జగన్నాథరెడ్డి ఇంట్లో అయిదు అస్థిపంజరాలు... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటకలోని చిత్రదుర్గ్ పట్టణంలోని ఓ ఇంట్లో అయిదు అస్థిపంజరాలు దొరకడం సంచలనం సృష్టించింది. ఓ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో ఉన్న ఈ అస్థిపంజరాలను పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరితో కలవకుండా, ఒంటరిగా ఉంటున్న ఆ కుటుంబం గురించి స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఆ కుటుంబానికి పెద్ద జగన్నాథ రెడ్డి (85) కాగా, ఆయన భార్య ప్రేమ (80), కూతురు త్రివేణి (62), కొడుకులు కృష్ణ (60), నరేంద్ర (57)లు ఆ ఇంట్లో ఉండేవారు. బంధువులతో సంబంధాలు లేకుండా వాళ్లు ఇక్కడ ఉంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
జగన్నాథ రెడ్డి కుటుంబం బయట ఎక్కువగా కనిపించేవారు కాదని స్థానికులు చెప్పారు. 2019 జూన్, జులై నెలల నుంచి ఆ ఇంటికి తాళం వేసి ఉందని, వారు ఇంట్లో లేకపోయి ఉండొచ్చని అంతా అనుకున్నామని వారు చెబుతున్నారు.
అయితే, రెండు రోజుల కిందట కొందరు ఇంటి మెయిన్ డోర్‌ను తెరిచి ఉన్నట్లు గుర్తించి ఓ విలేఖరికి సమాచారం ఇచ్చారు. సదరు జర్నలిస్టు పోలీసులకు సమాచారం అందించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంట్లో అస్థిపంజరాలు
పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూసినప్పుడు అయిదు అస్థిపంజరాలు కనిపించాయి. ఈ విషయంపై చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ ధర్మేంద్ర కుమార్ మీనా బీబీసీతో మాట్లాడారు.
‘‘జగన్నాథ్ రెడ్డి బంధువు కథనం ప్రకారం, కుటుంబం ఏదో ఆశ్రమానికి వెళ్లాలని భావించేది. చాలాకాలం ఇల్లు తాళం వేసి ఉండటంతో ఆశ్రమానికి వెళ్లి ఉంటారని అంతా భావించారు’’ అని ధర్మేంద్ర కుమార్ అన్నారు.
ఈ విషయాన్ని ఓ కేసులో ఆ కుటుంబం తరఫు వాదించిన న్యాయవాది కూడా ధ్రువీకరించారు.
అయితే, ఆ కుటుంబం చివరిసారిగా ఎప్పుడు కనిపించింది అన్నది పూర్తిగా తెలియలేదు. జగన్నాథరెడ్డి కుటుంబం పెద్ద ఇంట్లో ఉండేది.
ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న సబర్బన్ ప్రాంతం కావడంతో చుట్టు పక్కల ఇళ్లు ఎక్కువగా లేవు. గత రెండేళ్లలో ఇక్కడ కొన్ని ఇళ్లు నిర్మితమయ్యాయి. వారికి అతి దగ్గరగా ఉండే ఇల్లు 100 అడుగుల దూరంలో ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఒంటరి కుటుంబం
జగన్నాథ రెడ్డి ఇంటికి అతి సమీపంలో ఉన్న ఇంటి వారు కూడా జగన్నాథ రెడ్డి కుటుంబంతో ఎప్పుడూ మాట్లాడ లేదు. ఈ కుటుంబం అందరికీ దూరంగా ఉంటుందని జగన్నాథ రెడ్డి బంధువులు కొందరు చెప్పారు.
ఎవరైనా తలుపుకొట్టినా బయటకు వచ్చేవారు కాదని, కిటికీ నుంచే మాట్లాడి పంపించే వారని స్థానికులు చెబుతున్నారు.
కొన్నేళ్ల కిందట ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తోందని చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు పట్టించుకోలేదు.
ఇంటికి తాళం వేసి ఉంటంతో పోలీసులు పెద్దగా అనుమానించ లేదు. ఇంటి ముందు గేట్ కూడా తాళం వేసి ఉంది. రెండు నెలల కిందట గేటు విరిగింది. రెండు రోజుల క్రితం ఇంటి తలుపులు పగలగొట్టినట్లు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంట్లో దొరికిన ఆధారాలు ఏంటి?
విచారణలో భాగంగా పోలీసులు ఇంటిని సోదా చేసినప్పుడు అనేక పత్రాలు, పలు ఆసుపత్రుల నుంచి వచ్చిన మెడికల్ రిపోర్టులు లభించాయి.
బెంగళూరుతోపాటు పలుచోట్ల వీరు చికిత్స తీసుకున్నట్లు వాటినిబట్టి అర్ధమైంది. జగన్నాథరెడ్డికి శరీరంలో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నట్లు నిమ్హాన్స్ అనే ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టులో ఉంది.
ఆయన కూతురు స్పాండిలైటిస్‌తో బాధపడుతుండగా, కొడుకు కృష్ణ ఊబకాయం, గుండె జబ్బులతో బాధపడుతున్నట్లు మెడికల్ రికార్డుల్లో ఉంది.
చిన్న కొడుకు నరేంద్ర ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు.
‘‘ఈ మెడికల్ రిపోర్టుల పరిశీలనకు ప్రభుత్వ వైద్యుల దగ్గరకు పంపాం." అని ఎస్పీ ధర్మేంద్ర కుమార్ మీనా వెల్లడించారు.
ఆ ఇంట్లో కన్నడంలో రాసిన ఓ పేపర్ కూడా దొరికిందని, తాము ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటామని ఆ కుటుంబీకులు అందులో రాసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీస్ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.
అయితే, ఆ పేపర్ పై తేదీగానీ, సంతకంగానీ లేదు. ‘ఆ కుటుంబంలో దాన్ని ఎవరు రాశారో తెలియదు.’ అని ఆయన బీబీసీతో అన్నారు.
రెడ్డి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, కూతురుకుపెళ్లి కాకపోవడంతో ఇంటి పెద్దయిన జగన్నాథ రెడ్డి తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఈ కుటుంబానికి బంధువైన ఓ వ్యక్తి పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసినప్పుడు ఒక బెడ్ మీద తల్లీ కూతుళ్ల అస్థిపంజరాలు, అదే అంతస్తులోని ఒక గదిలో తండ్రి, పెద్ద కొడుకుల అస్థిపంజరాలు ఉన్నాయి. మరో గదిలో చిన్న కొడుకు మృతదేహం కనిపించింది.
‘‘ఇక్కడి పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఇల్లు చాలాసార్లు దోపిడికి గురైనట్లు కనిపిస్తోంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో పోలీసు అధికారి వెల్లడించారు.
‘‘అన్ని అస్థిపంజరాలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపాం. రెండు వారాల్లోగా విచారణ నివేదిక వస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఎస్పీ ధర్మేంద్ర కుమార్ మీనా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు.. నదిలో పసిడి ఎలా దొరుకుతోంది?
- పంజాబ్: కెనడా వెళ్లేందుకు అమ్మాయిలతో ఒప్పంద వివాహాలు, పెరుగుతున్న మోసం కేసులు
- ఖతార్: మరణ శిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపు.. వీరిలో ఒకరైన విశాఖ వాసి పాకాల సుగుణాకర్ నేపథ్యం ఏమిటి?
- ముంబయి నుంచి అమెరికా వరకు.. ‘2023’ కీలక పరిణామాలు 15 ఫోటోల్లో!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















