అతడు తన పెళ్లి జరగాల్సిన రోజు 16 మంది బంధువులను ఎందుకు ఖననం చేయాల్సి వచ్చింది?

పిడుగు
ఫొటో క్యాప్షన్, మామున్ పెళ్లి రోజే పిడుగుపాటుకు గురై 16 మంది బంధువులు చనిపోయారు
    • రచయిత, రజిని వైద్యనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, బంగ్లాదేశ్ నుంచి...

తన పెళ్లి వేడుక జరుగుతుందనుకున్న రోజే, మామున్ తన బంధువులు 16 మందిని ఖననం చేశారు.

పెళ్లి వేడుకలకు వెళ్తుండగా పిడుగుపాటుకు గురై వారంతా మరణించారు.

కొత్త చీరలు, సూట్లు ధరించి మామున్ పెళ్లికి వెళ్లేందుకు అతని కుటుంబ సభ్యులు, బంధువులు బోటులో బయలుదేరారు. అప్పుడు తుపాను ప్రభావం ఉంది. ఒక్కసారిగా భారీ వర్షం మొదలవడంతో పడవను పక్కకు నిలిపి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న షెడ్డు కింద తలదాచుకున్నారు.

విపరీత వాతావరణం, భారీ తుపానుల కారణంగా పిడుగుపాటుకి గురై ఏటా బంగ్లాదేశ్‌లో 300 మంది వరకూ చనిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.

బంగ్లాదేశ్‌తో పోలిస్తే దాదాపు రెండింతల జనాభా ఉన్న అమెరికాలో ఏటా 20 మంది పిడుగుపాటు కారణంగా చనిపోతున్నారు.

పిడుగుపాటు మరణాలు మామున్ లాంటి వారితో పాటు దేశానికి తీరని నష్టం చేస్తున్నాయి. 2021 ఆగస్టులో ఆ రోజు అసలేం జరిగిందో చెప్పేందుకు మామున్ మొదటిసారి పెదవి విప్పారు.

శిబ్‌గంజ్‌లోని మామయ్య ఇంట్లో 21 ఏళ్ల మామున్ పెళ్లికి ముస్తాబవుతున్నారు. ఆ చేదువార్త తన చెవిన పడడానికి ముందు, ఆ సమయంలో భారీగా ఉరుములు, మెరుపులు వచ్చాయి.

ఆ తర్వాత వెంటనే ఆయన తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లారు. అక్కడంతా గందరగోళంగా ఉంది. చుట్టూ అయోమయం నెలకొంది.

''అక్కడ ఉన్న మృతదేహాలను హత్తుకుని కొందరు విలపిస్తున్నారు'' అని మామున్ గుర్తు చేసుకున్నారు.

''గాయాలపాలైన వారు బాధ తట్టుకోలేక కేకలు పెడుతున్నారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. నేను నా వాళ్లను కోల్పోయాను. నేను ముందు ఎవరి దగ్గరికి వెళ్లాలో కూడా నాకు అర్థం కాలేదు'' అన్నారు.

పిడుగు

ఫొటో సోర్స్, MAMUN

ఫొటో క్యాప్షన్, పెళ్లి రోజు సాయంత్రం మామున్ బంధువుల అంత్యక్రియలు జరిగాయి

మామున్ తండ్రి, నానమ్మ, తాతయ్య, సోదరులు, బాబాయిలు, చిన్నమ్మలు చనిపోయారు. అతని తల్లి బోటులో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది.

''మా నాన్న మృతదేహం చూడగానే కన్నీళ్లు ఆగలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. షాక్‌కి గురయ్యాను'' అని మామున్ చెప్పారు.

సాయంత్రం చనిపోయిన బంధువుల అంత్యక్రియలు జరిగాయి. వివాహం సందర్భంగా తయారు చేసిన ఆహార పదార్థాలను నిరాశ్రయులకు పంచిపెట్టారు.

ఆ తర్వాత తనకు పెళ్లైందని, కానీ ఆ విషాద ఘటన వెంటాడుతోందని ఎలాంటి వేడుకలూ చేసుకోలేదని ఆయన చెప్పారు. ''ఆ ఘటన తర్వాత నాకు వర్షమన్నా, ఉరుములు, పిడుగులన్నా నిజంగా భయమేస్తోంది'' అన్నారు.

బంగ్లాదేశ్‌లో వరదల కంటే పిడుగుపాటు కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

పిడుగు

ఫొటో సోర్స్, SALMAN SAEED

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో పిడుగుపాటు మరణాలు గణనీయంగా పెరిగాయి

వాతావరణ మార్పులే ఈ విపత్తులకు కారణమన్ననాసా, ఐరాస

1990లలో కేవలం పదుల సంఖ్యలో ఉన్న పిడుగుపాటు మరణాలు ఆ తర్వాత నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

వాతావరణ మార్పుల(క్లైమేట్ చేంజ్) కారణంగా పెరిగిన తుపాన్ల వల్ల ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా), ఐక్యరాజ్యసమితి, బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నాయి.

''పెరిగిపోతున్న పిడుగుపాటు మరణాలకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో మార్పులు, మారుతున్న జీవన విధానాలు కారణం'' అని బంగ్లాదేశ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ మహ్మద్ మిజనుర్ రహ్మాన్ బీబీసీతో చెప్పారు.

వాటి తీవ్రతను గుర్తించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, పిడుగుపాటు ప్రమాదాలను కూడా దేశం ఎదుర్కొంటున్న వరదలు, తుపానులు, భూకంపాలు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాల జాబితాలో చేర్చింది.

పిడుగుపాటుకు గురవుతున్న వారిలో రైతులే ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే, వర్షాకాలంలో పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో పిడుగుపాటు బారినపడుతున్నారు.

పిడుగు

ఫొటో సోర్స్, SALMAN SAEED

ఫొటో క్యాప్షన్, పిడుగు పడిన సమయంలో అబ్దుల్లా తన బార్సిలోనా టీషర్ట్ వేసుకుని ఉన్నారు

ఆ రైతు పొలంలో ఎలా చనిపోయారు?

బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా ప్రాంతంలో పొలానికి సమీపంలో వెదురు కర్రతో కట్టిన దడిపై వేలాడుతున్న ఈ ఫుట్‌బాల్ టీషర్ట్ పిడుగుపాటుకు గురైన అబ్దుల్లా అనే బాధితుడి చేదు అనుభవానికి నిదర్శనం.

కొద్దిరోజుల ముందు అబ్దుల్లా ఈ టీషర్ట్ వేసుకుని తన వరి పొలంలో పనిచేసుకునేందుకు వెళ్లాడు.

ఇప్పుడు వెదురుకర్రల దడిపై ఆరేసి ఉన్న ఈ బార్సిలోనా ఫుట్‌బాల్ టీషర్ట్ పాడైపోయి ఉంది. కాలిపోయిన అంచులు పిడుగు పడిన గుర్తులను చూపిస్తున్నాయి.

మూడు పదుల వయసున్న రెహానా తన భర్త అబ్దుల్లా చనిపోయిన పొలాన్ని చూపించారు. ఆయన చనిపోయిన రోజు ఏం జరిగిందో ఆమె వివరించారు.

ఆ రోజు ఎండకాస్తూనే ఉంది. అబ్దుల్లా, మరికొందరు రైతులతో కలిసి వరి పొలంలో పని చేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత తుపాను మొదలైంది. అప్పుడే ఆయనపై పిడుగుపడింది.

''కొంత మంది రైతులు ఆయన్ను రోడ్డు పక్కన ఉన్న దుకాణం దగ్గరికి తీసుకొచ్చారు'' అని చెబుతూ రెహానా రోడ్డు వెంబడి ఉన్న ఓ చిన్న గుడిసె వైపు చూపించారు.

''అప్పటికే ఆయన చనిపోయారు'' అని ఆమె చెప్పారు.

పిడుగు

ఫొటో సోర్స్, SALMAN SAEED

ఫొటో క్యాప్షన్, అబ్దుల్లా, మరికొందరు రైతులతో కలిసి వరి పొలంలో పని చేసేందుకు వెళ్లారు.

అక్కడి నుంచి తిరిగి రెహానా ఇంటికి వెళ్లాం. చనిపోవడానికి ఒక్కరోజు ముందే ఇంటికి తీసుకొచ్చిన వరి ధాన్యం చిన్న గది బయట కుప్పలుగా పోసి ఉంది.

సాధారణంగా ఉన్న ఆ ఇంట్లో రెండో గది నిర్మించుకునేందుకు ఇటీవల వాళ్లు అప్పు చేశారు.

లోపల వాళ్లబ్బాయి, 14 ఏళ్ల మసూద్ చదువుకుంటున్నాడు. కుటుంబ పోషణ చూసుకొనే భర్త చనిపోయాడు. ఇక జీవితాంతం అప్పుల బాధ తప్పదేమోనన్న బాధలో ఉంది రెహానా. కొడుకు చదువు కోసం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది.

''నేను చాలా భయపడుతున్నా. ఆకాశంలో మేఘాలను చూస్తే, నా కొడుకును బయటికి పంపాలన్నా ధైర్యం సరిపోవడం లేదు'' అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

పిడుగు

ఫొటో సోర్స్, SALMAN SAEED

ఫొటో క్యాప్షన్, తన భర్త అబ్దుల్లా చనిపోయిన తర్వాత కొడుకును బయటికి పంపించాలంటే ధైర్యం సరిపోవడం లేదని రెహానా అన్నారు

పిడుగుపాటు ఘటనల గురించి ఇతర దేశాల్లోనూ ఆందోళన ఉంది. పక్కనే భారత్‌లోనూ ఇటీవలి కాలంలో పిడుగుపాటు ఘటనలు బాగా పెరిగిపోయాయి. అయితే, నివారణ చర్యల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.

బంగ్లాదేశ్‌లోనూ పిడుగుపాటు కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పిడుగులు పడే అవకాశాలను తగ్గించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా అడవుల నరికివేతకు గురైన ప్రాంతాల్లో పొడవాటి చెట్లను నాటాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

అలాగే, పిడుగుపాటు ఘటనల నుంచి రక్షణ పొందేందుకు షెడ్డులు నిర్మించాల్సిన అవసరం ఉందని, తద్వారా రైతులు వాటిలో సురక్షితంగా తలదాచుకోవచ్చని వారు చెబుతున్నారు. తుపానుల గురించి ముందుగానే తెలియజేసేలా హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

ప్రజలు ఎక్కువగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల వినియోగం తక్కువగా ఉండడం, కనెక్టివిటీ లేకపోవడం కూడా ఒక పెద్ద సవాల్.

పిడుగుల గురించి అవగాహన లేకపోవడం కూడా మరో సమస్య.

అవగాహన లేకపోవడం కూడా ఒక సవాలు. పిడుగుపాటు ఎంత ప్రమాదకరమో ఇక్కడ చాలా మందికి తెలియదు. ప్రపంచంలో ఎక్కడైనా పిడుగు పడే అవకాశం ఉందని అతికొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంది.

పిడుగు ఎలా ఉంటుందో అది మీద పడేవరకూ తెలియలేదని అబ్దుల్లా చనిపోయిన రోజు అతని పక్కనే ఉన్న రిపొన్ హొసెన్ అన్నారు.

పిడుగు

ఫొటో సోర్స్, SALMAN SAEED

ఫొటో క్యాప్షన్, పొలంలో పనిచేయాలంటే భయమేస్తోందని, కానీ బతుకుదెరువు కోసం తప్పట్లేదని రిపొన్ చెప్పారు

''భారీ శబ్దం వచ్చింది. కళ్ల ముందు మెరుపును చూశాను'' అని రిపొన్ హొసెన్ గుర్తు చేసుకున్నారు.

''ఏదో తిరుగుతున్న అగ్నిగోళం మా మీద పడినట్టైంది. కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టింది. అంతే, నేను కిందపడిపోయాను. కొద్దిసేపటి తర్వాత కళ్లు తెరిచి చూస్తే అబ్దుల్లా చనిపోయి పడి ఉన్నాడు'' అని రిపొన్ హొసెన్ తెలిపారు.

తాను బతికి బయటపడడాన్ని రిపొన్ నమ్మలేకపోతున్నారు. బయటికెళ్లి పనిచేయాలంటే భయమేస్తోందని, కానీ ఇక్కడ వ్యవసాయం తప్ప చేయడానికి ఇంకేం లేదని ఆయన అన్నారు.

''నా స్నేహితుడు అబ్దుల్లా గుర్తుకొచ్చినప్పుడు ఏడుపొస్తుంది'' అన్నారు.

''రాత్రిళ్లు నిద్రపోయేందుకు కళ్లు మూతపడగానే ఆ రోజు జరిగిందంతా ఓ పీడకలలా గుర్తుకొస్తుంది. ఆ దు:ఖాన్ని ఆపుకోలేను'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)