ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
2021, అక్టోబర్ 18వ తేదీన ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని చింతపల్లి మండలంలోని గంజాయి సాగు చేసే కొన్ని గ్రామాల్లో బీబీసీ పర్యటించింది. అప్పట్లో అక్కడ దారికి ఇరువైపులా చాలా చోట్ల గంజాయి తోటలు కనిపించాయి.
మళ్లీ 2023 డిసెంబర్ 26న చింతపల్లి సర్కిల్‌లో మరోమారు పర్యటించింది. ఈసారి గంజాయి తోటలు గ్రామాల సమీపంలో దాదాపుగా కనిపించలేదు. గత మూడేళ్లుగా పోలీసులు ‘పరివర్తన’ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకు దూరం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది.
పరివర్తన కార్యక్రమం గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకూ నిరంతరం సాగుతూనే ఉంది. ఏవోబీలోని ఏపీ భూభాగంలో చాలా వరకు గంజాయి తోటలను గిరిజనులే స్వచ్చంధంగా ధ్వంసం చేశారు. గంజాయి సాగుకు దూరంగా ఉంటూ మినుములు, రాగులు, పసుపు, వరి వంటి సంప్రదాయ పంటలను పండిస్తున్నారు.
కానీ, ఇప్పుడు అదే గిరిజన రైతులు మళ్లీ గంజాయి సాగు చేస్తే తప్ప తాము బతికే పరిస్థితి లేదని అంటున్నారు. అసలేం జరిగింది? ఎందుకీ పరిస్థితి? మళ్లీ గంజాయి సాగే దిక్కని గిరిజనం ఎందుకంటున్నారు? పోలీసులు వెర్షన్ ఏంటి?

అప్పుల్లో కూరుకుపోయాం: గంగవరం గిరిజనం
జీకే వీధి మండలంలోని దారకొండ పంచాయితీలో 300 మంది నివసించే గిరిజన గ్రామం గంగవరం. ఇక్కడ వరి, పసుపు, మినుములు, రాగులు పండిస్తారు. కానీ, గత రెండేళ్లుగా పంటలతో నష్టపోయామని, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు బీబీసీతో చెప్పారు. గతంలో ఇక్కడ 200 ఎకరాల్లో గంజాయి సాగు చేసినట్లు గిరిజనులు చెప్పారు.
“నాకు ఆరెకరాల పొలం ఉంది. దానిలో గత రెండేళ్లుగా మినుమలు, పసుపు, కొంత రాగులు వేశాను. ఈ రెండేళ్లలో రెండు సార్లు తుపాను వల్ల పంట పోయింది. ఆ తర్వాత అకాల వర్షాలు, విత్తనాలు నాణ్యత లేకపోవడం, కొద్దోగొప్పో పంట వచ్చినా అది తినడానికి సరిపోలేదు, అమ్మడానికి పనికిరాదు అన్నట్లు అయిపోయింది” అని గంగవరం రైతు రాము బీబీసీతో చెప్పారు.
రాము పొలంలో ఆవులు అక్కడున్న కొద్దిపాటి మినుము పంటను తింటూ కనిపించాయి. తానే ఆవులను పొలంలోకి వదిలేశానని, ఈ పంటను ఆవులైనా తింటే వాటి ఆకలి తీరుతుందని రాము అన్నారు. గత రెండు నెలలుగా తన పొలంలో ఆవులు పంటను తింటున్నాయని ఆయన చెప్పారు.
గతంలో గంజాయి సాగు చేసుకుంటే గొయ్యకి (ఒక గజం పరిమాణం) వెయ్యి రూపాయిలు వచ్చేవని, తానొక 150 గొయ్యిల వరకు సాగు చేసేవాడినని రాము చెప్పారు.
అప్పుడు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు చేతికి వచ్చేవని, ఇప్పుడు అప్పులు తెచ్చి, పొలంలో కాయకష్టం చేసినా కూడా ఏడాదికి చూసుకుంటే 30,000 నుంచి 40,000 రూపాయల వరకు అప్పు అవుతోందని ఆయన అన్నారు.
ఈ పరిస్థితిలో మళ్లీ గంజాయి పంట వేసుకుంటే తప్ప అప్పులు తీర్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

‘మళ్లీ గంజాయి వేయడమే నయమనిపిస్తోంది’
గంగవరం గ్రామంలో రాముతో పాటు బలరామ్, భగవాన్, సముర, మల్లిక అనే గిరిజన రైతులను బీబీసీ కలిసి మాట్లాడింది. వీరిలో సముర తాను గతంలో గంజాయి పండించి, ఇప్పుడు అక్కడే రాగులు వేసిన పొలానికి బీబీసీ బృందాన్ని తీసుకుని వెళ్లి, తన పరిస్థితిని వివరించారు.
గంగవరం గ్రామంలో రోడ్డు పక్కనే సముర పొలం ఉంది. అక్కడ చిన్న చిన్న మొక్కలు తప్ప మరేమీ కనిపించలేదు.
“నేను ఇక్కడ గంజాయి పండించేవాడిని. పోలీసు కేసులు, విచారణలు జరుగుతుండేవి. అయినా కూడా డబ్బులు కొంచెం ఎక్కువ మిగులుతుండడంతో గంజాయి పంట సాగు చేసేవాడిని. ఆ తర్వాత పోలీసులు పరివర్తన అనే కార్యక్రమం చేపట్టి మా గ్రామాల్లోకి వచ్చారు. గంజాయి వల్ల మాకు ఎదురయ్యే ఇబ్బందులతో పాటు, మేం పండించే గంజాయి వలన సమాజంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయో, ఎవరు ఎలా నష్టపోతున్నారో వీడియోలు వేసి చూపించారు” అని సముర చెప్పారు.
పోలీసులు చెప్పిన మాటలతో ఇక తాను గంజాయి పండించకూడదని నిర్ణయించుకుని తన రెండెకరాల పొలంలో గతేడాది మినుములు, ఇప్పుడు రాగులు వేశానని సముర చెప్పారు. ఈ రెండు పంటలు నష్టాలనే మిగిల్చాయని, అధికారులకు తమ కష్టం చెప్తే పట్టించుకోవడం లేదని తన పొలాన్ని చూపిస్తూ ఆయన ఆవేదన చెందారు.
“నాణ్యమైన విత్తనాలు లేకపోవడం, తుపాన్లు, అకాల వర్షాలు ఇలా అనేక కారణాలతో పంటను కోల్పోయి నష్టాలపాలయ్యాం. బ్యాంకు రుణాలు తీర్చలేకపోతున్నామంటూ అధికారులకు మా కష్టాలు తెలియజేస్తూ... మంచి విత్తనాలు ఇస్తే మళ్లీ పంటలు వేసుకుని మరో ప్రయత్నం చేస్తామని విన్నపాలు ఇచ్చాం. కానీ, అధికారులు పట్టించుకోలేదు. నెలలు గడచిపోయాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. దీంతో గంజాయి పంట వేస్తేనే నయమనిపిస్తోంది” అని సముర బీబీసీతో చెప్పారు.

గంజాయితో నష్టాలు గిరిజనులకు తెలుసు: ఏఎస్పీ
ఏవోబీలోని గిరిజనులతో గంజాయి సాగు మాన్పించేందుకు పోలీసులు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి పని చేస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరించి పోలీసులే గిరిజనానికి నాణ్యమైన విత్తనాలను, మొక్కలను అందించడంతో పాటు, వారికి వివిధ బ్యాంకుల సహకారంతో వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు కూడా అందిస్తున్నారు.
గంజాయి సాగుకు గిరిజనాన్ని దూరం చేసేందుకు పరివర్తన పేరుతో కార్యక్రమం చేపట్టిన పోలీసులు, గంజాయి సాగును మానేసిన గిరిజనానికి సన్మానాలు కూడా చేశారు.
అయితే, గిరిజనులు మళ్లీ గంజాయి సాగు వైపే వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారనే విషయాన్ని చింతపల్లి సర్కిల్ ఏఎస్పీ కేపీఎస్ కిషోర్ దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది.
“కొన్నిచోట్ల గిరిజనులు గంజాయి సాగుకు వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారనే విషయం మాకూ తెలిసింది. మీరు గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని వివరించిన దాన్ని బట్టి చూస్తే.. పంట నష్టపోవడం, అప్పులు పెరగడంతో వారు కోపంతో గంజాయి వైపు వెళ్తున్నామని అంటున్నారని అర్థమైంది.
మేం మా సిబ్బందితో వెళ్లి వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. గంజాయి సాగుతో ఎటువంటి నష్టాలో, ఒక వేళ కాస్త డబ్బులు సంపాదించినా కేసుల్లో ఇరుక్కుంటే అంతకు నాలుగింతలు ఎలా పోతుందో అన్ని విషయాలు గతంలోనే వారికి వివరించాం. గిరిజనులకు గంజాయి సాగు అనే ఆలోచన కూడా లేకుండా వారితో మాట్లాడతాం” అని ఏఎస్పీ కిషోర్ చెప్పారు.

తప్పని తెలుసు: రాము
గతంలో ఇతర పంటలతో పాటు గంజాయిని కూడా సాగు చేసేవారమని, అది కాస్త లాభదాయకంగా ఉండేదని గంగవరం గ్రామానికి చెందిన రాము బీబీసీతో చెప్పారు. సాధారణ పంటలు ఎన్ని వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తాయని అన్నారు.
గంజాయి సాగు తప్పని తెలుసని, కానీ ఆర్థిక సమస్యలు, ప్రభుత్వాలు తమపై చూపుతున్న నిర్లక్ష్యంతో గంజాయి సాగు వైపు వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాము బీబీసీతో చెప్పారు.
"మాతో పాటు మా చుట్టుపక్కలున్న అన్ని గ్రామాల్లో కూడా గంజాయి సాగు చేసేవారం. పోలీసుల సూచనలతో గంజాయి పంట వేయడం మానేసిన తొలి గ్రామం మాదే. అప్పట్లో పసుపు, మినుములు, వరి వంటి పంటలతో పాటే గంజాయి పంట కూడా వేసేవారం.
గత మూడేళ్లుగా గంజాయి పంటకు పూర్తిగా దూరంగా ఉన్నాం. కానీ, ప్రస్తుతం మాకు మరో మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వం గిరిజనులకు ఇస్తున్న పథకాలు కూడా మాకు సరిగ్గా అందడం లేదు" అని రాము చెప్పారు.
తన భార్య, బిడ్డలను పోషించుకోవాలంటే ఇది తప్ప మరో మార్గం లేదని రాము కాస్త ఆవేశంగానే చెప్పారు. ప్రభుత్వం తమ బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని కోరారు.
“గిరిజనుల పేదరికాన్ని అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం చేసి కోట్లు గడించిన కొందరు వ్యాపారులు గత రెండు, మూడేళ్లుగా గంజాయి సాగు లేకపోవడంతో చాలా నష్టపోయారు. ఇప్పుడు గిరిజన రైతులు సంప్రదాయ పంటలు వేసి నష్టపోవడంతో.. వారిని రెచ్చగొట్టి గంజాయి పంట వేసేటట్లు ప్రయత్నిస్తున్నారు. దీనిపై కూడా మా వద్ద సమాచారం ఉంది. గిరిజనులను గంజాయి వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్న వారిని వదిలి పెట్టం” అని ఏఎస్పీ కిషోర్ హెచ్చరించారు.

ఏవోబీలో గంజాయి సాగు అప్పుడు, ఇప్పుడు..
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో 10 వేల ఎకరాలకు పైనే గంజాయి సాగవుతోందని 2021 అక్టోబర్‌లో పోలీసులు బీబీసీతో చెప్పారు. కానీ, తాము చేపట్టిన పరివర్తన కార్యక్రమం విజయవంతం కావడంతో గిరిజనులే స్వచ్ఛందంగా తాము పండించిన గంజాయి తోటలను ధ్వంసం చేశారని, దీంతో గతేడాది ఏవోబీలో 7,500 ఎకరాల్లో గంజాయి తోటలు ఉంటే, వాటిని దాదాపుగా నాశనం చేశామని పోలీసులు బీబీసీతో అన్నారు.
ప్రస్తుతానికి ఏవోబీలో 250 ఎకరాల్లో మాత్రమే గంజాయి పంట పండిస్తున్నట్లుగా తమ వద్ద శాటిలైట్ చిత్రాలతో కూడిన సమాచారం ఉందని కిశోర్ తెలిపారు.
గంజాయి సాగుకు ఏవోబీలో అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో ఇక్కడ పెద్దగా కష్టపడకుండానే గంజాయి తోటలు పెరుగుతాయని తెలిపారు. అందుకే ఆర్థిక అవసరాలు తీరాలంటే గంజాయి తోటల సాగే గుర్తుకు వస్తుందని అంటున్నారు. ఎకరానికి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే పది రెట్లు సంపాదించవచ్చునని గిరిజనులు చెబుతున్నారు.

అప్పులు పెరిగిపోయాయి, ఆదుకోండి: గిరిజనం
గతంలో తెలిసో తెలియకో గంజాయి పండించాం. అప్పటికప్పుడు అవసరాలు తీరినా కేసుల్లో ఇరుక్కున్నప్పుడు మేం పడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. గంజాయి సాగుతో సంపాదించిన దానితో పాటు మరికొంత డబ్బులు కూడా పోగొట్టుకున్నాం. సంప్రదాయ పంటలు వేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాం. కానీ, ఈ పంటలు కూడా నష్టాలను మిగల్చడంతో అప్పులు తీర్చేందుకు మళ్లీ గంజాయి పంటలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు వచ్చాయని గిరిజనులు చెప్పారు.
మాకు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై ఇచ్చి బ్యాంకు రుణాల విషయంలో సహకరిస్తే మేం గంజాయి పంటల ఆలోచన కూడా చేయమని గంగవరం గ్రామానికి చెందిన బలరాం అన్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు: సీపీఐ
ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట దారకొండ, నెలజర్త, గంగవరం గ్రామాల గిరిజన రైతులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. అధికారుల దృష్టికి గిరిజనుల సమస్యలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు.
“పంట నష్టాలు వచ్చి, అప్పులు మిగలడంతో గిరిజనులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితులు కొనసాగితే మళ్లీ గంజాయి సాగు వైపు గిరిజనం వెళ్లే ప్రమాదం ఉంది. అది జరగకుండా ఉండాలంటే సబ్సిడీతో విత్తనాలు, మొక్కలు వెంటనే ఇవ్వాలి. రైతుల బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని సీపీఐ నాయకులు సుంకర విష్ణుమూర్తి బీబీసీతో చెప్పారు.
గిరిజనులు పూర్తిగా గంజాయి వేయడం మానేసి సంప్రదాయ పంటలు వేస్తున్నారు కాబట్టి, కాఫీ, నేరేడు, పనస, జీడి తోటలను ఇవ్వడం ద్వారా వారిని ఆదుకోవాలని విష్ణుమూర్తి అన్నారు.
గంజాయి సాగుకు దూరమైన గిరిజనుల్లో కొందరు మళ్లీ గంజాయి సాగుకు ఆకర్షితులయ్యే పరిస్థితులను పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ దృష్టికి కూడా బీబీసీ తీసుకుని వెళ్లింది. దీనిపై అధికారులను పంపించి, వివరాలు తెలుసుకుని, గిరిజనులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖలో తొలి విద్యుత్ దీపం ఎప్పుడు వెలిగింది... దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి?
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- రూఢకోట: ఈ ఊరి మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు
- అదానీ గంగవరం పోర్ట్: ‘కనీస వేతనాలు లేవు, హక్కులు లేవు’ అంటున్న కార్మికులు.. ఏమిటీ వివాదం?
- విశాఖ: దోపిడీ కేసులో అరెస్టైన ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఎవరు, ఆమె డ్యాన్స్ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














