ఐఐటీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసు: 60 రోజుల తర్వాత నిందితుల అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉత్పల్ పాఠక్
- హోదా, వారణాసి నుంచి బీబీసీ కోసం
ఐఐటీ-బీహెచ్‌యూ (బనారస్ హిందూ యూనివర్సిటీ) విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఆరోపణల కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులకు వారణాసి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ ఘటన నవంబర్ 1వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటుచేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, ఘటన జరిగిన 60 రోజుల తరువాత నిందితులు కునాల్ పాండే, ఆనంద్ అలియాస్ అభిషేక్ చౌహాన్, సక్షమ్ పటేల్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనలో వినియోగించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాశీ జోన్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో మాట్లాడుతూ, “అరెస్టయిన ముగ్గురూ నేరం చేసినట్లు ఒప్పుకున్నారు” అని చెప్పారు.
ఆదివారం సాయంత్రం స్థానిక కోర్టులో వారిని ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసులు ఏం చెప్పారు?
ఈ కేసుకు సంబంధించిన వివరాలను వారణాసికి చెందిన సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.
డీసీపీ రామ్‌సేవక్ గౌతమ్ మాట్లాడుతూ, “శనివారం అర్ధరాత్రి దాటాక ముగ్గురినీ, వారి వారి ఇళ్లకు వెళ్లి అరెస్టు చేశాం. ముగ్గురూ నేరానికి పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల మొబైల్ ఫోన్లు సీజ్ చేశాం. ఈ ఘటనలో వినియోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నాం” అని చెప్పారు.
ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఆలస్యంగా నిందితులను అరెస్టు చేయడంపై బీబీసీ ఆయన్ను ప్రశ్నించగా, “ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు, సెర్చ్ ఆపరేషన్లు అప్పటి నుంచే కొనసాగుతున్నాయి. వ్యూహాత్మకంగానే నిందితులను అరెస్టు చేయలేదు” అన్నారు.
“ముగ్గురు నిందితుల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నాం. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా? అనే విషయం కూడా తెలుసుకుంటున్నాం. అవసరమైతే, వారిపై గ్యాంగ్‌స్టర్ యాక్ట్ తెరుస్తాం” అని తెలిపారు.

బీజేపీపై విమర్శలెందుకు?
అరెస్టయిన ముగ్గురు నిందితులూ బీజేపీ ఐటీ సెల్‌కు సంబంధించిన వారిగా పేర్కొంటూ, వారు బీజేపీలోని ప్రముఖ నాయకులతో కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఆరోపణల ప్రకారం.. కునాల్ పాండే బీజేపీ ఐటీ సెల్ కోఆర్డినేటర్. ఆనంద్ అలియాస్ అభిషేక్ ఐటీ సెల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు.
మరో నిందితుడు సక్షమ్ పటేల్ బీజేపీ నేత దిలీప్ పటేల్ పర్సనల్ సెక్రటరీ. బీజేపీ కాశీ ప్రావిన్స్ ప్రెసిడెంట్‌గా ఉన్న దిలీప్ పటేల్ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు.
వీటితోపాటు బీజేపీ లెటర్‌హెడ్‌తో ఉన్న ఓ లేఖలో వీరి పేర్లు, బాధ్యతలతో కూడిన వివరాలు ఉన్నాయి. ఈ లేఖ వైరల్ అవుతోంది. దీనిని బీబీసీ ఇంకా ధ్రువీకరించలేదు.
అయితే, ఇది నిజమంటూ సోషల్ మీడియాలో చాలామంది వాదిస్తున్నారు.
బీజేపీ నేతలు కూడా పార్టీలో వారి పాత్ర గురించి పరోక్షంగా స్పందిస్తున్నారు. నిందితులను పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా సమాచారం అందుతోంది.
నిందితులకు బీజేపీ ఐటీ సెల్‌తో సంబంధమేంటని పోలీసులను బీబీసీ ప్రశ్నించగా, “విచారణలో ఎలాంటి తేడా ఉండదు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANURAG/BBC
అసలేం జరిగింది?
ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం, ఈ ఘటన నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో జరిగింది.
ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థిని న్యూగర్ల్స్ హాస్టల్ నుంచి వాకింగ్ కోసం బయటకు వెళ్లిన సమయంలో, సమీపంలోని గాంధీ స్మృతి హాస్టల్‌లో ఉండే ఫ్రెండ్‌ను కలుసుకుంది. వారిద్దరూ కర్మన్ వీర్ బాబా ఆలయ సమీపానికి రాగానే బుల్లెట్ బైక్‌పై వచ్చిన ముగ్గురు నిందితులు వారిని అడ్డగించారు.
బాధితురాలిని ఆమె ఫ్రెండ్ నుంచి దూరంగా తీసుకువెళ్ళి వారు లైంగిక దాడికి పాల్పడినట్లు, ఆమెను వివస్త్రను చేసి వీడియో తీసినట్లు ఎఫ్ఐఆర్‍లో పేర్కొన్నారు.
దీని గురించి ఎక్కడైనా చెబితే, దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు.
ఆ ఘటన తరువాత ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థులతోపాటు బనారస్ హిందూ యూనివర్సిటీలోని ఇతర విభాగాల విద్యార్థులంతా కలిసి నిందితులను అరెస్టు చేయాలని, క్యాంపస్‌లో భద్రతా చర్యలు చేపట్టాలని పది రోజులపాటు నిరసనలు చేశారు.
ఆ తరువాత బీహెచ్‌యూ అవుట్ పోస్ట్ ఇన్‌చార్జి, స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిలను సస్పెండ్ చేశారు.

బీజేపీ స్పందనేంటి?
అనధికారికంగా జరిపిన సంభాషణలో, నిందితులు ఐటీ సెల్ సభ్యులని చెప్పారు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ హంసరాజ్ విశ్వకర్మ. ఘటనలో వారి పేర్లు వినిపించినప్పుడే, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
అయితే, ఈ ఘటన వివరాలు బయటకు వచ్చిన ఆదివారం రోజున చాలామంది బీజేపీ నేతలు మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.
వారణాసి నార్త్ ఎమ్మెల్యే, మంత్రి రవీంద్ర జైస్వాల్ అనధికారికంగా మీడియాతో మాట్లాడిన సమయంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతిపక్షాల విమర్శలు
ఈ ఘటనతో బీజీపీపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేస్తోంది.
ఘటన జరిగిన కొద్దిరోజుల తరువాత ఇందులో బీజేపీ విద్యార్థి పరిషత్‌కు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అజయ్ రాయ్ ఆరోపించారు. అనంతరం లంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నిందితుల అరెస్టు అనంతరం బీజేపీ నేతలతో నిందితులు ఉన్న ఫోటోలను అజయ్ రాయ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. పోస్ట్ చేసిన వీడియోలో కూడా గతంలో తాను చేసిన ఆరోపణల గురించి ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అషుతోష్ సిన్హా డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ నేరపూరిత రాష్ట్రంగా మారింది. దీనికి బీజేపీ నాయకులే బాధ్యులు” అన్నారు.
బీజేపీ చెప్పే ‘నారీ వందన్’, ‘యాంటీ రెమో’, ‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదాలు ప్రచారానికే పరిమితం అయ్యాయని విమర్శించారు.
సమాజ్‌వాదీ పార్టీ పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ రాయ్ ధుప్‌చండీ సోషల్ మీడియా వేదికగా, “. మహిళలను గౌరవిస్తామని చెప్పే బీజేపీ అసలు రంగు వెలుగులోకి వచ్చింది” అని స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీపై ప్రశ్నలు సంధించారు.
ఇవి కూడా చదవండి:
- ముంబయి పేలుళ్ళ సూత్రధారి, లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని కోరిన భారత్... ఇదీ పాకిస్తాన్ రియాక్షన్
- ఖతార్: మరణ శిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపు.. వీరిలో ఒకరైన విశాఖ వాసి పాకాల సుగుణాకర్ నేపథ్యం ఏమిటి?
- పంజాబ్: కెనడా వెళ్లేందుకు అమ్మాయిలతో ఒప్పంద వివాహాలు, పెరుగుతున్న మోసం కేసులు
- భారత్ నుంచి ప్రవహించే ‘సింధు’లో బంగారం తవ్వుతున్న పాకిస్తానీలు.. నదిలో పసిడి ఎలా దొరుకుతోంది?
- హనీ బ్యాడ్జర్: మూడు చిరుత పులులను ఎదిరించిన ఈ చిన్న జంతువుకు అన్ని శక్తియుక్తులు ఎక్కడివి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










