రూ.2.5 కోట్ల లాటరీ తగిలినా 90 ఏళ్ల వయసులో రిక్షా తొక్కుతున్నారు. ఆ డబ్బంతా ఏమైంది?

ఫొటో సోర్స్, BBC/SURINDER MANN
గురుదేవ్ సింగ్. వయసు 90 ఏళ్ళు. పంజాబ్‌లోని మోగా జిల్లాలో నివసిస్తారు.
పంజాబ్ ప్రభుత్వం నిర్వహించే వైశాఖి లాటరీని 2023 ఏప్రిల్ నెలలో రిక్షావాలా గురుదేవ్ సింగ్ గెలుచుకున్నారు. ఆ లాటరీ ప్రైజ్ మనీ 2.5 కోట్ల రూపాయలు.
ఇంత పెద్ద మొత్తం గెలవడంతో గురుదేవ్ సింగ్ కుటుంబం అదృష్టరేఖ మారిపోయింది.
ఒకప్పుడు మట్టిగోడల ఇంటిలో నివసించిన గురుదేవ్ సింగ్ కొడుకు, కూతురు ఇప్పుడు కొత్తగా కట్టిన ఇంటికి మారారు.
కానీ డబ్బు వచ్చింది కదా అని ఊరికే తిని కూర్చోవడం ఇష్టం లేదంటారు గురుదేవ్ సింగ్.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కష్టించాల్సిందేనంటారు. అందుకే రిక్షా తొక్కుతానంటారు.

ఫొటో సోర్స్, BBC/SURINDER MANN
లాటరీ డబ్బుతో ఏం చేశారు?
లాటరీ డబ్బుతో గురుదేవ్ సింగ్ తన నలుగురు కొడుకులు, కూతురికి ఇళ్ళు కట్టించారు. వారందరికీ కొత్త కార్లు కొనిపెట్టారు. ఇప్పుడాయన మనవళ్ళు మంచి స్కూళ్ళలో చదువుకుంటున్నారు.
‘‘ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే జబ్బున పడతాను. రిక్షా తొక్కడం వల్ల కండరాలకు మంచి కసరత్తు దొరికి నేనెంతో ఫిట్‌గా ఉండగలుగుతాను. అలా కాకుండా ఊరికే మంచం మీద దొర్లుతుంటే పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి’’ అంటారు గురుదేవ్ సింగ్.
లాటరీ గెలవడంపై గురుదేవ్ సింగ్ మాట్లాడుతూ- ‘‘దేవుడంటే మనకు భయం ఉండాలి. డబ్బుందనే అహంకారంతో ఏం చేయగలం. పిల్లలేదో కార్లు కొనుక్కున్నారు. నేను దానిని వ్యతిరేకించలేదు’’ అన్నారు.
‘‘గతంలోనా పిల్లలు పేదరికంలో బతికారు. కానీ ఇప్పుడు వారికి మంచి ఇళ్ళు ఉన్నాయి. మా అమ్మాయి అద్దె ఇంట్లో ఉండేది. ఆమె కోసం కొత్త ఇల్లు కొనిపెట్టాను. నేను డబ్బులు వృథా చేయలేదు. ఏదైనా మంచి పని కోసం డబ్బు ఖర్చు చేయాలి. నేను ఆ పనే చేశాను’’ అంటారు గురుదేవ్ సింగ్.

ఫొటో సోర్స్, BBC/SURINDER MANN
గురుదేవ్ సింగ్ సామాజికసేవ
గురుదేవ్ సింగ్ ఎప్పటి నుంచో సామాజికసేవలో పాల్గొంటున్నారు.
కానీ లాటరీ గెలిచిన తరువాత సామాజిక సేవకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు.
రోడ్లు, వీధులలో గుంతలు పూడ్చడం ఆయన ఇప్పటికీ చేస్తున్నారు.
తన రిక్షాలో మట్టి, పారలు తీసుకువెళ్ళి గుంతలు పూడ్చేవారు.
అలాగే పూల మొక్కలకు నీళ్ళు పోయడమూ ఆగలేదు.
‘‘నేను ఎంతో కాలంగా సామాజిక సేవ చేస్తున్నాను. వేసవిలో చెట్లకు నీరు పోస్తాను. వాటిని జాగ్రత్తగా కాపాడతాను. కొన్నిసార్లు అడ్డదిడ్డంగా పెరిగిన వాటిని కత్తిరించి మరింత ఏపుగా పెరిగేలా చేస్తుంటాను’’ అంటారు గురుదేవ్ సింగ్.
‘‘నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఎలాంటి మందులు వేసుకోలేదు. ఎందుకంటే ఈ పనులే నాకు చక్కటి ఔషధాలు’’ అంటారు గురుదేవ్.
గురుదేవ్ సింగ్ చేసే పనులను ప్రజలు అభినందిస్తుంటారు.
భవిష్యత్తులో కూడా లాటరీలు కొంటూనే ఉంటానంటారు గురుదేవ్ సింగ్.

ఫొటో సోర్స్, BBC/KULDEEP BRAR
లాటరీ డబ్బుతో కంటి ఆస్పత్రి కడుతున్న డాక్టర్లు
కొన్ని నెలల కిందట ఇద్దరు డాక్టర్లు కూడా ఐదు కోట్ల రూపాయల లాటరీ కొన్నారు. వారిద్దరి పేర్లు డాక్టర్ స్వరణ్ సింగ్, డాక్టర్ రాజ్‌పాల్.
వీరిద్దరు ఫాజిల్కా జిల్లాలో జలాలాబాద్‌లో నివసిస్తున్నారు. చాలా రోజులుగా వీరిద్దరూ ఈ ప్రాంతంలో ఓ కంటి ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ జలాలాబాద్‌లో ఆధునిక పరికరాలతో కంటి ఆస్ప్రతి నిర్మిస్తున్నారు.
డాక్టర్ రాజ్‌పాల్ ఐదు కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నారు. ఈ మొత్తంలో 2 కోట్ల రూపాయలు పన్ను రూపంలో పోయింది. మిగిలిన 3 కోట్ల రూపాయలతో కంటి ఆస్పత్రిని నిర్మిస్తున్నారు.
‘‘ఈ డబ్బుతో స్థలం, పరికరాలు కొనుగోలు చేశాం. ఈ డబ్బు ఆస్పత్రి నిర్మాణానికి సరిపోతుందని భావించాం. కానీ ద్రవ్యోల్బణం కారణంగా ఈ డబ్బు సరిపోలేదు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/KULDEEP BRAR
ఆస్పత్రికి లాటరీ డబ్బు సరిపోక బ్యాంకు రుణం
ఇప్పుడీ డాక్టర్లు ఇద్దరూ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఆస్పత్రి నిర్మాణాన్ని రాబోయే రెండేళ్ళలోపు ప్రజా సేవ కోసం సిద్ధం చేయాలని చూస్తున్నాం అని చెప్పారు రాజ్‌పాల్.
‘‘మాకు ఆస్పత్రిని కట్టేందుకు స్థలం లేదు, పరికరాలకు డబ్బులు లేవు. కానీ లాటరీ డబ్బుతో వాటన్నింటినీ సమకూర్చగలిగాం’’ అంటారు డాక్టర్ స్వరణ్ సింగ్.
కొత్త ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేలోపు పాత కంటి ఆస్పత్రిలో ప్రజలకు అధునాతన పరికరాలతో సేవలు అందిస్తామని, కొత్తగా ఇద్దరు సర్జన్లు కూడా మాతో చేరబోతున్నారని ఆయన వివరించారు.
ప్రస్తుతం ఉన్న ఆస్పత్రికి సంబంధించిన స్థలానికి ఓ మాదిరి అద్దె కడుతున్నామని, దానివల్ల ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చుకే సేవలు అందించగలుగుతున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/KULDEEP BRAR
లాటరీ గెలుపుతో గుర్తింపు
లాటరీ గెలిచాక తాము అందరికీ తెలిశామని, గతంలో తామెవరో ఎవరికీ తెలియదంటారు ఈ డాక్టర్లిద్దరు.
ఆస్పత్రి కట్టాలనే తన కోరిక ఈ లాటరీ డబ్బు తీర్చలేదని డాక్టర్ స్వరణ్ సింగ్ తెలిపారు. అందుకే మరిన్ని లాటరీలు కొంటామని చెప్పారు.
‘‘ఇక్కడి ప్రజలు చికిత్స కోసం పట్టణానికి వెళుతుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల చార్జీలు వారు భరించలేరు. అందుకే తక్కువ ఖర్చులో ప్రజలు చక్కటి వైద్యసేవలు పొందేలా మేం పనిచేస్తున్నాం’’ అని చెప్పారు.
ఈ డాక్టర్లిద్దరూ కలిసి మొదటిసారి లాటరీ గెలిచారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ప్రజలకు సేవచేసేందుకు తామిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటామంటారు డాక్టర్ స్వరణ్ సింగ్, డాక్టర్ రాజ్‌పాల్.
ఈ లాటరీని ఈ డాక్టర్లిద్దరూ గెలవలేదని, జలాలాబాద్ ప్రాంత ప్రజలందరూ గెలిచారంటారు స్థానికుడైన విక్రమ్. ఎందుకంటే ఇక్కడో మంచి కంటి ఆస్పత్రి ఉండాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
‘‘జలాలాబాద్ నగరం ఈ ఊరుకు దగ్గరలోనే ఉంది. కానీ ఇక్కడ వైద్య సౌకర్యలు అంత బాగా లేవు. అయితే ఇక్కడి ప్రజలు మంచి ఆరోగ్యసేవలను కోరుకుంటున్నారు. వారు అవసరంలో ఉన్న ప్రజలకు చక్కటి సేవలు అందిస్తున్నారు. ప్రజలు వీరి నుంచి ఇంకా ఎక్కువ సేవలు ఆశిస్తున్నారు’’ అంటారు విక్రమ్.
ఇవి కూడా చదవండి:
- నీళ్లలో మీ మలం తేలుతుందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలు ఇవీ!
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
- నటరాజ స్వామి ఆలయం: వాన నీటిని చోళులు ఎగువకు ఎలా ప్రవహింపజేశారు? చిదంబర రహస్యం ఇదేనా?
- జగన్నాథరెడ్డి ఇంట్లో అయిదు అస్థిపంజరాలు... అసలేం జరిగింది?
- క్రికెట్: ధోనీతో యువ ఆటగాడైన రాబిన్ మింజ్‌ను ఎందుకు పోల్చుతున్నారు? ఐపీఎల్లో తొలి గిరిజన ఆటగాడు ఈయనేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















