పిల్లల భవిష్యత్తు కోసం వారితోనే పొదుపు చేయించే మూడు చిట్కాలు

పొదుపు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డబ్బు విషయంలో పిల్లలు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం.
    • రచయిత, క్రిస్టినా జె. ఆర్గాజ్
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

తల్లిదండ్రులు అందరూ సాధారణంగా తమ పిల్లల భవిష్యత్ గురించి ఆందోళన చెందుతుంటారు.

మొదట పిల్లల ఆరోగ్యంపై, తర్వాత వారు తీసుకునే నిర్ణయాల గురించి ఆలోచిస్తుంటారు.

పిల్లలు పెరుగుతున్నకొద్దీ తల్లిదండ్రుల ఆందోళన ఆర్థిక అంశాల వైపు మళ్లుతుంది.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్టాండర్డ్ లైఫ్ బ్యాంక్ చేసిన ఒక సర్వేలో ప్రతీ పది మంది తల్లిదండ్రుల్లో ఏడుగురు తమ పిల్లల ఆర్థిక భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నట్లు వెల్లడైంది.

పిల్లల భవిష్యత్ కోసం ఎలా డబ్బు పొదుపు చేయాలి? పిల్లలకు పొదుపు విలువను అర్థం అయ్యేలా ఎలా చెప్పాలి? అనే అంశాలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తెలిసింది.

చిన్నతనంలోనే పిల్లలకు పర్సనల్ ఫైనాన్స్ గురించి నేర్పిస్తే దాని ప్రభావం జీవితాంతం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

పొదుపు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లలకు దీర్ఘకాలిక పొదుపు విధానాల వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి.

పిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేయడం అనుకున్నంత సులభం కాదని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన బిహేవియరల్ ఎకనమిక్స్ ఎక్స్‌పర్ట్, రచయిత డాన్ అరీలీ అన్నారు.

‘ద ప్రైవేట్ ఆఫీస్’ ఫైనాన్షియల్ ప్లానర్ కిర్ట్సీ స్టోన్, ద మనీ చారిటీ యూత్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్టెఫానీ ఫిట్జ్‌గెరాల్డ్ బీబీసీ పాడ్‌కాస్ట్ ‘మనీ బాక్స్’లో మాట్లాడుతూ- పొదుపు చేయడాన్ని పిల్లలకు అలవాటు చేసేందుకు మూడు చిట్కాలను సూచించారు.

‘‘డబ్బుకు సంబంధించి పిల్లలు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో వారు కొన్ని తప్పులు చేయవచ్చు. లేదా వారికి డబ్బు నిర్వహణలో తగిన అనుభవం రావొచ్చు’’ అని ఫిట్జ్‌గెరాల్డ్ అన్నారు.

మనీ

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలకు దీర్ఘకాలిక పొదుపుతో ప్రయోజనం

పిల్లలకు తక్షణమే డబ్బు అవసరం ఉండదు కాబట్టి దీర్ఘకాలిక పొదుపు విధానాల వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి.

‘‘పిల్లల కోసం సింపుల్ ఖాతాలు ఉంటాయి. వారికి డబ్బు రాకపోకల గురించి అవగాహన కల్పించడానికి ఇవి అద్భుతమైన మార్గాలు’’ ఫిట్జ్‌గెరాల్డ్ అభిప్రాయపడ్డారు.

సాధారణంగా బ్యాంకుల్లో రెండు రకాల ఖాతాలు ఉంటాయి. డబ్బు డిపాజిట్ చేసి ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకునే ఇన్‌స్టంట్ యాక్సెస్ అకౌంట్లు ఉంటాయి. ఫిక్స్‌డ్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ అకౌంట్ల కంటే ఈ ఇన్‌స్టంట్ యాక్సెస్ అకౌంట్లకు తక్కువ వడ్డీని అందిస్తారు.

పిల్లల కోసం పొదుపు ఖాతాను వెదుకుతున్నవారికి కంపారిజన్ వెబ్‌సైట్లు చక్కగా ఉపకరిస్తాయి.

పిల్లలు 18 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే యాక్సెస్ చేయగల ఖాతాను కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు.

‘‘ఇలాంటి ఖాతా ద్వారా అనవసరంగా డబ్బు విత్‌డ్రా చేయడం, అత్యవసరం కాని వాటి కోసం పొదుపు చేస్తున్న డబ్బును వినియోగించడాన్ని నియంత్రించవచ్చు’’ అని పాడ్‌కాస్ట్‌లో ఫిట్జ్‌గెరాల్డ్ అన్నారు.

ఈ డబ్బును పొదుపు చేయడం వెనుక ఉద్దేశాన్ని పిల్లలకు చెప్పడం అన్నింటికంటే ముఖ్యం. యూనివర్సిటీ చదువులు, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తున్నట్లయితే పిల్లలకు వాటి గురించి వివరంగా చెప్పాలి.

ఇలా చేయడం వల్ల కలిగే మరో సానుకూల ప్రభావం ఏంటంటే, భవిష్యత్‌లో వచ్చే ఊహించని అవసరాల కోసం డబ్బును ఆదా చేయడం వల్ల ఎంత సురక్షితంగా ఉండవచ్చో పిల్లలకు తెలిసేలా చేయవచ్చు.

మనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డబ్బు గురించి పిల్లలు మఖ్యమైన పాఠాలు నేర్చుకోవడానికి పొదుపు చేయడం ఉపయోగపడుతుంది.

నేటి పొదుపు - రేపటి భారీ బహుమతి

ఈ రోజు పిల్లల కోసం పొదుపు చేయడం భవిష్యత్‌లో వారికి పెద్ద బహుమతిగా మారుతుంది.

ఇలా చేయడం వల్ల పెద్దయ్యాక వారి చేతిలో కొంత డబ్బుతో జీవనాన్ని మొదలుపెట్టడానికే కాకుండా, డబ్బు గురించి పిల్లలు మఖ్యమైన పాఠాలు నేర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది.

కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా మీరు పొదుపు చేయలేని స్థితిలో ఉంటే మాత్రం మీరు పొదుపు చేయకండి.

ముఖ్యమైన విషయం ఏంటంటే, అలాంటి వాటికి అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం వంటివి చేయకూడదు.

‘‘పిల్లలకు అత్యుత్తమ భవిష్యత్‌ను అందించాలని తల్లిదండ్రులు కోరుకోవడం చాలా సహజం. కానీ, నిజానికి మనం జీవన వ్యయ సంక్షోభంలో ఉన్నాం. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల పొదుపు సామర్థ్యం తగ్గిపోయింది’’ అని ఫిట్జ్‌గెరాల్డ్ అన్నారు.

ఫైనాన్షియల్ ప్లానర్ కిర్ట్సీ స్టోన్ కూడా ఇదే మాట చెబుతున్నారు.

‘‘పిల్లల భవిష్యత్‌ కోసం పొదుపు చేయాలనే ఆశతో తల్లిదండ్రులు అప్పుల పాలవ్వకూడదని నేను కోరుకుంటున్నా. మీరు పొదుపు చేయకుంటే మీ పిల్లలేం కోపగించుకోరు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. పరిస్థితులు మెరుగుపడుతున్నకొద్దీ వారు డబ్బును ఆదా చేసుకోగలుగుతారు’’ అని ఫిట్జ్‌గెరాల్డ్ వివరించారు.

మనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొంత మంది చక్రవడ్డీతో వచ్చే డబ్బును ‘ఉచిత డబ్బు’ అంటారు.

చక్రవడ్డీ మ్యాజిక్‌ను మర్చిపోవద్దు

కొంత మంది చక్రవడ్డీతో వచ్చే డబ్బును ‘ఉచిత డబ్బు’ అని నిర్వచించారు. మరికొందరు ప్రపంచంలోని ఎనిమిదో వింతగా అభివర్ణించారు.

ఇంకొంత మంది మాత్రం మీకు తెలియకుండానే మీ మూలధనాన్ని పెంచే స్నోబాల్ అని చక్రవడ్డీని పిలిచారు.

వడ్డీరేటు ఉన్న ఒక పొదుపు ఖాతా (సేవింగ్స్ అకౌంట్)‌తో ఇది మొదలవుతుంది.

మీరు 5 శాతం వడ్డీరేటు అందించే సేవింగ్స్ అకౌంట్‌లో 100 డాలర్లను ఉంచారనుకుందాం.

మొదటి ఏడాది గడిచేసరికి వడ్డీరేటుతో కలిసి మీ అకౌంట్‌లో ఉన్న డబ్బు 105 డాలర్లు అవుతుంది.

ఇందులో 100 డాలర్లు మీరు జేబులో నుంచి పెట్టినవి కాగా ఏడాదంతా అకౌంట్‌లో డబ్బును ఉంచినందుకు వడ్డీ రూపంలో బ్యాంకు మీకు అందించినవి 5 డాలర్లు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే, మీరు ఈ డబ్బును కదిలించనంత కాలం మాత్రమే మీరు చక్రవడ్డీ మ్యాజిక్‌ను అనుభవించగలరు.

‘‘మీ మూలధనాన్ని ఒక ఖాతాలో ఉంచడం ద్వారా మీరు ఉచిత డబ్బును సంపాదించగలరు’’ అని ఫిట్జ్‌గెరాల్డ్ అన్నారు.

ఇప్పుడు రెండేళ్ల కాలానికి మీరు పొదుపు చేసిన డబ్బు ఎలా మారుతుందో చూద్దాం.

ఇప్పుడు మీ చిన్నారి అకౌంట్‌లో 105 డాలర్ల డబ్బు ఉంది. కానీ, మీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మీరు దానికి మరింత డబ్బును జోడించలేకపోతున్నారు. అయినప్పటికీ మీ డబ్బు పెరుగుతూనే ఉంటుంది.

పిగ్గీ బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివిధ నాణేల విలువను అర్థం చేసుకోవడానికి పిగ్గీ బ్యాంక్ పిల్లలకు సహాయపడుతుంది.

పైగా, ఈ ఏడాది చివరకు మీరు మరింత ఎక్కువ పొందుతారు. 5 శాతం వడ్డీ రేటు ప్రకారమే బ్యాంకు మీకు అధిక మొత్తాన్ని ఇస్తుంది.

మీరు మొదట పొదుపు చేసిన 100 డాలర్ల మీద కాకుండా అకౌంట్‌లో ఉన్న 105 డాలర్లను మూలధనంగా భావించి మీకు దాని ప్రకారం వడ్డీ అందుతుంది.

అంటే, రెండో ఏడాది మీ అకౌంట్‌లోని మూలధనం: 105 డాలర్లు

రెండో ఏడాది అందే వడ్డీ: 5.25 డాలర్లు

అలాడే మూడో ఏడాది మీ పొదుపు అకౌంట్ 110.25 డాలర్లతో మొదలై 115.76 డాలర్లతో ముగుస్తుంది.

నాలుగో ఏడాది: 121.55 డాలర్లు

అయిదో ఏడాది: 127.63 డాలర్లు

ఇలా 18 ఏళ్లు నిండేసరికి చక్రవడ్డీ ప్రకారం మీకు మొత్తం 240.66 డాలర్లు అందుతుంది.

మీరు పొదుపు 100 డాలర్లతో కాకుండా 1,000 డాలర్లతో మొదలుపెట్టినట్లయితే, 18 ఏళ్లు నిండేసరికి మీరు 2,406.62 డాలర్లు అందుకుంటారు.

మీరు కొద్దికొద్దిగా పొదుపు చేయండి. మిగతా పనిని గణితానికి వదిలేయండి.

పిల్లలకు ఫైనాన్స్ గురించి నేర్పించాలనుకుంటే వారికి ఒక పిగ్గీ బ్యాంక్ ఇవ్వండని మనీ హెల్పర్ వెబ్‌సైట్ సిఫార్సు చేస్తోంది.

వివిధ నాణేల విలువను అర్థం చేసుకోవడానికి పిగ్గీ బ్యాంక్ పిల్లలకు సహాయపడుతుంది.

పిల్లల కోసం మనం పొదుపు చేసేదాని కంటే, డబ్బు ఎలా పనిచేస్తుందో పిల్లలకు అవగాహన కల్పించడం మరింత ముఖ్యం.

జీవితాంతం వారికి తోడుగా ఉండే నైపుణ్యం ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)