్నాయ మార్గాలతో సిద్ధంగా ఉందని చెప్పారు.
‘‘దురదృష్టవశాత్తూ ఇదంతా ఓ పాత కథ. అదే స్క్రిప్ట్. మైనస్ వన్ ఫార్మూలాను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి, పాకిస్తాన్ ముస్లీం లీగ్ కు అన్వయించారు. నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టోను రాజకీయాలకు, అధికారానికి దూరంగా ఉంచారు’’ అని చెప్పారు. కానీ ఇదెప్పుడు తగిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఇమ్రాన్ వంతు వచ్చింది. ఈ క్రమంలో ప్రాథమిక హక్కులన్నీ ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు రద్దుచేస్తుందనే ఆశతో ఉన్నాం’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పీటీఐపై ప్రభావం
ఇమ్రాన్‌ఖాన్ ఎన్నికల్లో పోటీచేయడం కుదరని పని అనే భావనలో చాలామంది విశ్లేషకులు ఉన్నారు. రాజకీయ వ్యాఖ్యాత సుహైల్ వాదైచ్ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఆయన పోటీ చేయలేరని చెప్పారు.
‘‘ఇదేమీ అదర్శవంతమైన పరిస్థితి కాదు. సాధారణ ఎన్నికలలో పోటీ చేసే పార్టీలన్నింటికీ సమాన అవకాశాలు కనిపించడంలేదు. ఇప్పటికే పీటీఐ ఏకాకి అయిపోయింది. అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది.
ఓ రాజకీయ పార్టీగా పీటీఐ భవితవ్యం ఏమిటనే విషయంలో స్పష్టత లేదు. ఆ పార్టీలోని చాలామంది అగ్రనేతలు పార్టీని వదిలిపెట్టేలా ఒత్తిళ్ళు ఉన్నాయి. పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నవారిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ ఎన్నికలు పీటీఐకు ఓ పెద్ద అవకాశామని నేను కూడా భావిస్తున్నాను. పీటీఐ పార్లమెంటులో కొన్ని సీట్లు గెలుచుకోగలదు’’ వాదైచ్ చెప్పారు.
‘‘ఇమ్రాన్‌ఖాన్, ఇతర అగ్రనాయకుల గైర్హాజరీ తప్పకుండా ఆ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. కానీ ఆ పార్టీ తను ఎంత ప్రయత్నించగలదో అంతా ప్రయత్నించాలి. మార్పు వచ్చేవరకు ఓపిక పట్టాలి’’ అని ఆయన వివరించారు.
ఇలాంటి సానుకూల దృక్ఫథం పార్టీ శ్రేణులలో నింపడం చాలా సంక్లిష్టతతోనూ, కష్టంతోనూ కూడుకన్నపని. పీటీఐ టిక్కెట్లు పొందిన నేతలు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని చెపుతున్నారు.
‘‘మా అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా పోలీసు, ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అడ్డుకోవడినికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు.. కొన్నిచోట్ల నామినేషన్ పత్రాలను కూడా తస్కరిస్తున్నారు’’ అని పీటీఐకు చెందిన షోయబ్ షహీన్ వివరించారు.
నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలంటూ పీటీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ తదనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఈమేరకు ఎన్నికల కమిషనర్ ను కలవాలని పీటీఐకు సుప్రీం కోర్టు తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
ప్రచారం నుంచి ఎన్నికల గుర్తు దాకా సంక్షోభమే
ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తన గొంతు విప్పడానికి, ఆందోళన వెలిబుచ్చడానికి సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుంటోంది.
కొన్నిరోజుల ముందు పీటీఐ ఓ ఆన్‌లైన్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించగా, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు నియంత్రణలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆగస్టు 5వ తేదీ నుంచి ఇమ్రాన్ జైల్లో ఉండటం వలన ఆయన ఓటర్లను, మద్దతుదారులను కలుసుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో కృత్రిమ మేథ ద్వారా పీటీఐ ఇమ్రాన్ ఖాన్ వీడియో సందేశాన్ని ఒకదానిని రూపొందించింది.
పరిస్థితులలో మార్పురావాలని కోరుకుంటే పీటీఐకు ఓటు వేయాలని ఇమ్రాన్’ ఖాన్ ఆ వీడియో సందేశంలో కోరారు.
ఈ సృజనాత్మకత ఇమ్రాన్ ఖాన్ స్వయంగా హాజరుకాని లోటును పూడ్చలేకపోతోంది.
మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే పీటీఐ ప్రశ్నలు సంధించడం ఆ పార్టీకి పెద్ద అవరోధమని విశ్లేషకుడు ముజిబుర్ రహమాన్ షమీ చెప్పారు.
పీటీఐ తన ఎన్నికల గుర్తుగా వచ్చే ఎన్నికలలోనూ, సంస్థాగత ఎన్నికలలోనూ క్రికెట్ బ్యాట్‌ను ఉపయోగించరాదంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీచేసింది.
‘‘క్రికెట్ బ్యాట్ గుర్తును ఉపయోగించుకోరాదనే ఆదేశం పీటీఐకు శరాఘాతమే. దీనర్థం పీటీఐ రాబోయే ఎన్నికలలో ఒక రాజకీయపార్టీగా పోటీచేయలేదు అని. ఇలాంటి పరిస్థితులలో పీటీఐ అభ్యర్థులను స్వతంత్రులుగా పరిణగించాలి, లేదా వారు ఎన్నికల్లో నామమాత్రంగా పోటీచేయాలి లేదంటే ఎన్నికల గుర్తు కోసం వారేదైనా చిన్న పార్టీతో రాజీపడాలి’’ అని ముజిబుర్ విశ్లేషించారు.
‘‘ఇది పీటీఐ ఓటర్లలో గందరగోళం సృష్టిస్తుంది. వారి ఓటు బ్యాంకుపైనా తీవ్ర ప్రభావం పడుతుంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, RAHAT DAR/EPA-EFE/REX/SHUTTERSTOCK
పీటీఐ మనుగడ సాధ్యమేనా?
పీటీఐ ఈసారి నిస్సహాయంగా ఉందని, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని సుప్రీం కోర్టును కోరుతోందని, దాంతోపాటు మే 9నాటి ఘటనల ప్రభావం ఆ పార్టీపై ఉందని సీనియర్ పాత్రికేయుడు సలీమ్ బుఖారీ చెప్పారు. పీటీఐను ఈ కష్టాలు దీర్ఘకాలం వెంటాడేలా ఉన్నాయన్నారు.
మే9 నాటి ఘటనలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయని, పూర్తిగా నిస్సహాయతలోకి నెట్టేశాయని తెలిపారు.
ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద మే9న ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేసిన తరువాత పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో మిలటరీ స్థావరాలను ఎక్కువ లక్ష్యంగా చేసుకున్నారు.
ఇప్పుడు చాలామంది పీటీఐ నాయకులు పోటీ చేయడంలేదు. ఇలాంటి పరిస్థితులలో పీటీఐ తన న్యాయవాదులను బరిలోకి దింపుతోంది. ఆ పార్టీ చాలామంది న్యాయవాదులకు టిక్కెట్లు ఇస్తుందని నమ్ముతున్నారు అని సలీమ్ బుఖారీ వివరించారు.
కానీ ఈ లాయర్లందరికీ నేరుగా ప్రజలతో సంబంధాలు లేవు. ఇలాంటి సవాళ్ళను పీటీఐ ఎలా ఎదుర్కొని నిలదొక్కుకుంటోందో చూడాలి అని తెలిపారు.
‘‘ఇప్పుడే ఏం చెప్పాలి. ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయం ’’ అని బుఖారీ చెప్పారు.
‘‘చాలామంది ఓటర్లు ఇమ్రాన్‌ఖాన్‌ను చూసి ఓటేస్తారు. కానీ, ఇప్పుడు ఆయనే పోటీలో లేరు. ఇది పీటీఐ విజయావకాశాలను దెబ్బతీస్తుంది. తిరిగి అధికారంలోకి వచ్చే పీటీఐ అవకాశాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది’ మహ్మద్ సర్ఫరాజ్ అనే విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
‘‘పాకిస్తాన్ లో నిజమైన సమస్య అధికారంలో ఎవరు ఉండాలనేది బ్యాలెట్ బాక్స్ కాకుండా సైన్యం నిర్ణయించడమే’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి :
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
- అయోధ్య-ప్రాణప్రతిష్ఠ: కాశీ పండితుల రాకపై స్థానిక అర్చకవర్గం ఏమంటోంది, ఈ నగరం ఇప్పుడెలా మారింది?
- దళితుల జీవితాలను కళ్లకు కట్టే 8 బ్లాక్ & వైట్ ఫోటోలు
- వాత్స్యాయన కామసూత్రాలు: సెక్స్ సమయంలో మీ భాగస్వామిని ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?
- రాజస్థాన్ అసెంబ్లీలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం సంస్కృతంలో ఎందుకు చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














