సామాన్యులే కానీ 2023లో వార్తల్లో నిలిచారు

బర్రెలక్క అలియాస్ శిరీష, పల్లవి ప్రశాంత్

ఫొటో సోర్స్, facebook

2023 తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి సమ్‌థింగ్ స్పెషల్.

రాజకీయ నాయకులు, సినీ తారలు, సెలబ్రిటీల గురించి మాత్రమే ఎక్కువగా చర్చ జరిగే వార్తల ప్రపంచంలోకి ఒకరిద్దరు దూసుకొచ్చారు.

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు.

పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, కొన్ని సంఘటనలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయిన అలాంటి కొందరు వ్యక్తులు, కొన్ని ఘటనలు ఏంటో చూద్దాం.

40 సెకన్ల వీడియోతో పాపులరైన శిరీష అలియాస్ బర్రెలక్క

ఫొటో సోర్స్, FB/PRINCESSSIRIBARRELAKKA

ఫొటో క్యాప్షన్, 40 సెకన్ల వీడియోతో పాపులరైన శిరీష అలియాస్ బర్రెలక్క

తెలంగాణ ఎలక్షన్లలో యూట్యూబర్ ‘బర్రెలక్క’

2023కి ముందే 40 సెకన్ల వీడియోతో పాపులర్ అయిన కర్నెశిరీష అలియాస్ బర్రెలక్క ఈ ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.

డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాసుకుంటున్నానంటూ అప్పట్లో ఆమె సెల్ఫీ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో విస్తృతంగా సర్క్యులేట్ కావడంతో కర్నె శిరీష బర్రెలక్కగా పాపులర్ అయ్యారు.

ఆమె వీడియో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని పోలీసులు కేసు పెట్టారు.

ప్రభుత్వం, అధికార పార్టీయే తనపై కేసు పెట్టించిందంటూ, ఆ కేసు కారణంగా తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఆమె కన్నీరు పెట్టడంతో సమాజంలో ఆమెకు చాలా మంది మద్దతుగా నిలిచారు.

బర్రెలక్కకు యూట్యూబ్‌లో నాలుగు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో మరో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు.

తెలంగాణలో నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఎన్నికలకు ముందు ప్రకటించారు.

కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శిరీషకు మద్దతుగా సొంత నియోజకవర్గంతో పాటు పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన కొంతమంది అండగా నిలిచారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయినా సమాజంలోని చైతన్యానికి ప్రతీకగా నిలిచారు. ప్రభుత్వం తప్పు చేస్తే అడిగగలిగిన సామాన్యులు కూడా ఉంటారని చెప్పడానికి బర్రెలక్క ఓ ఉదాహరణగా నిలిచారని ఆమె మద్దతుదారులు గర్వంగా చెప్పుకొంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ‘‘నాకు 6 వేల మంది ఓట్లు వేశారు. ఒక్క రూపాయి పంచకుండా నిజాయతీగా నాకు ఓట్లేశారు. నేను గెలిచానని భావిస్తున్నా. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటా. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తా’’ అని బర్రెలక్క చెప్పారు.

పల్లవి ప్రశాంత్

ఫొటో సోర్స్, FB/PALLAVI PRASHANTH

ఫొటో క్యాప్షన్, పల్లవి ప్రశాంత్

రైతు బిడ్డ నుండి బిగ్ బాస్ విజేత దాకా

‘అన్నా, మళ్లొచ్చిన’, ‘నేను రైతు బిడ్డను’ తగ్గేదేలా.. అంటూ యూ ట్యూబ్‌లో పాపులర్ అయి బిగ్ బాస్ విజేతగా నిలిచారు పల్లవి ప్రశాంత్.

బిగ్‌బాస్ ఏడో సీజన్‌ విజేతగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. తెలంగాణలో గజ్వేల్ పక్కనే ఉన్న కొలుగూరు అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబం ఆయనది.

సొంత భూమిలో తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తూ, వీడియోలు, రీల్స్ చేసేవారు. పొలంలో పనులు చేస్తూ వాటినే వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవారు.

ఆలా తీసిన వీడియోల ద్వారా ఏపీ, తెలంగాణలో బాగా పాపులర్ అయ్యారు. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో పల్లవి ప్రశాంత్‌కు లక్షల్లో ఫాలోయర్లు ఉన్నారు.

నటన మీద తనకు ఆసక్తి ఉందని, తనకు సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వాలని పల్లవి ప్రశాంత్ అనేక వీడియోల్లో అభ్యర్థించారు.

తనలో నటుడిని పరిచయం చేసేందుకు కొన్ని వీడియోలు చేశారు.

బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాలుగో సీజన్ నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చారు. బిగ్‌బాస్ షోలోకి వెళ్లేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ల దగ్గర కాపలా కాసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పల్లవి ప్రశాంత్.

బిగ్‌బాస్‌లోకి ‘రైతు బిడ్డకు ప్రవేశం లేదా?’. సామాన్యుడికి ప్రవేశం లేదా అంటూ తన వీడియోల్లో ప్రశ్నించేవారు.

దీంతో అతడి అభిమానులు కూడా పల్లవి ప్రశాంత్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలంటూ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు.

మొత్తానికి బిగ్‌బాస్ 7 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్.

బిగ్‌బాస్ విజేతగా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్, ఆయన అభిమానులు చేసిన గొడవలపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అతనితో పాటు అతడి సోదరుడిని అరెస్టు చేశారు. అనంతరం బెయిలుపై విడుదలయ్యారు.

ఫిషింగ్ హార్బర్ కేసులో చిక్కుకున్న లోకల్ బాయ్ నాని

ఫొటో సోర్స్, YT/LOCAL BOY NANI

ఫొటో క్యాప్షన్, ఫిషింగ్ హార్బర్ కేసులో చిక్కుకున్న లోకల్ బాయ్ నాని

ఒక్క రాత్రిలో మారిపోయిన జీవితం

ఒక సంఘటన, కోట్ల రూపాయల నష్టం. ఇందులో ‘లోకల్ బాయ్ నాని’ అనే యూట్యూబర్ ప్రమేయం ఉందనే ఆరోపణలు.

పోలీసుల అరెస్టు, తర్వాత విడిచి పెట్టడం.. అంతా కొన్ని గంటల్లో వేగంగా జరిగిపోయాయి.

2023 నవంబర్ 19 రాత్రి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 బోట్లు కాలిపోయాయి. 15 బోట్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.

ఈ అగ్నిప్రమాద దృశ్యాలను యూట్యూబర్ లోకల్ బాయ్ నాని షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు.

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎవరు కారకులో తెలియడం లేదని ఆ వీడియోలో నాని చెప్పారు.

అయితే, యూట్యూబర్ నాని కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు రావడంతో విశాఖ వన్ టౌన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బందించారని నాని హైకోర్టులో పిటిషన్ వేశారు.

కోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన నాని.. ప్రమాదంతో తనకు సంబంధం లేదని, కొంతమంది అత్యుత్సాహంతో చేసిన పనుల వల్ల తన కుటుంబ సభ్యులపై దాడులు జరిగాయని చెప్పారు.

పోలీస్ విచారణలోనూ ఆయన ప్రమేయం లేదని వెల్లడైంది.

లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబ్ వీడియోలు చేసే నాని ఈ ప్రమాద ఘటనతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.

సున్నితమైన అంశాన్ని చిన్నారులకు వివరించడంలో కొత్త పంథా

ఫొటో సోర్స్, KHUSHBOO ANAND /SOCIAL MEDIA 'X'

ఫొటో క్యాప్షన్, సున్నితమైన అంశాన్ని చిన్నారులకు వివరించడంలో కొత్త పంథా

సున్నితమైన అంశాన్ని సరళంగా చెప్పిన టీచర్

బిహార్‌లోని బంకా జిల్లాలో మాద్యమిక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తునన ఖుష్బూ ఆనంద్ హఠాత్తుగా సోషల్ మీడియా సంచలనంగా మారారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆమె పిల్లలకు చెబుతున్న వీడియోను లక్షల మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో చూసిన టీచర్లలో చాలా మంది కుష్బూ మాదిరిగా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు.

తల్లిదండ్రులు చాలా మంది తమ పిల్లలకు ఎలా చెప్పాలో అర్థం కాని అంశాన్ని కుష్భూ ఆనంద్ చాలా తేలిగ్గా చూపించారని ప్రశంసలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, పిల్లలకు అవగాహన కల్పించడంలో కొత్త మార్గం
సీమా హైదర్

ఫొటో సోర్స్, SHAHNAWAZ/BBC

ఫొటో క్యాప్షన్, సీమా హైదర్: ప్రియుడి కోసం సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్ మహిళ

ప్రేమ కోసం పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన నలుగురు పిల్లల తల్లి

ఆన్‌లైన్‌లో పబ్‌జీ ఆడేటప్పుడు ఏర్పడిన పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడంతో ప్రియుడిని కలుసుకునేందుకు భర్తను వదిలేసి, స్థలం అమ్మేసి నలుగురు పిల్లలతో పాకిస్తాన్ నుంచి వచ్చి భారత్ వచ్చిన సీమా హైదర్ భారత్, పాకిస్తాన్‌లో వార్తల్లో నిలిచారు.

గ్రేటర్ నోయిడాలో ఆమె ప్రియుడు సచిన్ మీనాతో కలిసి ఉంటున్న సమయంలో పోలీసులు వాళ్లిద్దర్నీ అరెస్ట్ చేశారు.

ఆమె అక్రమ మార్గంలో భారత్‌లోకి ప్రవేశించారంటూ కేసు నమోదు చేశారు.

పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్, అదే దేశంలోని జాకోబాబాద్ నివాసి అయిన గులాం హైదర్‌ను 2014లో పెళ్లాడారు. వీరికి నలుగురు సంతానం.

ఆ తర్వాత వీరిద్దరూ కరాచీకి వచ్చారు. 2019లో గులామ్ హైదర్ పని కోసం సౌదీ అరేబియా వెళ్లారు.

సీమా హైదర్, సచిన్ మీనా కాఠ్మండూలోని పశుపతి నాధ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆమె పాకిస్తాన్ నుంచి నేపాల్ వెళ్లి అక్కడ నుంచి బస్సులో భారత్ చేరుకున్నారు.

సీమా హైదర్‌ భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత, చాలా మంది ఆమెను పాకిస్తాన్ గూఢచారిగా ఆరోపించారు. ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆమె వద్ద మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత, చాలా మంది మనసులో ఇదే మెదిలింది.

ప్రస్తుతం సీమా భారత్‌లోనే ఉండాలనుకుంటున్నారు. తాను సచిన్‌తో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

దేశాలు, మతాలు, సరిహద్దులు దాటుకుని చిగురించిన ఈ ప్రేమ కథ మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి చాలా మందిలో ఉంది.

ప్రేమికుడి కోసం సరిహద్దుల్ని దాటి వెళ్లిన అంజూ

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, ప్రేమికుడి కోసం సరిహద్దుల్ని దాటి వెళ్లిన అంజూ

ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడేందుకు పాకిస్తాన్ వెళ్లిన అంజూ

పాకిస్తానీ యువకుడు నస్రుల్లాతో ఫేస్‌బుక్‌లో పరిచయం, స్నేహం, ప్రేమగా మారడంతో అతన్ని పెళ్లి చేసుకునేందుకు పాకిస్తాన్‌ వెళ్లారు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అంజూ. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దీర్ బాలా జిల్లాకు చేరుకున్న అంజూ నస్రుల్లాను విహం చేసుకుని తన పేరుని ఫాతిమా అని మార్చుకున్నారు.

అంజూకు 2020లో ఫేస్‌బుక్ ద్వారా నస్రుల్లాతో పరిచయం ఏర్పడింది. ఆమె పాకిస్తాన్ చేరుకునే వరకూ ఆమె భర్తకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఆ విషయం తెలియదు.

భర్తకు తెలియకుండానే ఆమె పాకిస్తాన్ వెళ్లేందుకు వీసా సంపాదించారు. నిశ్చితార్థం, పెళ్లి గురించి కూడా ఆమె భర్తకు ఏమీ తెలియదు.

అంజూ వయస్సు దాదాపు 35 ఏళ్లు. 2007లో ఆమెకు అరవింద్‌తో వివాహం అయింది. ఇద్దరిదీ ఉత్తర ప్రదేశ్ అయినప్పటికీ రాజస్థాన్‌లోని భివాడీలో స్థిరపడ్డారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు. పాపకు 15 ఏళ్లు, బాబు వయస్సు ఆరేళ్లు.

రవీందర్ ఇంటర్‌మీడియెట్ వరకు చదివారు. అంజూ పదో తరగతి పాస్ అయింది. భివాడీలోని ఒక కంపెనీలో అంజూ పనిచేస్తోంది.

ప్రస్తుతం దిల్లీ చేరుకున్న అంజూ నగరంలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. త్వరలోనే తన భర్త నస్రుల్లా దిల్లీ వస్తాడని ఆమె ఏబీపీ వార్తా సంస్థతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)