మూత్రం రంగును బట్టి కిడ్నీలు పాడయ్యాయో, లేదో ఎలా తెలుసుకోవచ్చు?

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో అనారోగ్యం వల్ల సంభవించే మరణాలకు ప్రధాన కారణాల్లో కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి.

శరీరంలోని ఫ్లూయిడ్స్‌ నుంచి అనవసరమైన వ్యర్థాలను, అధిక మోతాదులో ఉన్న నీటిని మూత్రపిండాలు (కిడ్నీలు) వడబోసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి.

భారత్‌లో అనారోగ్యం వల్ల సంభవించే మరణాలకు ప్రధాన కారణాల్లో కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్ ప్రకారం, దేశంలో మరణాలకు కిడ్నీ వ్యాధులు ఒక ప్రధాన కారణమని జాతీయ ఆరోగ్య నివేదిక 2017 పేర్కొంది. డయాబెటిస్, హైబీపీ వృద్ధాప్య సమస్యల కారణంగా ఎక్కువ మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు.

మెడికల్ జర్నల్ 'నేచర్'‌లో పేర్కొన్న అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో దాదాపు 6.97 కోట్ల మంది కిడ్నీ రోగులుంటే, ఒక్క ఇండియాలోనే 1.15 కోట్ల మంది ఉంటారని అంచనా.

2010 నుంచి 2013 మధ్యలో సంభవించిన 15 ఏళ్ల నుంచి 69 ఏళ్లలోపు వారి మరణాల్లో 2.9 శాతం మంది మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్) వల్లే చనిపోయారు. అంతకుముందు దశాబ్దంలో, అంటే 2001 నుంచి 2003 మధ్య కాలంతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం ఎక్కువ.

కిడ్నీ ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం డయాబెటిస్.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రొటీన్యూరియా వల్ల నీరసం, కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

కిడ్నీలకు, మూత్రానికి మధ్య సంబంధం ఏమిటి?

ఈ సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు కిడ్నీ నిపుణులు (నెఫ్రాలజిస్ట్) డాక్టర్ సిద్ధార్థ్ జైన్‌తో బీబీసీ మాట్లాడింది.

కిడ్నీలలో మూత్రం ఉత్పత్తి అవుతుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్‌లో ఉన్న వ్యర్థాలను కిడ్నీలు వేరు చేస్తాయి. తర్వాత శరీరానికి హాని కలిగించే జీవ పదార్థాలు మూత్రం ద్వారా బయటికెళ్లిపోతాయి.

సరళంగా చెప్పాలంటే, కిడ్నీలు మన శరీరంలో ఫిల్టర్‌లా పనిచేస్తాయి. రక్తంలోని వ్యర్థాలను వేరు చేసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరీరంలోని ఫ్లూయిడ్స్‌లో ఉన్న వ్యర్థాలను కిడ్నీలు వేరు చేస్తాయి.

కిడ్నీ పాడైందని ఎలా గుర్తించాలి? ప్రొటీన్యూరియా అంటే ఏమిటి?

''మూత్రం రూపంలో కొద్దిమొత్తంలో ప్రొటీన్ బయటికి పోతుంది. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఇది జరుగుతుంది. అయితే, ఈ ప్రొటీన్లు పెద్దమొత్తంలో మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతే అది శరీరానికి ప్రమాదకరంగా మారుతుంది. ఈ లీకేజీని ప్రొటీన్యూరియా అంటారు'' అని డాక్టర్ సిద్ధార్థ్ చెప్పారు.

ఈ ప్రొటీన్యూరియా పరిస్థితి ఏర్పడడానికి డయాబెటిస్ ప్రధాన కారణం. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే పెద్దమొత్తంలో ప్రొటీన్ మూత్రం రూపంలో బయటికి వెళ్లిపోతుంది. ఈ ప్రొటీన్యూరియా, డయాబెటిస్ నియంత్రణలో లేకపోవడాన్ని సూచించే ప్రధాన లక్షణం.

ఇంకా హైబీపీ, కొన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రొటీన్యూరియాకి కారణమవుతాయి.

ప్రొటీన్యూరియా లక్షణాల గురించి తెలియజేస్తూ, ''మూత్రం నురుగుతో రావడం ప్రొటీన్యూరియాని తెలియజేస్తుంది'' అని డాక్టర్ సిద్ధార్థ్ చెప్పారు.

తరువాతి దశలో రోగుల చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంది. అలాగే నీరసం, కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక్కో మూత్రపిండంలో నెఫ్రాన్స్‌ దాదాపు పది లక్షల వరకు ఉంటాయి.

సాధారణంగా మూత్రం ఏ రంగులో ఉంటుంది?

మూత్రంలో నీరు, యూరియా, లవణాలు కలిసి ఉంటాయి. శరీరంలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కాలేయం(లివర్) యూరియాను ఉత్పత్తి చేస్తుంది.

శరీరంలోని ఫ్లూయిడ్స్ నుంచి వచ్చే ప్రధాన వ్యర్థ పదార్థం యూరియా. అది మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంది.

హార్వర్డ్ హెల్త్ మెడికల్ జర్నల్ ప్రకారం, మూత్రంలో శరీరంలోని ఫ్లూయిడ్స్ వ్యర్థాలు, ఎక్కువ మోతాదులో ఉన్న అనవసర నీరు కలిసి ఉంటాయి. శరీరంలోని ఫ్లూయిడ్స్‌ను కిడ్నీలు శుభ్రం చేస్తాయి. ఆ తర్వాత అవి రక్తంలో కలిసిపోతాయి.

సాధారణంగా మూత్రం రంగు లేత పసుపు పచ్చ రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకూ పలు రకాలుగా ఉంటుంది. చాలా విషయాలు ఈ రంగుపై ఆధారపడి ఉంటాయి.

ఎవరికైనా మూత్రం ఎరుపు రంగులో, లేదా ముదురు గోధుమ రంగు, లేదా ఏదైనా ముదురు రంగులో వస్తే ఆ వ్యక్తి జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని డాక్టర్ సిద్ధార్థ్ చెప్పారు.

అలాగే, సాధారణం కంటే మూత్రం ఎక్కువ వచ్చినా, లేదా తక్కువ వచ్చినా, తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నా, మూత్రానికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నా, ఒకవేళ మూత్రాన్ని ఆపుకోలేకపోతున్నా కిడ్నీల్లో సమస్య ఉండేందుకు అవకాశం ఉంది.

ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిడ్నీలు శరీరంలో కాల్షియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌ సమతుల స్థాయిలో ఉండేలా చేస్తాయి.

కిడ్నీ ఎలా పనిచేస్తుంది?

శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు కూడా ముఖ్యమైనవి.

అవి శరీరంలో కాల్షియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌ సమతుల స్థాయిలో ఉండేలా చేస్తాయి.

ఎర్ర రక్తకణాల నిర్మాణంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలోని యాసిడ్ బేస్ (పీహెచ్) లెవెల్స్‌ సమతౌల్యాన్ని కాపాడతాయి. అలాగే, శరీరంలోని వ్యర్థాలను ద్రవ రూపంలో బయటికి పంపుతాయి.

శరీరంలో రక్తం శుద్ధి జరిగే ప్రక్రియలో గ్లూకోజ్, లవణాలు, నీటిని కిడ్నీల ద్వారా రక్తకణాలు శోషించుకుంటాయి.

శుద్ధి ప్రక్రియ పూర్తయిన తర్వాత నరాల ద్వారా రక్తం శరీరం మొత్తం సరఫరా అవుతుంది.

శరీరంలో నీటి నిల్వలను కిడ్నీలు సమతౌల్యం చేస్తాయి.

డయాబెటిస్, రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు.

డయాబెటిస్ రోగుల్లో దాదాపు 40 శాతం మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు.

నెఫ్రాన్స్ అంటే ఏమిటి? అవి పాడైతే ఏమవుతుంది?

ఒక్కో కిడ్నీలో నెఫ్రాన్స్‌గా పిలిచే ఫిల్టరింగ్ సెల్స్ (వడపోత కేంద్రాలు) దాదాపు పది లక్షల వరకూ ఉంటాయి. ఈ నెఫ్రాన్‌లను గాయపరిచే, లేదా ప్రభావితం చేసే ఏదైనా కిడ్నీ వ్యాధికి కారణమవుతుంది.

డయాబెటిస్, హైబీపీ కిడ్నీలను దెబ్బతీస్తాయి.

హైబీపీ, కిడ్నీలను దెబ్బతీయడమే కాకుండా, గుండె, మెదడులోని రక్తనాళాలకు కూడా హాని చేస్తుంది.

కిడ్నీలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలు ఉంటాయి. అందువల్ల రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు కూడా కిడ్నీలకు ప్రమాదకరం.

క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీలు పనిచేయడం పూర్తిగా ఆగిపోవడం. వికారంగా ఉండడం, వాంతులు రావడం, ఆకలి లేకపోవడం, నీరసం, బలహీనత, నిద్రలేమి, మూత్రంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, శరీర భాగాల వాపులు దీని లక్షణాలు.

ఈ వ్యాధి క్రమంగా పెరుగుతూ ఆఖరికి కిడ్నీలు పనిచేయడం ఆగిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)