సద్దాం హుస్సేన్: ‘నల్ల ముసుగు కప్పకుండానే నన్ను ఉరి తీయండి... నా ధైర్యాన్ని మీరు చూడలేరా?’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సనా ఆసిఫ్ దార్
- హోదా, బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్
2006 డిసెంబర్ 30న వేకువన 3 గంటలకు సద్దాం హుస్సేన్‌ను నిద్రలేపి ‘కొద్ది సేపట్లో నిన్ను ఉరితీస్తారు’ అని చెప్పారు.
ఆ మాట విని తీవ్ర నిరాశకు గురైన సద్దాం హుస్సేన్ ఏమీ మాట్లాడకుండా వెళ్లి స్నానం చేసి వచ్చి ఉరికి సిద్ధమయ్యారు.
సద్దాం హుస్సేన్ భద్రతకు నియమించిన 12 మంది అమెరికా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరైన విల్ బార్డన్‌వెర్పర్ ‘ది ప్రిజనర్ ఇన్ హిజ్ ప్యాలస్’ పేరిట రాసిన పుస్తకంలో సద్దాం హుస్సేన్ చివరి రోజు గురించి రాశారు.
ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ గురించి రాసిన ఈ పుస్తకంలో బార్డన్‌వెర్పర్... చివరి నిమిషం వరకు సద్దాం తనను ఉరి తీయరనే అనుకున్నారని చెప్పారు.
ఇరాక్‌కు సుమారు రెండు దశాబ్దాల పాటు పాలించిన తరువాత 2003లో ఆయన పాలన ముగిసింది.

ఫొటో సోర్స్, Getty Images
సద్దాం హుస్సేన్‌ను ఎందుకు ఉరితీశారు?
1982లో తన వ్యతిరేకులు 148 మంది దుజాయిల్ నగరంలో చంపారన్న ఆరోపణలతో సద్దాం హుస్సేన్‌కు ఇరాక్‌లోని కోర్టు 2006 నవంబర్‌లో మరణ శిక్ష విధించింది.
ఈ కేసులో హతులంతా షియా ముస్లింలని... సద్దాం హుస్సేన్‌ను హతమార్చేందుకు వారు వేసిన పథకం విఫలమైన తరువాత వారిని సద్దాం చంపించారని కోర్టు పత్రాలు చెప్తున్నాయి.
సద్దాం హుస్సేన్‌కు మరణశిక్ష ఎక్కడ విధించారు, ఎప్పుడు విధించారు అనేది మొదట రహస్యంగా ఉంచారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలోని ఖాద్మియాలోని ఒక కాంపౌండ్‌లో ఉన్న కాంక్రీట్ చాంబర్‌లో సద్దాంను ఉరి తీశారు. అమెరికన్లు ఈ ప్రదేశానికి ‘క్యాంప్ జస్టిస్’ అని పేరు పెట్టారు.
సద్దాం హుస్సేన్‌ను ఉరి తీసినప్పుడు అక్కడ కొద్దిమంది ఇరాకీలు కూడా ఉన్నారని బార్డన్‌వెర్పర్ తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సద్దాంను ఉరి తీర్పు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పిన ప్రకారం.. జడ్జి తీర్పు చదువుతున్నప్పుడు సద్దాం చేతిలో ఖురాన్ పట్టుకున్నారు.
తరువాత ఆ ఖురాన్ ప్రతిని సద్దాం తన స్నేహితుడికి అందించాలని కోరారు.
సద్దాంను ఉరి తీసినప్పుడు కూడా ఆయన జైలు దుస్తులు వేసుకోకుండా తెల్ల చొక్కా, ముదురు రంగు కోట్ వేసుకున్నారు.
ఇరాక్ అధికారిక టీవీ చానల్‌లో ప్రసారమైన ఫుటేజ్ ప్రకారం.. మాస్క్‌లు ధరించిన కొందరు సద్దాం హుస్సేన్‌ను ఉరి తీశారు. అయితే, ఆయన్ను ఉరి తీసిన ఆ నిర్దిష్టమైన దృశ్యాన్ని టీవీలో ప్రసారం చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఉరి తీసిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు సద్దాం తల, మెడను కవర్ చేసేలా నల్లని ముసుగు వేయడానికి సిబ్బంది ప్రయత్నించారు. నేరస్థులను ఉరి తీసేటప్పుడు ఇలాంటి నల్లని వస్త్రాన్ని ముఖం కనిపించకుండా కప్పుతుంటారు. అయితే, సద్దాం మాత్రం దాన్ని కప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఆ ముసుగు లేకుండా చనిపోతానంటూ ఆయన దాన్ని తిరస్కరించారు.
అయితే, అధికారిక టీవీ చానల్‌లో ప్రసారమైన వీడియో కాకుండా మరో వీడియో ఒకటి అప్పట్లో బయటకొచ్చింది. అందులో ఈ ముసుగు వేయడానికి సిబ్బంది వచ్చినప్పుడు సద్దాం నవ్వుతూ, గట్టిగా అరుస్తూ ‘మీరు ఈ ధైర్యాన్ని చూడాలనుకోవడం లేదా’ అని సద్దాం అనడం కనిపిస్తుంది.
ఆ తరువాత అక్కడ నిల్చున్నవారిలో ఒకరు ‘నరకానికి పో’ అంటూ బిగ్గరగా అరవగా... ‘ఏంటి? ఆ నరకం ఇరాకేనా?’ అని సద్దాం తిరిగి ప్రశ్నించారు. తన శత్రువులు ఇరాక్‌ను నాశనం చేస్తున్నారన్న అర్థంతో ఆయన అలా అన్నారు.
సద్దాంను ఉరి తీసినప్పుడు ఆయన శాంతంగా ఉన్నారని, ప్రాణభిక్ష పెట్టమని అడగడం లాంటిది ఏమీ చేయలేదని ఆ వీడియోలు చూసిన బీబీసీ వరల్డ్ కరస్పాండెంట్ జాన్ సింప్సన్ చెప్పారు.
ఖురాన్‌లోని కొన్ని వాక్యాలను చదువుకుంటూ సద్దాం ఉరి కంబం దగ్గరకు వెళ్లినట్లు ఆ వీడియోలలో కనిపించింది.
అయితే, సద్దాంను ఉరితీసినప్పుడు అక్కడే ఉన్న ఇరాక్ జాతీయ భద్రతా సలహాదారు వాఫిక్ అల్ రిబాయి మాత్రం సద్దాం ఉరి కంబం దగ్గరకు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్లారని ‘బీబీసీ’తో ఆ తరువాత చెప్పారు.
సద్దాం ఏవో కొన్ని నినాదాలు మాత్రం చేశారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2013లో వాఫిక్ అల్ రిబాయికి సంబంధించిన చిత్రం ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆయన ఇంట్లో సద్దాం విగ్రహం, దాని మెడలో ఉరి తాడు ఉన్నట్లు కనిపించాయి. సద్దాంను ఉరి తీయడానికి ఉపయోగించిన తాడే అది.
ఆ ఫొటో బయటకు వచ్చిన తరువాత ఆ తాడును వేలంలో పొందడానికి వివిధ దేశాల ప్రజలు ఆసక్తి చూపారు. అయితే సద్దాం విగ్రహాన్ని, ఆ తాడును మ్యూజియంలో ఉంచాలని భావిస్తున్నట్లు వాఫిక్ అల్ రిబాయి చెప్పారు.
సద్దాంను ఉరి తీసిన తరవాత ఆయన మృతదేహం చిత్రాలు ఇరాక్ టెలివిజన్ చానళ్లలో ప్రసారమయ్యాయి.
సద్దాంను ఉరి తీశాక ఆయన మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు బయట గుమిగూడినవారిలో కొందరు ఆ మృతదేహంపై ఉమ్మివేయడం, తిట్టడం వంటి దృశ్యాలు టీవీల్లో కనిపించాయి.
జనం అలాంటి చర్యలకు పాల్పడకుండా అక్కడున్న గార్డులలో ఒకరు ప్రయత్నించినా మిగతావారు ఆయన్ను వెనక్కు లాగారని బార్డన్‌వెర్పర్ తన పుస్తకంలో రాశారు.
‘సద్దాంను ఉరి తీసినప్పుడు ఆయనకు ద్రోహం చేసినట్లుగా అనిపించింది. మాకు చాలా సన్నిహితంగా ఉన్న మనిషిని చంపామని అనిపించింది. మమ్మల్ని మేం హంతకులుగా భావించాం’ అని ఆడమ్ రోథర్సన్ అనే ఒక గార్డు తనతో అన్నట్లు బార్డన్‌వెర్పర్ రాశారు.
2003 డిసెంబర్ 13న సద్దాంను అరెస్ట్ చేసిన తరువాత మూడేళ్ల పాటు విచారణ జరిగింది. అనంతరం 2006 నవంబర్ 5న కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది.
న్యాయమూర్తి తీర్పును చదవడానికి ముందు ఆ ప్రతులు ఆయనకు అందజేసిన తరువాత అమెరికా మాజీ అటార్నీ జనరల్ రిమ్సీ క్లార్క్‌ను కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. దానికి కారణం.. ‘ఈ విచారణ అంతా ఒక జోక్’ అని రాసిన చీటి ఒకటి ఆయన న్యాయమూర్తికి ఇవ్వడమే.
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ పార్టీ ఖజానా ఖాళీ అయిందా? అందుకే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టిందా
- వ్యూహం: 'నన్ను చంపడానికి పబ్లిగ్గా కాంటాక్ట్ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి' -డీజీపీకి రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
- అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














