ఇంట్లోనే చనిపోయినా పదేళ్ల వరకు ఎవరికీ తెలియలేదు.. ఆ వృద్ధురాలి మరణం దేశాన్నే కదిలించింది

- రచయిత, క్లైర్ బేట్స్
- హోదా, రిపోర్టర్, పీపుల్ ఫిక్సింగ్ ది వరల్డ్
బెప్ డి బ్రూయిన్ అనే మహిళ మృతదేహాన్ని ఆమె ఇంటిలో కనుగొన్నారు. ఆమె చనిపోయిన పదేళ్ల తరువాత ఆమె మృతదేహం దొరికింది. ఆ ఘటన నెదర్లాండ్స్ దేశాన్నే కదిలించింది.
ఆమె మరణం చెప్పిన పాఠం వల్ల సమాజంలో ప్రతి ఒక్కరికీ స్థానం ఉండాలన్న ఆలోచనతో అక్కడ దశాబ్ద కాలంగా వృద్ధుల సంక్షేమ కోసం కొత్త పథకాలు అమలులోకి వచ్చాయి.
2013 నవంబర్ 21న నెదర్లాండ్స్‌లో రోటర్‌డామ్ నగరంలోని ఒక ఇంటిలో బెప్ డి బ్రూయిన్ అనే 74 ఏళ్ల మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె 2003లో చనిపోయారని పోలీసులు నిర్ధరించారు.
బెప్ డచ్ ఈస్ట్ ఇండీస్‌లో జన్మించారు. యుక్తవయసులో నెదర్లాండ్స్‌కు వెళ్లారు. ఆమె ఒక్కగానొక్క బిడ్డ దూరమయ్యాక ఒంటరిగా మారారు.
అందుకే 2003లో బెప్ చనిపోయినా కూడా ఎవరికీ తెలియలేదు. పెన్షన్ డబ్బు ఆమె బ్యాంక్ ఖాతాలోకి వెళ్తూనే ఉన్నాయి, ఆమె అద్దె కూడా ఆటోమేటిక్‌గా చెల్లింపు అవుతోంది.
గుట్టలుగా పేరుకుపోయిన తెరవని పోస్టుల ద్వారా ఆమె ఎప్పుడు మరణించారో కనుగొనగలిగారు పోలీసులు. ఈ ఘటన ఆ నగరంలో చైతన్యం తీసుకొచ్చింది.
ఈ ఘటన గురించి తెలిసి తర్వాత హ్యూగో డి జంగే అనే స్థానిక రాజకీయ నాయకుడు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇంత పెద్ద సిటీలో ఒంటరిగా ఉండటం బాధకలిగించిందని స్థానిక మీడియాతో చెప్పారు.
రోటర్‌డామ్‌లోని 75 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను స్వచ్ఛంద సేవకులు తరచూ వెళ్లి కలిసేలా ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
వారితో మానవ సంబంధాలు ఏర్పరుచుకోవడానికి వలంటీర్లు సహాయం చేస్తారు.

ఫొటో సోర్స్, GOOGLE
జాతీయ స్థాయిలో కార్యక్రమం
హ్యూగో డి జంగే ఆరోగ్యం, సంక్షేమం, క్రీడల మంత్రిగా నియమితులైన తర్వాత వృద్ధులు ఒంటరిగా ఉండకుండా చూసుకోవడానికి 2018లో జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇటీవలి గణాంకాలు పరిశీలిస్తే ఆ కార్యక్రమం మెరుగ్గా పని చేస్తోందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన గణాంకాలను కనుగొనడం చాలా కష్టం.
కానీ గత సంవత్సరం యురోపియన్ యూనియన్ వ్యాప్తంగా జరిగిన సర్వేలో ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఎక్కువ సమయం ఒంటరిగా ఉన్నారని తెలిసింది.
అయితే, ఐరోపాలోని నెదర్లాండ్స్ మాత్రం అతి తక్కువ స్థాయిలో ఒంటరితనం ఉందని గణాంకాలు చెప్పాయి.
ఈ జాతీయ కార్యక్రమాన్ని 'వన్ అగెనెస్ట్ లోన్లీనెస్' అనే పేరుతో పిలిచారు. దీంట్లో భాగంగా సలహాదారులు మున్సిపాలిటీలను సందర్శిస్తారు.
ఆరోగ్య నిపుణులు, వలంటీర్లు, వ్యాపారులతో కమ్యునికేషన్ ఏర్పాటు చేస్తారు. ఒంటరిగా ఉన్నవాళ్లకు బంధాలను ఏర్పరచడానికి మునిసిపాలిటీలను ప్రోత్సహిస్తారు.
ఒంటరితనానికి వ్యతిరేకంగా జాతీయ కూటమిని ఏర్పాటు చేయడంతో జాతీయ స్థాయిలో ఫలితం కనిపించింది.
దీనిలో సభ్యులుగా బ్యాంకులు, సూపర్ మార్కెట్‌ల నుంచి స్వచ్ఛంద సంస్థలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, సాంస్కృతిక సంస్థల వరకు ఉంటారు.
కార్యక్రమంపై వారివారి ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పని చేయడానికి, మార్గాలను కనుగొనడానికి సంవత్సరానికి రెండుసార్లు భేటీ అవుతారు.
"చాలామంది ఏదైనా సాయం చేయాలనుకుంటున్నారు" ఈ పథకాన్ని మొదట ప్రారంభించినప్పుడు డచ్ టీవీ ప్యానెల్ షోతో డి జంగే చెప్పిన మాటలివి.
అనేక అనుబంధ కార్యక్రమాలతో అద్భుతమైన ఉద్యమ సృష్టి జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
వినూత్న మద్దతు
ఈ కార్యక్రమం చాలా ప్రాంతాల్లో వినూత్న ఆలోచనలు వచ్చేలా చేసింది. ఉదాహరణకు జంబో సూపర్ మార్కెట్లలోని డజన్ల కొద్దీ దుకాణాలలో ఇప్పుడు ప్రత్యేక "చాటీ చెక్‌అవుట్‌లు" ఉన్నాయి. ఇక్కడ కస్టమర్‌లు క్యాషియర్‌తో మాట్లాడవచ్చు.
అంతేకాకుండా జాతీయ తపాలా సేవ అయిన 'పోస్ట్ ఎన్ఎల్' ఇలాంటివారి కోసం ఒక స్వచ్ఛంద పథకాన్ని తీసుకొచ్చింది.
వినియోగదారుల్లో ఎవరైనా ఒంటరిగా ఇబ్బంది పడుతున్నారనిపిస్తే పోస్టల్ ఉద్యోగులు వారి వివరాలు తెలియజేస్తారు.
ఈ డెలివరీ వర్కర్లు ఇరుగుపొరుగున ఉన్న అదనపు సహాయకుల వంటివారని 'సోషల్ ఇంపాక్ట్ డైరెక్టర్' థిజ్స్ కెర్కాఫ్స్ చెప్పారు.
ఇంటి కర్టెన్లు సాధారణం కంటే ఎక్కువసేపు మూసిఉండటం, ఇంటి వద్ద పోస్టులు పోగై ఉండటం వంటివి కనిపిస్తే ఏం చేయాలో ఉద్యోగులకు సూచనలు చేశారు.
ఆ ఇంటి వివరాలతో ఒక ఫారం పూర్తి చేసి, దానిని సంక్షేమ సంస్థకు పంపిస్తారు.
ప్రస్తుతం 19 మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలవుతోంది. రోటర్‌డ్యామ్‌లో గత మూడు సంవత్సరాలలో దాదాపు 50 ఇలాంటివే పంపారు. అక్కడే గతంలో బెప్ డి బ్రూయిన్ మృతదేహం కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కుక్కలను చూసుకోవడంలోనూ..
'వన్ అగెనెస్ట్ లోన్లీనెస్' వెబ్‌సైట్ సామాజిక సంస్థలను కూడా ప్రోత్సహిస్తుంది.
ఊపోహ్ అని పిలిచే సంస్థ ఒకటి నెదర్లాండ్స్‌లోని నాలుగు పెద్ద నగరాల నుంచి కొంత నిధులను అందుకుంటోంది.
చాలా పెంపుడు జంతువులు యజమానులు బిజీగా ఉంటారు. అలాంటి వారి పెంపుడు జంతువు(కుక్క)ను చూసుకోవడానికి వృద్ధులను జత చేసేలా 'మ్యాచ్ మేకింగ్' వెబ్‌సైట్‌ను ఊపోహ్ సంస్థ నడుపుతోంది.
వృద్ధులకు ఇది ఉచితం, కుక్కల యజమానులకు కొంత ఛార్జీ వసూలు చేస్తారు.
పార్ట్-టైమ్‌గా కుక్కను చూసుకోవడానికి ఊపోహ్ సహకరిస్తుంది. ఈ వెబ్‌సైట్ ఇప్పటివరకు 4,500 పనులు కల్పించింది.
ఈ విధానంతోనే జీనెట్, ఆమె కుక్క బికెల్‌తో 74 ఏళ్ల థియో నీన్‌హుయిజ్ కలిసిపోయింది.
"మీకు 70 ఏళ్లు వస్తే మీరు బంధువులను కోల్పోవచ్చు" అని స్థానిక పార్కులో బికెల్‌ను నడిపిస్తూ చెప్పారు థియో.
"బికెల్ ముద్దొచ్చే చిన్న కుక్క, జనాలను ఆకర్షిస్తుంది. అందరూ నన్ను గుర్తించి హలో చెబుతారు. నేను కూడా జీనెట్‌తో దగ్గరైపోయా. నాకేదైనా సమస్య వస్తే ఆమెకే మొదట ఫోన్ చేస్తాను" అని థియో తెలిపారు.
థియో అనుభవాన్ని ఒక స్వతంత్ర సర్వే స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఊపోహ్ వినియోగదారులలో మూడొంతుల మందికి శారీరక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు మెరుగుపడ్డాయని ఒక సర్వే కనుగొంది.
2018లో ఈ జాతీయ కార్యక్రమం థియో లాంటి వృద్ధులకు సాయం చేయడంపై ఎక్కువగా దృష్టి సారించింది. అయితే, సమస్య చాలా ఎక్కువగా ఉందని తర్వాతే తెలిసింది.

మారిన లక్ష్యం
ఒమా సూప్ అనే సంస్థ దాని లాభాలలో సగభాగాన్ని విద్యార్థి వలంటీర్లు, సీనియర్లు జంటగా చేసే వంట సెషన్లకు నిధులుగా సమకూరుస్తుంది.
"వృద్ధులలో ఒంటరితనం కారణంగా మేం దీన్ని ప్రారంభించాం, కానీ, చదువుకోవడానికి నగరాలకు వచ్చిన ఒంటరి యువకులు కూడా చాలామంది ఉన్నారని తెలుసుకున్నాం" అని కంపెనీ సహ యజమాని మార్ట్‌జిన్ కాంటర్స్ చెప్పారు.
కాబట్టి 2022లో 'వన్ ఎగైనెస్ట్ లోన్లీనెస్' అందరికోసం విస్తరించారు, మొత్తంగా దీని భాగస్వాముల సంఖ్య 196కి పెరిగింది.
"వృద్ధులపై దృష్టి చాలా పరిమితంగా ఉందని మా భాగస్వాములు చెప్పారు. ఒంటరితనం ఎవరికైనా సంభవించవచ్చు" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి మిశ్చా స్టూబెనిట్స్కీ చెప్పారు.
అనధికారిక సంరక్షకులు, వృద్ధ వలసదారులు, కష్టాల్లో ఉన్న యుక్తవయస్కుల కోసం ఇప్పుడు పరిశోధనా ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తున్నారు.
యుక్తవయస్కులు కూడా కష్టపడుతున్నారని ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందని మాజీ యూత్ కౌన్సిలర్ జోలాండా వాన్ గెర్వే తెలిపారు.
కష్టపడే యువకుల కోసం కొన్ని సంవత్సరాల క్రితం 'జాయిన్ అస్ (మాతో కలవండి)' అనే యూత్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు జోలాండా.
"యువకులు ప్రతికూల ఆలోచనలను అధిగమించడానికి, సొంతంగా విశ్వాసం, సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మేం సాయం చేస్తాం" అని ఆమె చెప్పారు.
శిక్షణ పొందిన యువ కార్యకర్త ఈ సెషన్‌లకు నాయకత్వం వహిస్తారు. లీడర్ ప్రతి సభ్యుడికి లక్ష్యాలను నిర్దేశించడంలో సహాయం చేస్తాడు, వారు యూత్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేస్తారు.
"ప్రజలను కలవడం, వారితో మాట్లాడటం సమస్యగా ఉండేది. నాకది ఆందోళన కలిగించింది. ఇంట్లోరాత్రుళ్లు ఒంటరిగా గడిపేవాడిని, నాకు కాల్ చేయడానికి లేదా మాట్లాడటానికి కూడా ఎవరూ ఉండరు" అని 23 ఏళ్ల ల్యూక్ చెప్పారు.
అయితే, ఈ గ్రూపులోకి ఆహ్వానం అందిందని ల్యూక్ చెప్పారు. ''సరదాగా గడిపేలా ఉన్న ఈ ప్రాంతం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. నా గురించి మెరుగ్గా భావించడానికి ఇది సహాయపడింది'' అని ఆయన తెలిపారు.
ఒంటరితనం వైఫల్యంగా భావించే..
77 మున్సిపాలిటీల్లో ఈ 'జాయిన్ అస్ (మాతో కలవండి)' గ్రూపులు ఏర్పాటుచేశారు. పరిమిత బడ్జెట్ కారణంగా వాటి విస్తరణ అంతగా జరగలేదని జోలాండా చెబుతున్నారు.
అయితే, 'నెదర్లాండ్స్ జాతీయ కార్యక్రమం' ఇప్పుడు వాటికోసం రాయితీలను అందిస్తోంది.
ఒంటరితనం అనేది సమాజంలో ఒక సమస్యగా కాకుండా ఒక రకమైన వ్యక్తిగత వైఫల్యం అని ఇప్పటికీ ప్రబలంగా ఉన్న నమ్మకం.
ఈ విషయంపై గ్రూపులు వివిధ మార్గాల్లో వ్యవహరిస్తాయి. జాయిన్ అస్‌లోని యువ నాయకులను వారి అనుభవాలు పంచుకోవడానికి ప్రోత్సహిస్తారు.
"తాము ఒంటరిగా ఉన్నామని చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు" అని ఒమాస్ సూప్‌కు చెందిన మార్ట్‌జిన్ కాంటర్స్ తెలిపారు.
ప్రతి సంవత్సరం 'జాతీయ ఒంటరితనం వారం'లో ప్రజలు ఈ సమస్య గురించి మాట్లాడేలా వన్ ఎగైనెస్ట్ లోన్లీనెస్ ప్రయత్నిస్తుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా అనేక సంకీర్ణ భాగస్వాములతో కలిసి దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బెప్ డి బ్రూయిన్ కథ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ గ్రూపులన్నీ భావిస్తున్నాయి.
అందరూ సహకరిస్తూ సాగుతుంటే పరిష్కారం లభిస్తుందని మిస్చా స్టూబెనిట్స్కీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- మాజీ డీఎస్పీ నళిని: తెలంగాణ కోసం 12 ఏళ్ల కిందట రాజీనామా చేసిన ఈమె గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆమె ఏమని బదులిచ్చారు?
- మహారాష్ట్ర: 'నా బాయ్ ఫ్రెండ్ నన్ను కారుతో తొక్కించి చంపాలని చూశాడు'.. ఐఏఎస్ అధికారి కుమారుడిపై ఆరోపణ..
- నిమిష ప్రియ: బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తే హత్య కేసులో మరణశిక్ష పడినా తప్పించుకోవచ్చా? యెమెన్‌లో ఈ భారతీయురాలి కేస్ ఏమిటి?
- ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం: రెండు దేశాల పరిష్కారం అంటే ఏంటి... అది ఎందుకు అమలు కాలేదు?
- అన్నా మణి: ఈ భారతీయ ‘వెదర్ వుమన్’ గురించి మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














