డిజిటల్ పేమెంట్స్: జేబులో డబ్బులుంటేనే భారతీయులు భద్రంగా ఉన్నామని భావిస్తారా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సౌతిక్ బిశ్వాస్,
- హోదా, బీబీసీ ప్రతినిధి
నల్లధనాన్నీ, అవినీతినీ అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం 2016లో పెద్దనోట్లను రద్దు చేసింది. అప్పటికి దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీ నోట్లలో పెద్దనోట్ల వాటా 86 శాతంగా ఉంది.
నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల బయట, ఏటీఎం మెషీన్ల వద్ద గందగరోళం ఏర్పడింది. ఈ నిర్ణయం అల్పాదాయ వర్గాలవారిని ఇబ్బందికి గురిచేసిందని, దేశంలో ప్రజలు ఎక్కువగా నగదుతో లావాదేవీలు జరిపే అనధికార ఆర్థిక వ్యవస్థను కుదేలయ్యేలా చేసిందని విమర్శకులు అంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దును పదేపదే సమర్థించుకున్నారు. ఈ చర్య నల్లధనాన్ని (అప్రకటిత సంపద)ను కట్టడిచేయడంతోపాటు మరింత మంది ప్రజలు పన్ను నిబంధనలు పాటించేలా చేసిందని, పారదర్శకతకు ఊతమిచ్చిందని సమర్థించుకునేవారు.
కానీ ఏడేళ్ళ తరువాత ఈ వివాదాస్పద నోట్ల రద్దు నిర్ణయంపై సందేహాం కలిగే విధంగా జనం వద్ద నగదు నిల్వలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకారం 2020-21 సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు గత దశాబ్దంతో పోలిస్తే 16.6 శాతం పెరిగింది. గత దశాబ్దంలో దీని వార్షిక సగటు వృద్ధి 12.7 శాతంగా నమోదైంది.
ఒకదేశంలో ఎంత నగదు చలామణిలో ఉందో చెప్పడానికి , సహజంగా స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ)లో నగదు శాతం ఎంత ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
దీని ప్రకారం 2020-21లో జీడీపీలో నగదు వాటా గరిష్ఠంగా14 శాతంగా ఉండగా, 2021–22లో 13 శాతానికి పరిమితమైంది.
అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు కూడా పెరిగాయి. స్మార్ట్ ఫోన్లు, డెబిట్ కార్డుల వినియోగం పెరగడం, వివిధ సంక్షేమ పథకాలను విస్తృతంగా పంపిణీ చేయడం వల్ల డిజిటల్ లావాదేవీలు పెరిగాయి.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) కారణంగా డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. దీనిద్వారా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా సులభంగా నగదు బదిలీ సాధ్యపడుతోంది.
గత సంవత్సరం యూపీఐ లావాదేవీలు లక్షకోట్లు దాటాయి. ఇది ఇండియా జీడీపీలో మూడోవంతుకు సమానం.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన డిజిటల్ చెల్లింపులలో 89 మిలియన్ల లావాదేవీలతో ఇండియా వాటా 46శాతంగా ఉన్నట్టు ఏసీఐ వరల్డ్ వైడ్ అండ్ గ్లోబల్ డాటా 2023 చెబుతోంది.
ఏకకాలంలో నగదు, డిజిటల్ చెల్లింపులు పెరగడాన్ని ‘నగదు డిమాండ్’గా చెబుతారు.
‘‘నగదు, డిజిటల్ చెల్లింపులు సాధారణంగా ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా ఉండాలి, కానీ ఈ రెండింటిలోనూ ఏకకాలంలో పెరుగుదల ప్రతికూలంగా కనిపిస్తోంది" అని ఆర్‌బీఐ తాజా వార్షిక నివేదిక పేర్కొంది

ఫొటో సోర్స్, GETTY IMAGES
అల్పాదాయవర్గాలకు దెబ్బ
ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాల శాతం తగ్గింది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య నగదు చెలామణి మొత్తం తగ్గింది.
కానీ చాలామంది భారతీయులకు చేతిలో నగదు ఉంచుకోవడమనేది ఓ అత్యవసరమైన ముందు జాగ్రత్త .
నగదు రూపంలో పొదుపు చేసుకోవడం వల్ల అత్యవసర సమయాలలో అక్కరకు వస్తుందని భావిస్తారు.
మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న నగదులో 500, 2000 రూపాయల నోట్లు 87 శాతంగా ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది
(2016లో పెద్దనోట్ల రద్దు చేసిన తరువాత 2వేలరూపాయల నోటును ప్రవేశపెట్టారు. తరువాత ఈ నోట్లను రిజర్వ్ బ్యాంకు ఉపసంహరించుకుంది.)
కరోనా కాలానికంటే ముందు జరిగిన ఓ అధ్యయనంలో చిన్నచిన్న కొనుగోళ్ళలో నగదును ఉపయోగించడం ఎక్కువగా ఉంది. అయితే పెద్ద లావాదేవీలకు డిజిటల్ పేమెంట్స్ ను వినియోగిస్తున్నారని తేలింది.
కిరాణా సామాన్లు కొనడానికి, హోటళ్ళలో భోజనం చేయడానికి, వ్యక్తిగతసేవల కోసం , ఇంటి మరమ్మతులకు నగదును ఉపయోగిస్తున్నారని లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా కమ్యూనిటీ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది.
బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిపోవడం, అతిపెద్ద గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కరోనా సమయంలో ప్రత్యక్ష ప్రయోజన నగదు బదిలీ వంటివి భౌతిక నగదుకు ప్రాధాన్యతనిచ్చేలా చేశాయని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారిక డాక్యుమెంట్ తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
డబ్బు ప్రవాహం ఈ రెండు రంగాలలోనే
రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో డబ్బును మంచినీళ్ళలా ఖర్చుచేస్తుంటాయి. ఇదంతా కూడా లెక్కల్లోలేని నగదే. (ఇటీవల ఆదాయపు పన్ను అధికారులు ఓ విపక్ష ఎంపీకి చెందిన ఇంటి నుంచి 351 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు).
2018లో మోదీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ ను తీసుకువచ్చింది. స్వల్పకాల, వడ్డీరహిత బాండ్లను ప్రవేశపెట్టింది.
అక్రమ నగదును బయటకు తీసుకురావడానికి, రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలు మరింత పారదర్శకంగా ఉండేందుకు దీనిని తీసుకువచ్చారు.
కానీ ఈ బాండ్స్ ఆశించిన ప్రయోజనానికి పూర్తి విరుద్ధంగా పనిచేశాయని విమర్శకులు నమ్ముతున్నారు. ఈ బాండ్లను రహస్యంగా ఉంచుతున్నారని వారు చెపుతున్నారు.
ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద ఎత్తున నల్లధన ప్రవాహం కొనసాగుతోంది.
లోకల్ సర్కిల్స్ నవంబర్ లో చేసిన సర్వేలో భారతదేశంలో గడిచిన ఏడేళ్ళలో స్థిరాస్థిని కొనుగోలు చేసినవారిలో 76 శాతం మంది నగదునే వినియోగించారు.
24 శాతం మంది నగదు చెల్లింపులు చేయలేమని చెప్పారు. అయితే రెండేళ్ళ కిందట ఇలా నగదు చెల్లింపులు చేయలేమని చెప్పినవారి శాతం 30గా ఉంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నగదు లావాదేవీల ప్రాముఖ్యానికి కారణం, డెవలపర్స్‌కు ప్రజాప్రతినిధులతో దగ్గర సంబంధాలు ఉండటమేనని దేవేష్ కపూర్, మిలన్ వైష్ణవ్ చేసిన అధ్యయనంలో తేలింది.
డిజిటల్ కరెన్సీ భౌతిక నగదు రెండింటిలోనూ వృద్ధిని సాధించడంలో భారతదేశం మినహాయింపు కాదనే విషయాన్ని కచ్చితంగా చెప్పొచ్చు.
యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ 2021 నివేదిక బ్యాంకు నోట్ల డిమాండ్ పై మాట్లాడింది.
‘‘ఇటీవల సంవత్సరంలో యూరో బ్యాంకు నోట్ల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కానీ రిటైల్ లావాదేవీలలో బ్యాంకు నోట్ల వినియోగం తగ్గినట్టు కనిపిస్తోంది. రిటైల్ చెల్లింపుల్లో నోట్ల డిమాండ్ ధోరణి ఊహించినదానికంటే భిన్నంగా ఉందని’’ఈ నివేదిక పేర్కొంది.
నగదు డిమాండ్ తగ్గకపోగా, పెరుగుతుండమనేది ఓ ఊహించని పరిణామం.
యూరప్‌లో యూరో నోట్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. 2007 నుంచి అక్కడ భౌతిక నగదు చెలామణి పెరుగుతోంది.
ప్రపంచంలో నగదురహిత సమాజంగా స్వీడన్‌ను చెప్పుకోవచ్చు.
అయితే భారతీయులకు మాత్రం భౌతిక నగదు వారి నిత్యజీవితానికి అత్యంత ముఖ్యమైన దినుసు.
‘‘నా ఖాతాదారులలో చాలామంది ఇప్పటికీ నగదులోనే చెల్లింపులు చేస్తుంటారు’’ అని దిల్లీలోని అతుల్ శర్మ అనే ఆటో రిక్షా డ్రైవర్ చెప్పారు. అంటే...‘‘నగదు ఎక్కడికీ పోదు’’.
ఇవి కూడా చదవండి :
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
- బిగ్ బాస్ 7: పోటీదారులకు లక్షల మంది అభిమానులు ఎలా పుట్టుకొస్తున్నారు? రోడ్లపై ఈ విధ్వంసానికి కారణం ఏమిటి?
- Lizards: బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- ‘80 ఏళ్ల వయసులో మళ్లీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెడతానని అనుకోలేదు
- కామారెడ్డి: ‘అప్పు కట్టాలన్నందుకే ఒకే కుటుంబంలో ఆరుగురిని చంపేశాడు. ఎవరి హత్యకు ఎలా పథకం వేశాడంటే..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














